భూమికి అధిపతులం కాదు.. అతిధులం మాత్రమే…!


మానవులందరికీ మరింత మేలు చేసే ప్రయత్నంలో సామర్థ్యం, సంపద, అధికారం ఘోరంగా వైఫల్యం చెందాయని ఈ పరిణామం ప్రపంచం అంతటా కనిపిస్తున్నదని నిర్ధారణ చేశాడు బ్యారీ కామనర్‍. ఇందుకు ఉదాహరణగా పర్యావరణ సంక్షోభాన్ని చూపుతాడు. సంక్షోభం నివారించదగిన అవకాశం ఉన్నప్పటికీ ఆ పనిని చేయలేకపోయామని అంటాడు. పర్యావరణాన్ని ఉపయోగపెట్టుకోవటానికి మనం ఎంచుకున్న సాధానాలతోనే పర్యావరణ విధ్వంసానికి పూనుకున్నామని అంటాడు. ఏ సంపద సృష్టి కోసమైతే మనం ప్రయత్నించామో ఆ క్రమమే పర్యావరణ విధ్వంసకారకమని భావిస్తాడు. ప్రస్తుత ఉత్పత్తి విధానం స్వీయ విధ్వంస పూరితమైనదే కాకుండా, ప్రస్తుత క్రమం మానవ నాగరికతను ఆత్మహత్య దిశగా నడిపించేదిగా ఉందని ఆక్షేపిస్తాడు. పర్యావరణ వ్యవస్థలను స్వల్పకాలిక, త్వరిత లాభాలకోసం వివేకరహితంగా దోపిడీకి గురిచేశామని కూడా భావించాడు. ఇది ప్రకృతిపై అమిత భారం మోపిందని కూడా అంటాడు. పర్యావరణ విధ్వంసం అభివృద్ధి చెందిన దేశాల వల్ల ప్రకృతి వినాశనానికి దారితీసిందని, అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా పెరుగుదల భారంగా మారిందని చెపుతాడు. ఒకవేళ దీనిని సరి చేసుకోలేక పోయినట్లయితే ఇప్పటి దాకా మనం ప్రకృతి నుండి ఏ లాభమైతే పొందామో అది తుడిచి పెట్టుకు పోతుందని కూడా వాదించాడు. అంతే కాకుండా మనం ప్రకృతిపై మోపిన ఋణ భారాన్ని తీర్చుకోలేకపోతే అది భవిష్యత్తరాలకు మరింత సంక్లిష్టమైన సమస్యలను సృష్టించి ఇచ్చినట్లవుతుందనీ అంటాడు. పర్యావరణ కాలుష్యం పగలడానికి సిద్ధంగా ఉన్న బుడగ. అది ఎప్పుడైనా పేలవచ్చు. అదే జరిగితే మానవాళి మనుగడ ముప్పులో పడుతుంది.


పర్యావరణ సంక్షోభాల నుంచి బయటపడి బ్రతికి బట్ట కట్టాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల ప్రజలు తమ సమృద్ధ జీవన విధానాలనేమీ వదులుకోవలసిన పని లేదు. మనం సమృద్ధికి సూచికలుగా చెప్పుకొంటున్న జాతీయ స్థూల ఉత్పత్తి, విద్యుచ్ఛక్తి వినియోగం, లోహాల ఉత్పాదనల్లాంటివి ఒక భ్రమ అంటాడు. అవన్నీ కూడా మానవ సంక్షేమానికి సంబంధించినవి కాకుండా ఒక మేరకు పర్యావరణ పరంగా తప్పుడు పద్ధతులకు, సామాజికంగా వ్యర్థాలను ఇచ్చే ఉత్పత్తి పద్ధతులకు సూచికలుగా మారాయి. ప్రతి విడి వ్యక్తికి అవసరమైన వస్తువులను మాత్రమే ఉత్పాదించుకునే విధంగా ఉత్పాదనలో కొన్ని సంస్కరణలు జరగాలని ఆశించాడు. జీవన ప్రమాణాల నాణ్యత పెరగాలంటే ముందుగా కాలుష్యాన్ని అరికట్టాలని పేర్కొంటాడు. అప్పుడు మాత్రమే గుర్తించదగిన స్థాయిలో మార్పును చూడగలుగుతామని భావించాడు.


కొన్ని రకాల మనం పొందుతూ ఉన్న అతి సౌఖ్యాలు ఏవైతే ఉన్నాయో అవి పర్యావరణ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. అట్లాగే మనం దివాళా తీయడానికి చేరువయ్యే కొద్దీ మనలను బలవంతంగా ఆ సౌఖ్యాలను వొదులకునేట్లుగా వత్తిడికి గురి చేస్తుంటాయి. నిజానికి ఇప్పటిదాకా రాజకీయ సౌఖ్యాలను ఎవరైతే అనుభవిస్తూ వచ్చారో, ఎవరు వాటి నుంచి లాభం పొందారో అవి దూరం అవుతాయి. కొద్దిమంది పౌరులు ఆసక్తులు ప్రాధాన్యాల కోసం దేశ సంపదలను అనుభవించే అవకాశం కోసం ఆ రాజకీయ సౌలభ్యాలు ఉపకరించాయి. పౌరులకు ఈ విషయాలను తెలియజెప్పడంలో విఫలమయ్యాం. వారు తమ హక్కులను పొందాలంటే, రాజకీయ పాలనను అనుభవించాలంటే ఏ విధమైన ఆర్థిక విలువలను కలిగి ఉండాలో తెలియ జెప్పాల్సి ఉంది.


కనీసం పర్యావరణ సంక్షోభాలను పరిష్కరించే క్రమంలో వాటిని కోల్పోవలసి వస్తుంది. పేదరికాన్ని సహించ గలిగిన సౌఖ్యం, జాతిపరమైన, వివక్షలు పాటింపు, యుద్ధం మొదలైన వాటి పర్యవసానాలను గ్రహించగలిగే విధంగా తీర్చిదిద్దుకోవాలి. పర్యావరణాన్ని ఆత్మహత్య దిశగా పురికొల్పింది మనమే. ఇప్పుడు మనకు మిగిలిన దారులు అంటూ ఏమీ లేవు. రెండే రెండు ఐచ్ఛికాలు మనముందు ఉన్నాయి. మనం హేతుబద్ధమైన, సామాజికంగా వ్యవస్థీకరించుకొన్న పద్ధతి ప్రకారం భూమిమీద వనరులను పంపిణీ చేసుకునే విధంగా సర్దుబాటు చేసుకోవటం లేదా కొత్త రకమైన ఆదిమ క్రూరత్వానికి తలుపులు తెరవటం.


ఒక తెలియని అనాది అనాగరిక వ్యవస్థలోకే మానవ స్వార్థం పరుగులు పెట్టజూస్తుంది. ఈ పరుగును నియంత్రించుకోగలగాలి ఎవరికి వారు.
ఇటువంటి స్థితిని మనం ఎదుర్కొంటున్నాం కనుకనే మనకిప్పుడు కావలసింది భూవిజ్ఞాన విప్లవమే కాని, సమాచార విప్లవం కాదు అంటుంటారు పర్యావరణ తాత్వికులు. మరి పర్యావరణ శాస్త్రవేత్తలు తమనిత్య పరిశోధనల ద్వారా ఈ సత్యాన్ని ధృవీకరిస్తారు. ఆవిష్కరిస్తుంటారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడేవారు. పర్యావరణ ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు ఈ సత్యానికి మద్ధతునిస్తూ అవగాహనతో పనిచేస్తుంటారు. పర్యావరణం గురించి అంతగా పట్టించుకోనివారు ఈ విషయమై పెద్దగా స్పందించరు. పర్యావరణ బాధితులు దీనిని లోతుగా బోధపరచుకుంటారు. తదనుగుణంగా పరిష్కారం కోసం అన్వేషిస్తారు. అయితే అభివృద్ధి వాదాన్ని బలపరిచే వారు మాత్రం పర్యావరణ పరిరక్షకులను తరచుగా తప్పుపడుతూ ఉంటారు. తమ అవసరాలు, ప్రయోజనాల మేరకు పర్యావరణ హితవాదాన్ని వ్యతిరేకిస్తుంటారు.


పర్యావరణ హితవాదాన్ని వ్యతి రేకిస్తున్న వారిని ముందుగా అర్థం చేసుకోవాలంటే మనకు పర్యావరణ సమస్యలపట్ల అవగాహన అవసరమవుతుంది.
దీనికి మనకు కావలసింది ఎర్త్ కాపిటల్‍ను గురించి తెలుసుకోవటం. భూమి మనకు ఎటువంటి సహజ వనరులను ఇస్తున్నదో వాటి గురించి అవగాహన కావాలి. భూమిపై ఇన్ని రకాల జీవరాశులు ఉన్నాయంటే దానికి కారణం భూమి తప్ప మరొకటి కాదు. భూమి పెట్టుబడి.
భూమిని విధ్వంస పరచకుండా, వనరులను అతి వినియోగానికి పాల్పడకుండా భూమిపై నివసించే ప్రజలు వారికి జీవించి ఉండటానికి కావలసినవి స్థిరంగా ఉండే స్థాయిలో ఉపయోగించుకోవటం. భూమికి హానికారకం కాకుండా మనుషుల ప్రాథమిక అవసరాలు అందరికీ తీరేట్లుగా చూసుకోవటం అవసరం.


మరి భూ విజ్ఞాన విప్లవం అంటే ఏమిటి భూమండలం మీద నివసించే ప్రజలు, వారికి కావలసిన వాటి మధ్య ఒక సమతుల్యతను పాటిస్తూ, సహజ వనరులను తగు విధంగా కాపాడుకుంటూ సాంస్కృతికంగా మార్పులు చేసుకుంటూ జనాభా అభివృద్ధిని నియంత్రించుకుంటూ, జీవన విధానాలను మార్చుకుంటూ అందుకనుకుగుణమైన ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను రూపుదిద్దుకోవటం కావాలి. భూమిని కాపాడుకుంటేనే అది మనలను కాపాడ గలుగుతుందనే ఎరుకను కలిగి ఉండాలి. పర్యావరణాన్ని మనం నిర్వహించుకునే విధానాలను బట్టి భూమిని మన కోసం మనం సుస్థిర పరచుకునే వీలుంటుంది. తద్వారా ఇతర జీవరాశుల ఉనికిని కూడా కాపాడగలుగుతాము.


భూ విజ్ఞానం గల సమాజ నిర్మాణం జరుపుకోవటం నేడు మనముందున్న ప్రధాన కర్తవ్యం. వ్యర్థం అనుకున్న వాటిని తిరిగి వినియోగించటం. రీసైక్లింగ్‍, పునర్వినియోగం కాలుష్య నివారణ, ఇంధనవనరులను పరిమితంగా వినియోగించుకుంటూ వృధాను అరికట్టడం జరగాలి. అట్లాగే జనాభా నియంత్రణ, భూమి మోయగలిగిన సామర్థ్యం మించిన భారాన్ని మోపకుండా ఉండటం కావాలి. అట్లాగే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవటం జరగాలి.


భూ విజ్ఞాన ప్రాపంచిక దృక్పథం కూడా మనకు కావాలి. ఇది మరింతగా పెరగాలి. భూమి మానవులకు మాత్రమే ఆవాసం కాదు. అన్ని రకాల జీవ, వృక్ష జాతులకు కూడా చెందినది. ప్రకృతి మొత్తానికి మనమే ప్రతినిధులం కాదు కొన్ని విధాలైన ఆర్థిక అభివృద్ధి లాభకరం, మరికొన్ని పద్ధతులులో జరిగే అభివృద్ధి నష్టకారకం. ఈ రెంటి మధ్య తేడాలను గుర్తించి మనుగడ సాగించాలి. ప్రకృతి హితంగా మితంగా, అధిపతిగా కాకుండా అంతర్భాగంగా జీవించటం అందుకు అవసరమైన నైతిక జీవన పద్ధతులను విలువలను రూపుదిద్దుకొని బ్రతకటం నేర్చుకోవాలి.

  • డా।। ఆర్‍. సీతారామారావు
    ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *