తెలంగాణ మట్టిలో మాణిక్యం వెల్దుర్తి మాణిక్యరావు


స్వాతంత్య్రోద్యమంలో, నిజాం వ్యతిరేక పోరాటంలో అక్షరాలనే ఆయుధాలుగా మలచి పోరాటం చేసిన యోధుడు వెల్దుర్తి మాణిక్యరావు. నేటి తరానికి పెద్దగా తెలియకపోయినా తన కలానికి పదును పెట్టి అక్షరాలకు ప్రాణం పోసిన యోధుడు. ఒక ప్రక్క ఆంగ్లేయులపై మరో ప్రక్క నిజాం పాలకులపై పోరాటం సాగించాడు. తెలంగాణ సంస్క•తిలో, చరిత్రలో, నిజాం వ్యతిరేక స్వాతంత్య్ర సమరంలో, తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకతను, శైలినీ, స్థాయిని సాధించిన బహుభాషా పండితుడు వెల్దుర్తి మాణిక్యరావు. తెలుగు, ఇంగ్లీష్‍, హిందీ, కన్నడ, మరాఠి, పార్శీ భాషల్లో నిష్ణాతుడు. కరణం బ్రాహ్మణ కుటుంబంలో 1912 డిసెంబర్‍ 12న వేంకటేశ్వర్‍రావు, రుక్మిణమ్మ దంపతులకు పూర్వ మెదక్‍ జిల్లా వెల్దుర్తి గ్రామంలో జన్మించిన మాణిక్యరావు స్వగ్రామ్యాన్ని ఇంటి పేరుగా మార్చుకున్నారు. స్వగ్రామంలో బాల్య విద్యనభ్యసించి, మెదక్‍ పట్టణంలో కొంతకాలం పాటు చదివి హైద్రాబాద్‍లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. జోగిపేట, కంది గ్రామాల్లో జరిగిన ఆంధ్రమహాసభలు వీరి వ్యక్తిత్వంపై ఎంతో ప్రభావం చూపటమే కాకుండా ఇరవై సంవత్సరాల వయస్సులోనే పెద్దలతో పరిచయాలకు అవకాశాలు కల్పించాయి. హైద్రాబాద్‍లో మహామహుల పరిచయాలు వెల్దుర్తి వారి ప్రతిభను, సృజనాత్మక శక్తిని, సామర్థ్యాన్ని వెల్లడించి, అవి పరాకాష్ట అందుకోవటానికి దోహదపడ్డాయి.
మాడపాటి హనుమంతరావు మార్గదర్శకత్వంలో కార్యనిర్వహణ దక్షతను, సురవరం ప్రతాపరెడ్డి సాన్నిహిత్యంలో పత్రికా సంపాదక ప్రతిభను, దాశరధి కృష్ణమాచార్యులు ద్వారా కవితాస్ఫూర్తిని వట్టికోట ఆల్వార్‍స్వామి ద్వారా నవలా నైపుణ్యాన్ని, కాళోజీ నారాయణరావు స్నేహితంలో అభ్యుదయ భావాలను, జమలాపురం కేశవరావు సాంగత్యంలో స్వాతంత్య్ర స్ఫూర్తిని అలవర్చుకున్న మాణిక్యరావు తెలంగాణ తేజోమూర్తులలో ఈ నాటి తరం వారికి అంతగా తెలియని మాణిక్యం. వెల్దుర్తి మాణిక్యరావు కవిగా, కథకుడిగా, చరిత్ర నిర్మాతగా, నాటక కర్తగా, వ్యాసకర్తగా, పత్రికా సంపాదకుడిగా, పత్రికా నిర్వాహకుడిగా, అనువాదకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, చాలా రంగాల్లో విశేషకృషి చేశారు. గ్రంథాలయ ఉద్యమ సారథిగా, గ్రంథమాల నిర్వాహకుడిగా, ఆంధ్ర మహాసభ కార్యదర్శిగా, అభ్యుదయ రచయితల సంఘం సభ్యుడిగా, పౌరహక్కుల నేతగా, ప్రభుత్వాధికారిగా సమర్థవంతంగా విభిన్న పాత్రలు పోషించిన ప్రతిభావంతుడు. సంఘసేవకు మద్యపాన నిరోధక మార్గాన్ని ఎన్నుకొని మద్యపాన నిరోధక పత్రికను స్థాపించి, సంపాదకులుగా వ్యవహరించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. స్వాతంత్య్రానికి పూర్వమే తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‍ పత్రికలను నిర్వహించిన ఘనత వెల్దుర్తి వారిది. ఆనాటి తెలంగాణ సమాజాన్ని, సాంస్కృతిక జీవితాలను, రాజకీయ మార్పులను, సామాజిక చైతన్యాన్ని, ప్రజల కష్టసుఖాలను, సాహిత్య వికాసాన్ని వీరు పత్రికల ద్వారా ప్రజలకు అందించారు.


ఇక వెల్దుర్తి వారి సాహిత్యానికి వస్తే చెప్పుకోదగిన అంశాలు అనేకం ఉన్నాయి. గోల్గొండ పత్రికలో ఉపసంపాదకులుగా బాధ్యత వహిస్తూ నాటికలు, బాలరచనలు, వచనకవితాసృజన, కథారచన, చారిత్రక గ్రంథాల ద్వారా మనస్తత్వాలు, ఆవేశకావేశాలు, కష్టసుఖాలు సున్నితంగా సృశిస్తూ రచనలు చేశారు. ఆంధ్రమహాసభ ఉద్యమంలో నిజాం నిరంకుశ పోరాటంలో, గ్రంథాలయోద్యమంలో పత్రికా రంగంలో చురుకుగా పాల్గొన్నవాడు కావడంతో ఆయన రచనలు ఒక ప్రత్యేక శైలిని సంతరించుకున్నాయి. ‘‘మాణిక్యవీణ’’ పేరిట కవితా సంకలనం, ‘‘ఏయిర్‍ మేల్‍’’ లాంటి కథలు, టాల్‍ స్టాయ్‍ ‘‘ది ఫస్ట్ డిస్టిలర్‍’’కు అనుసరణగా అచ్చమైన పల్లెటూరు భాషలో రాసిన ‘‘దయ్యాల పన్గడ’’ లాంటి నాటకాలు, భావకవితా స్ఫూర్తితో రాసిన ‘‘హసేనా గేయాలు’’ వారి ప్రతిభలో కొన్ని ఆణిముత్యాలు మాత్రమే. ‘‘మీజాన్‍’’ పత్రికలో ఎన్నో గేయలు రాశారు. నిజాం నుండి విముక్తి పొంది ఈరోజు తెలంగాణాలో స్వాతంత్రోద్యమ చరిత్రను సుస్పష్టంగా చదువుకోగలుగుతున్నామంటే వారు పన్నెండు సంవత్సరాలు కష్టపడి రాసిన ‘‘హైదరాబాద్‍ స్వాతంత్య్రోద్యమ చరిత్ర’’యే కారణం. వారు ఆనాటి వ్యవసాయ పరిస్థితులపై రాసిన ‘‘రైతు’’ పుస్తకాన్ని ఆంగ్లేయ, నిజాం ప్రభుత్వాలు కలిసి నిషేధించారు. అనేక పుస్తకాలు రచించి నిజాం పక్షపాత ధోరణి ఎండగట్టాడు.


తెలంగాణ ప్రజల్లో సాహిత్య భావాలను పెంచే ప్రయత్నంగా తన సంపాదకత్వంలో ‘‘అణాగ్రంథమాల’’ను స్థాపించి అనేక పుస్తకాలు వెలుగు చూడటంలో వెల్దుర్తి వారి కృషి ఎంతో ఉంది. నిజాం ప్రభుత్వం ఎన్నో పుస్తకాలను నిషేధించినప్పటికీ ఆనాటి నిర్భందకాలంలో ఒక రచయితగా ఆయన చూపించిన సాహసం ఎన్నుకున్న వైఖరి, బాధ్యతాయుతమైన ధోరణి ఎందరికో ఆదర్శప్రాయమైనవి.


సురవరం, మాడపాటి, కాళోజీ, వట్టకోట లాంటి మహామహు లతో సన్నిహిత సంబంధాలతో వారు నిర్వహించిన ఉద్యమాలకు బాసటగా నిలచిన ఉద్యమశీలి వెల్దుర్తి. మాణిక్యరావు ఇంట్లో సాహిత్య, సాంస్కృతిక చర్చా గోష్ఠులకు కాళోజీ నారాయణరావు, కాళోజీ రామేశ్వర్‍రావు, దాశరధి కృష్ణమాచార్యులు, సి.నారాయణరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి లాంటి ఎందరో మహనీయులు వచ్చి సామాజక అంశాలకు ప్రతిపాదనలు రూపొందించేవారు. థియోసాఫికల్‍ సొసైటీ, హిందూ సోషల్‍ క్లబ్‍, బారిస్టర్‍ రుద్ర, ఆర్య సమాజం, శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయం, సోషల్‍ సర్వీస్‍ లీగ్‍ వంటి సంస్థల ద్వారా సాంస్కృతిక, సామాజిక, సాహిత్య చైతన్యం కోసం పోరాటం చేసిన చైతన్యమూర్తి వెల్దుర్తి. వీరు తెలంగాణలో అభ్యుదయ భావాలు వ్యాప్తి చేసేందుకు మొట్టమొదటగా ఏర్పడిన ‘‘వైతాళిక సమితి’’ సంస్థాగత సభ్యులు.
వెల్దుర్తి వారు రామానంద్‍తీర్థ స్థాపించిన హైద్రాబాద్‍ స్టేట్‍ కాంగ్రెస్‍లో సభ్యులు. మాణిక్యరావుగారు మాడపాటిగారితో పని చేస్తున్నప్పుడు వారి తెలివిని గమనించి బూర్గుల రామకృష్ణారావుగారు వారిని రాజకీయ సలహాదారుగా నియమించు కున్నారు. మాణిక్యరావుగారు మాజీ ప్రధాని పి.వి.నరసింహరావుగారిని రాజకీయాలవైపు మళ్ళించి మార్గదర్శకం చేసిన విషయం ఈనాడు చాలా మందికి తెలియదు.


ఈ వ్యాస రచయిత మాణిక్యరావుగారి పెద్ద కొడుకు హర్షవర్థన్‍కు చిన్ననాటి స్నేహితుడు, వ్యవసాయ కళాశాలలో సహచరుడు. ఆ విధంగా తరచూ వారి ఇంటికి వెలుతూ 1970 నుండి వారి కుటుంబంతో స్నేహసంబంధాలు ఉండటం వలన, మాణిక్యరావుగారు సాంప్రదాయకంగా కనబడినా సోషలిస్ట్ భావాలతో ఉండేవారని గమనించారు. అందుకే హర్షవర్థన్‍ కులాంతర, ఆదర్శ వివాహం చేసుకోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులెందరో వ్యతిరేకించినా నిండు మనస్సుతో వారిని ఆశీర్వదించి కోడలు అన్నపూర్ణతో ప్రేమతో ఉండేవారు. ఆయన భార్య విమలాదేవి కూడా సారస్వత, రాజకీయ ఉద్యమాల్లో భర్తకు అండగా నిలచిన ఆదర్శ గృహిణి. ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న పెద్దకొడుకు హర్షవర్థన్‍ను కువైట్‍లో చూడాలనే కోరిక తీరకుండానే వెల్దుర్తివారు సెప్టెంబర్‍ 28, 1994న మరణించారు.


తెలుగు భాషపై మమకారంతో విశాలాంధ్ర కోరుకున్న మాణిక్యరావుగారిని భాషాప్రయుక్తరాష్ట్రంగా ఏర్పడ్డ తరువాత ఆంధప్రదేశ్‍ రాష్ట్రం విస్మరించింది. వెల్దుర్తి మాణిక్యరావు గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకి ఒక భాషా, సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక వారధి. ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇలాంటి వారిని ఎందరినో పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఆర్తి, ఆత్మీయత, ఆప్యాయతలు మేలవించి సాహిత్య, సామాజిక
ఉద్యమాల్ని నిర్మించి నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి వెల్దుర్తి మాణిక్యరావును 110వ వర్థంతి సందర్భంగా దక్కన్‍ల్యాండ్‍ పత్రిక స్శరించుకుంటుంది.

  • ప్రొ।। దేవీ ప్రసాద్‍ జువ్వాడి
    ఎ : 98499 96099

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *