ప్రకృతే సౌందర్యం! 18 ప్రకృతే ఆనందం!! మనిషే మాపాలిట మహా మమ్మారి


(గత సంచిక తరువాయి)
నా దంతాలే (tusks) నాకు శత్రువులు:

భూమిపై నడయాడే జంతువులలో అతిపెద్ద జంతువును నేనే! నన్ను ఇష్టపడని వారుండరు. పిల్లలైతే ‘భలే!భేలే!’ అంటూ కేరింతలు కొడుతారు. ఒకప్పుడు సర్కసుల్లో వినోదాన్ని అందించేదాన్ని. జంతుప్రేమికుల చొరవతో నాకు సర్కసుల నుంచి విముక్తి లభించింది. కాని బాహ్యసమాజంలో, అడవుల్లో మానవుల నుంచే ఇంకా విముక్తి లభించక పోగా నిత్యం ప్రాణసంకటంగా వుంది. నా ఆవాస ప్రాంతాల్ని, నడిచేదారుల్ని (corridors) అటవులను నరికి, గనులను తవ్వి, రైలు, రోడ్డు మార్గాల్ని వేసి, ప్రాజెక్టుల పేరున, వ్యవసాయం ముసుగున ధ్వంసం చేసారు. చేస్తూనే వున్నారు. విధిలేక నేను గ్రామాలపై, పంటలపై దృష్టి సారించడంతో ప్రజలు, రైతులు నాపట్ల ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. తుపాకులతో, కందకాలు తవ్వి మమ్మల్ని నిత్యం హతమారుస్తున్నారు.


ఇక స్మగ్లర్ల విషయం తెలిసిందే! నన్ను వేటాడడంలో వీరప్పన్‍ అంతర్జాతీయ గుర్తింపును పొందింది తెలిసిందే! పేరుకు వీరప్పన్‍ అయినా, ఆయన వెనక పనిచేసిన రాజకీయ శక్తుల గూర్చి ఎన్నోసార్లు బయట పడింది గుర్తెరిగిందే! ఒకప్పుడు నా దంతాలకై నన్ను వధించేవారు. రాచరికపు లోగిళ్ళలో, ధనవంతుల ఇళ్ళలో నా దంతాలను, వాటితో తయారు చేసిన వివిధ పాత్రల్ని, అలంకరణ సామాగ్రిని వాడి వారి హోదాను చాటుకునేవారు. ఇప్పటికి ఆ చేదు గుర్తులు ఆసియా, ఆఫ్రికా దేశాల్లో, లాటిన్‍ అమెరికా దేశాల్లోచూడవచ్చు! రాను రాను మొత్తం నాశరీర భాగాలపై మానవుల దృష్టి పడింది. నామాంసం, శరీర అంతర్భాగాలు, నాతొండం చివరి భాగం అతి రుచికరమని ప్రచారం చేసి, నిత్యం నన్ను వేటాడం మరింతగా పెరిగింది. చివరికి, నా కాళ్ళను చెత్త బుట్టలకు వాడుకునే నీచానికి ఒడిగట్టారు. నేను భూమిపై నడయాడిన దశనుంచి మానవుడు నన్ను అన్ని విధాల వాడుకున్నాడు. యుద్ధాల్లో గజబలంగా, రాజుల అంబారిగా, అడవుల్లో పెద్ద దుంగల్ని తరలించే యంత్రంగా వాడుకునేది చూసిందే! చివరికి నా దంతాలతో చేసిన ఆభరణాల్ని, గుర్రాలకు, ఇతర పెంపుడు జంతువులకు వాడుతున్నారు. (గ్రీకు ఇతిహాసం ఇలియాడ్‍లో ప్రస్తావన)


నిజానికి నా ఉనికి ఆసియా, ఆఫ్రికా ఖండాలకే పరిమితమైనా, వలసవాదం, సామ్రాజ్యవాదం నన్ను బలిపశువును చేసి, వాడుకున్నది. యూరప్‍దేశాల్లోని దొరల (lords), రాజాంతపురాలలో నా దంతాల్ని ప్రదర్శించి వారి దర్పాన్ని పెంచుకున్నారు. వీరి ఆకాంక్షలకై 19వ, 20 శతాబ్దపు మధ్యకాలంలో దాదాపు లక్ష ఏనుగుల్ని బలితీసుకున్నారు. 1955-1960 మధ్యన కేవలం గ్రేట్‍ బ్రిటన్‍లోనే దాదాపు అయిదు వేల కిలోల దంతాలు బహిరంగంగా అమ్ముకున్నారు. వీరి దంతార్థిని (tuskgreedy) తీర్చడానికై కెన్యాలో సంవత్సరానికి 4-5 వేల ఏనుగుల్ని చంపేవారు. మొత్తం ఆఫ్రికా ఖండంలో సరాసరి రోజుకు 150 ఏనుగులు వధించబడ్డాయి. ఇది ఇప్పటికి కొనసాగుతూనే వున్నది.
వైల్డ్లైఫ్‍ ఫౌండేషన్‍ అండ్‍ ఆఫ్రికా జాగ్రఫీ (WFAG) లెక్కల ప్రకారం 20వ శతాబ్దం ప్రారంభంలో మా సంఖ్య ఆఫ్రికాలోనే 12 లక్షలకు పైగా వుండేది. 2020 వాటికి మా సంఖ్య 4 లక్షలకు పడిపోయింది. అంతకుముందు శతాబ్దంలో మా సంఖ్య పది మిలియన్లుగా, ఆసియాలో లక్షకు పైగా వుండేదట! 1980 దశకంలో భారత్‍లో 16 వేలుగా వున్న సంఖ్య ప్రస్తుతం 28 వేలకు పెరగడం మాత్రం ఆనందదాయకం. అయినా పరిస్థితి ఆశాజనకంగా లేదు. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంస్థ (IUCN) జాబితా ప్రచురించే రెడ్‍లిస్టులో ఆసియా ఏనుగులు అపాయకర ( endangered) స్థితిలో, ఆఫ్రికా ఏనుగులు ప్రమాదపుటంచున (vulnerable) స్థాయిలో వున్నట్లు పేర్కొంది.


ఇప్పుడు చెప్పండి! ఈ భూమిపై నా ఉనికికి భద్రతా వుందా! వుందంటే అది కొంతమంది మనుషులలోనే! రాజకీయాల్లో, చట్టాల్లో మాటల్లో, రాతల్లో మాత్రమే! చేతల్లో అంతా ధ్వంస రచనే! చివరికి మా కోసం ఏర్పాటు చేసిన రక్షిత ప్రాంతాల్లో కూడా మాకు భద్రత లేకుండా పోయింది. ప్రాజెక్టుల పేరున, గనుల తవ్వకాల పేరున మా ఆవాసాల్ని కొల్లగొడుతున్నారు. మా దారుల్ని మూసివేస్తున్నారు. విద్యుత్‍ కంచెలచే దిగ్భంధం చేస్తున్నారు. గోతులను తవ్వి దారుల్ని ధ్వసం (disuse) చేస్తున్నారు. ఎంత సాధువులమైనా, అభద్రతా భావంతో రెచ్చిపోయి దాడి చేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భాలలో కొంతమంది మా దాడిలో ప్రాణాలు కోల్పోవడం మాకు బాధను కల్గిస్తున్నది. వీటన్నీంటిని అర్థం చేసుకొని మా మానాన మమ్మల్ని బతకనీయండి.


ఖడ్గం వున్నా యుద్ధం చేయలేని నిస్సాహాయురాలిని!
నేలపై జీవించే భారీకాయపు జంతువులలో నాది రెండోస్థానం! చూడడానికి నేను ఏనుగులా ఆకట్టుకోలేకున్నా, నేనో శాఖహారపు జీవినే! ఎవరికి హానిచేయని దాన్ని. అయినా ఏ జంతువుకు లేనట్లు నాపేరుకు ‘మృగం’ అని చేర్చారు. పోతే, ముఖంపై మొనతేలిన ఓ అవశేష భాగం కత్తిలా వుండడమే నా పాలిట మృత్యుడిగా మారింది. నిజానికది ఎముకలేని కండర నిర్మాణం. చిన్నపాటి దెబ్బ తగిలినా అది విరిగిపోతుంది. అయినా సంవత్సరం తిరగకుండానే అది తిరిగి పెరుగుతుంది. ఇలా దెబ్బతిన్నా, తిరిగి పెరిగే ఖడ్గమే నా ఉనికికి ప్రమాదకరంగా దాపురించింది. ఈ ఖడ్గంచే తయారు చేసిన పాత్రలో విషం కలిపిన ఏ పదార్థమైనా, తాగే వ్యక్తికి హాని జరగదనే తప్పుడు ప్రచారం అనాదిగా కొనసాగడంతో రాజులు, భోగులు, విలాసవంతులు, నా ఖడ్గంచే చేసిన ‘చీర్‍’ (goblet) పాత్రకు ఎనలేని విలువకట్టి తమ మందు సీసాల పక్కన పెట్టుకుంటారు. దీనికి తోడు ఈ కొమ్మును ధరిస్తే యవ్వనం తరగదని, పరాక్రమ వంతులు అవుతారనే తప్పుడు ప్రచారంతో నా ఖడ్గాన్ని బంగారంతో సమానంగా భావిస్తారు.
ఏనుగులాగానే మా ఉనికి ఆఫ్రికాలో, ఆసియాలో అత్యధిక సంఖ్యలో వుండేది. కాని, ఇప్పుడు కనుమరుగైతున్న (extinction) జాబితాలో చేర్చారు. నేను ఏనుగంత ప్రాధాన్యతను సంతరించుకోకున్నా, ఏనుగుల వేటలో భాగంగా మాజాతిని మానవ జాతి వేటాడేది. 1920లో ఫ్రెంచ్‍ దేశపు కన్నాన్‍ నాలుగు సంవత్సరాల కాలంలో మా జాతిని 350 పైగా వధించాడు. నిజానికి ఆయన వేట ఏనుగులది. కాని, దారిలో మామానాన మేముంటే, వాడి తుపాకి సరదాకి మాపై గురిపెట్టాడు. ఆంగ్లేయుడైన జాన్‍ హంటర్‍ కెన్యా ప్రభుత్వ కోరికమేరకు 800 ఖడ్గ మృగాల్ని చంపాడు. ఇలా ఆయన వధించిన మొత్తం సంఖ్య 1600 వందల పైచిలుకే! సుమేరియాలో 1935 నాటికే మా జాతి పూర్తిగా అంతమైంది.


ప్రపంచంలో మా జాతి ఆప్రికాలో, నమీబియాలో, జింబాబ్వేలో కెన్యాలో బిక్కుబిక్కుమంటు గడుపుతున్నాయి. ప్రతి 16గం।।లకు ఒకటి చొప్పున మేం బలైపోతున్నాం. ఈ వధ నమీబియాలో, దక్షిణాఫ్రికాలో అత్యధికంగా కొనసాగుతున్నది. ఒకప్పుడు మా జనాభా అయిదు లక్షలకు పైగా వుండేది. 1970 నాటికి మా సంఖ్య 70 వేలకు పడిపోగా, ఇప్పుడు కేవలం 30 వేలు కూడా లేము. ఇందులో భారత్‍లోనే ఏనుగుల లాగా మా సంఖ్య 3,700 వరకు వున్నాం. ఇందులో అస్సాంలోని ఖాజిరంగా (kazoranga) జాతీయ ప్రాజెక్టులో 2,613 వరకు వున్నాం. అనగా, ప్రపంచ ఖడ్గమృగాల సంఖ్యలో అస్సాం 85 శాతం కలిగివుంటే, ఈ మొత్తంలో ఖాజిరంగా ప్రాజెక్టులోనే 70 శాతం ఖడ్గమృగాలున్నాయి.
నా ఖడ్గం ఎలాగో నాకు ఉపయోగం లేకున్నా, దానిపై తప్పుడు నమ్మకంతో ఆసియా జాతి కొమ్ము ధర కిలోకు నాలుగు లక్షల డాలర్లు, ఆఫ్రికా జాతి కొమ్ము ధర 20 వేల డాలర్లు వరకు పలకడంతో మా జీవితానికన్నా, మా కొమ్ములే అత్యంత ప్రాధాన్యత (మాకు ప్రమాదకరంగా)గా మారిపోయాయి. పైగా ఏనుగు కాళ్ళలాగే నా కాళ్ళ గిట్టలతో ఆష్‍ట్రేలను (ashtray) తయారు చేయడం నాకెంత అవమానకరమో ఆలోచించండి!
అందుకే అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంస్థ ప్రచురించే రెడ్‍ జాబితాలో అంతరించే జంతువులలో నన్ను కూడా ప్రమాదకర దశలో (vulnerable) వున్నట్లుగా గుర్తించారు. (తరువాయి వచ్చే సంచికలో)

  • డా।। లచ్చయ్య గాండ్ల, ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *