ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నిరుపేదలు ఆకలి కడుపుతో రోజులు గడుపుతున్నారు. ఆహారం వృధాను అరికట్టి అందరి కడుపులు నింపడం మనందరి సామాజిక బాధ్యత. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం అందరికీ ఆరోగ్యంపై అవగాహన కాస్త అయినా పెరిగింది. పోషకాహారాన్ని తీసుకోవాల్సిన ప్రాధాన్యతను అది నొక్కి చెబుతున్నది. అయితే అందరికీ మూడు పూటలా ఆహారం లభించడం లేదని మన కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. ఈ నేపథ్యంలో అక్టోబర్ 16న మనం జరుపు కుంటున్న ప్రపంచ ఆహారదినోత్సవం (వరల్డ్ ఫుడ్ డే) గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. యునైటైడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‍ఎవో) దీనిని 1979లో గుర్తించింది. అప్పట్నుంచి దీనిని ప్రతి యేటా నిర్వహిస్తు న్నారు. ప్రారంభంలో ఇది ఎఫ్‍ఎవో స్థాపించిన దాని గుర్తుగా నిర్వహించినా.. తర్వాత.. ఆహార కొరత గురించి అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా దీనిని జరుపుకుంటున్నారు.
వరల్డ్ ఫుడ్ డే ప్రాముఖ్యత :
ప్రజలందరికి పోషకాహారం కల్పించాలనే మహా సంకల్పంతో ఐక్యరాజ్యసమితి ముందుకెళ్తుంది. ప్రపంచంలోని పేద, బలహీన వర్గాలపై దృష్టి సారించి.. వారికి ఆహార భద్రత కల్పించడమే గాక.. అందరికీ పోషకాహారం కోసం అవసరమైన చర్యలను చేపట్టడానికి అనేక అవగాహన కార్యక్రమాలను యూఎన్ చేపట్టనుంది. అధికారిక లెక్కల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఆకలి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 13 కోట్లకు పై మాటే. ఆఫ్రికన్, మద్యాసియా దేశాల్లో అంతర్యుద్ధాల కారణంగా అక్కడ ఆకలి సమస్య తీవ్రమవుతున్నది. ఇండియా లోనూ చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. మనం తినంగా మిగిలిన ఆహారాన్ని వృథా చేయకుండా.. ప్యాకింగ్ చేసి అనార్థు లకు అందించడం ద్వారా వారి కడుపు నింపిన వారమవుతాం.
- దక్కన్‍న్యూస్, ఎ : 9030 6262 88