పీవీనరసింహారావుగారికి చిన్నప్పటి స్నేహితులు, పరిచయస్తుల్లో రాగి భద్రయ్య ఒకరు. ఆయనది, అప్పటి కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ తాలూక, గొడిశాల గ్రామం. గొడిశాలను గుజ్జులపల్లి అని కూడ పిలుస్తారు. రాగిభద్రయ్య తరచూ నేను పనిచేసిన పురావస్తుశాఖకు వస్తూ ఉండేవారు. గొడిశాలలోని శిథిల శివాలయాలను బాగు చేయమని అప్పటి పురావస్తుశాఖ సంచాలకులు, డా.వి.వి. కృష్ణశాస్త్రిగారిని, 1990 ఆగస్టులో కలిసి విజ్ఞప్తి చేశారు. శాస్త్రిగారు నన్ను పిలిచి, ఆ ఆలయాలు మన రక్షిత కట్టడాలు, వాటిని ఎలా బాగు చేయాలో చూచి, నాకు చెప్పండన్నారు. మరునాడే నేను గొడిశాల చేరుకొని, రాగి భద్రయ్యగారి అబ్బాయి శ్రీనివాస్‍ను తీసుకొని ఊరికి 1 కి.మీ. దూరంలో పొలాల్లో ఉన్న మూడు ఆలయాలను చూశాను. వాటిల్లో రెండు బాగా శిథిలమైనాయి. ఆ రెండు దేవాలయాల కొలతలు తీసుకొని, తిరుగు ప్రయాణంలో కరీంనగర్ కార్యాలయంలో బస చేసి, ఆలయాల ఫొటోలు సేకరించి తరువాత రోజు హైదరాబాద్‍కు వచ్చి, కృష్ణశాస్త్రిగారికి ఆలయ పరిస్థితిని వివరించగా, ఫొటోలు చూచిన తరువాత బాగా శిథిలమైన ఆ రెండు ఆలయాలను ఊడదీసి పునర్నిర్మించటానికి అంచనాలు తయారు చేయమన్నారు. ఊడదీయటానికి నిధులు మంజూరు చేశారు. వెంటనే పనులు ప్రారంభించమన్నారు. అప్పుడు పీవీ నరసింహారావుగారు మన ప్రధాని. ఆయన మిత్రుడు గొడిశాలకు చెందిన రాగిభద్రయ్య. అందుకని ప్రాధాన్యత.
అప్పుడే నేను జాకారం శివాలయం ఊడదీశాను. ఇంకా సామాన్లు అక్కడే ఉన్నాయి. మహబూబ్‍నగర్ జిల్లా నుంచి శంకరరెడ్డి బృందాన్ని పిలిపించి, సామాన్లతో సహా, పరకాల మీదుగా, హుజూరా బాదు, ఎలబోతారం, బోర్నపల్లి మీదుగా గొడిశాల చేరుకున్నాం.
రాగి భద్రయ్యగారి ఇంటి పక్కనే గల ఒక ఖాళీ ఇంట్లో శంకరరెడ్డి బృందానికి బస ఏర్పాటు. నేను కూడా వాళ్లతోనే. పని ప్రారంభించి నెలలోపే రెండు ఆలయాలను ఊడదీశాను. వెంటనే పునాదులు, బేస్‍మెంట్ వరకూ పూర్తైంది. అప్పుడు, కన్సర్వేషన్ అసిస్టెంట్‍గా పని చేస్తున్న రహీంషా ఆలీ, అసిస్టెంట్ డైరెక్టర్‍గా పనిచేస్తున్న భాస్కరన్ గార్ల ఆధ్వర్యంలో పనులు చకచకా సాగాయి. రెండేళ్ల తరువాత, ఆలయాల మొదటి వరుసల పునర్నిర్మాణం పూర్తైంది. ఇక అప్పట్నించి నిధులు లేక పనులు చతికిలబడ్డాయి. మామూలే. మళ్లీ నాలుగేళ్లకు మరికొంత పని జరిగింది. నిధుల్లేక 2000 సం।। నుంచి పనులు ఆగిపోయాయి. గొడిశాల దేవాలయాలు కూడా, నిడిగొండా, జాకారం, రామానుజపురం ఆలయాల సరసన చేరాయి. కాకతీయ హెరిటేజ్ ప్రాజెక్టు కింద ఊడదీశాం గానీ, పునర్నిర్మాణం చేపట్టి, పూర్తి చేయలేక పోయాం. గొడిశాలకు వెళ్లినప్పుడల్లా గ్రామస్తులు అడిగే ప్రశ్నలకు చిరునవ్వే నా సమాధానం. తన మాటకు విలువిచ్చి, పీవీగారి పేరు చెప్పగానే ఆలయాలు, ఊడదీసినందుకు రాగి భద్రయ్య కొంచెం గర్వంగా కూడా ఫీల్ అయ్యాడు. ఊళ్లో ఆయనకు గౌరవం పెరిగింది. వయోభారం చేత, రాగి భద్రయ్య మరణించారు.
ఆలయాలు ఊడదీశాంగానీ, పునర్నిర్మించలేపోయామన్న బాధ. ప్రభుత్వ నిర్లిప్తత శిథిలాలను మరింత శిథిలిం చేయడానికే దోహదం చేసిందనిపించింది. ఇదీ ఆలయాల ఊడదీత, పునర్నిర్మాణ పనుల సాగదీత కథ, కమామిషు.
ఆలయాలు, గర్భగృహం, అర్థమండపం, మహామండపాలతో, సాదా గోడలతో, ద్వార శాఖలు మాత్రం అలంకరణతో ఉన్నాయి. ఆలయం ముందున్న క్రీ.శ.1236వ సం।।పు, జనవరి, 24, గురువారం నాటి శాసనంలో కాకతీయగణపతి దేవుని ప్రధానిగా వ్యవహరించిన రేచర్ల రుద్రుని మంత్రి కాటయ, ఈ గ్రామంలో, పంచలింగాలను ప్రతిష్టించి, చెరువులు తవ్వించి, తోటలు బెట్టించి, ఆలయ నిర్వహణకు పించరపల్లిని దానం చేసిన వివరాలున్నాయి. ఈ కాటయ, రేచర్ల రుద్రుని మంత్రి రాజనాయకుడు, ఆయన భార్య రవ్వాంబల పుత్రుడని కాకతీయ గణపతి దేవుని భక్తుడని కూడా చెప్పబడింది.
ఇప్పటికి 786 సం।। క్రితం నిర్మించిన ఆలయాలను ఊడదీసి 30 సం।।లైంది. పునిర్నిర్మాణం ప్రారంభమై 27 సం।।లైంది. ఇంకా పూర్తి కాలేదు. మిగతా గుళ్ల మాదిరే గొడిశాల గుళ్లుకూడా అవే ఎదురు చూపులు చూస్తున్నాయి. ఎవరో ఒక మహానుభావుడు, పునర్నిర్మాణాన్ని పూర్తి చేస్తాడేమోనని నిరీక్షిస్తున్నాయి. బండలు, ఎండలకు పగిలి పోతున్నాయి.
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446