ప్రకృతే నియంత్రిస్తుంది! 15 ప్రకృతే శాసిస్తుంది!! నిర్వీర్యమౌతున్న నివేదికలు! శూన్యస్థాయిలో చర్యలు !!

(గత సంచిక తరువాయి)
నివేదిక ప్రస్తావించిన ప్రధాన అంశాలు :
కార్బన్‍డయాక్సైడ్‍ (co2) :

గత రెండు వేల సంవత్సరాలతో పోలిస్తే ఈ వాయువు గాఢత 2019లో వాతావరణంలో అత్యధికమైంది. 1990 నాటి హరిత వాయువులతో పోల్చినప్పుడు ఈ వాయువు 59 శాతం కాగా, 2010- 2019 మధ్యకాలంలో ఏకంగా 64 శాతంకు పెరిగింది. దీనంతటికి కారణం బొగ్గు ఆధారిత విద్యుత్‍ ప్లాంట్‍ నుంచి జనించిన కార్బన్‍ యాక్సైడే! ఈ విధంగా బొగ్గు వాడకం సంవత్సరానికి రెండు బిలియన్‍ టన్నులు కాగా, కార్బన్‍డయాక్సైడ్‍ ఉద్గారం 2021లో 6 శాతం పెరుగుదలతో వాతావరణంలో 36.3 బిలియన్‍ టన్నులకు చేరుకుంది.


హరితవాయువులు : పైన ప్రస్తావించిన కాలంలో మీథేన్‍ (CH4) 18 శాతం, నైట్రస్‍ ఆక్సైడ్‍ (N2O) 4 శాతం పెరగ్గా, ఫ్లోరినేటెడ్‍ వాయువులు 2 శాతంగా పెరిగాయి.


ఉష్ణోగ్రతలు : పై వాయువుల ఉద్గారాలు నిరంతరం పెరిగిపోవడంతో, 1970తో పోల్చినప్పుడు భూ ఉష్ణోగ్రతలు 1OCగా, 1.50Cగా నమోదు అవుతూ గడచిన రెండువేల సంవత్సరాల కన్నా అత్యధికమైంది. పరిస్థితి ఇలాగే వుంటే 2030 నాటికి ఇది 20 C చేరుకుంటుంది. (దీని ఫలితంగా గత జులైలో పశ్చిమ యూరప్‍లో, అమెరికాలోని కాలిఫోర్నియాలో వేలాది ఎకరాల కారడవి కార్చిచిచ్చుకు గురైంది చూసాం!)


సముద్ర మట్టాలు : గత మూడువేల సంవత్సరాలతో పోల్చినప్పుడు 1990 నుంచే సముద్రాల సరాసరి మట్టం పెరిగిపోతూ వున్నది. గతంలో ప్రతి 100 సం।।లకు ఒకసారి పెరిగే సముద్ర మట్టాలు ఇప్పుడు ఆరు సం।।లకు ఒకసారి పెరుగుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దాంతానికి సముద్రాలు సంవత్సర సంవత్సరానికి పెరుగుతూ పోతాయి.


లచక్రం గతితప్పును : వాతావరణ కాలుష్యం, ఉష్ణోగ్రతలు జీవరాశి ఉనికికి కారణమైన జలచక్రంపై తీవ్ర ప్రభావం చూపి, అత్యధిక వర్షాలు, వరదలు, కరువు కాటకాలు సంభవిస్తాయి.


వ్యవసాయంపై తీవ్ర ప్రభావం : అతివృష్టి భూభాగాల్ని అతలాకుతలం చేస్తే, సారవంతమైన నేల (soil) కోతకు గురై సముద్రాల్ని చేరుతుంది. అనావృష్టితో భూమి నెర్రలు వారి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. ఫలితంగా ప్రపంచ వ్యాపితంగా మానవులకే కాదు, యావత్‍ వృక్ష, జంతుజాలానికి విపరీతమైన ఆహారపు కొరత ఏర్పడుతుంది.


ఆక్సిజన్‍ తగ్గుట : ఈ పరిణామాలన్నీ వాతావరణంలోని ఆక్సిజన్‍ను తగ్గించగా, నీటిలో ఆక్సిజన్‍ శాతం పూర్తిగా తగ్గిపోతుంది. (ఇదే జరిగితే జీవకోటి పరిస్థితి ఏ విధంగా వుంటుందో ఊహించు కోవచ్చు).


పైన ప్రస్తావించిన విపత్కర పరిస్థితులు మచ్చుకకు కొన్ని మాత్రమే! ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‍ స్పందిస్తూ, హరిత వాయువులు భూగోళాన్ని ఊపిరాడకుండా చేస్తున్నాయని, రోజురోజుకు మార్పు చెందుతున్న భౌగోళిక మార్పల్ని నియంత్రించలేని స్థితికి చేరుకున్నాయని, గత వాతావరణ స్తాయికి తిరిగి పునరుద్దరించలేని పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికే ఆలస్యమైనా సమయం మించి పోలేదని, దేశాధినేతలంతా కళ్ళు తెరవాలని, కర్బన ఉద్గారాల్ని తగ్గించే చర్యలు వెంటనే చేపట్టాలని, అయినా ఇప్పటికే వెలువడిన ఈ వాయువులు వాతావరణంలో రాబోయే దశాబ్దకాలం కొనసాగుతాయని హెచ్చరించాడు.
ఈ నివేదిక వర్కింగ్‍ గ్రూప్‍ -l కి కో చైర్మన్‍గా వ్యవహరించిన వలిరియే మాసన్‍ డెల్‍మొట్టె (Valerie Mason – Delmotte) మాట్లాడుతూ, ఈ పరిస్థితులకు మితిమీరిన మానవుడి దుశ్చర్యలే కారణమని, అందరు జవాబుదారులేనని ఆరోపించగా, రాబోయే కాలమంతా భూగోళానికి అగ్నిపరీక్ష కాగా, అత్యధిక వేసవి తీవ్రతలను, అతిస్వల్ప చలిని చూడాల్సి వస్తుందని మిగతా నిపుణులు అభిప్రాయపడుతూ, ఇలా చేజారిన పరిస్థితి తీవ్ర ఆహార కొరతను కల్గిస్తే, ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాపితమైతాయని వాపోయారు.
ఒకవేళ మనుషులు కళ్ళుతెరిచినా, 2100 నాటికి ఉష్ణోగ్రత పెరుగుదలను 1.40 Cవద్ద కట్టడి చేయవచ్చని సూచించారు.


నివేదిక ముఖ్య సూచనలు :
 • AR-6 నివేదిక హెచ్చరికల్ని ఖాతరు చేయకుంటే, భూగోళ విపత్తులు మరింతగా పెరుగుతాయి.
 • చేపట్టిన చర్యలు పరిమితంగా వున్నాయి. ఇవి కూడా సమర్థవంతంగా లేవు.
 • మానవ ప్రేరిత పర్యావరణ విపత్తుల్ని కఠినంగా, సున్నితంగా నియంత్రించాలి.
 • సముద్రమట్టాల పెరుగుదలను గోడలు కట్టి నియంత్రిచ లేకపోగా, ఈ విధానం మరిన్ని వినాశనాల్ని కల్గిస్తాయి.
 • ముందుగా తీరప్రాంత నగరాలకు పెను ప్రమాదం సంభవిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో వుండే ఒక బిలియను ప్రజలు కష్టాల కడలిని చూడాల్సి వస్తుంది.
 • భౌగోళిక రక్షక అవకాశాల్ని మనమే చేజేతులా నాశనం చేసుకుంటున్నాం.

తక్షణం చేపట్టాల్సిన చర్యలు :
 • అన్ని దేశాలు మూకుమ్మడిగా కర్బన ఉద్గారాల్ని 2050 నాటి కల్లా సున్నా (ఓవతీశీ) శాతానికి తగ్గించివేయాలి. ముందుగా జి-20 దేశాలు ఇందుకు నడుము భిగించాలి. (కాలుష్య కారక ఇంధనాలకు బదులుగా, పునరుద్దరించబడే సహజ సిద్ద ఇంధనాల్ని, సౌరశక్తిని వినియోగంలోకి తేవాలి)
 • ఈ దశాబ్దాంతానికి (2030) హరిత వాయువల్ని విడుదలను గణనీయంగా తగ్గించాలి.
 • కొత్తగా థర్మల్‍ విద్యుత్‍ కేంద్రాల్ని నిర్మించవద్దు. ఉన్నవాటిని దశల వారిగా మూసివేయాలి.
 • కొత్తగా పెట్రోలియం నిక్షేపాలకై అన్వేషణ, తవ్వకాలు చేపట్టవద్దు.
 • కర్బన్‍ ఉద్గారాల్ని మొత్తంగా (Cummulative) లెక్కించాలి. (అన్ని స్థాయిలవి)
 • శ్రీ కాలుష్యరహిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి.


ఇవి జరగాలంటే
• ఇప్పటికే వెలువడిన కార్బన్‍ డయాక్సైడ్‍ను వాతావరణం నుంచి తొలగించాలి. (అత్యధిక శాతం శాశ్వత అడవుల్ని పెంచాలి)
• శిలజా ఇంధనాల వినియోగం ఆపివేయాలి.
• అడవుల నరికివేతను ప్రపంచవ్యాపితంగా నిషేధించి, పోగొట్టుకున్న అడవిని తిరిగి యుద్ధ ప్రాతిపదికన పునరుద్దరించాలి.
• పట్టణీకరణను నియంత్రించాలి.
• అంటే భూగోళాన్ని 19వ శతాబ్దిస్థాయి నాటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందించాలి.
(వచ్చే సంచికలో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి లక్ష్యాల్ని చూద్దాం!)

 • డా।। లచ్చయ్య గాండ్ల, ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *