నమ్మిన బంటు


శివపురంలో ఉండే ధర్మయ్యకు లేక లేక సంతానం కలిగింది. అతడు తన కుమారుని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. కానీ ఆ తర్వాత అతడు తన కొడుకుకు శ్రమపడి డబ్బులు సంపాదించాలని చెప్పాడు. అతని కొడుకు పేరు శేషు. అతడు తండ్రితో ‘‘నాన్నా! మనకు నీవు సంపాదించినదే చాలా ఉంది. నేనెందుకు కష్టపడాలి. మీ ఆస్తి అంతా కూడా నాదే కదా!’’ అని అన్నాడు . అప్పుడు ధర్మయ్య ‘‘ఒరేయ్‍! నా ఆస్తి అంతా నీదే. నేను కాదనను. కానీ కూర్చొని తింటే గుట్టలు అయినా కరుగుతాయి. అందువల్ల నీవు కష్టపడి డబ్బు సంపాదించడం నేర్చుకోవాలి’’ అని అన్నాడు. కానీ ధర్మయ్య మాటలు అతను పెడచెవిని పెట్టాడు.
ధర్మయ్య సముద్ర వ్యాపారం చేసేవాడు. ఒకరోజు సముద్రంలో అతని మొత్తం సరకుల ఓడలు మునిగాయని ఒక నౌకరు వచ్చి చెప్పాడు. ఆ మాటలు విని ధర్మయ్య కుప్పకూలిపోయాడు. అప్పుడే వచ్చిన శేషు నిజం తెలుసుకొని ‘‘అయ్యో నాన్నా! నీ పెట్టుబడి అంతా వ్యాపారంలో పెట్టావా! నాకు ఎంత నష్టం కలిగించావు’’ అని అన్నాడు. అప్పుడే స్పృహలోకి వచ్చిన ధర్మయ్య ఆ మాటలు విని ‘‘ఒరేయ్‍! నేను కూడా ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. రేపటి నుండి ఎవరినైనా మన ఇంటి ఖర్చులకే అప్పును అడిగి తీసుకుని రా !’’ అని శేషూను తన మిత్రుడైన రంగయ్య ఇంటికి పంపించాడు. ధర్మయ్యకు అతని వ్యాపారంలో నష్టం వచ్చిందని తెలుసుకున్న రంగయ్య తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని చెప్పాడు.


శేషు చేసేది లేక కొద్ది రోజులు కూలీ పనికి వెళ్ళాడు. ఆ తర్వాత అతడు ఒక దుకాణంలో నౌకరుగా పనికి కుదిరాడు. ఇప్పుడు ధర్మయ్య శేషు సంపాదనపైననే ఆధారపడ్డాడు. కొన్ని రోజులకు ధర్మయ్య వ•ద్ధాప్యం వల్ల చనిపోయాడు. శేషు క్రమేపీ కష్టపడడం నేర్చుకొని కొన్ని భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ఆ వ్యవసాయం వల్ల అతనికి లాభం రాకపోయినా జరుగుబాటుకు పెద్ద కష్టం కాలేదు. అతని భార్య కూడా కష్టపడసాగింది.
ఒకరోజు శేషు ఇంటికి రంగయ్య వచ్చాడు. అతడు శేషుతో ‘‘ శేషూ! పాపం నిన్ను చూస్తే జాలి వేస్తూంది. ఒక్కగానొక్క కుమారుడు అయిన నీకు మీ నాన్న చాలా అన్యాయం చేశాడు. వ్యాపారంలో ఎవరైనా మొత్తం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తారా! నేను చెబితే వినలేదు’’ అని అన్నాడు. అప్పుడు శేషు కోపంతో ‘‘దయచేసి మా నాన్నగారిని ఏమీ అనకండి. ఆయన మాకు కష్టపడడం నేర్పాడు. వ్యాపారంలో లాభనష్టాలు అన్నది సహజం. అది ఆయన తప్పు కాదు’’ అని తండ్రిని సమర్థిస్తూ మాట్లాడాడు. ఆ మాటలు విన్న రంగయ్య నవ్వి ‘‘శభాష్‍ శేషూ! నీలో చాలా మార్పు వచ్చింది. మీ నాన్న ఆస్తి ఎక్కడకు పోలేదు. మీ వ్యాపారంలో నష్టం వచ్చిందని అతను నీకు చెప్పడం శుద్ధ అబద్ధం. అతడు నీవు కష్టపడడం నేర్చుకోవాలని మీ ఆస్తి అంతా ప్రాణ మిత్రుడనైన నాకు అప్పగించాడు. పాపం దురద•ష్టం కొద్దీ మీ నాన్న మరణించాడు. ఈ బంగారు క్షణాలను పాపం ఆయన చూడలేదు. అందువల్ల మీ నాన్న అంత గొప్ప వ్యక్తి ఎవరూ లేరు. అతని మిత్రుడనైన నన్ను నమ్మి తన ఆస్తి అంతా నాకు అప్పగించి మీకు కష్టం విలువ తెలిసిన తర్వాతనే తన ఆస్తిని నీకు అప్పగించమని నాకు చెప్పాడు. ఇదిగో మీ ఆస్తి అంతా నీకు అప్పగిస్తున్నాను.’’ అంటూ కొన్ని కాగితాలను అతనికి అప్పగించాడు.


అప్పుడు శేషు ‘‘రంగయ్య మామా! మిమ్మల్ని నా మాటలతో నొప్పించినందుకు నన్ను క్షమించండి. మీరు ఎంత మంచి వారు. మా నాన్నకు మీరు నమ్మినబంటు. అందుకే మిమ్మల్ని మా నాన్న నమ్మి తన ఆస్తి అంతా మీకు అప్పగించాడు. కానీ ఇప్పుడు నేను కష్టపడడం నేర్చుకున్నాను. కష్టపడితేనే ఫలితం వస్తుందని, ఆరోగ్యం కూడా బాగుంటుందని నేను తెలుసుకున్నాను. నేను కొన్ని భూములు కౌలుకు తీసుకుని స్వయంగా వ్యవసాయం చేసి ఇతరుల కడుపులను నింపుతున్నాను. అందులో ఎంతో తృప్తి ఉంది. మా నాన్న నేర్పిన ఈ బంగారు జీవితం నాకు చాలా తృప్తిని ఇచ్చింది. ఈ వర్తక వ్యాపారాలు మీరే చూడండి. మాకు అందులో అనుభవం లేదు. మా నాన్న వలే మీరు కూడా నాకు ఆత్మీయులే ’’ అని అన్నాడు. ఆ మాటలకు రంగయ్య సరేనని తన మిత్రుడి కొడుకు ప్రయోజకుడైనందుకు ధర్మయ్య ఫోటోకు నమస్కరించి అక్కడినుండి వెళ్లి పోయాడు.

  • సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
    ఎ: 9908554535

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *