పత్రికొక్కటున్న పదివేల సైన్యము
పత్రికొక్కటున్న మిత్ర కోటి
ప్రజకు రక్ష లేదు పత్రిక లేకున్న…..
అంటారు పత్రికా రంగ వైతాళికుడు నార్ల వెంకటేశ్వరరావు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే పత్రికల పాత్ర అనివార్యం. మానవజీవన వికాసంలో పత్రికలు ఎప్పటికప్పుడు తమ వంతు పాత్రను నిరంతరాయంగా పోషిస్తూ వస్తున్నాయి. ఆ క్రమంలో 10 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన దక్కన్ ల్యాండ్ సామాజిక రాజకీయ మాసపత్రిక తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ పతాకగా నిలిచింది. మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరులూదింది. తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలను ప్రతిఫలించే అద్దంగా, అన్యాయాలు అక్రమాలపై ప్రకటించిన యుద్ధంగా దక్కన్ ల్యాండ్ పాఠకులకు చేరువైంది.
ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, సోషల్ మీడియాలు ఉప్పెనలై సమాజాన్ని ముంచెత్తుతున్న ఈ తరుణంలో పత్రికలు నిర్వహించడం కత్తి మీద సామే. అందునా పదేళ్లపాటు నిరంతరంగా కొనసాగడం, ప్రకటనల పటాటోపాలు, వ్యాపార ధోరణులకు దూరంగా, పవిత్రంగా, పాఠకుల ప్రయోజనమే లక్ష్యంగా ఇన్నేళ్లు కొనసాగడం పత్రిక యాజమాన్యం సంపాదకవర్గం సిబ్బంది రచయితల అభిమానుల సమిష్టి క•షికి తార్కాణం. వారందరికీ అభినందనలు.
ఇక పత్రిక అందిస్తున్న సమాచారం విషయానికొస్తే 60 పేజీల్లో పొదిగిన అంశాలన్నీ వర్తమాన సమాజాన్ని ఆవిష్కరించేవే. వివిధ శీర్షికల రూపంలో దక్కన్ ల్యాండ్ ప్రకటిస్తున్న ప్రచురిస్తున్న విషయాలన్నీ విస్తారమైన సమాచారంతో లోతైన విశ్లేషణ చక్కగా చిక్కుగా రూపొంది అభిరుచి గల పాఠకులను ఆకర్షిస్తాయి. ఇంతవరకు వెలువడిన 132 సంచికలను తిరగవేస్తే ఎక్కడా పొల్లు రాతలు సొల్లు కూతలు మచ్చుకి కూడా కనిపించవు. ఇటువంటి సాధికార పత్రికలు సమాజంలో అరుదుగా కనిపిస్తుంటాయి. ఆ వరుసలో తెలుగులో దక్కన్ ల్యాండ్ అగ్రభాగాన నిలుస్తుంది. పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయాల దాకా అన్నిచోట్ల వివిధ వ్యక్తులు వ్యవస్థలు నిర్వహిస్తున్న గ్రంధాలయాల్లో విశేషించి ఇంటింటా ఉండవలసిన పత్రిక దక్కన్ ల్యాండ్. ఉద్యోగార్థులకు పోటీ పరీక్షలకు అవసరమైన అమూల్యమైన సమాచారం దక్కన్ ల్యాండ్ అందిస్తున్నది. ప్రత్యేకించి విశ్లేషకులకు, వ్యాసకర్తలకు, పరిశోధకులకు, పరిపాలకులకు దక్కన్ ల్యాండ్ ప్రతి సంచిక ఒక కర దీపిక. నానాటికి విలువలు అంతరించిపోతున్న నేటి చీకటి సమాజానికి దక్కన్ ల్యాండ్ ఒక ఆశాకిరణం. ఈ పత్రిక ఆదర్శంగా మరిన్ని పత్రికలు పాఠకులకు అందుబాటులోకి రావాలని తెలుగు అక్షరం మరింత సుసంపన్నం కావాలని కోరుకుంటున్నాను. వేదకుమార్ గారికి అభినందనలు.
- డా. అయాచితం శ్రీధర్
అధ్యక్షుడు. తెలంగాణ గ్రంథాలయ పరిషత్
ఎ : 984989323