జానే కాహా గయే ఓదిన్

(గత సంచిక తరువాయి)
ఆ దినాలల్ల అన్ని టాకీసులలో మార్నింగు షోలకు తక్కువ ధర ఉండేది. కారణం అవి పాత సీన్మాలు. మిగతా మూడు ఆటలకు ధర ఎక్కువ. ఎందుకంటే అవి కొత్త సీన్మాలు. పైగా రంగుల సీన్మాలు. మా ‘ఆషా’ల మార్నింగులన్నీ పాత తెలుగు సీన్మాలు. మిగతా మూడు ఆటలు కొత్త హిందీ సీన్మాలు. మా అమ్మ వెంబడి తోక లాగ తెలుగు సీన్మాలకు పోయేవాళ్లం. దేవదాసు సీన్మా చూసి మా అమ్మ వారం దినాలపాటు ఒకటే ఏడుపు తన స్వంత తమ్ముడో అన్ననో తాగి తాగి చచ్చిపోయినట్లు! నేనైతే సీన్మా చూస్తూ చూస్తూ మధ్యమధ్యల తలకాయ వెనకకు తిప్పి ప్రొజెక్టర్‍ వైపు చూసేవాడ్ని. చీకటి హాలులో ఆ రంధ్రాల నుండి వచ్చే తెల్లటి పొగలాంటి కాంతి కూడా నన్ను ఆకర్షించి ఆశ్చర్యపరిచేది.


సినిమాలే కాదు అసలు సినిమాల కంటె ముందు వేసే యాడ్‍ సీన్మాలు, డాక్యు మెంటరీలు కూడా మాకు తెగ నచ్చేవి. తెల్లని లక్స్ సబ్బుల యాడ్‍లు, తలనొప్పి తగ్గించే అనాసిన్‍ బిళ్లల యాడ్‍లు కూడా మాకు వినోదమే. ఇక ఇండియన్‍ ఫిల్మ్ డివిజన్‍ వారి నలుపు తెలుపుల డాక్యుమెంటరీలు సరేసరి. అప్పుడు భారత పాకిస్తాన్‍ దేశాల మధ్య యుద్ద కాలం కావున తెరమీద లాల్‍ బహద్దూర్‍ శాస్త్రి కనబడగానే మేమందరం చప్పట్లు చరిచి మా దేశభక్తిని ప్రదర్శించేవారం. కాని సీన్మా ముగిసి జనగణమన పాట, జాతీయపతాకం రెపరెపలు శురూ కాంగనే ఓపిక లేని మేం కలుగుల్లోని ఎలుకల్లాగ చీకట్ల నుండి వెలుగులకు ఇవతల పడేవాళ్లం. బలవంతపు దేశభక్తిని రుద్దటం ఆ రోజులలో ఇంకా ప్రారంభం కాలేదు.


అప్పుడు మార్నింగ్‍ షో సీన్మా ధర థర్డ్ క్లాస్‍ టిక్కెటుకైతే నలభై పైసలు. పైసలకు కట కట ఉండే ఆ దినాలల్ల మేం గాంధీగారి క్లాసునే ఆశ్రయించేవాళ్లం. గంట, గంటన్నర ముందే వెళ్లి క్యూలో పడిగాపులు కాసేవాళ్లం. కాని క్యా ఫాయిదా? తీరా టిక్కెట్ల కిడ్కీ తెరిచే సమయానికి బలవంతులు (ధనవంతులు కాదు సుమా) వచ్చి ముందు నుండి గుసాయించి కిడ్కీ దగ్గరికి చేరు కొనేవాళ్లు. అప్పుడు క్యూలో పెద్ద ‘ఢక్లం ఢక్లీ’ (తోపులాట) శురువయ్యేది. కొండోకచొ ముష్టి ఘాతాలు, ముష్టి యుద్దాలు కూడా! సందట్లో సడేమియా లాగా కొంతమంది ‘పాకెట్‍ మార్‍’లు (జేబు దొంగలు) తమ హస్త కళా లాఘవాన్ని ప్రదర్శించేవారు. ఆవులావులు కొట్లాడుకుంటే మధ్యల ల్యాగదూడల కాళ్లు విరిగినట్లు ఆ బలవంతుల బలప్రదర్శనలో బక్కజీవులమైన మేము నానా అవస్థలు పడి చెమటలతో తడిసిన అరచేతులతో టిక్కెట్లను సంపాదించి ఎగురుకుంటా గంతులేసుకుంటూ హాలులోకి ప్రవేశించేవాళ్లం. అప్పటికే సీన్మాపాటలతో హాలు హోరెత్తి పోతుండేది. చెక్క కుర్చీలలో ఆసీనులైనమేం కండ్లు చించుకుని తెరవైపు ఆత్రుతగా ఎదిరి చూస్తుండే వాళ్లం. అది కొంచెం కొంచెం కదులుతూ అలలు అలలుగా పైకి లేస్తుంటే ధర్డు కాస్లులోని కిష్కంధమూకంతా సీటీలు బజాయిస్తూ కేరింతలు కొట్టేవాళ్లు. సీన్మా నడుస్తున్నపుడు ఏ మాత్రం రసవత్తర సన్నివేశం వచ్చినా లేదా రెండర్థాల డైలాగులు వచ్చినా లేదా హీరో విలన్ను చితగ్గొడ్తున్నపుడైనా ధర్డ్ క్లాసు ప్రేక్షక మహాశయులు తమ ఆనంద పారవశ్యాన్ని ఆపుకోలేక కుర్చీలలో నుండి లేచి కుర్చీ రెక్కల్ని టపటపా క్రిందికీ మీదికీ కొట్టే వారు. ఫలితంగా ధర్డు క్లాసులో సగానికి పైగా కుర్చీలు విరిగిపోయి ఉండేవి. ‘జైసీ కర్నీ వైసీ బర్నీ’ అన్నమాట.


