మొన్న మొన్న కొన్ని రోజుల క్రింద పొద్దు పొద్దుగాల్నే నేనింకా పక్క మీద నిద్ర మబ్బుల ఉండంగనే మా సుశక్క ఫోను.
‘‘అరే లోకి! నీకు తెలుసారా? ఆషా టాకీసు మొత్తం కూలగొ ట్టిండ్రు. ఇగక్కడ షాపింగ్ మాల్ కడ్తరంట’’ అని అంగలారుస్తూ తన పాత జ్ఞాపకాల మూటను విప్పి ‘‘నీకు జ్ఞాపకముందా 1972ల అండ్ల మనిద్దరం ‘గంగా జమునా’ సీన్మా సెకండ్ షో చూసినం’’ అంటూ వైజయంతిమాల పాడిన ‘‘డుండో డుండోరే సాజ్‍నా’’ పాట లోకి వెళ్లి ఇగ అక్కడ్నుండి తన జ్ఞాపకాల ప్రవాహంలో తనే కొట్టుకపోయింది.
‘‘మన జీవితంలో ప్రియమైనవన్నీ పరాయివై పోతాయి’’ అన్న బుద్దుని సూక్తి జ్ఞాపక మొచ్చింది. ఆ తర్వాత జ్ఞాపకాల వరదలో నేను కూడా నిండా మునిగి కొట్టుకపోయాను.
మా శాలిబండాలోని ఆశాటాకీసు అంటే మా కౌమార నవయవ్వన జీవితాలతో ముడి వేసుకున్న బొడ్డుతాడు సంబంధం అన్నమాట. 1965లో అది ప్రారంభమైయ్యింది. అందులో ఆడిన మొట్టమొదటి సీన్మా ‘రాబిన్‍హుడ్’ హిందీ సీన్మా. ఆనాటి పాతనగరంలో ఆ సీన్మాహాలు నిర్మాణమే ఒక పెద్ద సంచలనం.
ఆ దినాలల్ల పాతనగరంల కొన్ని టాకీసులు మాత్రమే ఉండేవి. కృష్ణా టాకీస్, యాఖుత్ మహల్, నూర్ మహల్, తాజ్ మహల్ లాంటివి. 1930ల సుల్తాన్ బజార్‍ల మోతీ మహల్ ఉండేది. అందులో మొదట మూకీ సీన్మాలు నడిచేవి. ఒక మనిషి తెర పక్కన నిలుచుని పెద్ద గొంతుతో సీన్మాలోని సన్నివేశాలకు అనుగుణంగా కథ చెప్పేవాడు.
ఆ టాకీసులో ప్రొజెక్టర్ పై భాగంలో చెక్కలతో నిర్మించిన జునానాఖానా (స్త్రీల గ్యాలరీ) ఉండేది. ఒక ఎండాకాలం ప్రొజెక్టర్ వేడికి ఆ చెక్కనిర్మాణం అగ్నిప్రమాదానికి గురయ్యింది. స్త్రీలకు బయటపడే మార్గం లేకపోయింది. హాహాకారాలు చెలరేగాయి. ఒక పడుచు ధైర్యం చేసి తన చీర విప్పి ఒక గుమ్మానికి గట్టిగా ముడేసి దాని ఆధారంగా క్రిదికి జారింది. అట్లా మరికొంత మంది ఆ ధీర వనిత పుణ్యమా అని బతికి బయట పడినారు. మిగతా వారందరూ అగ్గిలో బుగ్గిగా మారినారు. తర్వాత కాలంలో అదే స్థలంలో కొత్తగా మరో టాకీసు నిర్మించబడింది. దాని పేరు ‘‘దిల్షాద్ టాకీసు’’. కాలక్రమంలో అది కూడా కనుమరుగై అపార్ట్మెంట్‍గా మారింది.
ఆషా టాకీసు ప్రారంభోత్సవం ఒక పండుగలాగ, పెళ్లి సందడిలాగ జరిగింది. ఆ చల్లని సాయంత్రం జిలుగువెలుగుల రంగురంగుల విద్యుద్దీప కాంతులతో ఆ సీన్మాహాలు కొత్తపెళ్ళి కూతురులా, ‘నయీ దుల్హన్’ లా సింగారించుకుని నిలబడింది. ఆ హాలుపైన చాలా ఎత్తున ‘ఆషా టాకీస్’ అన్న ఇంగ్లీష్ అక్షరాల రంగులు మా లేత మనసులను మురిపించాయి. జేబులో పైసలు లేని పిల్లలం కదా! అసలు సిసలు సీన్మాను చూసే తాహత్, తాఖత్ లేక అక్కడున్న పోస్టర్లను చూసి కథను ఊహించి, కథను అల్లుతూ, దానినే కథలు కథలుగా చెప్పుకునే వాళ్లం.
ఆ సీన్మాహాలును నిర్మించింది ‘పదం సేఠ్’. గుల్జార్ హౌజ్ చౌరాస్తాలో, సిటీ కాలేజీకి పోయే తోవల ‘‘షేర్‍దిల్’’ కమాన్ పక్కన ఉన్న ‘ఆగ్రా స్వీట్స్’ యజమాని ఆయన. ఆ మిఠాయి దుకాన్‍ను 1951లో అక్కడ స్థాపించారు. ఇపుడు నగరంలో అనేక చోట్ల దాని శాఖోపశాఖలు విస్తరించి ‘ఘరానా ఖాన్‍దాన్లకు అది స్టేటస్ సింబల్‍గా మారింది. అప్పటికి జి. పుల్లారెడ్డి స్వీటు షాపు నగరప్రవేశం చేయలేదు. ఆయన 1956లో ఆంధప్రదేశ్ ఏర్పడగానే హైద్రాబాద్ వచ్చి నాంపల్లి స్టేషన్‍రోడ్‍లో తన మొదటి దుకాణాన్ని ప్రారంభించాడు. పదం సేఠ్ పూర్వీకులందరూ రాజస్థాన్‍లోని ‘అల్వార్’ నగరానికి సంబంధించిన ‘అగ్రవాల్’ తెగకు చెందినవారు. వీరి వంశ మూలపురుషుడు ‘అగ్రసేన్ మహా రాజ్’. ప్రముఖ చరిత్రకారుడు, ప్రపంచ పర్యాటకుడైన పండిత్ రాహుల్ సాంకృత్యాయన్ తన చారిత్రక నవల ‘జయఔధేయ’లో వీరి గురించి ప్రస్తావించాడు. తొలిరోజులలో ఆర్యులను ఎదుర్కొన్న వారు వీరేనని ఆ తర్వాత తమ క్షత్రీయ ధర్మాన్ని పరిత్యజించి వ్యాపారస్తులుగా మారిపోయారని కత్తిని వదిలి త్రాసును చేపట్టారని ఆ నవలలో వివరంగా చర్చించాడు. ఏదేమైతేనేం ఈ ‘పదం సేఠ్’ పూర్వీకులు రాజస్థాన్‍లోని అల్వార్ నుండి బయలుదేరి షాజహాన్ కాలంలో ఆగ్రాకు వలసవచ్చి ‘ఆగ్రా మిఠాయి దుకాన్’ను నెలకొల్పారు. అప్పుడు ఆగ్రాను ‘షాజహానాబాద్’ అని కూడా అనేవారు. ఈ అగ్రవాలులు ఆగ్రాలో ‘పేటా’ మిఠాయిలను తయారుచేయటంలో సిద్దహస్తులుగా, అగ్రజులుగా మారిపోయారు. బూడిద గుమ్మడికాయలను పొట్టు తీసి ముక్కలు ముక్కలుగా తరిగి కాసేపు సున్నపు నీటిలో ముంచి, నాన్చి, తేల్చి ఆ పిమ్మట ఘుమ ఘుమలాడే శుద్దమైన నేతిలో దోరగా వేయించి, చివరగా శక్కర పానకంలో వేసి ఆరినాక గట్టి పడుతుంది. ఈ పేటా మిఠాయి నేటికి కూడా మహా మశూర్. రైళ్లు ఆగ్రా స్టేషన్‍లో ఆగగానే మనకు ‘పేటా’ ‘పేటా’ అన్న మిఠాయివాలాల అరుపులు ఇప్పటికీ వినబడుతునే ఉంటాయి.
దక్కన్‍లోని గోల్కొండ కోటపైకి ఆలంగీర్ ఔరంగజేబ్ షహెన్‍షా ‘హమ్లా’కు వచ్చి విజయం సాధించి మొగలుల రాజ్యం స్థాపించగానే ‘పదం సేఠ్’ పూర్వీకులు హైద్రాబాద్‍కు వలస వచ్చి హైద్రాబాదీయుల ‘దిల్’లను తమ మిఠాయిల ద్వారా గెలుచు కున్నారు. మరికొందరేమో ముత్యాలు, వజ్రాల వ్యాపారాలను చేసే ‘సౌదాగర్లు’ గా ‘షావుకారు’గా మారారు.
కార్వాన్ సాహు లేదా కార్వాన్ సాహుకార్ అన్న బస్తీ పేరు వీరి వల్లనే వచ్చింది. అట్లా అట్లా 1965 వచ్చే సరికి మన ‘పదం సేఠ్’ దిల్ ఔర్ దిమాక్‍లను లుఠాయించుకునే ‘ఆషా టాకీసు’ను నిర్మించాడు.
సరే మళ్లీ మనం వెనక్కి వెళ్లుదాం. నాకు ఆషా టాకీస్ ప్రారంభోత్సవమే కాదు అది లేనపుడు అంటే అది ఇంకా కట్టబడక ముందు ఆ ప్రాంతం గురించి ఆ స్థలం గురించి బాగా తెలుసు. ఆ రోజులలో అదొక పెద్ద తోట. పాత నగరంలో నవాబులకు సంబంధించిన అనేక భాగ్‍బగీచాలు వారి పేర్లతోనే
ఉండేవి. 1948 పోలీస్ యాక్షన్ జరిగి, నిజాం అధికారం కోల్పోయిన తర్వాత చాలా మంది నవాబులు, జాగిర్దారులు తమ భూములను, తోటలను భవనాలను అగ్గువ సగ్గువకు అమ్ముకుని పాకిస్తాన్‍కు పారిపోయారు.
చౌమహల్లా ప్యాలెస్‍కు కొంచెం దూరంలో ఉండే ఒక తోటలోనే ఈ ఆశాటాకీసు వెలిసింది. టాకీసుకు పూర్వం ఆ తోట ఒక అరణ్యంలా, తాటిచెట్లతో ఒక వనంలా మా పసికండ్లకు కనబడేది. దానిని నేను చూడటం ఎలా జరిగిందంటే….. మా చిన్నపుడు ప్రతి సంవత్సరం మేమందరం వొండుకుని తినటానికి ‘చెట్లల్లకు’ పోయేవాళ్ళం. కోస్తాంధ్ర భాషలో వనభోజనాలన్న మాట. ఒకో సంవత్సరం ఒకో ప్రాంతానికి వెళ్లేవాళ్లం. వారం రోజుల ముందే మా అమ్మ ‘స్థల నిర్ధారణ’ కోసం సర్వేకు బయలు దేరేది. నేను నా జాసూసీ (గూఢచర్యం) పరిజ్ఞానంతో అమ్మ ఎక్కడికి బయలుదేరుతుందో, ఎందుకుబయలుదేరుతుందో గ్రహించి ఆమెను అనుసరించాను. మేమిద్దరం గ్యారా నంబర్ బస్ ఎక్కి (అంటే రెండు కాళ్ల నడక అని అర్థం) శక్కర్ గంజ్, గాజీబండ, పార్థీవాడ తోటలన్నీ తిరిగి, తిరిగి నచ్చక చివరికి శాలిబండాలోని ఆ భాగ్ చేరుకున్నాం. దాని చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడ. దానికి ఒక పెద్ద పాఠక్ (గేటు). లోపలికి ప్రవేశించే సరికి తాటివనం దర్శనమిచ్చింది. గౌండ్లోళ్లు తియ్యటి కల్లు కుండల్ని కాంపౌండ్‍ల కోసం మోసుకపోతున్నారు. మా అమ్మకు అది కూడా నచ్చక మొగల్‍పురా దాటి రాచెరువు కట్టకు నన్ను తీసుకుపోయి దానిని ఖాయం (సెటిల్) చేసింది.
ఆ తర్వాత ఆ తాటితోపుల వనంలోనే ఆషా టాకీసును ‘పదం సేఠ్’ నిర్మించాడు. అప్పుడు.. అట్ల ఆ భాగ్ కాస్తా బజార్ అయిపోయింది. సీన్మా టాకీసు పుణ్యమా అని దాని చుట్టూ చాయ్ ఖానాలు, పాన్ దుకానాలు, గరం గరం మిర్చీ బజ్జీ, పకోడీ దుకానాలు వెలిసి జన సమ్మర్థంతో ఆ ప్రాంతమంతా ‘ఆబాద్’ ఐపోయింది. అట్ల తోటా మాయం. తాటి తోపుల వనమూ మాయం. అట్లనే మాకు తెలియకుండనే, మాతో మాట మాత్రం చెప్పకుండనే మా బాల్యం కూడా మాయమైపోయింది. జమానా బదల్ గయా!
ఆషా టాకీసుల అమ్మతో కలిసి నేను చూసిన మొదటి సీన్మా ‘తోటలో పిల్ల కోటలో రాణి’’ విఠలాచార్య దాని దర్శకుడు. కాంతారావు, రాజనాలల కత్తి యుద్ధాలు, ముష్ఠియుద్ధాలు, గుర్రాలపై కూచుని పరిగెత్తడాలు, ఆ గుర్రపు డెక్కల టకటక చప్పుళ్లు నన్ను మంత్రముగ్ధు డిని చేసి మరోలోకంలోకి తీసుకపోయాయి. ఇంటికి రాగానే గూన పెంకలను కప్పటానికి వాడే చిన్న సైజు బొంగు కట్టెలనే కత్తులుగా ఊహించి మా తమ్ముడు నేను కత్తి యుద్దాలు చేసేవాళ్లం. ఆ కట్టెలు చేసే శబ్దాలతో మరింత ఉత్తేజితులమైపోయి ఒళ్లు మరిచి విరిగిన ఆ కట్టె ముక్కల తోనే ఒకళ్లనొకళ్లం టప, టపా కొట్టుకునేవాళ్లం. నవ్వులు పోయి నువ్వులు అయ్యేవి. విరిగిన ఆ కట్టెముక్కల పదును కొసలు కండ్లకు గుచ్చుకుంటే కండ్లు పోయి గుడ్డోళ్లవుతారని మా అమ్మ లబ లబ మొత్తుకునేది. (తరువాయి వచ్చే సంచికలో) (చార్‍మినార్ కథలు-పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్,
ఎ: 91606 80847