దివినుండి భువికి దిగి వచ్చిన రోజు

మధ్యాహ్నం 12 గంటలవుతుంది. ఇంటర్‍ లేకెన్‍ ట్రెయిన్‍ స్టేషన్‍ బయట నిలబడి పిక్‍ అప్‍ వ్యాన్‍ కై ఎదురుచూస్తున్నా. 12 దాటినా వ్యాన్‍ రాలేదు. ఫోన్‍ చేద్దామంటే కాల్‍ చార్జెస్‍ ఎక్కువని తీసుకురాలేదు. ఇంకో పావుగంటైనా వ్యాన్‍ జాడలేక పోవడంతో హమ్మయ్య, డైవ్‍ కాన్సిల్‍ చేసుంటారు, ప్రమాదం తప్పిందన్న ఉపశమనం ఓ వైపు. ఇన్నేళ్ళ స్కైడైవ్‍ చేయాలనే నా కల నెరవేర్చుకోలేక పోతున్నాననే దిగులు మరో వైపు. అవును, స్కై డైవ్‍ నా కల.. చిన్ననాటి కల. డెంగ్మా అనే కుర్రాడు ఆ సాహసం చేస్తూ పారాచ్యూట్‍ తెరుచుకోక ప్రాణాలు కోల్పోయిన విషాద ద•శ్యం దూరదర్శన్‍లో చూసిన నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అయినా ఆ సాహసం చేయాలని కోరిక. ఆ కల కోరికై పట్టుదలగా మారింది.


కానీ నాకు ఆక్రోఫోబియా. అంటే ఎత్తులంటే భయం. పైనుండి కిందికి చూడాలంటే చచ్చేంత భయం. 16 ఏళ్ళ వయసులో ఇంటర్‍ చదివే సమయాన హైదరాబాద్‍ జింఖానా గ్రౌండ్‍లో తొలిసారి జెయింట్‍ వీల్‍ ఎక్కినపుడు నా అవస్థ వర్ణనాతీతం. అది తిరిగే క్రమంలో కిందికి వచ్చేటపుడు దూరంగా పడి పోతానేమోనని నేను కూర్చున్న ఇనుప కుర్చీని గట్టిగా పట్టుకుంటే దానికున్న గ్రీజు మొత్తం నా బట్టలకంటుకుంది. గట్టిగా పట్టుకోవడమే కాకుండా పెద్దగా అరిచా, ఆపండని. జనం కేరింతలలో నా వేదన అరణ్య రోదనే అయ్యింది. జెయింట్‍ వీల్‍ తన సమయానుసారమే ఆగింది నన్ను నానా తిప్పలు పెట్టి ఓ పావుగంట తర్వాత. ఎత్తులంటే భయపడే నాలో స్పూర్తి నింపింది మాత్రం ఏ రైడ్‍ నైనా భయం లేకుండా ఎంజాయ్‍ చేసే నా కూతురు. ఆకాశాన్ని జయించి అంతెత్తున స్వేఛ్ఛగా విహరించే పక్షులు.


నా కూతురు మౌక్తికకి 8 ఏళ్ల వయసులో ఇద్దరం మలేసియాలోని జెంటింగ్‍ ఐలెండ్‍లో ఒక రైడ్‍ ఎక్కాం. నేనేమో కళ్ళు మూసుకుని నా ముందున్న రాడ్డు గట్టిగా పట్టుకుని భయపడుతూ ఉన్నా, ఎప్పుడాగుతుందా అది అని. తనేమో జుట్టు గాలికి ఎగురుతుంటే చిరునవ్వులు చిందిస్తూ ఆ రైడ్‍ని సంపూర్తిగా ఆస్వాదిస్తుంది. అంత చిన్నది నిర్భయంగా ఆనందిస్తుంటే నేను భయంతో కుంచించుకు పోవడం సిగ్గనిపించింది. నాలో ఆలోచనలను నింపింది. నేనెందుకలా ఉండకూడదని. ఆ తరువాత అక్కడే స్పేస్‍ షాట్‍ అనే రైడ్‍కి వెళ్ళా. దానిలో మనల్ని కుర్చీలో కూర్చో బెట్టి ఓ 50 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి సడన్‍గా కిందికి డ్రాప్‍ చేస్తారు. గుండాగిపోయింది నేలమీద పడిపోతానేమోనని. కానీ పూర్తిగా కిందికొచ్చేలోగా ఆపేస్తారు. తర్వాత మెల్లగా పైకీ కిందికీ తిప్పి ఆపేస్తారు. ఆ రైడ్‍ నాలో భయం కొంచెం తగ్గించి తర్వాత హాంకాంగ్‍ డిస్నీ వరల్డ్లో ఇంకొంచెం ఎక్కువ భయం కలిగించే హెయిర్‍ రైజర్‍ రైడ్‍ చేసేందుకు నన్ను పురికొల్పింది. అది సముద్రం ఒడ్డున జరిగే రోలర్‍ కోస్టర్‍ రైడ్‍. తేడా వస్తే ఎగిరి సముద్రంలో పడిపోతామన్నట్టుంది అది చూస్తుంటే. కానీ నేను అది ఎక్కినపుడు నన్ను నేను ఆకాశంలో స్వేచ్చగా విహరించే పక్షిలా ఊహించుకున్నా, ఎత్తులంటే కలిగే భయాన్ని ఇంకొంచెం తగ్గించుకుని పరిపూర్ణంగా ఆ రైడ్‍ని ఎంజాయ్‍ చేసా.


అలా నా ఆక్రోఫోబియాను జయించి స్కై డైవ్‍ చేయాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకుని తొలుత చెక్‍ రిపబ్లిక్‍ లోని ప్రాగ్‍లో చేయాలనుకున్నా కానీ అది గ్రూప్‍ ట్రావెల్‍ అవడం వల్ల సగం రోజుకు పైగా పడుతుండడం వల్ల చేయలేకపోయా.


ఈసారి ఇంటర్నెట్‍ జల్లెడపట్టి పక్కాగా ప్లాన్‍ చేసి స్కై డైవ్‍ చేస్తూ ప్రక•తి అందాలు చూడడానికి అత్యంత సుందర ప్రదేశం ఇంటర్‍ లేకెన్‍ అని తెలుసుకుని అక్కడే ఆ సాహసం చేయాలనుకున్నా. ఇంటర్‍ లేకెన్‍ అంటే రెండు సరస్సుల మధ్య ఉన్న ప్రాంతమని అర్ధం. అది చాలా అందమైన ప్రదేశం సాహస యాత్రికులకు ఇష్టమైన ప్రాంతం. సరస్సులలో విహరిస్తూ ఆకాశంలోకి చూస్తే పారా గ్లైడర్లూ స్కై డైవర్లే కనబడతారు. కానీ స్విడ్జర్లాండ్‍ లో కాలుమోపింది మొదలు ఒకటే జల్లు. మేఘావ•తమైన ఆకాశంలో స్కై డైవ్‍ ప్రమాదమని అనుమతించడంలేదు. ఆ ఐదు రోజులూ యూరో రైల్‍ పాస్‍ తీసుకుని జున్గ్ఫ్రా, జెనీవా, మౌంట్‍ టిట్లిస్‍, రైన్‍ ఫాల్‍, లేక్‍ లూసర్న్ అన్నీ తిరిగేసాం. యూరో రైల్‍ పాస్‍ ఉంటే రైలు, బస్సు, బోటు, మ్యాజియం ఎంట్రీ అన్నీ ఫ్రీ. అక్కడి ట్రెయిన్ల పంక్చువాలిటీ చెప్పుకుని తీరాలి. 6 గంటలకంటే ఒక సెకను అటూ ఇటూ అన్న మాటే ఉండదు. సరిగ్గా 6గంటలకు రైలు కదలాల్సిందే. రైళ్ళ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి, అది దేశంలో ఏ మూలనున్నా చేరుకోవడం సులభం.


మా ట్రిప్‍ ముగిసే రెండు రోజుల ముందు వర్షం ఆగిపోయింది. డైవ్‍కి రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నారు. నా పేరు నమోదు చేసుకుని పేమెంట్‍ చేసేసా.


ఆ సమయాన నాలో విరుద్ధ భావోద్వేగాలు. గొప్ప సాహసం చేయబోతున్నానన్న ఆనందం ఓ వైపు, ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్న భయం మరో వైపు. ఆ ఆలోచనలు డైవ్‍కి ముందు రాత్రి నాకు నిద్రను కూడా దూరం చేసాయి. ఇక మంచంపై సమయం వ•ధా చేయటం నచ్చని నేను లేచి నా భయాందోళనలు తెలియక హాయిగా నిద్రిస్తున్న కుటుంబ సభ్యులను చూసుకుని (అది ఆఖరి సారి కావచ్చని కొంచెం ఎక్కువ సేపే) ఎంజిల్‍ బర్గ్ స్టేషన్‍లో ఇంటర్‍ లేకెన్‍ వెళ్ళే రైలెక్కా, స్కైడైవ్‍ చేయడానికి. 13000 అడుగుల ఎత్తునుండి విమానంలో నుండి అమాంతం కిందికి దూకడానికి. బ్రతికితే ఆ సాహసం చేసిన లక్షల్లో ఒకడిగా గర్వంగా తిరిగి వెళ్తా లేదంటే చెక్క పెట్టెలో, సాహసిగా అనుకుని ముందడుగేసా.


వాళ్ళు మధ్యాహ్నం 12 కల్లా ఇంటర్‍ లేకెన్‍ స్టేషన్‍ బయట నిల్చోమని మెయిల్‍ పెట్టారు, పికప్‍ చేసుకోవడానికి. వారు చెప్పినట్టే మధ్యాహ్నం 12లోపే ఇంటర్‍ లేకెన్‍ స్టేషన్‍ చేరుకున్నా. చెప్పిన సమయం దాటి అర్ధ గంటవుతున్నా వ్యాన్‍ రాకపోవడాన నా మదిలో జరగుతున్న సంఘర్షణకు తెరదించుతూ నీలి రంగుతో ‘‘స్కై డైవ్‍ స్విడ్జర్లాండ్‍’’ అని రాసున్న తెల్లటి వ్యాన్‍ నా వైపు వస్తుంది. అది నాకు ఆ క్షణాన మార్చురీ వ్యాన్‍లా గోచరించింది. నా నిర్జీవ దేహాన్ని మోసుకుపోవడానికి సిధ్ధంగా ఉన్నట్టు. ఆ ఆలోచనలను తీసి పడేసి నాకు నేను సర్ది చెప్పుకుని వెంటనే వ్యాన్‍ ఎక్కేసా. అప్పటికే దానిలో ఇంకో నలుగురు ఉన్నారు. ఒక అమ్మాయితో సహ. అంతా నాకంటే చిన్నవాళ్ళే. వ్యాన్‍ డ్రైవ్‍ చేసేది కూడా అమ్మాయే. తను ఆ సంస్ధ భాగస్వామి కూడా. నన్ను విష్‍ చేసి ఓ ఫాం నింపమని చేతికిచ్చింది. స్కై డైవ్‍ చేస్తూ ప్రమాదవశాత్తూ నేను మరణిస్తే వారిని బాధ్యులను చేయనని ప్రమాణం. ఓ రకంగా కన్సెంట్‍ ఫర్‍ డెత్‍. మనసు దిటవుచేసుకుని వణికే చేతులతో సంతకం పెట్టా.


అరగంట ప్రయాణం తరువాత ఎయిర్‍ స్ట్రిప్‍కి చేరుకున్నాం. చుట్టూ ఎత్తైన మంచు కొండలు, కిందంతా పచ్చని పచ్చిక బయళ్ళు. ఆహ్లాదకరమైన వాతావరణం. ఉల్లాసం ఓ పక్క, ఆందోళన ఓ పక్క.


నలుగురు నలుగురిని ఓ చిన్న విమానంలో ఎక్కిస్తున్నారు. అదేమో సొట్టలు పడి రంగు వెలిసి ఎగరడం మాట అటుంచి అసలు కదులుతుందా అన్నట్టుంది. మొత్తానికి అది భారంగా కదిలి మెల్లగా ఎగిరి మేఘాల్లోకి కనుమరుగయ్యింది. పది నిమిషాలైనా తిరిగి రాలేదు. భయం, ఎక్కడైనా కూలిపోయిందేమో అని. అంతలోనే రంగుల గాలిపటంలా ఆకాశంలో ఒకటి తరువాత మరొకటి ఇంకొకటి అలా నాలుగు ఆకారాలు. అవి పారాచ్యూట్లు. కింద నాతో పాటు చూస్తున్న స్కై డైవ్‍ నిర్వాహకులు ధమ్స్ అప్‍ సైన్‍ చూపించారు. అవి మనవే అన్నట్టుగా. కొంచెం ధైర్యం వచ్చింది. రెండో రౌండ్‍లో ఎక్కేద్దాం ఈ టెన్షన్‍ భరించలేను అని నేననుకుంటే వాళ్ళేమో నాకు చివరి ట్రిప్‍ దాకా అవకాశం ఇవ్వలేదు.


ఇక నా వంతు వచ్చింది. పారాచ్యూట్‍ వీపుకి కట్టారు. క్లిప్పులు సరిగా ఉన్నాయో లేదో చూడమంటే మరేం పరవాలేదన్నట్టు నవ్వాడు నా టాండమ్‍ డైవర్‍, కీరాన్‍. విమానం ఎక్కించారు, అది 13000 అడుగుల ఎత్తుకు చేరే లోపు జాగ్రత్తలు చెపుతూ నువ్వు దూకదలచు కోకుంటే చెప్పు ఏం పరవాలేదు నీ డబ్బులు తిరిగిచ్చేస్తాం అన్నాడు పైలెట్‍. మళ్లీ సంఘర్షణ, ధైర్యం చేసి దూకి చిన్ననాటి కల నెరవేర్చుకుందామా లేక బతుకుజీవుడా అంటూ బయటపడదామా అని. చివరికి విజయమైనా సరే వీర స్వర్గమైనా(నరకమైనా) సరి అని దూకటానికే సిద్ధమయా . విమానం డోర్‍ అంచుకు చేరుకున్నాం కూర్చుని జరుగుకుంటూ. జంప్‍ అన్నాడు కీరాన్‍. గుండె దిటవు చేసుకుని దూకేసా ఏం జరిగినా సరే అనే తెగింపుతో. నా భయం పటాపంచలయ్యింది. దూకిన మరుక్షణమే సంబరం. అధ్భుత అనుభూతి. పడిపోతున్నట్టు లేదు. స్పీడుగా బైక్‍ నడుపుతున్నట్టుంది, చల్లటి గాలిలో. చిన్న పిల్లాడిలా కేరింతలు కొట్టా. అలా ఓ రెండు నిమిషాల ఫ్రీ ఫాల్‍ తర్వాత ప్యారాచ్యూట్‍ తెరుచుకుంది. కింద అల్లంత దూరాన మంచుకొండలు, నీలి రంగు సరస్సులు, పచ్చిక బయళ్ళ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మెల్లగా నేలపై దిగిపోయాం.


పారాచ్యూట్‍ విప్పేసి విజయగర్వంతో విక్టరీ సైన్‍ చూపిస్తుంటే కీరాన్‍ ఫోటోలు తీసాడు. ఆ అనిర్వచనీయమైన అధ్భుత అనుభూతిని అవకాశం వస్తే మళ్ళీ అనుభవిస్తా, మళ్ళీ మళ్ళీ నెమరేసుకుంటా.

  • డా।। శ్రీకాంత్‍
    ఎ : 9848081039

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *