నిర్జనారణ్యంలో నామకరణం

‘‘మేరానామ్‍ రాజు
ఘరానా అ నామ్‍
బహతీహై గంగా
జహాఁ మేర ధాఁమ్‍’’
(జిస్‍ దేశ్‍ మే గంగా బహతీ హై సీన్మా పాట)
నిజమే. ఎవరి పేరు వారికి గొప్ప. ఎవరి ఊరు వారికి మహాగొప్ప. మరి నేను మాత్రం తక్కువా?
లోకానికే
లోకేశ్వరుడిని
ముచికుందానది
తీర నివాసిని
నా నామకరణం కూడా వీనుల విందైన కథనే. గాన! సుజనులారా అవధరించండి. ఆలకించండి.


జూన్‍ పది 1951వ సంవత్సరం అర్థరాత్రి పెద్ద దవాఖానా అని లోకులు పిలిచే ఉస్మానియా జనరల్‍ హాస్పిటల్‍ లేబర్‍ రూం టేబుల్‍ మీద పురుటి నొప్పులు పడుతున్న అమ్మ తనకు నేతాజీ సుభాష్‍ చంద్రబోస్‍, పండిత్‍ జవహర్‍ లాల్‍ నెహ్రూ లాంటి కొడుకు పుట్టాలని మనస్సులనే పెరుమాండ్లకు మొక్కుకుంటున్నది.
అప్పటికి హైద్రాబాద్‍ సంస్థానంపై పోలీస్‍ యాక్షన్‍ జరిగి మూడు సంవత్సరాలు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి నాలుగు సంవత్సరాలు. దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగింది కూడా అదే సంవత్సరం.
యాఖుత్‍పురా రైల్వేస్టేషన్‍ దగ్గరి రైన్‍ బజార్‍ల పుట్టి పెరిగి ఐదో తరగతి కామ్యాబ్‍ఐన అమ్మకు గాంధీ, నెహ్రూ, పటేల్‍ అంటే దేవుండ్లతో సమానం.
అట్ల ఏడుపదుల క్రింద ఆఖరి నిజాం నవాబ్‍ మీర్‍ ఉస్మాన్‍ అలీఖాన్‍ బహద్దూర్‍ మూసీనది తీరాన కట్టించిన ఉస్మానియా సర్కారీ దవాఖానాల నేను కండ్లు తెరిచి ఈ భూమ్మీదపడిన.
చందమామ కథల పత్రిక నుండి విశ్వనాథ నవలల వరకూ చదివే మా అమ్మకు నా పేరు ఖరారు లక్ష వరహాల సమస్యగా మారింది. అరుదైన అపురూపమైన పేరు పెట్టాలని ఆమె ఆలోచన. దాదాపు సంవత్సరం కావొస్తున్నా సరిఐన పేరే ఆమెకు ఇంకా దొరకలేదు.
పిల్లల పేర్లు తల్లితండ్రుల సంస్కారానికి ప్రతిరూపాలు.
‘‘దేవులాడితే దేవుడైనా కనబడతడు’’ అని నమ్మే ఆమె నా పేరుకోసం దేవులాడుతూనే ఉంది. ఒకరోజు నన్ను సంకనేసుకుని అలియాబాద్‍ నుండి తన తల్లిగారిల్లు రైన్‍బజార్‍కు ‘‘గ్యారా నంబర్‍’’ బస్సు మీద బయలుదేరింది.


ఆరోజులల్ల బొగ్గుతో నడిచే బస్సులు ఒకటో రెండో నయాపూల్‍ నుండి లష్కర్‍కు (సికింద్రాబాద్‍కు) అటుఇటూ తిరిగేవి. వాటిని నెంబర్‍ వన్‍ బస్సులు అనేవారు. రిక్షాలు తక్కువ. టాంగాలు, జట్కాలు, ఎక్కాలు (మనిషిలాగేవి) ఎక్కువ. రెండవ ప్రపంచ యుద్ధానంతర కరువు కాలంలో పైసలకు కటపిట అయ్యే రోజులవి. పైస కానరాని కాలంలో ఏ వాహనమైన ఒక విలాసమే. అందుకే పేదవాళ్ల రెండుకాళ్ల నడకే ‘‘గ్యారా నంబర్‍ బస్‍’’ అన్నమాట.
అమ్మ కాలినడకన అలియాబాద్‍ నుండి బయలు దేరి సయ్యద్‍ అలీ చబూత్రా దాటి శాలిబండా ఉతార్‍ దిగి మహారాజా చందూలాల్‍ దేవుడీ వైభవాన్ని తిలకిస్తూ సుల్తాన్‍ షాహీలోని మీర్‍ మొమీన్‍ దాయెరా దగ్గర మలుపు తిరిగి రాచెరువు కట్ట మీదికి ఎక్కి ఆ నిర్జనారణ్యం నుండి రైన్‍ బజార్‍ వైపు నడవసాగింది.
కులీఖుతుబ్‍షా నాలుగవ నవాబుకు మీర్‍ మొమిన్‍ వజీర్‍గా (ప్రధానమంత్రి) పనిచేసేవాడు. ఈయన పర్షియా దేశం నుండి వచ్చిన పండితుడు, పరిపాలనా ధ్యక్షుడు. ఇరాన్‍లోని ఇస్పహాన్‍ నగరం నమూనాలో హైద్రాబాద్‍ నగరాన్ని, చార్మినార్‍ను స్వీయపర్యవేక్షణలో నిర్మించిన మహానుభావుడు. అతని సమాధిని మీర్‍ మోమిన్‍ దాయెరా అంటారు.
ఖుతుబ్‍షాహీ నవాబులు కట్టించిన చెరువు అది. రాజు కట్టించిన చెరువు కావున పామరుల నోళ్లలో నానినాని ‘రాచెర్వు’ కట్ట అయ్యింది. ముస్లింలకు తలాబ్‍ కట్ట అయ్యింది.


మిట్టమధ్యాహ్నం ఎండాకాలం ఎండ మిసమిసలాడుతూ మండిపోతుంది. గులకరాళ్లు తేలిన కచ్చా సడక్‍ మీద నగ్న పాదాలతో నడుస్తున్న అమ్మ. మండుతున్న ఎండకు మాడుకాలుతున్నా చీరెకొంగు తన తలపై కప్పుకోక నాపై కప్పి, నా పేరు గురించే సుదీర్ఘంగా ఆలోచిస్తూ నడుస్తున్న అమ్మ. ఆమెకు ముందు కొద్ది దూరంలో ఒక వృద్ధ బ్రాహ్మణ బాటసారి నడుస్తున్నాడు.
రాచెర్వు కట్టమీద ఆ నిర్జనారణ్యంలో వారిద్దరే పాదచారులు, బాటసారులు, సాగుతున్న నడక. ఎండ దెబ్బకు అలసిసొలసిన ఆ వృద్ధుడు దాహార్తిని తట్టుకోలేక తన రెండు చేతులు పైకెత్తి ఆకాశం వంక చూస్తూ దండం పెడుతూ ‘‘హా లోకేశ్వరా! ఎక్కడున్నావయ్యా!!’’ అని ఎలుగెత్తి పిలిచాడు.
ఆ ఆక్రందన విన్న అమ్మకు మెదడు అడుగు పొరలలో తటిల్లున మెరుపు మెరిసింది. చిక్కటి చీకటి ఆకాశంలో ఒక విద్యుల్లత వెల్లివిరిసింది. పేరుకు సంబంధించిన చిక్కుముడి విడిపోయింది. దాంతో సంతోషమూ, నవ్వు పట్టలేక ‘‘ఇగ్గో ఇక్కడే లోకేశ్వరుడు నీ వెనుకనే ఉన్నాడు’’ అని గట్టిగా అరిచింది.
ఆ విప్రుడు కూడా నవ్వుతూ ఆనందంతో నన్ను ఎత్తుకుని ఆశీర్వదించాడు.
అట్ల నాకు ఆ నిర్జనారణ్య రాచెర్వు కట్ట మీద ‘‘లోకేశ్వర్‍’’ అని నామకరణ మహోత్సవం ఎవరూ లేకుండా నిరాడంబరంగా, ఒంటరొంటరిగా జరిగి పోయింది.
జర ఆగండి! కథ ఇంతటితో అయిపోలేదు.


అమావాస్యనాడు సరిగ్గా అర్ధరాత్రి సమయంలో పుట్టానన్న అనుమానంతో మా అమ్మబాపులు గుళ్లో అయ్యగారిని కలసి నా జాతకం చెప్పమన్నారు. ఆయన వేళ్లమీద అవిఇవీ లెక్కలేసి, నాడీగ్రంథం, తాళపతగ్రంథాలు తిరగేసి ఏతావాతా తేల్చిందేమంటే ‘‘ఈ పిల్లవాడికి అడవులు పట్టుకుని తిరిగే సంచారతత్వం
ఉందని – కావున శాంతి చేయించమని’’ సలహా ఇచ్చాడు.
ఆ జోస్యం విని భయంతో మా వాళ్లు తు.చ. తప్పకుండా అవన్నీ చేశారు. అయినా ఏం ఫాయిదా?
ఉత్తరోత్తరా నేను పెరిగిపెద్దగవుతుంటే అమ్మకు నేనొక పెద్ద సమస్యగా మారాను. ఇంటా బయటా రెబెల్‍ను. నా జీవితంతో నేనే అనేక ప్రయోగాలు చేస్తూ, దేవుడుగీవుడూ లేడని, పెళ్లిగిళ్లీ వద్దనీ, చేస్తున్న సర్కారీ నౌఖరీ వదిలి సంజెకెంజాయకేతన సైనికుడిగా తిరుగుతుంటే తనని తాను చాలాసార్లు తిట్టుకుంది. నన్ను కనేముందు లోకనాయకులను, దేశనాయకులను స్మరించుకున్నందుకు, అట్లాంటి కొడుకు పుట్టాలని కోరుకున్నందుకు.
గుడిలో అయ్యవారు చెప్పిన జాతకం ప్రకారమే గాక నా పేరులో ఈశ్వరుడు కూడా ఉన్నందుకు నాకు సంచార తత్వం, దేశదిమ్మరితనం కూడా అబ్బిందని చాలాసార్లు మొత్తుకున్నది.


ఇప్పుడు అమ్మలేదు. అమ్మలాంటి నగరం కూడా అట్లలేదు. అంతా ఉల్టాపల్టా అయిపోయింది. జీవితమే ఒక తీన్‍ తేరా నౌ అఠారా అయ్యింది!
ఆ రాచెర్వు కట్ట మాత్రం ఇప్పటికీ ఉంది కాని అప్పటిలా నిర్జనారణ్యంలా కాదు. కాంక్రీటు జంగల్‍ పుణ్యమా అని ఆ చెరువులో నీళ్లే కాక చివరికి తేమ కూడా ఎండిపోయి భూబకాసురుల దాహానికి గురై అదిప్పుడు అథోజగత్స హోదరులు నివసించే మురికివాడగా మారిపోయింది. పటాన్‍ చెరువు, సరూర్‍నగర్‍ చెరువు, మీరాలం చెరువు, దుర్గం చెరువు, హుస్సేన్‍సాగర్‍ లాంటి చెరువులు మాయమయ్యి, మరికొన్ని కుదించుకుపోయి, ఆకాశహర్మ్యాలు నిర్మించబడినాయి. దీనిని రాచెర్వుకట్ట అంటే ఇప్పుడు ఎవరికీ అర్థం కాదు. నా తరం ముస్లింలకు తలాబ్‍ కట్టంటే కొంత సమజవుతుంది.
ఏదేమైతేనేం ఆరుపదుల క్రింద ఆ రాచెర్వుకట్ట మీద నా నామకరణ మహోత్సవం అట్ల జరిగిపోయి ఈశ్వరుడి మీద నమ్మకం లేకపోయినా లోకేశ్వరుడిగ ఇట్లా మిగిలిపోయిన. (చార్‍మినార్‍ కథలు-పుస్తకం నుంచి)


-పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *