దక్కన్‍ చైతన్య వాహిని దక్కన్‍ ల్యాండ్‍


సమాజానికి అండగా నిలబడవలసిన అనివార్యత ఏర్పడి నప్పుడు కాలం ఒక కవిని ఉద్భవింపజేస్తుంది. అట్లాంటి చారిత్రక అవసరం ఉన్న తెలంగాణ మహోద్యమ కాలంలో ఆవిర్భవించిన సామాజిక, రాజకీయ పత్రిక ‘దక్కన్‍ల్యాడ్‍’. పేరులోనే ఉన్నతమైన ప్రాంతీయ అస్తిత్వాన్ని నిబిడీకృతం చేసుకున్న దక్కన్‍ల్యాండ్‍ నేడు దశాబ్దికాలాన్ని పూర్తి చేసుకోవడం పత్రికారంగంలో ప్రధాన విషయంగా చర్చించుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం అనేక మలుపులు తిరిగిన కీలకమైన దశలో ప్రారంభమైన దక్కన్‍ల్యాండ్‍ తెలంగాణ ప్రజల హృదయస్పందనలను లోకానికి వినిపించింది. ఇంతటి చారిత్రక బాధ్యతను మోసుకుంటూ నడిపించిన ఉద్యమ సంపాదకుడు మణికొండ వేదకుమార్‍ గారు. సామాజిక సేవాతత్వాన్ని, సాహిత్య సాంస్కృతిక కళాభిరుచిని హృదయం నిండా నింపుకున్న అచ్చమైన సహృదయుడు వేదకుమార్‍గారు. మానవీయ విలువలున్న కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ కొత్త ఆదర్శ పథంలో ప్రయాణిస్తున్న ఈ పర్యావరణ ఉద్యమకారుడు పత్రికను కూడా ఆస్థాయిలో తీసుకురావడానికి నిరంతరం తపించిపోయేవారు. తెలంగాణలో ఒక అనిశ్చితి, అధిపత్యం, సంక్షోభం ముసురుకున్న కాలంలో ప్రజాఫ్రంట్‍ నాయకుడిగా ఉద్యమానికి అవసరమైన సాధనంగా ‘దక్కన్‍ల్యాండ్‍’ పత్రికను స్థాపించడం వేదకుమార్‍గారి చైతన్యానికి సంకేతం.
పత్రికను నిర్విఘ్నంగా నడిపించడమంటే మాటలుకాదు. నిరంతరం యుద్ధం చేయడంలాంటిదే. అనేక వనరులను సమకూర్చుకొని ఆశించిన లక్ష్యానికి దూరం కాకుండా, రాజీపడకుండా పత్రికను ప్రజలముందుకు తీసుకురావడం సాహసమే.

2012 సెప్టెంబర్‍ తొలి సంచిక నుండే దక్కన్‍ల్యాండ్‍ తన దృక్పథముద్రను గాఢంగా వేసింది. ‘ప్రాచీన చరిత్రకు సజీవసాక్ష్యాలు… దక్కన్‍శిలలు’ను ముఖచిత్ర కథనంగా అందిస్తూ దక్కన్‍ప్రాంత విశిష్టతను వివరిస్తూ పత్రిక నామౌచిత్యాన్ని నిలబెట్టుకుంది. దక్కన్‍ ప్రాంతానికి భౌగోళికంగా వున్న ప్రాధాన్యతను, చారిత్రాత్మకతను తెలుపుతూ పాఠకులను గాఢంగా ప్రభావితం చేసింది. ఈ దక్కన్‍ రాక్‍ ఫార్మేషన్‍ను పరిరక్షించడంలో సేవ్‍రాక్‍ సోసైటీ సేవను గుర్తుచేస్తూ తొలి సంచికలోనే బలమైన నాందీ స్వరాన్ని వినిపించింది. ముఖచిత్రం మీద వేసిన ప్రధాన వ్యాస శీర్షికల్లో దక్కన్‍ల్యాండ్‍ తన ఆశయాలను చాటుకుంది. ‘హైదరాబాద్‍లో విధ్వంసకర అభివృద్ధి’, ‘పోలవరం కాదిది ధనవరం’, ‘ఎడారిగా మారనున్న తెలంగాణ’ అనే శీర్షికలు పత్రిక లోపలిపేజీల్లోకి వెళ్ళి చదువాలనే ఆసక్తిని, ఆత్రుతను కలిగిస్తాయి. ఈ క్రమాన్ని నేటికీ అనుసరించడం పత్రిక నిబద్ధతకు నిదర్శనం. తెలంగాణ ఉద్యమకాలంలో పత్రికలు, ఎలక్ట్రానిక్‍ మీడియా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఎంత తక్కువ ప్రాధాన్యమిచ్చాయో అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ చరిత్ర, సంస్కృతిపట్ల వివక్ష చూపడంతోపాటు అనేక వక్రీకరణలకు వంతపాడింది మీడియా. ప్రత్యేకరాష్ట్ర ఉద్యమంలో ప్రజాస్వామిక ధోరణులకు అడ్డుకట్టవేస్తూ హింసవైపు ప్రేరేపించేలా, ఉద్యమస్థాయి తీవ్రతను లోకానికి చూపకుండా నిరోధించే కుట్రలను చేసింది. ఇటువంటి ఆధిపత్యాలు నియంతృత్వాలపై తిరుగుబాటే ‘దక్కన్‍ల్యాండ్‍’ పత్రిక. ఒక ‘ప్రత్యామ్నాయ మీడియా’గా రూపుదిద్దుకొని తెలంగాణకు అండగా నిలబడింది. సంపాదకుడిగా వేదకుమార్‍గారి శ్రమ ప్రతిపుటలో కనిపిస్తుంది. ఈ దశాబ్ది కాలయానంలో ప్రతిసంచిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలబడుతుంది.


ఈ నూటా ఇరవై ఒకటి సంచికలను చూస్తుంటే ఒక అద్భుతాన్ని అక్షరరూపంలో చదువుకున్నట్లుగా అనుభూతి చెందుతాం. పత్రికా రంగంలో నెలకొన్న కొన్ని మూసధోరణులను బద్దలు కొట్టింది దక్కన్‍ల్యాండ్‍. మానవ జీవితం చుట్టూ ఆవరించిన అనేక అంశాలపై లోతైన సమాచారాన్ని, జ్ఞానాన్ని, ఆలోచనల్ని ప్రేరేపించే వ్యాసాలను అందించే ప్రయత్నంలో సఫలీకృతం అయింది. సమాజంలో నెలకొన్న భిన్న సమస్యలలోని బాగోగులను చర్చించింది. సాంస్కృతికంగా తెలంగాణ ఎంత విలక్షణమైందో, ఇక్కడి సంప్రదాయాల, జీవన విధానాల్లోని ప్రత్యేకతలను దృశ్యమానం చేసేలా ప్రచురించిన ప్రత్యేకవ్యాసాలు ఈ నేలఋణం తీర్చుకునేలా అనిపిస్తాయి. విస్మృతికి, విస్మరణకు గురైన సాహితీవేత్తలను, రచనలను వెలుగులోకి తెచ్చిన వ్యాసాలు సాహిత్య చరిత్రలోని ఖాళీలను పూరిస్తాయి. దక్కన్‍ల్యాండ్‍ సంపాదకులు ఒక పరిధి పరిమితి పెట్టుకున్నట్లుగా అనిపిస్తారు. కాని సమాజానికి అవసరమైన ప్రతి విషయాన్ని రికార్డ్ చేసే తపన కనిపిస్తుంది. మనిషి కంట్లో పడని. నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన ప్రదేశాలను పరిచయం చేయడం ఒక చారిత్రక స్పృహగా వేదకుమార్‍గారిలో ప్రతిఫలిస్తుంది. శిధిలమైన కట్టడాలు, అనామకంగా పడివున్న శాసనాలను, కనుమరుగవుతున్న మానవజీవన ఆనవాళ్ళను సాంస్కృతిక ఆధారాలను ఎంతో పదిలంగా కాపాడే పక్రియ దక్కన్‍ల్యాండ్‍లో ప్రదర్శిత మైంది. చరిత్రకు కొత్త చేర్పును అందించి సరికొత్త చరిత్రకారుడిగా వేదకుమార్‍గారు దర్శనమిస్తారు. స్వయంగా తనలోవున్న పర్యావరణ పరిరక్షణా పౌరస్పృహ, చరిత్ర పట్లవున్న ప్రేమ స్వయంగా చరిత్రకారుల బృందంతో పర్యటిస్తూ ఆయా విశేషాలను తన పత్రికలో ప్రచురించి కొత్త సంద్రాయాన్ని నెలకొల్పారు. ఈ విభాగంలో ఎందరో ప్రముఖ చరిత్రకారుల పరిశోధనలు, అనుభవాలు విశేషవ్యాసాలుగా అందించి పత్రికను బలోపేతం చేశారు. ఈ స్ఫూర్తితో ఎందరో వర్తమాన చరిత్రకారులు, వ్యాసకర్తలు తయారుకావడంలో దక్కన్‍ల్యాండ్‍ ఒక మంచివేదికగా నిలబడింది. తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యం విస్తృతంగా ప్రచారం కలగడంలో దక్కన్‍ల్యాండ్‍ భూమిక విస్మరించలేనిది.


దక్కన్‍ల్యాండ్‍ పత్రిక పరిణామక్రమాన్ని రెండుదశలుగా చూడవచ్చు. ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమిస్తున్న కాలంనాటి సంచికలు తొలిదశగా చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమకాలంనాటి ప్రధాన సంఘటనలు, మలుపులు, ప్రజల భావోద్యేగాలు, ఉద్యమనాయకుల వ్యూహలు, ఎత్తుగడలు, వాదనలు సమస్తం దక్కన్‍ల్యాండ్‍లో నిక్షిప్తమైనాయి.’ భవిష్యత్తులో రాజకీయ, సామాజిక ఉద్యమాలను ఎలా నడిపించాలో తెలుసుకోవలనుకునే వారికి ఒక ముఖ్యమైన డాక్యుమెంట్‍గా దక్కన్‍ల్యాండ్‍ ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రజల పోరాట పాఠాలుగా దిశానిర్దేశాన్ని చూపుతాయి. తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైన తర్వాత పత్రిక రెండవదశగా పరిగణించవచ్చు. ఈ కాలాన్ని సంపాదకుడు చాలా విషయాలలో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ పునర్నిర్మాణ కాలంలో వర్తమాన పాలనకు అండదండలు ఇవ్వవలసిన బాధ్యత సహజంగానే ఉంటుంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి వాటిని అమలు చేయడంలో అనుసరిస్తున్న పద్ధతులను విశ్లేషించవలసిన పాత్రలోకి పత్రిక నడిచింది. జ్ఞాన తెలంగాణ, బంగారు తెలంగాణ ఆవిష్కృతం కావడానికి తనవంతుగా కృషి చేసింది. మరోవైపు తెలంగాణలో, అనేకరంగాలలోని పత్రిభావంతులను పరిచయం చేసింది. మన చుట్టూవున్న మహా కళాకారులను, చిత్రకారులను, ఫొటోగ్రాఫర్లను, మహిళా సాధికారమూర్తుల గొప్పదనాన్ని చూపెట్టింది. ఈ దక్కన్‍పీఠ భూమిలోని సాంస్క•తిక వైవిధ్యాన్ని, సామరస్యమత సహన జీవన సంస్కృతిని, భిన్న భాషా పరిమళ వాతావరణాన్ని, వాస్తు శిల్ప కళావైభవాన్ని ప్రతి పేజీలోను జీవంపోసేలా విశేషాత్మక వ్యాసాలతో పాఠకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగింది.


ఈ నేపథ్యాల్లోనే దక్కన్‍ల్యాండ్‍ పత్రిక నాకు పరిచయమైంది. ఉద్యమకాలంలో అనేక సందర్భాలలో వేదకుమార్‍గారిని చూస్తుండేవాడిని. దక్కన్‍ల్యాండ్‍ పత్రికలోని భిన్న రీతులను గమనిస్తూ వేదకుమార్‍గారిపై దూరం నుండే గాఢమైన అభిమానం ఏర్పడింది. తెలంగాణ రచయితల వేదిక వారి ఉద్యమ సభల్లో తరుచుగా పాల్గొనడం వల్ల కొంత పరిచయం మొదలైంది. కాలక్రమేణా దక్కన్‍ల్యాండ్‍ పత్రికలోని అంశాలపై నా పరిశీలనలను, అభిప్రాయాలను చెప్పే వాడిని. నా అభిప్రాయాల్లోని విమర్శనాత్మక కోణాలను నిశితంగా గమనించేవారు. పైకి మాత్రం ఎటువంటి స్పందనలను వ్యక్తీకరించకుండా మౌనంగా ఏదో ఆలోచనల్లోకి వెళ్ళేవారు. దక్కన్‍ల్యాండ్‍ పత్రిక ప్రింటవగానే పిడిఎఫ్‍ కాపీ పెట్టి ఎలావుందని నా వ్యాఖ్యలకోసం ఎదురుచూసేవారు. ఇక అప్పటినుండి నేను మరింత జాగ్రత్తగా పత్రికను చదివి నా గమనింపులను తెలిపేవాడిని. కొన్ని అంశాలు వారికి నచ్చేవి. తదుపరి సంచికలో ఆ మార్పులు కనపడేవి. దక్కన్‍ల్యాండ్‍ పత్రికకు నన్నుకూడా ఆర్టికల్స్ రాయమని కోరారు. కొన్ని రాశాను. ప్రతినెల ఒక పుస్తక సమీక్ష ఉండాలని పట్టుబట్టి నా చేత ఒక ఇరవై అయిదు సమీక్షలు రాయించారు. అలా రాయడం వల్ల నా పఠనావ్యాసంగం, రచనాభ్యాసం మెరుగులు దీరడానికి కారణమైంది. ఈ సందర్భంగా వేదకుమార్‍గారి ప్రోత్సాహం ఉత్తేజకరమైంది. కృతజ్ఞతలు అనేది చిన్నమాట.


తెలంగాణలో సాహిత్య పత్రికలు తక్కువగా ఉన్నాయి. దక్కన్‍ల్యాండ్‍ పత్రిక ఆదిశగా కొన్ని పేజీలు సాహిత్యానికి కేటాయిస్తే బాగుంటుందని అప్పుడప్పుడు నసిగేవాణ్ణి కొంత వారితో స్నేహం, సాన్నిహిత్యం ఏర్పడినాక. సాహిత్యప్రాధాన్యాన్ని నొక్కి చెప్పేవాడిని. వేదకుమార్‍గారు స్వతహగా సాహిత్యాభిమానులే. వారి దక్కన్‍ ప్రచురణల ద్వారా ఎన్నో విలువైన సాహిత్య గ్రంథాలను ప్రచురించారు. వాటికి ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా వచ్చాయి. అందుకే దక్కన్‍ల్యాండ్‍లో సాహిత్యపేజీలను పెంచడానికి ఒప్పుకున్నారు. ఆ విభాగానికి సంబంధించిన బాధ్యతను నాకు అప్పజెప్పారు. ఆ విధంగా ప్రతినెల పత్రికలో ఇలస్ట్రేషన్‍తో కూడిన ఆరు కవితలు, ఒక కథ, సమాకాలీన సాహిత్యవ్యాసాలు, సమీక్షలు, ప్రత్యేక వ్యాసాలతో దక్కన్‍ల్యాండ్‍లో సాహిత్య వ్యవసాయం విస్తృతమైంది. ‘సామాజిక, రాజకీయ మాసపత్రిక’ అనే ట్యాగ్‍లైన్‍కు ‘సాహిత్య’ అనే పదం అనధికారికంగా స్థిరపడింది. కొన్ని సందర్భాలలో ప్రత్యేక సాహిత్య సంచికగా దక్కన్‍ల్యాండ్‍ వెలువడింది. వర్థమాన సాహిత్య కారులకు మంచి వేదికైంది. ప్రముఖ సాహితీవేత్తలు ఈ మార్పును ఆనందిస్తూ స్వాగతించారు. దక్కన్‍ల్యాండ్‍ తెలంగాణాకే పరిమితం గాకుండా ఆంధప్రదేశ్‍ ప్రాంత పాఠకులు కూడా రచనలు పంపించారు. వేదకుమార్‍ గారిలో వున్న సాహిత్యాభిరుచి దక్కన్‍ల్యాండ్‍లో మరింత స్పష్టంగా ఆవిష్క•తమైంది. దక్కన్‍ల్యాండ్‍ చరిత్రలో ఇదొక మరవలేని సాహిత్యమజిలీగా పేర్కొనవచ్చు.


ఈ డిజిటల్‍యుగంలో పత్రికా నిర్వహణ అనేది పెనుభారంగా మారింది. వ్యాపారాత్మక పత్రికలు సైతం ఎంతో అప్రమత్తతతో ఉండవలసివస్తున్న కాలం ఇది. ఇంతటి సంక్లిష్టకాలంలోంచి దక్కన్‍ ల్యాండ్‍ను దశాబ్దికి తీసుకురావడం వెనుక వేదకుమార్‍గారి అకుంఠిత దీక్ష, నిబద్ధత ప్రధాన చోదకశక్తిగా పనిచేసింది. ఏది చేసిన క్రమపద్ధతిలో, వ్యవస్థాగత క్రమశిక్షణతో శ్రమించే వర్క్హాలిక్‍ వేదకుమార్‍. పత్రికను ముద్రించడమేకాదు అది చందాదారులు కానివారికి కూడా జాగ్రత్తగా అందించడం ఆదర్శణీయం. ప్రతిసారి వీలయినంతగా అచ్చుతప్పులు లేకుండా కళ్ళలో ఒత్తులు వేసుకొని ఫ్రూప్‍ చూసే సంపాదకులు వీరే. ప్రతి సంపాదకీయాన్ని బాధ్యతగల పౌరధర్మంతో సమాజానికి తన ఆలోచనను, ఆవేదనను విన్నవించు కోవడం వేదకుమార్‍ లోని సంస్కారానికి నిదర్శనం. తన మాటలో ఎంత సాత్వికత, మెత్తదనం పరచుకొనివుందో, తన స్వభావంలో ఎంత ప్రశాంతత దాగివుందో దాన్నంతా దక్కన్‍ల్యాండ్‍లో ప్రతిఫలించే విధంగా రూపొందిస్తారు. కొంతకాలం నుండి పత్రికలో సాహిత్య పేజీలను తగ్గించి కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. చరిత్రను, జానపదకళలు, ఆదివాసీ సంస్కృతి, పర్యావరణం, వారసత్వసంపద, బాలసాహిత్యం, చేతివృత్తులు, శాసనాలు, శాస్త్ర సాంకేతికలపై దృష్టిని సారించారు. ఈ ధోరణిలోనూ దక్కన్‍ల్యాండ్‍ ఒక ప్రామాణిక పత్రికా విలువలను నిలబెట్టుకుంటుంది. ఈప్రయాణంలో తెలంగాణ సాహితీసమాజం దక్కన్‍ల్యాండ్‍ దారుల్లో కలిసి అడుగు లేస్తుంది. దశాబ్ది సంబురంతో సంపాదకులకు ప్రగాఢ శుభాకాంక్షలు.

  • డా. ఎస్‍. రఘు, ఎ : 9848208533

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *