ప్రకృతి నిర్మిత సౌందర్యాన్ని కాపాడుకుందాం!


కళాకారులు మానవ హృదయ నిర్మాతలు. ప్రకృతి అద్భుతమైన సహజ సౌందర్యాల నిర్మాత, కన్నతల్లి. కళాకారుల సృజన ఆనాటి నాగరికతకు, నైపుణ్యాలకు ప్రతీక. ప్రకృతి సృజన స్వాభావికమైనది, సహజమైనది. వాటిని ప్రకృతి మార్పులు, చేర్పులు చేయలేదు. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఈ పంచభూతాల సమ్మిళతమే ప్రకృతి. ఈ పంచభూతాల సంచలిత క్రియలు వాతావరణాన్ని మార్పుకు గురిచేస్తాయి. పెల్లుబికిన లావా చల్లబడి వివిధ నిర్మాణ రూపాలు తీసుకుంటాయి. శిలలు, కొండలు, గుహలు, దిబ్బలు, సొరంగాలు ఇలా ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి. అందుకే యివి ప్రకృతి నిర్మిత సౌందర్యాలు. ఇవే ఆది మానవులుకు, వివిధ సకల జీవరాసులకు ఆవాసాలు అయ్యాయి.


మధ్యప్రదేశ్‍లోని భీమ్‍ బేట్కా శిలాగుహలు లక్షల సంవత్సరాల క్రితమే ఆది మానవులకు నివాసమైనట్లు పురావస్తుశాఖ ఆధారాలున్నాయి. మన హైదరాబాద్‍ దక్కనీ ప్రాంతంలో వున్న శిలలు, రాతి కళాశిల్పాలు, గోల్కొండ, ఎర్రదిబ్బలు, గండికోట, బుర్రాగుహల వంటి సహజ నిర్మితాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఈ గుహల్లో వేల సంవత్సరాల నాటి ఆది మానవుడి జీవన విధానాన్ని తెలిపే చిత్రకళారూపాలు సహజమైన ఎర్రమట్టి రంగుతో ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇవేకాక వివిధ సామ్రాజ్యనేతలు నిర్మించిన అబేధ్యమైన కోటలు, దేవాలయాలూ ఉన్నాయి.


మానవతప్పిదాల వల్ల ఉత్పన్నమైన వివిధ కాలుష్యాలు, ఉద్గారాల కారణంగా యివి తమ వైభవాన్ని, ప్రాబల్యాన్నీ, ఉనికినీ కోల్పోతున్నాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ సంపదను కాపాడుకోవడం సామాజిక వ్యవస్థల పనితీరుపై ఆధారపడి వుంటుంది. వీటి పరిరక్షణ పర్యావరణ పరిరక్షణలో భాగం. భౌగోళిక రక్షణ చర్యలు చేపట్టాలి. కర్బన్‍ ఉద్గారాలను తగ్గించాలి. కాలుష్య కారక ఇంధన వినియోగాన్ని తగ్గించాలి. భూగర్భ వనరులను రక్షించుకోవాలి. వీటి పరిరక్షణకు, కనుమరుగవుతున్న వాటిని వెలికితీసి ప్రాచుర్యం కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రపంచంలో పర్యావరణ సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి. ఈ కృషికి అక్టోబర్‍ 6న జరుపుకోబోతున్న ‘జియో హెరిటేజ్‍ డే’ మరింత స్ఫూర్తినిస్తుంది.


షెడ్యూలు తెగలు, జాతులు, కులాలు, వెనుకబడిన కులాలు, మైనారిటీలు తరతరాలుగా సామాజిక అసమానతలకు గురవుతున్నారు. కొన్ని జాతులకున్న వెసులుబాటు అందరికీ లేదు. ఒకే తెగ వివిధ ప్రాంతాలలో చెల్లా చెదురుగా విడిపోయి వేరే వేరే పేర్లతో గుర్తింపు పొందుతున్నాయి. ఒకే గోండు తెగ 38 రకాలుగా విడిపోయినట్లు ఈ సంచికలోని ఒక వ్యాసం ద్వారా తెలుస్తోంది. దీని వల్ల ఒక తెగగా వారికి దక్కవలసిన అవకాశాలకు దూరం అవుతున్నారు. రిజర్వేషన్లు రాజకీయ లబ్ది కోసం కాక ఆయా వర్గాలకు ప్రయోజనకరంగా ఉండాలి. మన తెలంగాణా ప్రభుత్వం ఆదివాసీల రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచడం అభినందనీయం. ఆదివాసీలకు, మైనారిటీలకు, బీసీలకు రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడమే కాక వారి భాష, సంస్కృతి, జీవన విధానం కనుమరుగై పోకుండా కాపాడుకోవడం మన అందరి బాధ్యత.


దక్కన్‍ల్యాండ్‍ దశ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మిత్రులు, శ్రేయోభిలాషులు, వివిధ రంగాల మేధావులు చూపుతున్న ప్రేమాభిమాన స్పందనలు అపురూపం. ఈ సంవత్సరం పొడవునా మిత్రులు, శ్రేయోభిలాషులు, పాఠకులు, మేధావుల స్పందనలు, సూచనలు, సలహాలు ప్రచురించాలన్న ఆలోచనకు మీ సహకారం కోరుతూ…


(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *