కౌశాంబీ రాజ్యాన్ని కీర్తి సేనుడు పరిపాలిస్తున్న కాలంలో ఉన్నట్టుండి ఆ రాజ్యంలో వర్షాలు లేక కరువుకాటకాలు ప్రారంభమైనాయి. ప్రజలంతా ఆకలితో ఆహాకారాలు చేశారు. మంత్రి తమ మిత్ర రాజ్యాల నుండి ఎన్ని సార్లు సరకులను దిగుమతి చేసినప్పటికినీ ప్రజల అవసరాలకు అవి సరిపోలేదు. దానికి తోడు ఎప్పుడూ అన్ని పోటీల్లో విజయఢంకా మోగించే కౌశాంబీ రాజ్యం తమకన్నా చిన్న రాజ్యాల కంటే కూడా చాలా వెనుకబడిపోయింది. కానీ మహారాజు ఇవేవీ పట్టించుకోకుండా తన విలాసాలలో మునిగితేలాడు. అప్పుడు మంత్రిగారు రాజు గారిని కలిసి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికినీ ఫలితం లేకపోయింది. మంత్రి సలహాలను కూడా రాజుగారు పెడచెవిని పెట్టారు. ఇలా ఉండగా రాజుగారికి సభలో ప్రశ్నలు అడగడం అంటే చాలా ఇష్టం. అది తెలుసుకున్న మంత్రిగారు రాజు గారిని ఒక ప్రశ్న అడగమని చెబుదామని అనుకున్నాడు.
మరునాడు మంత్రిగారు రాజుగారిని కలిసి అతనిని ఒక ప్రశ్నను సభలో అడగమని అతని చెవిలో ఏదో చెప్పాడు. అందుకు రాజు సంతోషంతో ‘‘మంత్రిగారూ! మీ ప్రశ్నని రేపు సభలో అడుగుతాను. నాకు ప్రశ్నలు అడగడం అంటే చాలా సరదా అని మీకు తెలుసు కదా! అందరూ ఈ ప్రశ్నకు ఏమి జవాబు చెబుతారో అని ఆసక్తిగా ఉంది ‘‘అని అన్నాడు.
ఆ తెల్లవారి సభ ప్రారంభమైంది. మహారాజు లేచి ‘‘మేధావులారా! అన్నింటికన్నా గొప్పది ఏది’’ అని ప్రశ్నించాడు. ఒకరు లేచి ‘‘ధనం’’ అని అన్నారు . మరొకరు ‘‘కీర్తి ప్రతిష్టలు’’ అని అన్నారు. ఇంకొకరు ‘‘పాండిత్యం’’ అని అన్నాడు. మరొకరు ‘‘కళ’’ అని అన్నారు. ఇలా ఎవరికి తోచిన రీతి వారు జవాబు చెప్పారు.
రాజు అప్పుడు మౌనంగా ఉన్న రుద్రభట్టును మంత్రి సూచనచే తన ప్రశ్నకు జవాబు చెప్పమని ప్రశ్నించాడు. అప్పుడు రుద్రభట్టు ‘‘మహారాజా ! అన్నింటికన్నా గొప్పది మరియు ముఖ్యమైనది ఆరోగ్యం. అందుకు కావలసింది మనం పరిశుభ్రత పాటించి పర్యావరణాన్ని కాపాడుకోవడం’’ అని అన్నాడు. అప్పుడు రాజు దాని ప్రాముఖ్యతను తెలుపమని అన్నాడు.
అప్పుడు రుద్ర భట్టు సభలో లేచి ‘‘మహారాజా! ఒక్క ఆరోగ్యం బాగా ఉంటేనే కదా ఇవన్నీ కలిగేవి. ఆరోగ్యం బాగా లేకుంటే ఎంత డబ్బు ఉన్నా, ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నా, ఎంత పాండిత్యం ఉన్నా, ఎన్ని కళలు ఉన్నా అవి అన్నీ వ్యర్థమే కదా!’’ అని అన్నాడు. రాజు అందుకు ఏం చేయాలో అది కూడా చెప్పమన్నాడు. అప్పుడు రుద్రభట్టు ‘‘మహారాజా! నాదొక ముఖ్యమైన మనవి. ముందు మన ప్రజల ఆకలిని తీర్చండి. తర్వాత వారికి చదువును చెప్పి అక్షరాస్యులను చేయండి. ఇంకొక విషయం ఏమిటంటే మన దగ్గర ఉన్న కొద్దిపాటి అడవుల్లో ఆయుర్వేద మొక్కలు చాలా తక్కువగా ఉన్నాయి. అందువలన చాలా మంది జనం రోగాల బారిన పడి కోలుకోలేక మనం అన్ని రంగాల్లో ఇతర రాజ్యాల కన్నా చాలా వెనుకబడి పోతున్నాం. అందువల్ల అందరిచేత మొక్కలు నాటించండి. అనారోగ్యంగా ఉండడం వల్లే మనం పొరుగు రాజ్యాల్లోని పోటీలలో కూడా విజయం సాధించలేకపోతున్నాం. ఇవన్నింటికీ కారణం పరిసరాలన్నీ పూర్తిగా అపరిశుభ్రంగా ఉండడమే. అందువల్ల పర్యావరణాన్ని కాపాడుకుంటే ఈ రోగాలను అరికట్టవచ్చు. ప్రజలందరూ సోమరులుగా ఇంట్లో కూర్చొనకుండా శ్రమపడి పని చేయాలి. ప్రజలు ఎండలో కూడా కొంత సమయం గడపాలి. పుష్టికరమైన ఆహారాన్ని తినాలి. అన్నీ మొక్కలతో పాటు పండ్ల మొక్కలను కూడా నాటించి ముందు ముందు ప్రజలందరూ పండ్లు తినేలాగా ప్రోత్సహించాలి. వారి ఆరోగ్యం మెరుగుపడితే మనం అన్ని రంగాల్లో ముందు ఉంటాం. అందుకే ముందు ఆకలి, తర్వాత విద్య కావాలి. విద్య నేర్చిన తర్వాత వారికి పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది.’’ అని అన్నాడు.
రాజుకు ఆయన సూచనలు నచ్చి ఆయన చెప్పినట్లే చేశాడు. కొన్ని ఏళ్ల తర్వాత కౌశాంబీ రాజ్యం ఆకలి, విద్య, పర్యావరణంతో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యత నివ్వడం వల్ల అన్నింటిలోకి అగ్రగామిగా మారి ఇతర రాజ్యాలకు ఆదర్శప్రాయం అయింది. రుద్రభట్టు సలహాతోనే మంత్రి రాజుగారి చెవిలో ఈ ప్రశ్నను అడగమని కోరాడనీ, తర్వాత సభలో రాజు గారిని ఒప్పించే విషయం తాను చూసుకుంటానని రుద్రభట్టు మంత్రికి చెప్పినట్లు ఎవ్వరికీ తెలియదు.
సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
ఎ: 9908554535