భీమ్‍బేట్కా శిలా గుహలు

ఆదిమ మానవుడు నివసించిన ప్రాంతం… భీముడు తలదాచుకున్న చోటు!!
2003లో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు
అక్టోబర్‍ 6న వరల్డ్ జియో హెరిటేజ్‍ దినోత్సవం సందర్భంగా…


భీమ్‍ బెట్కా భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుహలు. ఈ గుహలకు అటు పురాణ ప్రాధాన్యతతో పాటు చారిత్రాత్మక ప్రాధాన్యత కూడా ఉంది. భీమ్‍ బెట్కా గుహలు మధ్యప్రదేశ్‍లోని భోపాల్‍కు కేవలం కేవలం 50 కిలోమీటర్ల దూరంలో అమర్‍ కంటక్‍ నదీ తీరంలో రతపాని వన్యప్రాణి అభయారణ్యంలో చూడవచ్చును. ఒకప్పుడు ఆదిమానవులకు, ఆతర్వాత క్రూరమృగాలకు నివాసమైన ఈ ప్రదేశం నిర్మలంగా, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది.


భీమ్‍ బెట్కా అన్న పేరు మహాభారతంలోని భీముడి పేరు మీద వచ్చిందని స్థానికుల అభిప్రాయం. జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాక పాండవులు కొంతకాలం ఈ గుహల్లో తలదాచు కున్నట్లు పురాణ కథనం. మనిషి మొట్టమొదట జీవించింది ఇక్కడే అట. 1888లో పురావస్తు శాఖ స్థానిక ఆదివాసీల కథనం ప్రకారం పూర్వం ఈ గుహలు బౌద్దా రామాలని నమోదు చేసింది. పురావస్తు శాఖ అధ్యయనం ప్రకారం 15000 ఏళ్ల కిందటే ఆదిమానవుడు ఇక్కడ నివసించినట్లు ఆధారాలు వున్నాయి.


ఎలా కనుగొన్నారు?
భీమ్‍ బెట్కా గుహలు కనుగొన్న తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త వీ.ఎస్‍. వకాన్కర్‍ రైలులో భోపాల్‍కు వెళుతుండగా తాను ఐరోపా ఖండంలో చూసిన గుహలను పోలిన వాటిని ఇక్కడ చూసాడు. ఆతర్వాత 1957లో తన బృందంతో కలిసి గుహలను సందర్శించి కనుగొన్నాడు.
భీమ్‍ బెట్కా గుహలు ప్రాచీన శిలాయుగం కాలం నాటివి. ఈ గుహలు భారతదేశంలో ఆదిమానవుడి ఉనికి తెలియజేస్తున్నాయి. ఈ రకముగా దక్షిణ ఆసియా రాతి యుగం ఆరంభాన్ని కూడా చాటుతున్నాయి. ఈ గుహలలో లక్ష సంవత్సరాల క్రితం హోమో ఎరక్టస్‍ ఆదిమానవులు నివసించారు. భీమ్‍ బెట్కాలో మొత్తం 750 గుహలు కనుగొన్నారు. అందులో 243 భీమ్‍ బెట్కా చెందినవిగా, 178 లకర్‍ జువార్‍ వర్గానికి చెందినవిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ గుహలలో సందర్శకుల కోసం 12 మాత్రమే తెరచి ఉంచారు.
గుహలలో పెయింటింగ్స్, ఆదిమానవులు వేసిన పెయింటింగ్స్ ప్రధాన ఆకర్షణలు. ఇవి 30,000 ఏళ్ల క్రితం నాటివిగా చెబుతారు.


భీమ్‍ బేట్కా రాక్‍ షెల్టర్స్
భీమ్‍బెట్కా యొక్క రాక్‍ షెల్టర్లు మధ్య భారత పీఠభూమి యొక్క దక్షిణ అంచున ఉన్న వింధ్యన్‍ పర్వతాల దిగువ భాగంలో ఉన్నాయి. సాపేక్షంగా దట్టమైన అడవి పైన ఉన్న భారీ ఇసుకరాయి ఉద్గారాలలో, సహజ శిలా ఆశ్రయాల యొక్క ఐదు సమూహాలు ఉన్నాయి, ఇవి మెసోలిథిక్‍ కాలం నుండి చారిత్రక కాలం వరకు కనిపించే చిత్రాలను ప్రదర్శిస్తాయి. సైట్‍ ప్రక్కనే ఉన్న ఇరవై ఒక్క గ్రామాల నివాసుల సాంస్కృతిక సంప్రదాయాలు రాక్‍ పెయింటింగ్స్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వాటికి బలమైన సారూప్యతను కలిగి ఉన్నాయి.
భీమ్‍ బెట్కా గుహలను యునెస్కో 2003లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. భీమ్‍ బెట్కా గుహలో ఉన్న ఏక శిలపై ఉపయోగించిన రంగుల యొక్క ముడిసరుకు బార్కేదా వనరుగా వ్యవహరించారు పురాతత్వ శాస్త్రవేత్తలు. ఒకానొక ఏకాంతమైన రాతి గుహలో ఒక రాతి చిత్రం చేతిలో త్రిశూలం కలగి నృత్యం చూస్తున్న భంగిమలో ఉంది. దీనికి డాక్టర్‍ వకాన్కర్‍ గారు నటరాజు అని నామకరణం చేసారు. ఈ చిత్రాలు వాతావరణ అవపాతం కోతకు గురై కొంతమేరకు చెరిగిపోయినవి. కొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా గుహలలో అరుదైన చిత్రాల కోతకు గురవుతున్నాయి. వీటిని సంరక్షించడం కోసం పురావస్తుశాఖ రసాయనాలను, మైనాన్ని ఉపయోగిస్తున్నది.


సందర్శన సమయం : ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భీమ్‍ బెట్కా గుహలను పర్యాటకులు/ యాత్రికులు సందర్శించవచ్చు.
ఎలా చేరుకోవాలి : భీమ్‍ బెట్కా గుహలు భోపాల్‍కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కనుక ముందు భోపాల్‍ చేరుకొని అక్కడి నుంచి లోకల్‍ ట్రాన్‍స్పోర్ట్ ద్వారా భీమ్‍ బెట్కా చేరుకోవచ్చు. భీమ్‍ బెట్కా గుహలకు సమీపాన 45 కిలోమీటర్ల దూరంలో రాజ భోజ్‍ ఎయిర్‍ పోర్ట్ కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి విమానాలు వస్తుంటాయి. టాక్సీ లేదా క్యాబ్‍ అద్దెకు తీసుకొని భీమ్‍ బెట్కా సులభంగా చేరుకోవచ్చు. రైలు మార్గం భోపాల్‍ రైల్వే స్టేషన్‍ భీమ్‍ బెట్కాకు 37 కి.మీల దూరంలో కలదు. ఈ రైల్వే స్టేషన్‍ దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి, పట్టణాల నుండి చక్కగా కనెక్ట్ చేయబడింది. రోడ్డు మార్గం ద్వారా అయితే భీమ్‍ బెట్కా కు చుట్టుపక్కల ప్రాంతాల నుండి, భోపాల్‍, ఇండోర్‍ నుంచి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి.


చివరగా: భారతదేశం ఒకప్పుడు అనేక సామ్రాజ్యాల సమూహం. రాజులు, చక్రవర్తులు ఈ క్రమంలో శత్రుదుర్భేద్యమైన కోటలు, దేవాలయాలు నిర్మించారు. అవి ఇప్పటికీ చెక్కుచెదరకుండా చరిత్రకు సజీవ సాక్షాలుగా నిలుస్తున్నాయి. వీటిలో కనుమరుగైన వాటిని వెలికితీసి ప్రాచుర్యం కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి అభినందనీయం. ప్రభుత్వాలే కాక, ఇంటాక్‍, దక్కన్‍ హెరిటేజ్‍ అకాడెమీ, ప్లీచ్‍ ఇండియా ఫౌండేషన్‍, కొత్త తెలంగాణ చరిత్ర బృందం తదితర స్వచ్ఛంద సంస్థలు వారసత్వ సంపదను కాపాడేందుకు అనేక సూచనలు చేస్తూ, కొత్త వాటిని వెలికి తీయడంలో విశేష కృషి చేస్తున్నాయి.


-సువేగా,
ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *