కాకతీయ సామంతులైన రేచర్ల రెడ్లు, వారి అధికారులు, కాకతీయుల తీరుగానే అనేక ఆలయాలు నిర్మించారు. క్రీ.శ. 12వ శతాబ్దిలో కాకతీయ రుద్రదేవుని సామంతుడైన రేచర్ల బేతిరెడ్డి, ముందు ఆమనగల్లు, తరువాత పిల్లలమర్రిని రాజధానిగా పాలించాడు. బేతిరెడ్డి క్రీ.శ. 1190లో పిల్లలమర్రి, సోమవరంలోనూ ఆయన భార్య ఎఱుకసానమ్మ క్రీ.శ.1208లో పిల్లలమర్రి ఎఱకేశ్వరాలయాన్ని మమ్మూర్తులా కాకతీయ ఆలయ వాస్తు శైలిలోనే నిర్మించారు. అవి అలనాటి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నేటికీ నిలిచి ఉన్నాయి. కొన్ని శిథిలాలు కాగా, మరికొన్ని కనుమరుగైనాయి.
వీరి రాజధాని పిల్లలమర్రికి 10 కి.మీ.ల దూరంలో సూర్యాపేట -జనగాం రహదారిలో నున్న ఎఱుకవరం (ఎల్కారం)లో బేతిరెడ్డి వేయించిన శాసనంలో, ఎరకవరంలో బేతనాథధామం (గుడి), కృష్ణయ్య కొడుకు లక్కను రక్షించుగాక అని ఉంది. తేదీలేదు. బేతిరెడ్డి భార్య ఎఱక సానమ్మ పిల్లలమర్రిలో శైవ మఠాన్ని నిర్మించి, దాని నిర్వహణ బాధ్యతను ఇవటూరి సోమన అనే వ్యక్తికి అప్పజెప్పింది. అందుకు కృతజ్ఞతగా అతడు, ఎఱుకసానమ్మ పేరిట, ఎఱుకవరం అనే గ్రామాన్ని నిర్మించి, అందులో బేతేశ్వర, ఎఱకేశ్వర అనే రెండు ఆలయాలను నిర్మించాడు. బేతేశ్వరాలయం ఆనవాళ్లు కోల్పోయింది. ఎఱకేశ్వరాలయం వ్యవసాయ భూముల విస్తరణలో నాగలికర్రు గాయాలకు బలై, మాయ మవటానికి సిద్ధంగా ఉంది.
ఆలయ స్థంభాలు కుంగి, దూలాలు వంగినాయి. నంది మెడ పోగొట్టుకుంది. ఉమామహేశ్వర శిల్పం తలవరకూ విరిగిపోయింది. ద్వార శాఖలు, నక్షాత్రాకారపు కప్పు, రేచర్ల వంశీకుల కళాభినివేశనాన్ని, అలనాటి శిల్పుల ప్రతిభా పాటవాల్ని తెలియజేస్తున్నాయి. మొత్తం నేలకొరిగే ముందే కనికరించండని వేడుకొంటున్నాయి. ఊరు పేరును కూడా ఎర్కారం నుంచి ఎరుకవరంగా మార్చమని పంచాయితీ సభ్యుల్ని గెడ్డంబట్టుకొని బతిమాలుతున్నాయి.
ఒకప్పుడు రాచమర్యాద లందుకొన్న ఎఱకేశ్వరాలయం చిక్కి శల్యమై, శిథిలావస్థకు చేరుకొని, మునుపటి వైభవానికి మరో ఎఱుకసానమ్మ కోసం మౌనంగా ఎదురు చూస్తుంది. గ్రామస్తుల్లో కనీసం ఒకరికైనా కనికరం కలగకపోతుందా అని కునికి పాట్లు పడుతుంది.
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446