మానవుడు అడుగుపెట్టిన ప్రతి చోటుకు పేరు ఉంటుంది. పప్రథమంగా దీనికి ప్రాధాన్యం వహించేది అక్కడి నైసర్గిక స్థితిగతులు. అవి చెట్టు చేమలు, కొండ కోనలు, నదులు, వాగులు వంకలు, నైసర్గిక, స్థితి గతులతో పాటు సామాజిక, చారిత్రక అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. స్థలనామాన్ని అధ్యయనం చేయటం ద్వారా, ఆ పేరు పెట్టడం ద్వారా ఇతర కారణాలూ తెలుసుకునే అవకాశం ఉంటుంది. స్థలనామ విజ్ఞానం పేరుతో అధ్యయనం చేసేది గ్రామ నామాధ్యయనమే. ఇందులో మానవ నాగరికత సంస్క•తికి సంబంధించిన ఎన్నో అంశాలు ఇమిడి ఉంటాయి.
మహబూబ్ నగర్ జిల్లా నామాన్ని పాలమూరు’గానూ వ్యవహరిస్తుండడం ఎందరికో తెలిసిన విషయం. క్రీ.శ.1883లో నైజాం నవాబ్ అయిన మీర్ మెహబూబ్ అలీ పాషా కాలంలో పాలమూరు జిల్లా కేంద్రంగా ఏర్పడి మహబూబ్ నగర్ గా మారిందని చారిత్రక కథనం ఉన్నది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు దాదాపు 1700 వరకు గ్రామాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఇక్కడ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సాక్ష్యాలెన్నో ఉన్నవి. ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఖల్సాలనే పేరుతో నేరుగా నైజాములచే పాలించబడగా, అమరచింత (ఆత్మకూరు) గద్వాల, గోపాల్ పేట, జటప్రోలు (కొల్లాపూర్), వనపర్తి సంస్థానాలు హిందూ రాజుల ఏలుబడిలో కప్పం కట్టే షరతులపై పాలనాధికారం కొనసాగింది.
ఈ జిల్లా గ్రామ నామాల నిర్ధారణకు ఓ ప్రత్యేకత ఉంది. చాలా గ్రామాల పేర్లకు చివర పాడు అనే పేరు ఉంటుంది. పాడు అనే రూపాలు అన్నీ క•ష్ణా, తుంగభద్రా నదుల మధ్య ప్రదేశంలో ఉండడం విశేషం. ఈ మధ్య ప్రదేశాన్ని దోఆబ’ అని అంటారు. అలంపురం, గట్టు, గద్వాల, ధరూర్, మల్డకల్, మానోపాడు మండలాల గ్రామ నామాలు ఈ దోఆబ క్రిందకు వస్తాయి. ఈ జిల్లాలో లభించిన శాసనాలు కన్నడ, హళగన్నడ, సంస్క•త, తెలుగు భాషలో కలవు. క్రీ.శ.3వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు ఉన్న చారిత్రక, సాంస్క•తిక విషయాలను బయలు పరుస్తున్నాయి. ఈ ప్రాంతం కన్నడ, తమిళ రాజ్యాలు ఏలిన రాజుల ఆధీనంలో ఉండడం వలన కొన్ని గ్రామ నామాల పేర్లు కన్నడ భాషలోనూ, తమిళ భాషలోనూ కనబడుతవి. ఉదాహరణకు సత్యహళ్ళి అను గ్రామ నామంలో హళ్ళి అనునది కన్నడంలో గ్రామాన్ని సూచిస్తుంది. ఇట్లాగే కున్షి, గోవిందహళ్ళ, నాచహళ్ళి, నీలహళ్ళి, మఖ్తల్, రాయికోడు వంటి రూపాలు కనబడుతవి. తమిళ భాషకు ఉదాహరణగా పాలాయి, మద్దూరు, కురుమూర్తి, వల్లూరు, వెల్లాల, వంగూరు రూపాలు కనబడుతవి.
వ•క్ష, సస్య, జంతు, పక్షి, సరీస•ప, కీటక, వంశ, కుల అనేక విభాగాల గ్రామ నామాలతో పాటు మత సంబంధమైనవి కూడా ఉన్నాయి. ఈ జిల్లాలో బౌద్ధ జైన మతాలే కాకుండా శైవ మత ప్రాబల్యం కనబడుతుంది. యుద్దవీరుల త్యాగానికి ప్రతీకగా వీరగల్లులు
ఉన్నవి. ప్రత్యేకంగా గ్రామ నామాల రూపాలు ఉన్నాయి. ఉదాహరణకు వీరాపురం, వీరాయి పల్లి, ఈర్లదిన్నె, ఈర్లబండ.
ప్రత్యేక కథనాలు:-
ఆమనగల్:- ఆమన అనే తమిళ పదానికి జైన అని అర్థం. ఈ ప్రాంతంలో జైన ప్రాశస్త్యం అధికముగా ఉన్నందున జైన మతం ప్రభావంతో ఈ గ్రామ నామం ఏర్పడి ఉండవచ్చునని స్థానిక కథనం.
గణపురం:- ఈ జిల్లాలో ప్రసిద్దమైన గిరి దుర్గాలలో గణపురం కోట ఒకటి. ఖిల్లా అంటే ఉర్దూ భాషలో కోట అని అర్థం. దీనిని ఖిల్లా గణపురం గానూ వ్యవహరించడం విశేషం.
గోపాల్ పేట:- జిల్లాలోని సంస్థానాలలో ఒకటి. వనపర్తి సంస్థానాధీశుడైన వెంకట్ రెడ్డి ఇక్కడ కోటను నిర్మించి, తన సోదరుడైన రంగా రెడ్డికి నూతన సంస్థానంగా ఇచ్చెను. వెంకట్ రెడ్డి తన తండ్రి పేర గోపాల్ పేట’గా మార్చారని స్థానిక కథనం.
నాగర్ కర్నూలు:- ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్నది. 1904 ప్రాంతంలో నాగన్న, కందన్న ఇరువురు అన్నదమ్ములు ఈ ప్రాంతంలో నాగనోలు, కందనోలు అనే గ్రామాలు నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ రెండు గ్రామాలు కలిసిపోయి నాగన కందనోలుగా పిలువ బడింది. కందనోలు కర్నూలుగా మారినట్లు నాగనోలు నాగర్ కర్నూలుగా మారిందని కథనం ఉన్నది.
గద్వాల: ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్నది. 17వ శతాబ్దం ఆరంభంలో సోమ భూపాలుడు నిర్మించిన ప్రాంతమిది. పూడూరును పాలనా కేంద్రంగా పాలించిన పాకనాటి రెడ్లు గద్వాల కోటను కట్టారట. కోట నిర్మాణ అనంతరం రాజధానిని పూడూరు నుండి గద్వాలకు మార్చినారట. గద్వాలను గద్దాల అనే పేరుతో పూర్వం పిలిచే వారట.ఇంకా అడ్డాకుల, ఊర్కొండ పేట, కల్వకోల్, కొడంగల్, కొత్తకోట, కోయిల్ కొండ, కోస్గి, తలకొండపల్లి, నారాయణపేట, పానగల్, పెబ్బేరు, బీచ్ పల్లి, మిడ్జిల్, వనపర్తి వంటి అనేక ప్రత్యేక కథనాలను, ప్రాంతాలను విస్త•తంగా చర్చించవచ్చు.
ఈ ప్రాంత గ్రామ నామాలపై రాష్ట్ర కూటులు, చాళుక్యులు, చోళులు, పల్లవుల పాలనా ప్రభావం కనబడుతుంది. కందూరి చోడుల పాలనా ప్రభావంతో, ఆ కాలం నాటి శాసనాలలో ఉప్పునూతల, గంగాపురం, జడ్చర్ల, పాలెం, మామిళ్ళపల్లి రాచూరు, లింగాల వంటి గ్రామ నామాల ప్రస్తావనలు కనబడుతవి. మల్యాల వంశీయుల ప్రభావంతో నంది వడ్డెమాన్, భూత్పూర్ ప్రస్తావనలున్నవి.
గ్రామ నామాలు ప్రస్తుత/పూర్వ రూపాలు. ఈ జిల్లా గ్రామ నామాలు భౌగోళిక సంబంధాలతో పాటు జాతి, కుల, మత, ప్రాంత, ప్రాచీన రాజవంశాల పేర్లు కూడా సంతరించుకున్నాయి. కొన్ని గ్రామాల పేర్లు తమ పూర్వపు పేర్ల స్థానంలో అపభ్రంశంతో కూడిన కొత్త పేర్లు రూపు దిద్దుకున్నాయి. జిల్లాలోని శాసనాల ఆధారంగా వాటి పూర్వపు పేర్లు ప్రస్తుత వ్యవహారంలో వుండే పేర్లు కొన్ని భిన్నంగా ఉన్నవి.
అమరచింత-అబ్రచింత, అలంపూర్-హేమలాపురం, అల్లంపల్లి-అల్లమపల్లి, ఎల్లమపల్లి, ఆమ్రాబాద్-అమరావతి, ఆవంచ-ఆలమంచె, ఇర్విన్-ఇరువెన్ను, ఇటిక్యాల-ఇటికెల, ఉజ్జిళ్ళ- ఒజ్జహళజ, ఉదరసరసం-రుద్రసముద్రం, ఎక్లాసుపురం-ఏకశిలాపురం, కడుమూరు-కదంబపురం, కల్వకోల్-కలువకొలను, కవులకుంట్ల-కౌకుంట్ల, కుడికిళ్ళ-కూటకుళ్ళ, కేశంపేట-బక్కరపల్లె, గోరిట-గంటయ్యపల్లి, గోపాల్ పేట-బండ్లపల్లి, చాకలి పల్లి-సాగువాటుపల్లి, చిన్న దగడ-చిన్నదేవునిగుడి, జిన్నారం-జైనఆరామం, తక్కశిల-తక్షశిల, ధరూర్-దొరవూరు, నంది వడ్డెమాన్-వర్ధమానపురం, నర్వ-నరవాడి, నాగర్ కర్నూలు-నాగుల కందనవోలు, నెల్లికొండ-తుమ్మలకుంట, పులిజాల-పులిజల, పుల్లూరు-పూలనూరు, పూడూరు-పుండ్రపురం, పెంట్లవెల్లి-పంటలవెల్లి, బల్లానిపల్లి-బల్లాలపల్లి, భూత్పూరు-బుద్ధపురం, మఖ్తల-మగతల, మరికల్-మర్రికల్లు, మున్న నూరు-ముని పురము-మునిపల్లె, రాజోలి-రాజవోలు, లాలుకోట-లకాకులకోట, సింగోటం-సింగపట్టణం వంటి అనేక గ్రామ నామాలు కనబడుతవి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధి చాలా విస్త•తమైనది. అయినా కొండను అద్దంలో చూపినట్లు ఈ చిన్న వ్యాసంలో ఆ ప్రయత్నం చేశాను.
పరిశోధనాత్మక క•షి:- ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయిలో ప్రామాణికమైన పరిశోధనాత్మక క•షి జరిగింది. తెలంగాణ ప్రాంతంలోని గ్రామ నామాల అంశంలో మొట్టమొదటగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగింది. నాగర్ కర్నూలు తాలూకా గ్రామాలు చరిత్ర అను అంశంతో ఆచార్య బిరుదురాజు రామరాజు గారి పర్యవేక్షణలో కపిలవాయి కిశోర్ బాబు గారు 1983లో యం.ఫిల్. స్థాయి పరిశోధన చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని 2008 సంవత్సరంలో ఆచార్య కే. రుక్నుద్దీన్ గారి పర్యవేక్షణలో డా. ఎ. వెంకట ప్రసాద్ గారు 2008 సంవత్సరంలో మహబూబ్ నగర్ జిల్లా గ్రామ నామాలు అంశంతో పిహెచ్.డి. స్థాయి పరిశోధనా క•షి చేశారు. సిద్ధాంత గ్రంథంగా కాకపోయినా పరిశోధనాత్మక క•షి కనబడుతున్న మరో గ్రంథం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గ్రామ నామాలు ఒక పరిశీలన. ఈ విషయంతో డా. యం. రాములు గారు ఏప్రిల్ 2003లోనే ముద్రణ రూపంలోకి తెచ్చారు. అనంతరం జనవరి 2021లో కొత్త ఎడిషన్ ని వెలువరించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం ఐదు జిల్లాలుగా విడిపోయింది. ఈ విభజన అనేది విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధకులకు, ఔత్సాహికులకు సమాచార సేకరణ, పరిశోధన, పరిష్కరణ విషయ వివరణ సులభతరమవుతుంది. ఈ మార్గంలో భవిష్యత్తులో మరింత క•షి జరగాలని, అందరికీ అందుబాటులోకి రావాలని ఆశిద్దాం.
ఆధార గ్రంథాలు
1.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గ్రామ నామాలు ఒక పరిశీలన : డా. ఎం. రాములు.
2.కందూరి చోడుల శాసనములు చరిత్ర సంస్క•తి : బి.ఎన్.శాస్త్రి.
3.నాగర్ కర్నూలు తాలూకా గ్రామాలు – చరిత్ర : కపిలవాయి కిశోర్ బాబు.
4.నామ విశ్లేషణ : ఆచార్య యార్లగడ్డ బాలగంగాధర రావు.
-డా।। మండల స్వామి
ఎ : 9177607603