‘ఆషా’ ప్రారంభమైన కొత్తలో ఒకరోజు ఏదో సాంకేతిక కారణాల వలన తెర ‘పైకి’ లేవలేదు. ఆలస్యం భరించలేని రసజ్ఞప్రేక్షకులు ఒకటే గడ్‍బడ్‍. సీటీలతో పాటు నక్కకూతలు, పిల్లి కూతల మిమిక్రీ శురువైయ్యింది. హాలు పనివాళ్లు, మేనేజర్‍తో సహా అందరూ పరేషాన్‍. చెమటలు కక్కుతూ తెరను పైకి లేపటానికి క్రిందా మీదా పడి ‘పసీనా పసీనా’ ఐపోయారు. ఓపిక నశించిన ప్రేక్షకులు వారి అమ్మా అక్కా పేర్లను ఉపయోగించి వారికి అక్షింతలు చల్లసాగారు. హాలు వారు చివరికి రెండు బొంగులను తీసుకొచ్చి తమ భుజబలం ఉపయో గించి తెరను బలవంతంగా పైకి లేపి తాళ్లతో కట్టేసారు. చాలారోజుల వరకు తెర అట్లానే ఉండిపోయింది. మళ్లీ క్రిందికి దించే సాహసం చేయలేదు. ఆ రోజులలో ప్రతి సంగతి ఒక ఉచిత వినోద ప్రదర్శనమే. అసలు సీన్మా కంటే ఆ సంఘటననే మమ్మల్ని చాలా రోజుల వరకు నవ్వించింది.


ఆషా టాకీస్‍ అంటే ఒకటా రెండా? ఎన్నెన్ని జ్ఞాపకాలు, ఎనెన్ని సీన్మాలు, ఎంతమంది జిగ్రీ దోస్తులతో చూసిన సీన్మాలు ఎన్నని చెప్పుకుంటాం. అవన్నీ మధుర స్మ•తులే కదా. కాలవాహిని అలల వాలున కొట్టుక పోయిన స్నేహితులను, తెగిపోయిన బంధాలను, ఆ ఆనంద విషాదాలను జ్ఞాపకం చేసుకోవటం అంటే ‘తెగిన జ్ఞాపకాలను’ అతికించుకోవటమే కదా!
చివరాఖరిగా మరొక చిన్న మాట. నేను కాబోయే నా శ్రీమతితో కల్సి ‘ఆషా’ లో మొదటి సారిగా చూసిన సీన్మా రాజేంద్రకుమార్‍, వైజయంతీ మాల కలిసి నటించిన ‘సూరజ్‍’ హిందీ సీన్మా. తర్డుక్లాసులో తెరకు ముందున్న మొదటివరుస కూర్చీలలో కూచుని మేం ‘సూరజ్‍’ను ఆనందించాం. అప్పుడు నేను పద్నాలుగు ఆమె తొమ్మిది. గౌను వేసుకుని ఆ సీన్మాకు వచ్చింది. అదెట్లా అని మళ్లీ అడక్కండి. ముట్టుకుంటే పట్టుకునే ముచ్చట్లు. చెప్పటం మొదలైతే మళ్లీ అది మరొ కథ అయితది.


‘‘ఆషా టాకీసు కూలగొడ్తుండ్రంట’’ అని మా సుశక్క చెప్పిన రోజే నేను బాధాతప్త హృదయంతో ‘ఆఖ్రీ ములాఖాత్‍’’కు బయలుదేరిన.
తీరా అక్కడికి చేరుకునే సరికి ఏమున్నది? యుద్ద రంగంలో నేల కూలిన నల్ల ఏనుగులా అది నేల కూలి నల్లటి శకలాలుగా అంతటా పరుచుకుని గుట్టలా పడి ఉంది. ఇనుప సీకులు, సిమెంటు దిమ్మెలు, మట్టి ముద్దలు నాకు ‘‘ఆఖ్రీసలాం’’ చేసాయి. దాని ఎదురుగా ఉన్న మిరపకాయబజ్జీ దుకాణం అరుగుమీద నేను చాలా సేపు నిల్చుని ఆ శకలాలను చాలా సేపు తదేకంగా చూసిన. ‘‘కలలు కూలుతున్న దృశ్యం’’ ఆ శకలాల అట్టడుగున సమాధి ఐన నా బాల్యం కలలు. నాబాల్యం తీపి గుర్తులు. మధురమైన జ్ఞాపకాలు. ఏదీ ఆనాటి తాటి తోపుల వనం? ‘చెట్లు కూలుతున్న దృశ్యం’. తియ్యటి కల్లు మాయ మైన దృశ్యం. చెట్లల్లకు పోదామని తోటలను, చెట్లను వెదుకుతూ పోయిన మా అమ్మ. కాలగర్భంలో కలిసిపోయిన మా అమ్మ. కాలవాహినిలో కరిగిపోయిన ఆశా టాకీసు. ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు?
నేను నిలుచున్న మిరపకాయ బజ్జీల దుకాణం కూడా 50 సంవత్సరాల క్రిందటిదే. ‘ఆషా’ పుట్టినపుడే అది కూడా పుట్టింది. ఆషా లేదు కాని మిరపకాయబజ్జీలు వేయించే ‘‘బట్టీ’’ పొయ్యి మాత్రం అట్లనే ఉంది.
మాయమైన బాల్యాన్ని మళ్లీ ఒకసారి ఆస్వాదించాలనే దుగ్ధతో రెండు బజ్జీలను కొని కొంచెం కొంచెం కొరుక్కతింటూ ఆ దుకాణం సేఠ్‍తో మాటలు కలిపిన.
‘‘అబ్‍ యహాఁ క్యా బన్‍ రా భై ’’ అని అడిగాను.
‘‘నహీ మాలుం సాబ్‍. కుచ్‍ షాపింగ్‍ మాల్‍ బోల్‍ కే సునా’’ అన్నాడు.


మిరపకాయ బజ్జీలకు ఆనాటి రుచి లేదు. ఆ టాకీసు ప్రాంగణానికి ఆనుకుని ఆషా ఇరానీ హోటల్‍ ఇంకా అట్లనే
ఉంది. లోపలికి వెళ్ళి ఇరానీ ‘చాయ్‍’ చప్పరిస్తూ ఆ కాలం నాటి కుర్చీలు, బల్లలను చూసిన. ఆకుర్చీలల్ల నేనూ నా దోస్తులం చాలా సార్లు కూచున్నాం. ఆనాటి మనుషులు లేరు కాని వస్తువులు మాత్రం అట్లనే ఉన్నాయి. వారి తీపి గుర్తులుగా!
‘చాయ్‍’ తాగటం పూర్తి కావటంతో ఆషా టాకీసుకు నా నివాళి, నా శ్రద్ధాంజలి ముగిసి పోయింది.
అక్కడ్నుంచి బయలుదేరి మొగల్‍పురా, చార్మినార్‍ దాటి గుల్జార్‍హౌజ్‍ చౌరస్తాలోని ‘ఆగ్రా హోటల్‍’ చేరుకున్న. కౌంటర్‍లో ఒక యువకుడు కూచున్నాడు. ఆయన్ని ‘పదం సేఠ్‍’ గురించి అ డిగాను. ఆయన మా తాతగారు అన్నాడు. పోయి చాలా కాలం అయ్యిందంట. ‘ఆషా’ ఎవరి పేరూ? అని ప్రశ్నించాను. పదంసేఠ్‍ పెద్ద కూతురు అని జవాబు ఇచ్చాడు.
మరికొన్ని వివరాలు అడిగాను.
‘‘నాకు తెలియదు కాని మా పెద్దన్నకు అన్ని సంగతులు తెల్సు. ఆయన లేడు. ఒక వారం రోజులకోసం ఆగ్రా వెళ్లాడు. మీరు మళ్లీ రాండ్రి అన్నాడు.
నేను గృహోన్ముకంగా ప్రయాణమైనాను.
‘‘కోయీ లౌటాదే మేరే
బితే హుయే దిన్‍ ’’.

(దూర్‍ గగన్‍ కీ చాఁవ్‍ మే సీన్మాలో కిశోర్‍ కుమార్‍ పాట)


(చార్‍మినార్‍ కథలు-పుస్తకం నుంచి)
-పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *