యూరప్‍ ఖండంలో తీవ్రమైన కరువు దేనికి సంకేతం?


‘‘ప్రతీకారం తీర్చుకుంటున్న ప్రకృతి’’ శీర్షికన అక్టోబర్‍ 2021 సంచికలో వ్యాసం రాసి ఉన్నాను. దానికి కొనసాగింపుగానే ఈ ఏడు యూరప్‍ ఖడాన్ని అతలాకుతలం చేస్తున్న కరువును విశ్లేషించు కుందాము. యూరప్‍లో ఈ యేడు సంభవించిన కరువు పరిస్థితులు ఏర్పడిన దానికి ముందే భారత్‍ సహా ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలి కాలంలో సంభవించిన ప్రకృతి విపత్తులను ఒకసారి మననం చేసుకుందాము. 2013లో జరిగిన కేదార్‍నాథ్‍ దుర్ఘటన, 2021 ఫిబ్రవరి 8న జరిగిన రిషిగంగా నదికి ఆకస్మికంగా వచ్చిన వరదలు, అమెరికా రాష్ట్రాలైన టెక్సాస్‍, మిసిసిపి తదితర రాష్ట్రాలలో సంభవిస్తున్న కనీవినీ ఎరుగని మంచు తుఫానులు, 2020 అక్టోబర్లో, 2022 జూలై లో తెలంగాణలో కురిసిన కుండపోత వర్షాలు, అసాధారణ వరదలు, 2019 లో కేరళలో సంభవించిన వరద విధ్వంసం, 2022 ఆగస్ట్లో పాకిస్తాన్‍లో సంభవించిన వరదల భీభత్సం, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న అనేకానేక ప్రకృతి విపత్తులు. ఇవన్నీ కూడా మనిషిపై ప్రకృతి తీర్చుకుంటున్న ప్రతీకారంగానే భావించాలి. ఈ విపరీత పరిస్థితులను పర్యావరణ శాస్త్రవేత్తలు, సంబంధిత నిపుణులు దశాబ్ద కాలంగా అంతర్జాతీయ వేదికల మీద విస్తృతంగా చర్చిస్తున్నారు. విశ్లేషిస్తున్నారు. భారత్‍లో కూడా ఈ చర్చ జరుగుతున్నది.


గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్న సంగతిని వారు గుర్తు చేస్తూనే ఉన్నారు. భూగోళం మీద రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వరుస కరువులు లేకపోతే అతి వరదలు సంభవించి ప్రజలు కడగండ్ల పాలవుతున్నారు. ఈ వాతావరణ మార్పులకు (CLIMATE CHANGES) అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షలాది చదరపు కిలోమీటర్ల మేర అడవుల నరికివేత ప్రధానమైన కారణంగా ముందుకు వచ్చింది. ప్రతీ నిమిషం ఒక ఫుట్‍ బాల్‍ మైదానం అంత అడవి అమెజాన్‍ అడవుల నుంచి మాయం అవుతున్నది. 2018లో సుమారు 3.60 మిలియన్‍ హెక్టార్ల ఉష్ణ మండల అడవులు (TROPICAL FORESTS భూమి మీద నుంచి మాయం అయినట్టు ఒక అంచనా. అడవుల నరికివేత వలన భూగోళంపై
ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఈ కారణంగా భూగోళం మీద వాతావరణంలో విచిత్రమైన, అనూహ్యమైన మార్పులు నెలకొంటున్నవి. తీవ్రమైన వరదలు లేదంటే తీవ్రమైన కరువులు దాదాపు ప్రతీ ఏటా ఏదో ఒక చోట పునరావృతం అవుతున్నాయి. కరువులు ఒకప్పుడు ఆఫ్రికా ఖండంలోనే చూసేవారం. ఇప్పుడు యూరప్‍ ఖండం, అమెరికా దక్షిణ రాష్ట్రాలు, చైనాలో తీవ్రమైన కరువు పరిస్థితులు దాపురించాయి. యూరప్‍ కరువును పర్యావరణ వేత్తలు 500 ఏండ్లకు ఒకసారి వచ్చే కరువుతో (500 year frequency drought) పోల్చారు. నదులలో తగ్గిపోతున్న నీటి ప్రవాహాలు, జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వలు ఈ తీవ్రతను చాటి చెపుతున్నాయి.


యూరప్‍లో కరువు పరిస్థితులు :
చెక్‍ రిపబ్లిక్‍ ఉత్తర ప్రాంతంలో జర్మనీ సరిహద్దుకు దగ్గరలో ఉన్న ఎల్బీ (ELBE RIVER) నది ఒడ్డున ఉన్న డెసిన్‍ పట్టణం వద్ద మునిగిపోయి ఉన్న రాతి శాసనం బయట పడింది. దాని మీద రాసి ఉన్న అక్షరాలు ‘‘If you see me, then weep”. ఈ డెసిన్‍ రాతి శాసనం చివరిసారిగా దర్శనమిచ్చింది 1616లో. వీటిని ‘‘హంగర్‍ స్టోన్స్’’ అని కూడా అంటారు. అంటే 406 సంవత్సరాల తర్వాత ఇది బయటపడిందన్న మాట. ఈ రాతి శాసనం బయట పడినదంటే మధ్య యూరప్‍ దేశాలలో తీవ్రమైన కరువు పరిస్థితులు దాపురించాయని అర్థం. ఈ రాతి శాసనంతో పాటు జలాశయాల్లో ఎన్నో ఏళ్లుగా మునిగిపోయి ఉన్న గ్రామాలు, పట్టణాలు, పురాతన కట్టడాల శిథిలాలు బయటపడుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో మునిగిపోయిన నౌకల శిథిలాలు బయటపడినాయి. శతాబ్దాలు, దశాబ్దాల అనంతరం ఇవి బయట పడడంతో పరిశోధకులు వివిధ రకాల అధ్యయనాలకి వీటిని వేదికలుగా ఎంచుకుంటున్నారు.
జర్మనీ, నెదర్లాండ్‍, స్విట్జర్‍ లాండ్‍ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నుగా ఉండే రైన్‍, ఇటలీ లో 2900 కిలోమీటర్లు ప్రవహించే పో నది, సెర్బియా, చెక్‍ రిపబ్లిక్‍ తదితర పది దేశాల గుండా ప్రవహించే డాన్యూబే, దాని ఉపనదులు, మోసెల్లీ, ఎల్బీ, స్పెయిన్‍, పోర్చుగల్‍ దేశాలలో ప్రవహించే లిమా, ఇంగ్లాండ్‍ లో ప్రవహించే థేమ్స్, ఫ్రాన్స్లో ప్రవహించే లోయెర్‍ తదితర జీవ నదులు ఎండిపోవడంతో జల రవాణాకు తీవ్రమైన అంతరాయం ఏర్పడి యూరప్‍లో సరకుల రవాణా దెబ్బతిన్నది. యూరప్‍ ఆర్థిక వ్యవస్థపై ఈ కరువు పరిస్థితులు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.


ఇటలీలో అతి పొడవైన నది పో (Po). ఈ నదిలో గత 70 సంవత్సరాలలో లేనంత తక్కువ స్థాయికి నీటి ప్రవాహాలు పడిపోయినాయి. ఇటలీలో ప్రాచీన గ్రామాలు చాలా బయట పడినాయి. వీటితో పాటు రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల యుద్ధ నౌకల శిథిలాలు, 450 కిలోల బరువున్న పేలని బాంబు బయట పడింది. ఈ బాంబును నిర్వీర్యం చేయడానికి చుట్టు పక్కల 3 వేల మంది ప్రజలను వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించారట. ఓగ్లియో (oglio) నదిలో పురాతన భవనాలు, ఎండిపోయిన కోమో సరస్సు (LAKE COMO) లక్ష సంవత్సరాల క్రితం జీవించిన జింక పుర్రె, సింహాలు, హైనాలు, రైనోల అవశేషాలు కూడా బయటపడినాయట. ఇవన్నీ ఇప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలకు, జీవ శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు వేదికలుగా మారినాయి. వీటిని చూడటానికి కూడా పర్యాటకులు కూడా వేల సంఖ్యలో తరలి వస్తున్నారట.


రోమ్‍ నగరంలో టైబర్‍ నదిపై (TIBER RIVER నీరో చక్రవర్తి కాలంలో నిర్మాణం అయినదని చెప్పబడుతున్న పురాతన వంతెన శిథిలాలు, నీరో తల్లి అగ్రిప్పినా నివసించిన విల్లా శిథిలాలు చాలా ఏళ్ల తర్వాత బయటపడినాయి. సెర్బియాలో ఉదృతంగా ప్రవహించే డాన్యూబే (DONUBE) నది వంద సంవత్సరాలలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయి ప్రవాహాలు నమోదు అయినాయి. ఈ నదిలో కూడా జర్మనీ యుద్ధ నౌకల శిథిలాలు బయటపడినాయి. స్పెయిన్‍లో లిమా నదిపై (LIMA RIVER) నిర్మించిన ఆల్టో లిండోసొ (ALTO LINDOSO) జలాశయంలో మునిగిపోయిన అనేక గ్రామాలు బయటపడడంతో వాటిని చూడటానికి స్పెయిన్‍ ప్రజలు క్యూ కడుతున్నారట.


ఇటలీలో కొంఛాస్‍ (CONCHAS) జలాశయం ఎండిపోవడంతో క్రీస్తు పూర్వం 69- 79 మధ్య కాలంలో రోమన్‍ చక్రవర్తి నిర్మించిన కోట శిథిలాలూ బయటపడినాయి. 5.9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కోటను రోమన్‍ చక్రవర్తులు క్రీస్తు శకం 120లో వదిలేసినట్టు చరిత్రకారులు చెపుతున్నారు.
స్విట్జర్‍ లాండ్‍, నార్వే దేశాలలో కరుగుతున్న మంచు గ్లెసియర్లు ఇనుప యుగపు పురాతన రహస్యాలను బయటపెడ్తున్నాయి. లండన్‍ నగరం మధ్యలో నుంచి ప్రవహించే థేమ్స్ నది కూడా ఎండిపోయింది. థేమ్స్ నది పుట్టిన చోట ఉష్ణ పవనాల వలన తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొని ఉన్న కారణంగా థేమ్స్ నదిలోకి ప్రవాహాలు దారుణంగా పడిపోయినాయి.
యూరప్‍ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉష్ణ పవనాల కారణంగా జనజీవితం అస్తవ్యస్తంగా మారిపోయింది. తాగునీటికి కొరత ఏర్పడింది. వ్యవసాయానికి, జల విద్యుత్‍ ఉత్పత్తికి నీటిని వినియోగించే పరిస్థితి లేదు. తీవ్రమైన కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయి. వాటిని ఆర్పడానికి నీరు దొరకడం లేదు. యూరోపియన్‍ కమీషన్‍ ఈ పరిస్థితిని criticalగా అభివర్ణించింది. జూలై నెల మధ్య నాటికే యూరప్‍ ఖండంలో 45 శాతం భూభాగానికి కరువు హెచ్చరికలు జారీ అయినాయి. 15 శాతం భూభాగం కరువు పరిస్థితిలోకి వెళ్లిపోయిందని ప్రకటించింది. ఫ్రాన్స్లో 100కు పైగా మునిసిపాలిటీలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. 85 శాతం లోటు వర్షపాతం నమోదు అయిన కారణంగా ఈ కరువు దాపురించిదని కమీషన్‍ అభిప్రాయపడింది. సాగునీటి కొరత కారణంగా పంటల సాగు దారుణంగా పడిపోయింది. యూరప్‍ లో ఆహార కొరత రాబోతున్నదన్న సంకేతాలు వెలువడినాయి. దీనికి తోడు రష్యా ఉక్రేన్‍ యుద్ధం ఆహార దిగుమతులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జలాశయాలు ఎండిపోవడంతో జల విద్యుత్‍ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. థర్మల్‍, న్యూక్లియర్‍ విద్యుత్‍ ఉత్పత్తిలో కోత విధించే పరిస్థితి తలఎత్తింది.


ఈ విపరీత ప్రకృతి ప్రకోపాలు యూరప్‍ లోనే కాదు భూగోళం అన్ని ఖండాలలో అనుభవంలోకి వస్తున్నది. అమెరికాలో దక్షిణ రాష్ట్రాలకు సాగునీరు, తాగునీరు, జల విద్యుత్తు అందించే కొలరాడో నదిలో నీరు కనిష్ట స్థాయికి చేరుకున్నది. 1200 టిఎంసిల నిల్వ సామర్థ్యం కలిగిన హూవర్‍ డ్యాంలో నీటి నిల్వ కనిష్ట మట్టానికి చేరుకున్నది. ఆ డ్యాం నీటిపై ఆధారపడిన రాష్ట్రాలకు నీటి సరఫరాలో కోట విధించింది అమెరికా ప్రభుత్వం. చైనాలో ఉదృతంగా ప్రవహించే యాంగ్షి నదిలో కూడా నీట ప్రవాహాలు దారుణంగా పడిపోయినాయి. ఈ నది పరీవాహక ప్రాంతాలలో చైనా ప్రభుత్వం కరువు హెచ్చరికలు జారీ చేసింది. రెండేళ్ల క్రితం చైనాలో తీవ్రమైన వరదలు సంభవించాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొని ఉన్న కారువుకు భిన్నంగా భారత్‍, పాకిస్థాన్‍, బంగ్లాదేశ్‍, శ్రీలంక, నేపాల్‍ తదితర దక్షిణాసియా దేశాలలో తీవ్రమైన వరదలు ఆయా దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. జపాన్‍ లో కూడా వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. దీనికి గత రెండు దశాబ్దాలుగా పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నట్టు భూగోళం మీద రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలే కారణం. ఈ వాతావరణ మార్పుల వలన మానవాళి తీవ్రమైన కష్ట నష్టాలకు బలి అవుతున్నది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, తాగునీటి కొరత, ఆహార కొరత, మితి మీరిన కర్బన ఉద్ఘారాల కారణంగా కాలుష్యం .. ఇవన్నీ మానవాళి జీవితాన్ని దుర్భరంగా మారుస్తునాయి.


మానవాళి కర్తవ్యం :
వాతావరణ మార్పులను నియంత్రించి తిరిగి గాడిలో పడేయాలంటే భూగోళం మీద అడవుల నరికివేతను నియంత్రించడం, నరికివేతకు గురి అయిన అడవులను తిరిగి పునరుజ్జీవింపజేయడం, కర్బన ఉద్ఘారాలను నియంత్రించడం తప్పనిసరి అవసరమని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. గడచిన 10 సంవత్సరాలలో ఏటా 5.20 మిలియన్‍ హేక్టార్ల అడవిని మనం భూమి మీద నుంచి మాయం చేస్తున్నాము. కాబట్టి భూమి మీద అడవులను పునరుజ్జీవింపజేయడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం, వాతావరణ ఉష్ణోగ్రతను పెంచే కర్బన ఉద్ఘారాలను (carbon emission) తగ్గించడం మానవాళి ప్రథమ కర్తవ్యమని పర్యావరణ శాస్త్రవేత్తలు దశాబ్దకాలంగా చెపుతున్నారు. లేనిచో మనిషి సహ అన్నీ జీవజాతుల మనుగడ ప్రమాదంలో పడిపోతుంది. సముద్ర మట్టాలు పెరిగి కొన్ని దేశాలు, నగరాలు ప్రపంచ పటం నుంచి మాయమయ్యే పరిస్థితులు దాపురించనున్నాయి.
యూరప్‍ లో ఉత్పన్నమైన అతి తీవ్రమైన కరువు మానవాళికి ప్రకృతి పంపిన ప్రబలమైన హెచ్చరిక. ప్రపంచ దేశాలు ఈ అంశాన్ని అత్యధిక ప్రాధాన్యత కలిగిన అంశంగా భావించి తగు చర్యలు తీసుకోక తప్పదు.

శ్రీధర్‍రావ్‍ దేశ్‍పాండే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *