తెలంగాణా చరిత్రలో మైలురాళ్లు!


‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం ప్రతి నెల నిర్వహిస్తున్న వెబినార్‍లో భాగంగా
సెప్టెంబర్‍ మాసంలో ముఖ్య వక్తగా ప్రసంగించిన డా।। ఈమని శివనాగిరెడ్డి-స్థపతి వ్యాసం


కొత్త తెలంగాణా చరిత్ర బృందం కన్వీనర్‍ రామోజు హరగోపాల్‍ గారు ఈ నెల నన్ను మాట్లాడమని కోరి, చరిత్ర చదవాల్సిన అవసరం, బోధనా పద్దతుల్లో రావల్సిన మార్పులు, ఉద్యోగావకాశాలు, చరిత్ర చదవటం వల్ల వ్యక్తిగతంగా ఒనగూడే ప్రయోజనాలు అన్న అంశాలను స్పృశించమన్నారు. ఆయా సందర్భాల్లో గమనించిన కొత్త విషయాలను పాతరాతియుగం నుంచి క్రీ.శ.1000వ సం।। దాకా ఏకరువు పెడతాను.


1983 ప్రాంతంలో నేను మునుపటి మహబూబ్‍నగర్‍ జిల్లా, కొల్లాపురం తాలూకా, సోమశిల గ్రామంలోని సోమేశ్వరస్వామి దేవాలయ సముదాయాన్ని శ్రీశైలం జలాశయం ముంపు నుంచి ఎగువకు తరలించే పనిలో భాగంగా నేను సోమశిలలో ఉండే వాణ్ణి. కృష్ణశాస్త్రిగారి ప్రోత్సాహంతో, డా।। బి. సుబ్రహ్మణ్యం గారితో నేను కూడా పురావస్తు అన్వేషణపై కృష్ణానది దిగువన గల అమరగిరి, బొల్లారం ప్రాంతాలకు వెళ్లాం. అక్కడ మధ్యరాతి యుగపు కొండ చరియ ఆవాసాలపై గల శిలాయుగపు చిత్రాలను, ఒక మళయాళ స్వామితో పాటు వెళ్లి చూశాం. లెక్కలేనన్న రేఖలు, ఎరుపు రంగులో ఉన్నాయి. చూట్టానికి అనేక ముగ్గులు ఒకచోట పోటీ పడుతున్నాయా అన్నట్లున్నాయి. అసలు ముగ్గులు తెలంగాణా లోనే పుట్టాయా అన్న సంశయం కూడా కలిగింది. సహజసిద్ధంగా దొరికే ఎర్రమట్టితో వేసిన రంగులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం, రేఖలు, కోనాలు కోకొల్లలుగా ఉండటంతో ఆ నిర్ణయానికి రావటం జరిగింది. శిలాయుగపు చిత్రకళ ఇబ్బడి ముబ్బడిగున్న బొల్లారం కొండ చరిత్ర కింద ఏవైనా అలనాటి మానవుల ఆనవాళ్లు దొరుకుతా యేమో నన్న ఆశతో సుబ్రహ్మణ్యంగారు జరిపిన అన్వేషణలో అరుదైన పొడవాటి, వెడల్పైన క్వార్జెటు కలం కత్తి పీలిక దొరికింది. ఆయన ఆనందానికి అవధుల్లేవు. మొట్టమొదటిగా నాకే చూపించి, ఇలాంటివి మన దేశంలో దొరకటం ఇదే తొలిసారి అన్నారు. ఇది పాతరాతి యుగ తెలంగాణా చరిత్రలో ఒక మైలు రాయే.


సోమశిలలోనే బస చేసినప్పుడు ఒకరోజు అనుకోకుండా ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డా।। ఎం.ఎల్‍.కే. మూర్తిగారు సోమశిల వచ్చారు. గుడారం ముందు మేం ఉంచిన రాతియుగపు పనిముట్లను పరిశీలించి ఒక గుండ్రని రాతిని తీసుకొని ఇది ఎక్కడ దొరికిందని అడిగితే, తీసుకెళ్లి ఆ స్థలాన్ని చూపించాం. గుండ్రని నల్లశాసపురాయికి కింది వైపు మొన నునుపుగా చేసి ఉంది. దాన్ని డిస్కాయిడ్‍ అంటారని, ఇలాంటివి కేవలం ఆస్ట్రేలియా లోనే దొరికాయని, కొత్తరాతి యుగపు తెలంగాణ చరిత్రలో ఇదొక అరుదైన పరికరమన్నారు.


కొల్లాపురం తాలూకా చిన్నమారూరు పెద్దమారూరులలో జరిపిన తవ్వకాల్లో కొత్తరాతి యుగపు చుట్టింటి పునాది బయటపడింది. చిన్న నాపరాత్రి ముక్కల్ని నిలువుగా, 10 అడుగుల వ్యాసంలో గుండ్రగా పాతి, గుంజులు పాతి ఒక గుడిసెను కట్టుకొన్న ఆధారాలు దొరికాయి. ఇంతకు ముందు అనంతపురం జిల్లా, హులికట్లలో క్రీ.పూ. 2100 సం।।ల నాటి చుట్టూ బండలు పేర్చిన ఇంటిప్లాను బయట పడింది. చిన్న మారూరులో బయల్పడిన ఈ చుట్టిల్లు కూడా అప్పటిదే. తెలంగాణా కొత్తరాతి యుగానికి సంబంధించి ఇదొక కొత్త ఆనవాలు. అక్కడే జరిపిన తవ్వకాల్లో అనేక ఇనుపయుగపు సమాధులు బయటపడినాయి. ఒక సమాధిలో మానవ అస్తిపంజరంతో పాటు, చిన్న ఇనుప పరికరాలు వెలుగు చూశాయి. ఇవి ఈనాటి డాక్టర్లు శస్త్ర చికిత్సకు వాడే పనిముట్ల లాంటివి. అందుకని కృష్ణశాస్త్రిగారు వీటిని శస్త్ర చికిత్స పరికరాలుగానే గుర్తించారు. ఇలా, క్రీ.పూ. 1000 సం।। నాడే తెలంగాణాలో శస్త్ర చికిత్సలు జరిగాయన్న విషయం తెలిసింది.
అలంపురం తాలూకా శేరుపల్లిలో కృష్ణా నది ఒడ్డున బి. సుబ్రహ్మణ్యం గారు 1983లో జరిపిన ఇనుపయుగపు స్థావరం తవ్వకాల్లో నేను కూడా పాల్గొన్నాను. సమాధులకు దూరంగా, రెండు అడుగుల లోతులో ఒక చుట్టిల్లు బయల్పడింది. దాని నేలంతా, ఇప్పటి మాదిరిగానే నాపరాళ్లతో పరచబడింది. చెమ్మ నుంచి కాపాడు కోవటానికి నేలపై బండలు (ప్లోరింగ్‍) పరచటం తొలిసారిగా తెలంగాణాలో, క్రీ.పూ.1000 ఏళ్ల నాడే ఆచరణలో ఉండటం చరిత్రలో ఒక మైలు రాయే.
కరీంనగర్‍ జిల్లా, బుడిగేపల్లి తవ్వకాల్లో కొత్తరాతియుగం, రాగి – రాతి యుగం, ఇనుపయుగపు ఆనవాళ్లు బయట పడినాయి. పక్కనే ఉన్న ఒక బండపైన రాళ్లతోనో, ఇనుప పరికరాలతోనే ఏర్పరచిన అత్యంత అందమైన ఎద్దు బొమ్మను గుర్తించారు. కృష్ణశాస్త్రిగారు. అంగసౌష్టవంతో పాటు, రూపలావణ్యం కూడా కల ఈ ఎద్దు, అప్పటి తెలంగాణా జాతి ఎద్దుగా గుర్తించబడి, ముమ్మర వ్యవసాయ పనుల్ని తెలియజేస్తుంది.


చారిత్రక తొలియుగానికి సంబంధించి, 16 మహాజనపదాల సరసన తెలంగాణాలోని అస్సకజనపదం ఉండటం, బుద్దుని జీవిత కాలం లోనే బావరి ద్వారా తెలంగాణాకు బౌద్ధ ధర్మం వ్యాపించటం కోటిలింగా లలో ఇంత వాహనముందరి కాలపు గోవిధ అనే రాజు తన పేరుతో తొలిసారి నాణేలను విడుదల చేయటం తెలంగాణా చరిత్రలో మైలురాళ్లే.
చారిత్రక తొలియుగానికి సంబంధించి తెలంగాణలోని పెద్ద బంకూరు, ధూళికట్టల్లో చాలా కొత్త ఆధారాలు వెలుగు చూశాయి. ధూళికట్టలో ఇప్పటి లేసాన్‍సే సబ్బును పోలిన ఒక సబ్బు బిల్ల దొరికింది. పెద్దబంకూరులో గెడ్డంగీసుకొనే కత్తి దొరికింది. ఇవి రెండూ క్రీ.శ.1వ శతాబ్దికి చెందిన చారిత్రక మైలురాళ్లే. హైదరాబాదు – కర్నూలు జాతీయ రహదారిపైన పెబ్బేరు దాటిన తర్వాత వచ్చే బ్రిడ్జి పక్కనే గల రంగాపూర్‍లో జరిపిన తవ్వకాల్లో ఒక చదరపు ఇటుక రాతి ఆలయపు నాది బయల్పడింది. మధ్యలో శివలింగాల, తవ్వకాల్లో శాతవాహన నాణెం, కుండ పెంకులు, 58×29×7 సెం.మీ. కొలతలు గల ఇటుకల ఆధారంగా, ఈ ఆలయం, క్రీ.శ.1వ శతాబ్దికి చెందిందని మన దేశపు తొట్టతొలి నాగరశైలి దేవాలయమని, ఇదీ తెలంగాణాలో వెలుగు చూడటం ఆశ్చర్యమేనని ఐ.కె. శర్మగారు అన్నారు. చారిత్రక తొలి యుగానికి సంబంధించిన తెలంగాణా చరిత్రలో ఇది మరో మైలురాయి.


పటాన్‍ చెరు – సంగారెడ్డి మధ్యలో జాతీయ రహదారి పక్కనే 1983లో పురావస్తుశాఖకు చెందిన ఎన్‍ ఆర్‍వీ ప్రసాద్‍ గారు కందిలో జరిపిన తవ్వకాల్లో బయట చదరం, లోపల ఎనిమిది పలకల గర్భాలయం, ముందు దీర్ఘ చదరపు మండపంతో ఒక ఆలయ పునాది బయల్పడింది. దొరికిన పురావస్తువులు, ఇటుకరాతి పరిమాణాన్ని బట్టి ఈ ఆలయం క్రీ.శ. 3వ శతాబ్ది నాటి ఇక్ష్వాకుల కాలందని తేల్చారు. ఇదే ఇప్పటి వరకూ బయల్పడిన తొట్ట తొలి ద్రావిడ సంప్రదాయ శైలి ఆలయం. అదీ తెలంగాణా నుంచే.


మునుపటి నల్లగొండ జిల్లా తిరుమల గిరి మండలంలోని ఫణిగిరి తవ్వకాల్లో బయల్పడిన ఇక్ష్వాకు రుద్రపురుష దత్తుని 18వ పాలనా సం।। శాసనం, అతని పాలనా కాలాన్ని మరో తొమ్మిదేళ్లు పెంచటమే కాక, కృష్ణునికి సంబంధించిన తొలి ప్రస్తావన, ధర్మచక్ర ప్రశస్తి తెలంగాణా చరిత్రలో కొత్త మైలురాళ్లే.
మునుపటి మహబూబ్‍నగర్‍ జిల్లా, వనపర్తి తాలూకా గుమ్మడంలో రాష్ట్ర పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో నలువైపులా ప్రొజక్షన్‍ (భద్రం అంటారు) గల చదరపు ఇటుకరాతి ఆలయపునాది బయల్పడింది. ఇలా నలువైపులా ద్వారాల కోసమే ఈ ప్రొజెక్షన్స్ ఉండేవనీ, మధ్యలో ముఖలింగం గానీ, జైన చౌముఖ్‍ గానీ ఉండి ఉండొచ్చని, అందుచేత ఇది ఒక సర్వతో భద్రాలయ పునాది అని ఐకె శర్మగారు చెప్పారు. ఇటుకల సైజును బట్టి ఇది క్రీ.శ.4వ శతాబ్ది (విష్ణు కుండినుల) నాటిది. ఇలా మళ్లీ మన దేశంలోనే తొట్టతొలి సర్వతో భద్రాలయాన్ని అందించిన ఘనత కూడా తెలంగాణాకే దక్కింది.
విష్ణు కుండినుల కాలానికికే చెందిన కీసరగుట్టలో తెలంగాణా తొట్ట తొలిగిరి దుర్గం, రాజధాని, పాదబన్ధ అధిష్ఠానంతో నున్న ఆలయాల సముదాయంతో పాటు తులచువాన్టు’ అన్న క్రీ.శ.5-6 శతాబ్దాల నాటి రెండు పదాల తొలి తెలుగు పొట్టి శాసనం బయల్పడింది. ధనంజయని కలమళ్ల శాసనమే తొలి తెలుగు శాసనంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో పురావస్తుశాఖ గుర్తించినా, బహళ ప్రచారంగా వస్తున్న కొత్త తెలంగాణా చరిత్ర బృందం కన్వీనర్‍ శ్రీరామోజు హరగోపాల్‍గారు చేస్తున్న కృషి అభినందించదగ్గదే. పూర్తిస్థాయి తొలి తెలుగు శాసనంగా కలమళ్ల గుర్తింపు పొందగా, అంతకంటే ముందు కాలానికి చెందిన ఈ కీసరగుట్ట రెండు పదాల తెలుగు శాసనమే రెండు రాష్ట్రాల్లోకి అతి చిన్న తొలి తెలుగు శాసనంగా గుర్తింపు పొందటం మరో మైలురాయి.


హైదరాబాదు నగర సుందరి వయసు 400 సం।।లేనని ఇటీవలి వరకూ జరిగిన ప్రచారం, చైతన్యపురిలో పరబ్రహ్మశాస్త్రిగారు ప్రకటించిన విష్ణుకుండిన గోవిందవర్మ (క్రీ.శ.4వ శతాబ్ది) ప్రాకృత శాసనంతో, నగర సుందరి వయసు క్రీ.శ.4వ శతాబ్ది వరకు పోవడమే కాక, తొలిసారిగ పిండపాతికులనే బౌద్ధ భిక్షువుల గురించి తెలిసింది. అలానే తుమ్మలగూడెం శాసనంలో బుద్ధుని 32 మరో పురుషలక్షణాఉ గల దశ బలుడని, అష్ఠాదశ ఆవేశనిక గుణాలు కలవాడన్న విషయాలున్న తొలిరాగిరేకు శాసనంగా కూడా ఇది గుర్తింపు పొందింది.
బాదామీ చాళుక్యులకు సంబంధించి, హైదరాబాదులో బయల్పడిన రెండో పులకేశి రాగిరేకు శాసనంలో, అప్పటి వరకూ అతడు క్రీ.శ.614లో సింహాసనాన్ని అధిష్టించాడనుకొన్న దాని కంటే భిన్నంగా, క్రీ.శ.610లోనే అతడు సింహాసనంపై పట్టాభిషిక్తుడై నాడన్న కొత్త చారిత్రక ఆధారం బయటపడింది. ఇది బాదామీ చాళుక్య చరిత్రను సవరింపజేసిన శాసనంగా తెలంగాణ నుంచి వెలువడిన శాసనంగా గుర్తింపు పొందింది. బాదామీ చాళుక్య వినయాదిత్యుడు, కృష్ణా తుంగభద్ర నదుల సంగమస్థానం కూడ వెల్లిలో నిర్మించిన కూడలి సంగమేశ్వరస్వామి దేవాలయాన్ని, నీటి ముంపు నుంచి తరలించే సందర్భంగా జరిపిన తవ్వకాల్లో ఆ ఆలయం కింద 14-0 అడుగల లోతు రాతి పునాదులు బయల్పడినాయి. భారత దేశ చరిత్రలోనే, ఆలయానికి ఇంత గట్టి పునాదులున్న ఆధారాన్ని అందించిన ఘనత తెలంగాణాకే దక్కింది. ఇది తెలంగాణా దేవాలయ నిర్మాణ చరిత్రలో ఒక మైలురాయి. అలంపూర్‍లోనే బాలబ్రహ్మేశ్వరాలయ గోడలపై గల క్రీ.శ.674-75 సం।।నికి చెందిన బాదామీ చాళుక్య విజయాదిత్యుని 75 పంక్తుల ప్రశస్తి శాసనాన్ని అందించిన ఘనత కూడా తెలంగాణాదే. ఇందులో విజయాదిత్యునికి ‘మహాదేవి’ అనే మరో రాణి ఉన్న విషయంతో పాటు, అతడు పశువైద్యశాలలు కట్టించి, శైవ, వైష్ణ, శాక్త ఆలయాలతోపాటు బౌద్ధ, జైన మతాలను కూడా సమాదరించి, అశోకుని తరువాత సామరస్య సంక్షేమ పాలననందించిన చక్రవర్తిగా తెలియజేస్తున్న ఈ ప్రశస్తి శాసనం తెలంగాణా చరిత్రలో ఇంకో మైలురాయి.


బాదామీ చాళుక్యుల తరువాత తెలంగాణా రాష్ట్రకూటుల ఏలుబడిలోకి వచ్చింది. రాష్ట్ర కూటుల సామంతుడైన శంకరగండరస, కొలనుపాకను రాజధానిగ పాలించాడన్న సంగతిని కూడ తొలిసారిగ, శ్రీరామోజు హరగోపాల్‍గారు అనేక శాసనాధారాలతో నిరూపించటం కూడా తెలంగాణ చరిత్రలో కొత్త విషయమే. ఇలా, తడిమిన కొద్దీ తెలంగాణా మాగాణమంతా కొత్త కొత్త చారిత్రక ఆనవాళ్లనే కాక, భారతదేశ చరిత్రకు మైలురాళ్లనందిస్తూనే ఉంది.
‘తెలంగాణ చరిత్రలో మైలురాళ్లు’ అన్న అంశంపై ప్రసంగించే అవకాశం కల్పించిన కొత్త తెలంగాణా చరిత్ర బృందంకు, ఈ వ్యాసాన్ని ప్రచురించిన వేదకుమార్‍గారికి నా ధన్యవాదాలు.


ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *