ది సియాసత్ డైలీ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలిఖాన్ ఆగస్టు 7, సోమవారం అల్వాల్‍లో ప్రజా యుద్ద నౌక తన చిర కాల స్నేహితుడైన గద్దర్ అన్న అంత్యక్రియల ఊరేగింపులో గుండెపోటు కారణంగా మరణించారు. ఆయన అకాల మరణం సామాజిక కార్యకర్తలకు అణగారిన వర్గాలకు తీరని దుఖం. గద్దరన్న మరణంతో జహీర్ భాయ్ తో పాటు యావత్ తెలంగాణ సమాజం శోక సముద్రంలో మునిగి ఉన్న సమయంలో మరో దుఃఖాన్ని మిగిలించి వెళ్ళాడు జహీర్ భాయి.
ఆగస్ట్ 6వ తేదీ నాడు మదీనా హాల్‍లో విద్యావంతుల వేదిక నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ గారి సంస్కరణ సభలో మాట్లాడి వెళుతున్నప్పుడు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నుండి వచ్చిన నా మిత్రుడు జమీల్‍ను జహీర్ భాయ్‍కి పరిచయం చేయగా ఎంతో అప్యాయతతో జామీల్ ను పలకరించి ఆయన ఉర్దూ మీడియం పాఠశాల కోసం ఆ ప్రాంత పిల్లల హక్కుల కోసం అమ్రాబాద్ లో చేస్తున్న పనులను తెలుసుకుని చాలా సంతోషించాడు. ఆయన వెళ్ళిన పది నిమిషాలకె బాంబు లాంటి గద్దరన్న మరణ వార్తతో మళ్ళీ ఎల్‍బి స్టేడియంలో ఆ మరుసటి రోజు గన్ పార్క్ వద్ద చాలా విషాధంతో కలుసుకున్నాము. సాయంత్రం మొబైల్ లో లైవ్ లో చూస్తూనే ఉన్నాము జహీర్ భాయి గద్దరన్నను వదలకుండా అంటిపెట్టుకుని వ్యాన్ ముందు భాగంలో ఉండడడం. సాయత్రం పిడుగు లాంటి వార్తా నమ్మ లేని వార్త జహీర్ భాయి ఇక లేదని.
అందరికీ సుపరిచిత పేరు జహీర్ భాయి పత్రికా రంగమే కాకుండా సామాజిక రాజకీయ కార్యకలాపాలలో పాల్గొని ప్రజలందరికీ చిర పరిచితులు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం మరియు సమానత్వం అనే రాజ్యాంగ విలువలకు ఎట్టి పరిస్తితిలో రాజీ పడని లౌకిక వాది జహీర్ భాయ్.
నా పరిచయం:
తెలంగాణ రాష్ట్ర మలి దశ ఉద్యమంలో తెలంగాణ రిసోర్స్ సెంటర్ హిమాయత్‍నగర్‍లో జహీర్ భాయితో నా తొలి పరిచయం. తొలి పరిచయం తోనే తన చిరునవ్వుతో మ•దు మధురమైన భాయి సాబ్ అనే పిలుపుతో ఆకర్షితులైన వేలాది మంది ఆయన అభిమానులలో నేను ఒకన్నీ. సమయ పాలన ఆయన మారు పేరు. ఉద్యమ కారులుగా మన సమావేశాలన్నీ అనుకున్న సమయం కంటే ఆలస్యంగానే ప్రారంభం అవుతాయి. జహీర్ సాబ్ మాత్రం సమయానికి వచ్చి కూర్చునే వాడు. ‘ఆరే సాబ్ టైమ్ పే కామ్ నహి కరేగా తో తెలంగాణ కైసా చలాయింగే’ భాయ్ సాబ్ అని ముక్కు సూటిగానే అనేవాడు. ప్రేక్షకులలో లోనే కూర్చుని అందరూ చెప్పేది శ్రద్ద గా వినేవాడు. మాట్లాడే అవసరం వస్తే మాత్రం చెప్పదలచుకున్నది సులువుగా అందరికీ అర్ధం అయ్యే విధంగా క్లుప్తంగా మాట్లాడే వాడు. సియాసత్ కార్యాలయానాకి వెళ్ళే వరకు తెలియదు ఆయన చేస్తున్న పలు సామాజిక కార్యక్రమాలు. ముందుగా ఆయన ఆఫీసులో ఒక రకమైన తులసి ఆకుల ఛాయతో మొదలయ్యేది ముచ్చట. ఆ స్పెషల్ చాయా ఆయన ఆఫీసులోనే దొరికేది. ఒక రోజు ఆయన చేసే పనుల గురించి చెప్పమని అడిగినప్పుడు సామాజిక కార్యక్రమాల సియాసత్ టూర్‍కు వెళ్ళినట్లు అనిపించింది. ఆయన చేపట్టిన పనులను పరిశీలిస్తే చాలా వివరాలు తెలుస్తాయి.
సామాజిక కార్యక్రమాలు:
పేద బాహుజనుల సాధికారికతకు విద్య ద్వారానే సాధ్యం అని బలంగా నమ్మిన వ్యక్తి జహీర్ భాయ్. విద్య లేని కారణంగానే సమాజంలో ఉన్న అసమానలతో పాటు నూతన అసమానతలు ఉత్పన్న మవుతున్నాయని ముఖ్యంగా చదువుకున్న వారు చదువులేని వారు ఇంగ్లీషు వచ్చిన వారు రాని వారు నాణ్యమైన విద్య అందుకున్న వారు అందుకోని వారు అనే తారతమ్యాలతో సమాజం విభజింప పడుతుందని ఈ దిశగా ఏమైనా చేయాలనే తపనతో మొదలైనదే సియాసత్ మిల్లత్ ఫండ్ ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్, గుజరాత్, జార్ధండ్, పశ్చిమ బెంగాల్,ఉత్తరప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల అణగారిన వర్గాల పిల్లల విద్య మరియు ఇతర అవసరాలకు అబిద్ అలీ ఖాన్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది నిరుపేద విద్యార్థులకు కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. సియాసత్ పత్రికా కార్యాలయంలో పోటీ పరీక్షలకు కావలసిన కోచింగ్ ఇచ్చి వేలాది మంది యువతి యువకులు ఉపాధి పొందే అవకాశాలు కల్పించారు. అదే విధంగా ఉన్నత చదువులు చదివి ఇంగ్లీషు మాట్లాడడంలో వెనుక బడ్డ విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను ఏర్పాటు చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు ఐటి కంపానీలలో ఉద్యోగాలు చేయడమే కాకుండా కొంత మంది విద్యార్థులు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ విద్యార్థులంతా అతి నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు. ఈ కార్యక్రమాలు కేవలం ముస్లిం యువతి యువకుల కోసమే కాదని చాలా మందికి తెలియదు. ఒక సారి ఒక కోచింగ్ కార్యక్రమానికి మహబూబ్ నగర్ వెళ్ళినప్పుడు కోచింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏదో అనుమానం వచ్చి మైకులో నిర్వాహకులను ముస్లిమేతర విద్యార్థులు తక్కువ కనపడుతున్నారు. ఇది కేవలం ముస్లిం విద్యార్థుల కోసమే కాదని పేద వర్గాల నుండి వచ్చిన ప్రతి విద్యార్థికి మన సేవలు అందాలని చెప్పారు.
మహిళా సాధికారత అతనికి అత్యంత ఇష్టమైన పని. చేతినిండా పని లేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావడం పురుషుల సంపాదన కారణంగా స్త్రీల పట్ల వివక్షతకు కారణం అని తెలుసుకుని స్త్రీలకు ఆర్థిక సాధికారిత ఉంటే స్వంత నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఒక గౌరవ ప్రదమైన జీవనం కొనసాగుతుందని బలంగా నమ్మిన వ్యక్తి. అందుకు గాను వెనుకబడిన మహిళల కోసం వృత్తి శిక్షణా కోర్సులను ప్రవేశపెట్టి వారికి టైలరింగ్, ఎంబ్రాయిడరీ మరియు ఇతర అనుబంధ వృత్తులలో శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేశారు అమ్మాయిల పెళ్ళిళ్ళకు కట్నాలు అయ్యే అప్పులతో కుటుంబాలు ఆర్థికంగా చితికి పోవడం మొదలగు ఇబ్బందులను గ్రహించిన జహీర్ భాయ్ ‘దో-బా-డూ’(పెళ్లి చూపులు)అనే వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చాడు. ఇది దేశంలోనే ఏకైక కార్యక్రమం అని చాలా మంది మాట్లాడుకుంటారు. సామూహిక వివాహాల ద్వారా ఆర్దిక సహాయం అందించినండు వల్ల ఈ కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా చేయ గలిగాడు.
హైదరాబాద్‍లో క్లెయిమ్ చేయని ముస్లింల మృతదేహాలను కూడా ఖననం చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వికారాబాద్‍లో సుకూన్ అనే వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. స్లమ్ ఏరియాలో నిరుపేదలకు సహాయం చేయడానికి మైనారిటీ డెవలప్‍మెంట్ ఫోరమ్‍ను స్థాపించి మురికివాడల నివాసులకు కార్పోరేట్ ఆసుపత్రులతో మాట్లాడి పేదలకు ఉచిత ఆరోగ్య సేవలను అందించాడు.
సియాసత్ పత్రికా కార్యాలయం ప్రజల కార్యాలయం :
జహీర్ భాయ్ పత్రిక కార్యాలయం నిర్వచన్నానే మార్చేసాడు. మామూలుగా పత్రికా కార్యాలయాలు సామన్యులకు పెద్ద అవసరం ఉండదు. జహీర్ భాయ్ ఈ పరంపరకు ఒక బ్రేక్ వేశాడు. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్ష్యంగా తెలుసుకుని సామాజిక సోయితో ఉండాలనే ఆశయం తో అతి నిస్సాహయులకు నిరుపేదలకు తమ కార్యాలయ తలుపులను బార్లుగా తెరిచి ఉంచారు. కొందరు ఉద్యోగం కోసం, మరికొందరు విద్యా సహాయం కోసం, మరి కొందరు ఆధార్ కార్డులు మరియు అలాంటి వాటి సవరణల కోసం సహాయం కోసం సియాసత్ కార్యాలయానికి వస్తారు. వచ్చిన వారికి అన్ని సమాధానాలు చెప్పడానికి తగినంత సహాయం చేయడానికి కొంత మంది సిబ్బందిని ఈ పని కోసమే నియమించారు. వచ్చిన వారు సిబ్బందితో సంతృప్తి చెందక పోతే తన దగ్గరకు వచ్చిన వారిని ఓపికగా వారి బాధలు వినేవారు.
రాజకీయ, సామాజిక న్యాయం కోసం నిశ్యబ్ద విప్లవ వాది :
వేద కుమార్ గారు, గద్దన్న అంటే జహీర్ భాయ్ కి చాలా ప్రాణం అభిమానం గౌరవం. వాళ్ళు చేపట్టే అన్నీ కార్యక్రమాలకు ఎన్ని పనులు ఉన్నా తప్పక హాజరు అవుతుండె. జహీర్ భాయిని, నన్ను గద్దరన్న ‘క్యా బాత్ హై డెమాక్రాట్స్’ అని ప్రేమగా పిలుచుకునేది. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న కాలంలో ప్రజాస్వామిక తెలంగాణ అని కొన్ని వర్గాలు, సామాజిక తెలంగాణ అని మరికొన్ని వర్గాలు ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూనే ఇలాంటి చర్చలను లేవదీసారు. ఈ రెండు వాదనలు చాలా బలమైనవి వాటిని సాధించుటకు మొదలు రాజ్యాంగ పరంగా రాష్ట్రం ఏర్పడడానికి తెలంగాణ ప్రజలకు హక్కు ఉందని ఉద్యమంలో పాల్గొనే వారు.
చాలా చురుకుగా ఉద్యమంలో పాల్గొంటూనే వచ్చే తెలంగాణ ఎలా ఉండాలి అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందాలని పాలనలో రాజకీయ భాగస్వామ్యం ఉండాలని ఎప్పుడు పరితపించేవాడు. తెలంగాణ ప్రకటించగానే ఒక ఇంటర్వ్యూలో తెలంగాణ సాధించారు కదా మీరు ఆశించిన ఫలితాలు వస్తాయా అన్న ప్రశ్నకు మా పాలన మాకే అనే నినాదమే అన్నిటికన్న ప్రాధాన్యమైన ఆశయం. ఇది నెరవేరినట్లే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక నుంచి తెలంగాణ నాయకులే విధాన నిర్ణేతలు. మిగతా విషయాలు మా పాలనలో పరిష్కరించు కుంటామనీ సమాధానం ఇచ్చారు. జహీర్ భాయికి తెలంగాణ సాధన ఎంత ముఖ్యమైనదో ఈ ఒక్క సమాధానంతో అర్ధం అవుతుంది. సమావేశాలు నిర్వహించి ఆయా జిల్లాల స్థితి గతులను తెలుసు కునే వాడు. రాజకీయ సామాజిక అంశాలు చర్చకు వచ్చినప్పుడు ఒక లౌకిక వాదిగా ప్రజాస్వామ్య విలువలకు కట్టు బడి ఉన్న బాధ్యతాయుత పౌరుడిగా జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న అణగారిన వర్గాల వైపు రాజీ లేని నిర్ణయాలు తీసుకుని నిశ్యబ్ద విప్లవానికి నాంది పలికాడు జహీర్ భాయి.
చివరగా:
ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల జహీర్ భాయ్ లాంటి వ్యక్తిత్వం గల మనిషిని కోల్పోవడం లౌకిక ప్రజాస్వామ్య వాదులకు తీరని లోటు. ఆయన వ్యక్తి కాదు ఆయన ఒక వ్యవస్థ. తరతరాల వెనుకబాటు తనం నుండి అణగారిన వర్గాలకు విముక్తి విద్య ద్వారానే సాధ్యం అని నమ్మిన బలమైన నాయకుడు జహీరుద్దీన్ అలీఖాన్ సాహెబ్. అలాగే ప్రజలను వెనుకబాటు తనంలో ఉంచే వివిధ సాంప్రదాయక నియమాలను సవాళ్లు విసిరి నిశ్యబ్ద ధిక్కార స్వరాన్ని వినిపించిన వ్యక్తి జహీర్ భాయి. మానవ స్వేచ్చ పోరాటాలకు ఒక దిక్సూచి. లౌకిక, సామాజిక రాజకీయ, ప్రజాస్వామికరణకు జరిగే పోరాటాలకు ఒక గొప్ప విశ్వాసం. జహీర్ భాయ్ గారి స్పూర్తి ఈ తరం వారికే కాదు తరతరాలకు గొప్ప మానవతా చిహ్నంగా నిలిచి ఉంటుంది.
- ఆర్. వెంకట రెడ్డి, సామాజిక కార్యకర్త