భూమి మీద మనుషులతో పాటు ఎన్నో రకాల జంతువులూ ఉన్నాయి. వాస్తవానికి మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్ చెబుతోంది. అయితే భూమి ఆవిర్భవించిన తరవాత పుట్టిన చాలా జంతు జాతులు ఇప్పుడు లేవు. ఈ ఆధునిక యుగంలోనూ మనకు తెలిసిన ఎన్నో జంతు జాతులు కనుమరుగై పోతున్నాయి. ఈ మధ్యనే అంతరించి పోయిన చీతాలు జాతిని ఇతర దేశాల నుంచి తెప్పించడం జరిగింది. ఇలా జంతువుల జాతులు అంతరించిపోకుండా, వాటిని పరిరక్షించడమే ‘ప్రపంచ జంతు దినోత్సవం’ ముఖ్యోద్దేశం. ఏటా అక్టోబర్ 4న ఈ జంతు దినోత్సవాన్ని అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు. మానవ మనుగడకు అనివార్యమైన జంతుసంపదను పరిరక్షించడం, వృద్ధి చేయడం, జంతువుల హక్కులను కాపాడటం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం.
ఈ జంతు దినోత్సవాన్ని తొలిసారి 1931లో ఇటలీలోని ఫ్లోరెన్స్లో జరుపుకున్నారు. పర్యావరణ పరిరక్షకుడిగా పిలుచుకునే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 4వ తేదీన ప్రపంచ జంతు దినోత్సవాన్ని నిర్వహించారు. మానవుడికి, జంతువులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈదినోత్సవం తెలియజేస్తుంది. ఈ రోజున జంతు సంక్షేమ ప్రచారాలతోపాటు జంతు పరిరక్షక శిబిరాలను ప్రారంభించడం, జంతు సంరక్షణకు నిధులు సేకరించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వాస్తవానికి మనం జంతువుల ఆవాసాలను నాశనం చేస్తున్నాం. విచక్షణా రహితంగా అడవులు నరుకుతూ వాటి ఆవాసాలను, మంచినీటి వనరులను ధ్వంసం చేస్తున్నాం. అందుకే అడవి జంతువులు గ్రామాల్లోకి, పట్టణాల్లోకి వస్తున్నాయి. ఆహారం కోసం మనుషులపై దాడులు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిని మార్చడం కూడా ఈ జంతు దినోత్సవ లక్ష్యాల్లో ఒకటి. జంతువులకు సహజసిద్ధమైన ఆవాసాలను కల్పించడం, జంతు జాతులను రక్షించడం, వాటి సంక్షేమాన్ని కాపాడటం ఇవే ప్రధానం. ఈరోజును జంతు ప్రేమికుల దినోత్సవంగా కూడా పిలుస్తారు.
- దక్కన్‍న్యూస్, 9030 6262 88