హాఫెజ్‍ కవిత్వం – సౌందర్య దృష్టి


పర్షియాకు చెందిన సుప్రసిద్ధ కవి హాఫెజ్‍. 14వ శతాబ్దానికి చెందిన హాఫెజ్‍ రచనలు పర్షియన్‍ సాహిత్యానికి పరాకాష్టగా భావిస్తారు. హాఫెజ్‍ రచించిన అనేక పద్యాలు, గజళ్ళు ప్రపంచ మంతటా ప్రఖ్యాతిగాంచాయి. ఆయన రచనల్లో ఎక్కువగా భావ కవిత్వం తొణికిసలాడుతుంది. ఆధ్యాత్మిక సుగంధం పరిమళిస్తుంది. అతని కవిత్వం విశ్వవ్యాప్తంగా విరాజమానమై పర్షియన్‍ కవిత్వాన్ని అజరామరం చేసింది. అతని కవిత్వాన్ని ఎందరెందరో ఇతర ప్రపంచ భాషల్లోకి అనువదించారు. ఇతని సాహిత్యాన్ని రాబర్ట్ బ్లై, లియోనేర్డ్ లెవిసాన్‍, మహ్మద్‍ ఖరీమీ హకాక్‍, బిల్‍వొలక్‍, డేనియల్‍ లాడెన్‍ స్కై వంటివారు చక్కగా ఆంగ్లంలోకి అనువదించారు. వీరంతా సుప్రసిద్ధ ఆంగ్ల అనువాదకులు కావడం మరో విశేషం. హాఫెజ్‍ కవితా మూలాలను ఏమాత్రం చెడకుండా భావసౌందర్యాన్ని, ఆధ్యాత్మిక పరిమళాల్ని, శైలీ సంపద్వత్వంతో ‘హాఫీజ్‍ కవితా’ దీపాలను వెలిగించిన పండితులు.


హాఫెజ్‍ కవిత్వం అంతా తాత్వికతతో కూడినది. అర్థం చేసుకోవడం కష్టం. ధ్వని గర్భితంగా ఉంటుంది. సముద్రమంత లోతుగా ఉంటుంది. ఎత్తైన శిఖరాలను ముద్దాడే విధంగా ఉంటుంది. అతని సుప్రసిద్ధ రచన ‘హాఫెజ్‍ దివాన్‍’. హాఫెజ్‍ కవిత్వంలో ఎక్కువగా ఇరాన్‍ చరిత్ర, సంస్కృతి, పురాణ ఇతిహాసాలు ఉంటాయి. స్థానికత కవిత్వంలో తొంగిచూస్తుంది. ఆ దేశ వారసత్వ సంపద దర్శనమిస్తుంది. 14వ శతాబ్ధపు సమాజం ఎలా ఉందో, ఇస్లాం సంస్కృతి ఎలాంటిదో తెలుస్తుంది. ఇతని కవిత్వంలో ఎక్కువగా వ్యక్తి ప్రాధాన్యత ఉంటుంది. వైయుక్తిక కవిత్వం తొణికిసలాడుతుంది. మృదువుగా మత్తెక్కిస్తుంది. మధువు తాగినట్లుగా ఉంటుంది. సరసంతో సంభాషణ చేస్తున్నట్లు ఉంటుంది. కోరికలు చెలియలికట్ట దాటినట్లుగా ఉంటుంది. గజళ్ళ రచనా సౌందర్యం అదే ప్రేమ భావమును వ్యక్తం చేయడంలోనే కవిత్వం రసగంగా ప్రవాహంలా పొంగిపొర్లుతుంది. హాఫెజ్‍ ఒక ప్రేమికుడిగా తన కవిత్వం ద్వారా ముద్రపడిన వాడు. అలాంటి హాఫెజ్‍ కవిత్వాన్ని ఎందరెందరో ఇతర భాషల్లోకి అనువదించారు. మన తెలుగు భాషలోకి సుప్రసిద్ధ కవి అనువాదకులు జలజం సత్యనారాయణ చక్కగా అనువదించారు. తెలుగులోనే కవిత్వం రాశాడా అన్నంతగా అనువదించి హాఫెజ్‍ సాహితీ సౌరభాలను తెలుగు సాహిత్య లోకానికి అందించారు. ఇంతకుముందే జలజం ‘‘వేదన, శిఖరం, కబీర్‍ గీత, శృంగార బిల్హణీయం, ఫైజ్‍ కవిత్వం, ప్రేమలహరి, కురుక్షేత్ర, ఇప్పపూలు’’ వంటివి అనువాదం చేశారు. తెలుగుభాషలో మిణుకుమిణుకు మంటున్న అనువాద రంగానికి తిరిగి జవసత్వాలు నింపిన వారు జలజం సత్యనారాయణ. సుప్రసిద్ధ హిందీ, ఆంగ్ల, సంస్క•త కావ్యాలను తెలుగులోకి అనువదించి తెలుగు అనువాద శిఖరంగా కీర్తి గడించారు. అనువాద రంగానికి ఆజ్యంపోసి వెలిగించారు. ఇంతటి గొప్ప పని జలజం ఎప్పుడో చేసి ఉంటే ఈపాటికే గొప్ప కవిగా, అనువాదుకుడిగా కీర్తి గడించేవారు. కానీ ఆ కీర్తి కండూతికి ఆయన దూరంగా ఉన్నారు. ఎప్పుడూ ప్రచార ఆర్బాటాలకు దూరంగానే ఉన్నారు. ప్రపంచ సాహిత్యాన్ని చదువుతూ చదువుతూ ఒక నడిచే అంతర్జాతీయ సాహితీ భాండాగారంగా పేరుపొందారు. జలజం పాలమూరు జిల్లాలో పుట్టడం జిల్లాకే గర్వకారణమని చెప్పక తప్పదు. ఇంతకుముందే ‘హాఫెజ్‍’ కవిత్వాన్ని జలజం తెలుగులో ‘ప్రేమలహరి’ పేరుతో అనువదించారు. ఇందులో హాఫెజ్‍ కవితా సౌందర్యాన్ని ‘మధుశాల తలుపు తట్టిన దేవదూతలు, నీప్రేయసి ప్రేమికుడు, ఈ రాత్రి విషయం ప్రేమ’ వంటి మూడు భాగాలతో తెలుగులోకి వొంపి తెలుగు పాఠకులకు మధుశాల రుచిని చూపించారు. ఇందులో ఎక్కువగా గజళ్ళే ఉండడం గమనార్హం.


జలజం అనువాద సృజన
ఒక భాషలోని కవిత్వం మరోభాషలోకి అనువదించటమంటే శంఖంలో తీర్థం పోయడమే. మూల వస్తువును దృష్టిలో పెట్టుకొని అనువాదం చేయడం అంత సులువైన పనేమికాదు. మూలాన్ని దెబ్బతినకుండా మరో భాషలోకి అనువదించడ మంటే ఆషామాషి విషయం అంతకన్నా కాదు. కాని జలజం ఆ పని చాకచక్యంగా మూలం ఏమాత్రం దెబ్బతినకుండా తెలుగులోకి అణు సృజన చేశారు. కారణం హాఫెజ్‍ కవిత్వం ఇతర ప్రపంచ భాషలైన ఫ్రెంచి, జర్మనీ, ఇంగ్లీష్‍ భాషల్లోకి అనువాదం కావడమే. వీటిని జలజం సంపూర్ణంగా అవగాహన చేసుకొని హాఫెజ్‍ కవిత్వాన్ని చాలా సరళ సుందరమైన భాషలో చక్కగా అభివ్యక్తీకరించారు. హాఫెజ్‍ కవిత్వంలోని సౌందర్య సంపదను గమనిస్తే గమనంలా చక్కగా సాగిపోతుంటుంది. ఆ నడకలోనే అద్భుతమైన, అర్థవంతమైన సాహిత్యాన్ని హాఫెజ్‍ సృజించాడు. లోలోతుల్లోకి వెళ్ళి కవితా సాంద్రతలను పంచాడు. కవిత్వంలో ముఖ్యమైనవి సరళత, గాఢత, శైలీ శిల్పం. ఇవన్నీ హాఫెజ్‍ కవిత్వంలో పరిపుష్టంగా కనిపిస్తాయి. అందుకే దేశాలకు అతీతంగా అతన్ని ప్రేమించారు. అతని సాహిత్యాన్ని అక్కున చేర్చుకున్నారు. మధుపమును గ్రోలినట్లు అఘాణించారు. మధువును తాగినట్లు రుచిచూశారు. అదీ హాఫెజ్‍ కవిత్వంలోని గొప్పదనం. అదీ హాఫెజ్‍ కవిత్వంలోని సౌందర్యం. అదీ హాఫెజ్‍ కవిత్వంలోని తియ్యదనం. ఆ గొప్పదనాన్ని, సౌందర్యాన్ని, తియ్యదనాన్ని మనకు అందించిన వారు జలజం సత్యనారాయణ. తెలుగు సాహిత్య లోకంలో విరబూసి పరిమళించిన జ్ఞాన సంద్రం జలజం. హాఫెజ్‍ కవిత్వ మూలాలను పట్టుకుని అంతే స్థాయిలో తెలుగు చక్కగా అనువదించిన జలజం హాఫెజ్‍ సాహితీ విరాట్‍ రూపాన్ని తెలుగులోకానికి అందించడం మరో విశేషం. హాఫెజ్‍ తన కవిత్వాన్ని అంతా గజల్‍ ఛందో రూపంలో రచించారు. గజల్‍ అనేది అరబిక్‍ పదం. అంటే ప్రేమ గీతం. అందుకే తెలుగులో గజళ్ళు ఎక్కువగా ప్రేమ పరంగా సాగినవి. భావ కవిత్వమై పొంగి పొర్లినవి. ఈ గజల్‍ ఫారసీ సాహిత్యంలో విశేష ఆదరణ పొందింది. అందుకే హాఫెజ్‍ కవిత్వం ప్రజల హృదయాల్లో బలంగా నాటుకుపోయింది. ఇప్పటికీ ఇరాక్‍ ప్రజలు హాఫెజ్‍ను తమకంటూ కుడిగా బావిస్తారు. అంతలా హాఫెజ్‍ కవిత్వం మమేకమైపోయింది. నిజమైన కవి గెలిచేది ఇక్కడే అందుకే హాఫీజ్‍ కవిత్వం ప్రపంచాన్ని గెలిచింది. శిఖరాయ మానమై నిలిచింది. అలాంటి సాహితీ శిఖరాన్ని తెలుగులోకి దించిన తెలుగు సాహితీ అనువాద శిఖరం జలజం.


హాఫెజ్‍ రాసిన ‘దివాన్‍’ 500 గజళ్ళతో రూపు దిద్దుకుంది. చాలామంది అనువాదకులు ఈ ‘దివాన్‍’ పుస్తకాన్నే ఆధారం చేసుకొని ఇతర భాషల్లోకి అనువదించారు. అతని మరణానంతరం వెలువడిన గజళ్ళ సంపుటి ఇది. అతని కవిత్వంలో ఎక్కువగా ప్రేమ, మధుశాల, ప్రేమికుడు, ప్రేయసి, ఉద్యానవనం, కాలం, విశ్వాసం, మార్మికత, తాత్వికత, నీతి, కవి వంటి వస్తువులు ప్రధానంగా దర్శనమిస్తాయి. హాఫెజ్‍ కవితాశైలి చాలా అర్థవంతంగా ఉంటుంది. మృదుమధురంగా సాగి పోతుంటుంది. ఎపుడు చదివినా తాజాగా ఉంటుంది. పండిత పామరులను మెచ్చే విధంగా ఉంటుంది. అతని కవిత్వం సూక్తులుగా, సామెతులుగా ఉంటుంది.అందుకే హాఫెజ్‍ కవిత్వం సముద్ర తీరాలు దాటి విశ్వవ్యాప్తమైంది. విశ్వజనీనమై శిఖరాన్ని అందుకుంది. హాఫెజ్‍ కవిత్వం ఎంత చదివినా మన వేమన పద్యాల్లా తనివితీరదు. తెలుగులో వేమన ఎలాగో ఇరాన్‍లో హాఫెజ్‍ అలాగే. జనరంజక కవిగా సుప్రసిద్ధుడైనాడు. జనాల నాలుకలపై నాట్యం చేసేలా కవిత్వాన్ని అల్లాడు. ఈ పుస్తకంలో మూడు భాగాలు ప్రధానంగా మూడు భాగాలు. అవి ‘మధుశాల తలుపు తట్టిన దేవదూతలు, నీ ప్రేయసి ప్రేమికుడు, ఈ రాత్రి విషయం ప్రేమ.


మధుశాల తలుపుతట్టిన దేవదూతలు

ఈ భాగంలోని గజళ్ళు ఎక్కువగా ఆత్మాశ్రయ రీతిలో దర్శనమిస్తాయి. గజళ్ళు అంటేనే ప్రేమ గీతికలు కాబట్టి ప్రేమను తెలుపడానికే గజళ్ళలో కవిత్వం రాస్తారు కవులు. కాలం మారుతున్న కొద్దీ. ప్రేమగీతాలనుంచి సామాజిక చింతనతో గజళ్ళను నేటి కవులు ఆవిష్కరిస్తున్నారు. అయితే హాఫెజ్‍ తన గజళ్ళను ఎక్కువగా ప్రేమ గీతాలుగానే ఆవిష్కరించాడు. అంతే కాదు తన కవిత్వంలో ఎక్కువగా మధువు గురించి మధుర సంభాషణ చేశాడు. ప్రేయసి, ప్రేమికుల విరహ•త్కంఠితను మధురంగా వర్ణించాడు. శృంగారాన్ని హత్తుకున్నట్లు తన కవిత్వాన్ని సృష్టించాడు హాఫెజ్‍.


ఆమె ఎర్రటి పెదాలు నా చెవి దగ్గర
పెట్టి గుసగుసలాడింది
కనులనిండిన కన్నీళ్ళతో ఆమె యిట్లా అంది ఏంటి ఇదంతా?
‘నువ్వు నా పూర్వ ప్రేమికుడివా? నీకేమైనా నిద్రొస్తుందా?


ఇది అనువాదం చేసినట్లు అనిపించడం లేదన్నది ఈ కవిత్వం చదివిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇది చదువుతుంటే తెలుగు సాహిత్యంలోని భావ కవిత్వం నిజంగా మన చెవిలో గుసగుస లాడుతున్నట్లుంటుంది. జలజం మరో అనువాదం చూడండి.


ఒకవేళ నీవు నీకు అత్యంత ప్రియమైన రాజగోపురంలో నివసిస్తుంటే
నీవు స్వర్గాలకు పైన ఉన్నావని అనుకోకు, ఎందుకంటే
ఒకనాడు నీవు చెత్తచెదారమున్న వీధిలో రాయిలా పడిపోతావు


ఒక ప్రేమికుడి విరహవేదనకు పరాకాష్ట ఈ పంక్తులు. ప్రియురాలు ప్రేమికుడికి దక్కకపోతే నైరాశ్యంతో అన్న పంక్తులు ఇవి. ప్రేమికురాలు ఎప్పుడు ప్రేమికుడికి దూరమే. ఎంత దూరమంటే ఆమె రాజగోపురంలో. అతడు వీధి చివరలో. ప్రేమికుల మధ్య దూరమంటే అదే. తనకు ప్రేమికురాలు దక్కుతుందో లేదోననే నిరాశ నిస్పృహలతో ఆమెపై నిందలు వేస్తాడు. తనకు దక్కకపోయేసరికి అభాండాలు సృష్టిస్తాడు. ఇక్కడా అంతే రాజగోపురంలో ఉన్న నీవు వీధిలో రాయిలా పడిపోతావంటాడు. తనకు దక్కదన్న ఆక్రోశంతో ఈ పెదవిరుపులు. ఈ పాదాలను చాలా సరళంగా, భావాత్మకంగా అనువదించిన జలజం ప్రతి పాదాన్ని స్పష్టంగా కవిత్వంలోకి పంపారు. హాఫెజ్‍ రసస్థాయిని ఏ మాత్రం తగ్గించకుండా ద్రాక్షరసంలో ముంచి తీసినట్లు చక్కగా అనువదించారు.
ఈ ‘మధుశాల తలుపు తట్టిన దేవదూతలు’ లోని గజళ్ళన్నింటిని జలజం మలయమారుతంలా మార్చి మనకందించారు.


నీ ప్రేయసి ప్రేమికుడు
ఈ భాగంలో మొత్తం 51 గజళ్ళను జలజం అనువదించారు. ఇందులో ఏ గజళ్ళను చదివినా అక్షరాలు మత్తుగా మనలను దోచేస్తాయి. మన మనసునిండా మధురంగా ఆవహిస్తాయి.
నీ ముఖం ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు, అయినప్పటికీ
వేలపోటీదార్లు ఇక్కడ గుమిగూడారు
నీవు ఇప్పటికీ మొగ్గవే, అయినా వందల కోకిలలు నీ చుట్టూ చేరినవి


ప్రేమంటే ఒక కల్పన. ఒక వర్ణన. ఒక ఊహ సుందరిని ఎలా ఊహించుకుని ప్రేమికుడు ప్రేమిస్తాడో అదే సందర్భాన్ని కవి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఆమె ముఖం ఎవ్వరూ చూడకున్న ఆమె ప్రేమ కోసం ఎంతోమంది పోటీపడుతున్నారు. కానీ ఆమె ఇంకా చిరుమొగ్గనే. పుప్పొడికోసం తేనెటీగలు చేరినట్లు… ఆమె కోసం వందల కోకిలలు సప్తస్వరాలతో స్వాగతం పలుకు తున్నాయి. ఎంత అందమైన భావన. ఆమె చుట్టూ ప్రేమ కోకిలలు వసంతంలా ఆహ్వానిస్తున్నాయి. మొగ్గ అంటే ఎవరికిష్ట ముండదు. అదీ లేలేత మొగ్గ. ఆ మొగ్గ కోసం కోకిలలు పహారా కాస్తున్నాయి. ఆ మొగ్గ వెదజల్లే సుగంధ పరిమళాల కోసం. ఆ మొగ్గను మత్తుగా ఆఘ్రాణించడం కోసం.
హాఫెజ్‍ ఏ బావనతో గజళ్ళను సృష్టించాడో జలజం అదే భావాన్ని చక్కగా తెలుగులోకి ఆవిష్కరించారు.


నీలాంటి ప్రేయసి వున్నంతకాలం నా హృదయాన్ని నీ నుంచి వేరు చేయలేదు
ఎంతకాలమైనా నేను బాధపడతాను

అసలైన ప్రేమికుడి తత్వమిదే. తను కోరుకున్న ప్రేమ కోసం ఎన్ని సంవత్స రాలైనా, ఎన్ని యుగాలైనా ఎదురు చూస్తుంటాడు ప్రేమికుడు. తన హృదయంలో గాఢంగా ముద్రించుకుపోయిన ప్రేయసి రూపాన్ని ఎవరూ వేరు చేయలేరని ప్రేమికుడి తత్వం. ఇదొక అద్వైత భావన. అపుడే ప్రేమ పరిమళిస్తుంది. పరిమళించి చిగురిస్తుంది. చిగురుతొడిగి ప్రేమ గ్రంథాన్ని వెదజల్లుతుంది. ఇట్లా జలజం కలమనే మధుపాత్రతో హాఫెజ్‍ గజళ్ళను తెలుగు పాఠకులకు అందించి అనువాదంలో రారాజు అనిపించుకున్నారు.


ఈ రాత్రి విషయం ప్రేమ
ఇందులోని 20 కవితలు ముందు పేర్కొన్న కవిత్వానికి కాస్త భిన్నంగా ఉంటాయి.
నీ శరీరంలోని ప్రతి కోర్కె పవిత్రమైందే
ఔ నా ప్రియమైనవాడా
నీవు చనిపోయేదాక నిరీక్షించడం దేనికి
ఆ దైవిక పరమసత్యాన్ని తెలుసుకోవడానికి?

ఈ కవితలో అమలిన ప్రేమ సాక్షాత్కరిస్తుంది. మనసులోని కోరికలను కూడా పవిత్రంగా పేర్కొనడ మంటే స్వచ్ఛమైన మనస్సు ఎలా ఉంటుందో తెలియపరచడం. ప్రేయసి ప్రేమికుడిని సంబోధిస్తూ అతన్ని చనిపోయేదాక నిరీక్షించడం దేనికి, దైవికమైన పరమసత్యాన్ని తెలుసుకోవడానికా అంటూ ప్రశ్నించడం ఇద్దరి మధ్య నిజమైన ప్రేమతత్వాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రేమంటే నిరీక్షణకు పరాకాష్ట. ఆ నిరీక్షణలోనే అసలైన ప్రేమ దివిటీలా వెలుగుతుంది. ఇలాంటి హాఫెజ్‍ కవితా పంక్తులను జలజం ప్రేమతో తెలుగులోకి అనువదించారు. ఈ అనువాదంలో మనం మునిగిపోతే మత్తుగా కవితల్ని ఆఘ్రాణిస్తాము. ఆనందంతో పరవశించిపోతాము. అదీ జలజం అనువాదానికున్న ద్రాక్షరస సొగసు. పదాల పోహలింపు.
నీ శరీరంలో నీవొక పవిత్రమైన అంకురానివి
ప్రతిరాత్రి ఒక బాణంపైకి పొడుసు కొస్తుంది
అది నీ ఆత్మని పరమాత్మలోకి నెట్టి వేస్తుంది

ప్రేమ గురించి ప్రేమికుడు పలికిన పంక్తులివి. ఆమె ఎంతో పవిత్ర. ఆమె మనస్సు కూడా అంతకంటే పవిత్రమైనదని. ఇక్కడ ఆత్మ ప్రేయసి అయితే పరమాత్మ ఆమె మనసు. ఆత్మ, పరమాత్మల సంలీనమే ప్రేమ. హాఫెజ్‍ ప్రేమికులను, వారి బాధలను, వారి విరహవేదనలను ఎలా ఆవిష్కరించాడో జలజం తెలుగులో అదే స్థాయిలో అమృతంలా మనకందిచారు. ఒక ప్రత్యేకమైన అనువాద పద్ధతులని జలజం పాటించారు. అందుకే అంత చక్కగా, చిక్కగా తెలుగు అనువాదం పండింది. అక్షరాలు అమృతాన్ని ఆస్వాదించాయి. పాదాలు పరిమళభరితంలా ఆఘ్రాణించాయి. తెలుగు సాహిత్యంలో అనువాద రసాన్ని అందించిన జలజం అనువాద రారాజు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


పుస్తకం : ప్రేమలహరి – హాఫెజ్‍ కవిత్వం
తెలుగు : జలజం సత్యనారాయణ

  • డా।। భీంపల్లి శ్రీకాంత్‍,
    ఎ : 9032844017

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *