అశేష తెలంగాణ ప్రజల అస్థిత్వ దర్పణం దక్కన్‍ ల్యాండ్‍ మాసపత్రిక


మిత్రుడు మణికొండ వేదకుమార్‍గారు, తాను సంపాదకత్వం వహిస్తున్న ‘‘దక్కన్‍ల్యాండ్‍’’ సామాజిక రాజకీయ పత్రిక గురించి ఒక వ్యాసం రాయమని అడిగినప్పుడు చాలా సంతోషపడ్డాను. ఈ పత్రిక గురించి రాయడమంటే నా తెలంగాణ రాష్ట్రం మద్యలో నా అస్థిత్వాన్ని వీక్షించుకోవడంగా నేను భావించాను. తొలిదశ ఉద్యమంలో వరంగల్‍లో జరిగిన ఆందోళన, నా కళ్ళముందే వరంగల్‍ పాలిటెక్నిక్‍ దగ్గర, వరంగల్‍ లక్ష్మీటాకీసు సమీపంలో పోలీసు కాల్పులు, అందులో మరణాలు, జైళ్ళు నిండిపోవటంతో మమ్మల్ని పోలీసులు లారీలల్లో ఎక్కించి, మామునూరు దగ్గర, హసన్‍పర్తి అవతల దించివేస్తే అక్కడ నుండి హన్మకొండకు నడిచి వచ్చిన వైనం, హంటర్‍ రోడ్డులో సీమాంధ్రకు చెందిన సోమరాజు పవర్‍ క్రషర్‍ తగలబెట్టడానికి మేము గుంపుగా వెళ్తుంటే మందంరాజు అనే పోలీసు సబ్‍-ఇన్‍స్పెక్టర్‍ పొడుగాటి లాఠీతో మమ్మల్ని తరిమికొట్టి, పవర్‍ క్రషర్‍కు నష్టం కాకుండా కాపాడిన సంఘటనలు లాంటివి ఎన్నో గుర్తుకొచ్చాయి. తెలంగాణా ప్రజా సమితికి చెందిన భూపతి కృష్ణమూర్తి, ముచ్చెర్ల సత్యనారాయణ, కొత్తపల్లి జయశంకర్‍ సార్‍తో బాటు వరంగల్‍ వీధుల్లో, ‘ఇడ్లీ సాంబర్‍ గో బ్యాక్‍’ అంటూ నినాదాలిస్తూ జరిపిన ఊరేగింపులు గుర్తుకొచ్చాయి. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఘట్టాలు ‘‘దక్కన్‍ల్యాండ్‍’’ సంచికలు చూస్తుంటే ఒక్కొటొక్కటీగా మనసులో మెదిలాయి.


దక్కన్‍ల్యాండ్‍ పత్రిక ఆవిర్భావం అకస్మాత్తుగా వచ్చిన ఒక ఆలోచన అని నేను అనుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉద్యమం రకరకాల పద్దతుల్లో ఉవ్వెత్తున లేచిన నేపథ్యంలో హిమాయత్‍నగర్‍లోని చారిత్రక ‘చంద్రం’ నివాసంలో ఒక విన్నూతనమైన కార్యక్రమం ప్రారంభం అయింది. అదే తెలంగాణ రిసోర్స్ సెంటర్‍ TRC-Charcha కార్యక్రమం. 2012 జనవరిన ‘‘ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో మహిళలపాత్ర’’ అనే అంశంతో ప్రారంభం అయిన చర్చ రెండు వందల శనివారాల రోజుల్లో సాయంత్రాలు తెలంగాణకు సంబంధించిన వైవిధ్యమయిన అంశాలపై చర్చ జరిగింది. ఈ పక్రియను చర్చ అనే కంటే తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణా అస్థిత్వం, తెలంగాణా వనరుల లూటీకి సంబంధించిన బ్రహ్మాండమైన ‘‘మేథోమధనం’’ అనడం సబబుగా ఉంటుంది. తెలంగాణాలో వ్యవసాయం, కళలు, సంస్కృతి, పాటలు, నాటి నిజాంపాలనలో ప్రజల జీవనం, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో జరిగిన అన్యాయాలు, పవిత్రమైన తెలంగాణ నీళ్ళ లూటీ, విద్య, వైద్యం, నీటి వనరులు, విశిష్టమైన తెలంగాణ విత్తనాలు మొదలైన ఎన్నో అంశాలపై ఈ మేధోమధనం జరిగింది. దాదాపు 700 వరకు తెలంగాణ మరియు ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఆలోచనాపరులు, రాజకీయనాయకులు, కార్యకర్తలు ఇందులో వక్తలుగా ఉపన్యసించారు. చాలా ఆవేశంగా, ఆవేదనతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని లెక్కలతో సహా కూలం కషంగా వివరించి చర్చకు దోహదం చేసారు. బయట జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తెలంగాణ జిల్లాలో, సీమాంధ్రలో లేవనెత్తిన ప్రశ్నలకు, అనుమానాలకు ఈ ‘చర్చ’ వేదికలో సమాధానాలు లభించి, బయట వస్తున్న ‘తొండి’ వాదనలను సమర్థవంతంగా తిప్పి కొట్టగలిగాం. ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగాం. బహుశా ఈ తరుణంలోనే ‘చర్చ’ ప్రధాన సూత్రధారి వేదకుమార్‍గారు, ‘చర్చ’ను వేరే యితరంమీడియంలో చరిత్రలో రికార్డు చేయాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఈ చర్చ కొనిసాగించాలని సంకల్పించు కున్నట్టున్నారు. దాని ఫలితమే ‘దక్కన్‍ల్యాండ్‍’ సామాజిక మాసపత్రిక ఆవిర్భావం.


2012 సెప్టెంబర్‍ మాసంలో ప్రారంభమయిన ఈ పత్రిక 134వ సంచికగా ఈ అక్టోబర్‍ నెలలో బయటకు వచ్చింది. నిబద్దత, సమర్థత, తెలంగాణపట్ల అంచంచలమైన గౌరవం ఉన్న పత్రికారంగంలో అనుభవం ఉన్న వ్యక్తుల సహకారంతో వేదకుమార్‍గారు ఈ పత్రికను విన్నూతన రీతిలో తెస్తున్నారు. 2013 సెప్టెంబర్‍ సంచిక కాళోజీ నారాయణరావు ప్రత్యేక సంచికగా తరువాత 2015 నవంబర్‍, డిసెంబర్‍ సంచికలు ‘చర్చ’ సంచికలుగా వెలువడ్డాయి. వీటికి మాత్రమే ప్రత్యేక సంచికలుగా శీర్షికలు పెట్టారు. నిజానికి అన్ని సంచికలు విషయాల వివరణ, వ్యాసాలలో దేనికదే ప్రత్యేకం. ఈ నూటా ముప్పై నాలుగు సంచికలలో స్పృశించనివిషయం లేదంటే అతిశయోక్తి కాదేమో. తెలంగాణ ప్రజా ఉద్యమం తీరు-తెన్నులు, సీమాంధ్ర నాయకుల కుట్రలు- కుతంత్రాలు, దేశంలో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాలు, సాహిత్య, సినిమా సమీక్షలు, రైతుల, విద్యార్థుల ఆత్మహత్యలు, సంక్షోభాలు, తెలంగాణ కవుల, రచయితల పరిచయాలు, నీటి వనరుల స్థితిగతులు, గొలుసుకట్టు చెరువుల తీరునా ప్రభుత్వాల నిర్లక్షం, దళిత సమాజాలు, ఆదివాసీ, సంచార జాతుల సమస్యలు పరిష్కారాలు, ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ అణచివేత, న్యాయవ్యవస్థలు చట్టాల అమలు తీరు, అడవుల, చెట్ల రక్షణ నగరీకరణ, వలస కార్మికులు, నగరంలో కాలుష్యం, తెలంగాణలో ప్రజల జాతరలు, సమ్మక్క – సారాలమ్మ జాతర, పోచమ్మ, బతుకమ్మ ఇతర పండుగలు, అభివృద్ధి ప్రాజెక్టులు, భూసేకరణ, నిర్వాసితులు, పునరావాసం, పర్యాటకరంగం, వారసత్వ సంపద, దేవాలయాలు వాటి ప్రత్యేకతలు, చారిత్రక శిలలు, శిలాజ, వృక్ష సంపద, వాయిద్యాలు, కొండలు, కోనలు, ఆరోగ్య, విద్యా వ్యవస్థల పరిస్థితి, కులాల ప్రత్యేకత, చేతివృత్తులు, నైపుణ్యాలు, హిందూ, ముస్లిం, క్రైస్తవ, పార్శీ, బౌద్ధ సంస్కృతి అంశాలు ఇట్లా వందలాది అంశాలపై వివరమైన విశ్లేషణాలతో, గణాంకాలతో వ్యాసాలు మనకు దర్శనమిస్తాయి. ఒకమాటలో చెప్పాలంటే తెలంగాణకు సంబంధించిన విజ్ఞానాన్ని, చరిత్రను అంతా ఒక నిధిలా అక్షరాలలో ఈ సంచికలలో నిర్వాహకులు భద్రపరిచారు. ఈ వ్యాసాలన్ని ఆశామాషీగా రాసినవి కావు. రాసినవారు, విశ్లేషకులు అందరూ విషయాలపట్ల పూర్తి అవగాహన, తెలంగాణ అంశాలపట్ల నిబద్దత కలిగిన వ్యక్తులు. తెలంగాణ ప్రాచీన, చరిత్ర, శిలా సంపదపై వచ్చిన వ్యాసాలన్నింటిని, ఒక నిష్ణాత వ్యక్తి సంపాదకుడుగా ఒక పుస్తకంగా తెచ్చినట్టు నాకు జ్ఞాపకం ఉంది. పైనపేర్కొన్న ఒక్కొక్క అంశంపై ఒక్కొక్క పుస్తకం ప్రచురించవచ్చు. ఇవన్నీ కలిపితే తెలంగాణ రాష్ట్ర సమాచార భండాగరం అవుతుంది అనడంలో తప్పులేదు. ఈ పత్రికల్లో వహ్వా… క్యా బాత్‍ హై, సంపాదకీయం, తేజో మూర్తులు, మూసీ ముచ్చట్లు, జ్ఞాపకం, సందేశంతో సహా అన్ని శీర్షికలు వాటిలో వివరించిన అంశాలకు సంబంధించిన ప్రేమ్‍లలో దర్శనమిస్తాయి. పత్రిక ప్రారంభ సంచికలో నిర్వాహకులు ‘‘ప్రజాభిప్రాయాన్ని విస్తృత స్థాయిలో వ్యక్తం చేసేందుకు వీలుగా, విద్యావంతులు, సామాజిక ఉద్యమ కార్యకర్తల నుండి రచనలు ఆహ్వానిస్తున్నాం. ప్రజాస్వామ్య వాదుల గొంతుక ఇది.ఉద్యమకారుల వేదిక ఇది’’ అని ప్రకటించారు. ఈ ప్రకటనలో అకాంక్షను పూర్తిగా ఈ పత్రిక అమలు పరచినందుకు సంతోషంగా ఉంది.


ఈ పత్రికకు కవర్‍ పేజీలు పెద్ద హైలైట్‍. ప్రతి సంచిక కవర్‍ పేజీ ఫోటో జర్నలిజం లాగా ఆ సంచికలోని ప్రధాన అంశాలను సూచిస్తాయి. కవర్‍ పేజీలపై వాడిన పెయిటింగ్‍ చిత్రాలు, రేఖా చిత్రాలు, ఫోటోలు అన్ని కూడా కళాఖండాలు. 54 సంచికలపై ప్రఖ్యాత చిత్రకారుల రంగుల పేయింటింగ్స్ మనలను అబ్బురపరుస్తాయి. 64 సంచికలపై మనను పలకరించే ఫోటోలు మనం మరవలేం. 16 సంచికలపై ముద్రించిన శిలల ఫోటోలు మనల్ని తన్మయపరుస్తాయి. ఒక టూర్‍ వేసుకొని ప్రకృతి తయారు చేసి మనకు శాశ్వతంగా ఉంచిన ఆ శిలా ఖండాలను చూసి వస్తే మన జన్మ తరిస్తుంది అనిపిస్తుంది. ఇంత వైవిధ్య భరతిమైన కవర్‍ పేజీలను డిజైన్‍ చేయడానికి వేదకుమార్‍ గారికి తాను ఎంతో కాలంగా సేకరిస్తూ వస్తున్న ఫొటోల కలెక్షన్‍, మా భూమి నరసింగరావుగారి దగ్గర ఉన్న అపారమైన ఫొటోల కలెక్షన్‍ సంపద, ఇన్‍టాక్‍, హెరిటేజ్‍ సంస్థల్లో వారు పోషిస్తున్న క్రియాశీలక పాత్ర, హైదరాబాద్‍ సేవ్‍రాక్‍ సంస్థతో వారి అనుబంధం తోడ్పడ్డాయి. అన్ని సంచికలను ఒక ఆర్ట్ గ్యాలరీలో క్రమపద్ధతిలో గోడలపై, స్టాండ్‍పై అమర్చితే అది ఒక బ్రహ్మాండమైన ఆర్ట్ ఎగ్జిబిషన్‍లా తయారవుతుంది.


వీటిని చూస్తుంటే ఎన్నో సంస్థలతో సంబంధాలు, బాధ్యతలు పంచుకుంటూ తీరిక లేకుండా ఉన్న వ్యక్తికి ఈ సృష్టి ఎట్లా సాధ్యం అనే అనుమానం రాకమానదు. అయితే ఆయనకున్న పుష్కలమైన సామాజిక వనరులు, ఆలోచనాపరుల సాంగత్యంతో బాటు, ఆయన టీం సమిష్టి కృషి పాత్ర చాలా ఉంది. సహాయ సంపాదకులుగా ఉన్న వంశీమోహన్‍, తిరునగరి శ్రీనివాస్‍, జుగాష్‍, కట్ట ప్రభాకర్‍, ఫోటోగ్రాఫర్‍ టి. స్వామిగార్ల నిబద్ధతను, కృషిని మనం అభినందించాలి.


ఇంత కృషి, శ్రమ చేసి తెస్తున్న ఈ పత్రికలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అన్నిరంగాలలో జరుగుతున్న కృషి, మనకు కనపడుతున్న అభివృద్ధితో బాటు, సూచనప్రాయంగా నైనా రాష్ట్ర పునర్‍నిర్మాణంలో ఇంకా చేపట్టవలసిన అంశాలు, నిర్లక్షానికి గురౌతున్న అంశాలు ప్రస్తావించే వ్యాసాలు కూడా ఉంటే బాగుంటుందని కొంతమంది దక్కన్‍ల్యాండ్‍ పత్రిక అభిమానులు, శ్రేయోభిలాషులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం వేదకుమార్‍గారు దృష్టిలో పెట్టుకోవాలి అని విజ్ఞప్తి.


-యస్‍.జీవన్‍ కుమార్‍
మానవ హక్కుల వేదిక
ఎ : 9848986286

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *