స్థలనామ విజ్ఞానం (టోపోనమి) అనే శాస్త్రానికి సంబంధించి పాశ్చాత్య దేశాల్లో గ్రామ నామాల పరిశోధన ప్రారంభమై వందేళ్ళకు పైనే అయిందనవచ్చు. భాష పుట్టిన తర్వాతనే పేర్లు పుట్టుకొచ్చాయి. గ్రామాల పేర్లు కూడా అంతే. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామాలకు ఆయా పేర్లు ఎలా వచ్చాయో అనడానికి చాలా చరిత్రే ఉంది. జనాలు గుంపుగా ఒకచోట స్థిరనివాసం ఏర్పరచుకున్నాక అక్కడ భౌగోళిక, చారిత్రక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని వందల ఏళ్ళ క్రితమే ఊర్ల పేర్లు వచ్చాయని చరిత్ర పరిశీలిస్తే మనకు బోధపడుతుంది.
సామాజిక శాస్త్రాల అధ్యయనంలో స్థలనామ ప్రాధాన్యతను అంగీకరించవలసి ఉంది. మన దేశంలోనే గాక అనేక దేశాల్లో ఈ రంగంలో క•షి జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. విషయ సేకరణ, వర్గీకరణ వివరాలు సామూహికంగా, వైయక్తికంగా ప్రత్యేకంగానూ, పత్రికల ద్వారానూ పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. మన ప్రాచీన జీవద్భాషలోని పదాలు స్థలనామాలను కలిగి ఉంటాయని, అవి సమాజ చరిత్ర, సంస్క•తిని తెలియజేస్తాయని పలువురు శాస్త్రవేత్తలు స్థలనామ ప్రాధాన్యతలను తమ తమ పరిశోధనల ద్వారా నిర్ధారించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది. భాష, సాహిత్యం, కళలు, చరిత్ర, సంస్క•తికి పెట్టింది పేరు. స్థలనామ పరిశోధనా రంగంలో కూడా ఈ జిల్లాను ముందు వరసలో నిలబెట్టిన ఘనత కరీంనగర్ జిల్లా హూజూరాబాద్ మండల వాస్తవ్యులు, తెలుగు స్కూల్ అసిస్టెంట్ డాక్టర్ తాటిపాముల శ్రీనివాస్ గారిది. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు (ఓరియంటల్ లాంగ్వేజెస్) విభాగంలో డాక్టర్ పైడిమర్రి మాణిక్ ప్రభు గారి పర్యవేక్షణలో ‘కరీంనగర్ జిల్లా గ్రామనామాలు’ అనే అంశంపై •ష్ట్ర.ణ. పరిశోధన చేసారు. జనవరి 2003 నుండి క•షి చేసిన తన సిద్ధాంత వ్యాసాన్ని డిసెంబర్ 2005లో విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ఆ తర్వాత జరిగిన స్నాతకోత్సవంలో గౌరవ భారత రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను స్వీకరించారు. ప్రస్తుతం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలుగా ఉన్న
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని గ్రామ నామాలను పరిశోధించారు.
ఈ సిద్ధాంత వ్యాసాన్ని ఆరు అధ్యాయాలుగా విభజించారు. ఒక్కో అధ్యాయాన్ని ఉప శీర్షికలుగా విభజించి పరిశీలించారు. నాల్గవ అధ్యాయంలో ఉపశీర్షికలు లేవు, కానీ 113 గ్రామ నామాల చరిత్రలను అందించారు. ఐదవ అధ్యాయానికి కరీంనగర్ జిల్లా పరిధిలోని గ్రామ నామాలకు పదకోశాన్ని అందించారు. కేవలం ఆకారాది క్రమంలో ఉన్న పట్టిక రూపంగా కాకుండా, గ్రామ నామం, వ్యాకరణ విభజన, ప్రథమావయవం, మండలం పేరు వివరించారు.
స్థలనామ విజ్ఞానం అనే మొదటి అధ్యాయంలో నాలుగుఉపశీర్షికలు ఉన్నవి. ఒకటవ ఉపశీర్షిక ‘స్థలనామ విజ్ఞానం’. ఇందులో స్థలనామ ఆవశ్యకత, గ్రామనామం వివరణ, ప్రాచీన భారతీయులు కనబరచిన శ్రద్ధను చర్చించారు. స్థలనామాల్లో దేశవాళి భాషల్లో జరిగిన పరిశోధన క•షిని వివరించారు. తన పరిశోధనా సమయానికి తెలుగులో జరిగిన గ్రామ నామ పరిశోధన క•షిని వివరించడం జరిగింది. 1945 సంవత్సర కాలం నాటి భారతి మాస పత్రికలలోని వ్యాసాలను ఉదహరించారు. ఊర్ల పేర్లు మార్చిన సందర్భాలు చెప్పారు. రెండవ ఉపశీర్షక ‘స్థలనామ పరిశోధన స్థూల చరిత్ర’. అంతర్జాతీయ స్థాయిలో స్థలనామ సంస్థలు స్థాపించిన దేశాలు, సంవత్సరాలు తెలిపారు. మూడవ ఉపశీర్షిక ‘కరీంనగర్ జిల్లా భౌగోళిక ప్రాంతం మార్పులు చేర్పులు’. ఇందులో 2005 కాలం నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా భౌగోళిక స్థితిగతులను, రెవెన్యూ డివిజన్ల వారీగా, మండలాల వారీగా విభజించారు 2001 జనాభా లెక్కల ప్రకారం కరీంనగర్ జిల్లాలోని 2006 గ్రామ నామాలను తన పరిశోధనకు ఎంచుకున్నారు. నాలుగవ ఉపశీర్షిక ‘కరీంనగర్ జిల్లా గ్రామ నామాలు మూలాధారాలు’. గ్రామ నామాలకు చెందిన భిన్న వర్ణ క్రమాల్ని, వాటి పుట్టుపూర్వోత్తరాల్ని, నామాంతరాల్ని సేకరించడానికి ఎనిమిది రకాల మూలాధారాలను ఉపయోగించిన క్రమాన్ని తెలిపారు.
భాషా సామాజిక పరిశీలన అనే రెండవ అధ్యాయంలో వర్ణ పరిశీలన, గ్రామ నిర్మాణ పరిశీలన, అర్థ పరిశీలన, నైసర్గిక – సాంస్క•తిక – చారిత్రకాది విశేషాలు అనే నాలుగు ఉపశీర్షికలు ఉన్నవి. వర్ణ పరిశీలనలో వర్ణ సమామ్నాయ పట్టికలను అచ్చులు, హల్లుల ప్రకారం అందించారు. అచ్చు, హల్లులతో మొదలయ్యే గ్రామ నామాలసంఖ్యా పట్టికను ఇచ్చారు. తెలుగులో వర్ణ వ్యత్యయ మూలాన ఏర్పడిన హల్సంయుక్తాలు గ్రామ నామాలలో కనిపించిన విధానాన్ని అందించారు.
గ్రామ నామ నిర్మాణ పరిశీలనలో గ్రామనామ నిర్మాణ స్వరూప సంబంధాలను పరిశీలన ద్వారా చర్చించారు. అసమస్తాలు, సమస్తాలు లేక నామ బంధాలు, అస్పష్ట నామ బంధాలు, స్పష్ట నామ బంధాలు అంశాలతో గ్రామ నామాలను ఉదహరించారు. సంబంధార్థక నామ బంధాలు, స్థలార్ధక నామ బంధాలు, విశేషణ సూచి బంధాలు’గా గ్రామ నామాలను విభజించి శాఖ చిత్రాలలో చూపించారు.
అర్థ పరిశీలన’లో సామాన్య నామ నిర్దేశకాలు, సంజ్ఞానామ నిర్దేశకాలు అను రెండు వర్గాలుగా విభజించి ఆయా గ్రామ నామాలు ఏర్పడిన నిర్దేశకాల రకాలను తెలిపారు. లోకనిరుక్తిలో గ్రామ నామాలను జానపద నిరుక్తి, పండితలోక నిరుక్తులుగా చర్చించి ఉదహరించారు.
నైసర్గిక, సాంస్క•తిక, చారిత్రకాది విశేషాలలో జిల్లాలోని గ్రామ నామాల్లో శిల, పర్వత, అటవీ, భూ, ఉన్నతభూ, వ•క్ష, సస్య, సరీస•ప, జంతు, పక్షి, కుల, మత, జాతి నిర్దేశక గ్రామ నామాలను విభాగాల వారీగా వర్గీకించారు.
మూడవ అధ్యాయం కరీంనగర్ జిల్లా చరిత్ర. చరిత్ర పూర్వ యుగంలో తొలి పాత రాతియుగం, మధ్య పాత రాతియుగం, పాత రాతియుగం, సూక్ష్మ రాతియుగం, కొత్త రాతియుగం, ఇనుప యుగం, తొలి చారిత్రక యుగాలకు సంబంధించిన చారిత్రక సమాచారం ఉన్నది.
ప్రాచీన యుగంలో నందరాజులు, మౌర్యులు, తొలి ఆంధ్రరాజులు, శాత వాహనులు, విష్ణు కుండినులు, రాష్ట్ర కూటులు (బాదామి చాళుక్యులు), వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, రామగుండం ఏడరాజు వంటి కరీంనగర్ జిల్లాతో చారిత్రక అనుబంధమున్న ప్రాంతీయ సమాచారం ఉన్నది.
మధ్య యుగంలో కాకతీయులు, రాచకొండ రేచర్ల (వెలమ) నాయకులు, బహుమనీ సుల్తానులు, కుతుబ్షాహీల పాలన పరిణామక్రమం ఉన్నది. ఆధునిక యుగంలో మొగలుల పరిపాలన, ఔరంగజేబు, బహద్దూర్ షా, జహందర్ షా, ఫరూక్ సయ్యద్, రఫీయుద్దరాజత్, రఫీయుద్దౌలా, అసఫ్ జాహీ నవాబుల పాలన, స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం వంటి చరిత్ర వివరాలు వరుస క్రమంలో ఉన్నవి.
నాలుగవ అధ్యాయం కరీంనగర్ జిల్లా గ్రామ నామాల చరిత్ర. ఈ గ్రామ నామాల చరిత్రను తెలుసుకోవడానికి శాసనాల ఆధారాల ద్వారా, ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్లోని సమాచారం ద్వారా, లోక నిరుక్తుల ద్వారా గ్రామ నామాల చరిత్రలను ఊహాత్మకతకు తావు లేకుండా నిర్ధారించినట్లు పరిశోధకుడు తెలిపారు. దాదాపు 113 గ్రామ నామాలకు చారిత్రక పరిణామ క్రమాన్ని తెలియజేశారు. వాటిలో అనంతగిరి, ఇల్లందకుంట, కొండగట్టు, కట్కూరు, కరీంనగర్, ఎలగందుల, కాళేశ్వరం, కుక్కల గూడూరు, కొత్తకొండ, కోటిలింగాల, కోరుట్ల, గంగాధర, గుంజపడుగు, గట్టుసింగారం, గుల్లకోట, గొడిశాల, చండ్రుపల్లె, చొప్పదండి, జగిత్యాల, జనగాం, జమ్మికుంట, జూలపల్లి, ధర్మపురి, ధర్మారం ధూళికట్ట, నందగిరి, నాంపల్లి, నగునూరు, నరసింహుల పల్లె, ప్రతాపగిరి(కోట), పాషిగాం, పెద్దంపేట్, పెద్దపల్లి, పెద్దబొంకూరు, పోతుగల్, బెజ్జంకి, మంథని, మల్లాపూర్, ముత్తారం, మెట్ పల్లి, మేడారం, మొలంగూరు, రాంపూర్, రామగిరి (కోట), రామగుండం, రాయికల్, రేపాక, వెంగుమట్ల, వరికోల్, వాల్గొండ, వెల్లుల్ల, వేములవాడ, శ్రీరాంపూర్ కాలువ, సంకేపల్లి, సంగెం, స్తంభంపల్లి, సర్వాయిపేట, సిరిసిల్ల, సుందిల్ల, సుల్తానాబాద్, హుజూరాబాద్ వంటి ప్రసిద్ధమైన గ్రామ నామాలు ఉండడం విశేషం.
ఐదవ అధ్యాయం కరీంనగర్ జిల్లా గ్రామ నామ పద కోశం. ఈ పద కోశాన్ని అకారాది క్రమంలో గ్రామ నామాలను, వాటి వ్యాకరణ విభజన, ప్రథమ అవయవం, మండలం పేరు వివరించారు. గ్రామ నామం, ఆ నామ నిర్దేశం చేయడానికి, మండలం చెప్పడానికి, సంకేత పదాలు ఇవ్వడం జరిగింది. కడప జిల్లా గ్రామ నామాలు, మెదక్ జిల్లా గ్రామ నామాలలో పదకోశం ఉపయోగించిన పరిశోధనా పద్ధతిలో ఈ జిల్లా గ్రామ నామాల పదకోశాన్ని అందించి ప్రామాణికతను పాటించడం జరిగింది.
ఆరవ అధ్యాయం గ్రామ నామ పదబంధ విభజన – నిర్మాణం సమస్యలు. ఇందులో గ్రామ నామ ద్వితీయావయవ వివరణ, గ్రామ నామ ద్వితీయావయవ విభజనం, గ్రామ నామ వ్యుత్పత్తి నిఘంటు నిర్మాణ పద్ధతి, నిఘంటు నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలు వివరించారు.
చివరగా ‘అనుబంధాలు’ విభాగంలో బేచిరాకు (జన నివాసం లేని) గ్రామాలు, శాసనాలలోని గ్రామ నామ రూపాలు, క్రీ.శ. 1868 – 2005 వరకు పాలనా వివరాలు, భారత దేశ పుర గ్రామములు (సీసమాలిక) అందించారు. పరిశోధనకు సాయపడిన ఆధార గ్రంథాలను, పత్రికలను ఉపయుక్త గ్రంథ సూచిలో పొందు పరిచారు. ఐదవ అధ్యాయం తప్ప మిగిలిన అధ్యాయాల్లో సందర్భోచితమైన పాద సూచికలను ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా గ్రామ నామాలు తర్వాత అంతగా ప్రభావితం చేయ గల అగశ్రేణి పరిశోధనా గ్రంథమిది. ప్రస్తుతం అముద్రితంగా ఉన్నది. ముద్రణా రూపంలోకి తెచ్చి భావి పరిశోధకులకు, ఔత్సాహికులకు అందరికీ అందిస్తారని ఆశిస్తున్నాను. గ్రామ నామ పరిశోధనా రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న పరిశోధకుడు డాక్టర్ తాటిపాముల శ్రీనివాస్ గారికి హ•దయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు.
- డాక్టర్ మండల స్వామి
ఎ : 9177607603