ఉమ్మడి రంగారెడ్డి జిల్లా దక్కన్ పీఠభూమిగా పేరుగాంచినది. ఇక్కడ విష్ణు కుండినులు, శాతవాహనులు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు పరిపాలించిన చారిత్రక ఆధారాలున్నవి. ఈ జిల్లాని 1948కి ముందు అత్రాప్-ఇ-బల్దా అనే పేరుతో వ్యవహరించారు. 1948 నుండి 1978 వరకు హైదరాబాదు జిల్లాగా పిలువబడింది. 1978లో కె.వి.రంగారెడ్డి గారి పేరు మీదుగా రంగారెడ్డి జిల్లాగా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2016లో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్ అను మూడు జిల్లాలుగా విభజించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధానంగా 37 మండలాలు, 951 గ్రామాలతో హైద్రాబాద్ జిల్లాకి చుట్టూరా ఆవరించి ఉన్నది. జిల్లాలో ప్రవహించే మూసీ (ముచికుంద), కాగ్నా నదులు ముఖ్యమైనవి. అనంతగిరి కొండలు పచ్చదనం ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడి అనంత పద్మనాభ స్వామి క్షేత్రం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. కీసర రామ లింగేశ్వర స్వామి ఆలయం, కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం, చిలుకూరు బాలాజీ టెంపుల్, ఎల్లంకొండ శివాలయం ప్రాచీనమైనవి ఉన్నవి. ఈ జిల్లా రాష్ట్ర రాజధానికి చేరువగా ఉండటం వల్ల భిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. దేశ విదేశ భాషలకు కేంద్ర స్థానంగా, కళలు సంస్కృతి సంప్రదాయాలు పండుగలు పర్వదినాలు వేడుకలన్నీ నగరీకరణ చెందడం విశేషం. గతంలోని గ్రామాలన్నీ చాలా చాలా వేగంగా పట్టణీకరణలో కలిసి, కాలనీలుగా మారుతున్నవి. గ్రామ నామాల కోణంలో ఉమ్మడి జిల్లా ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు అనేక ఆసక్తికర విషయాలు వెల్లడవుతాయి. జిల్లాలోని గ్రామ నామాలపై కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల ప్రభావంతో ఉర్దూ భాషా ప్రభావం ఉండగా, తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్ ప్రాంతాల్లో కన్నడ భాషా ప్రభావం కనబడుతుంది.
ఇబ్రహీంపట్నం మూలం వీర పట్నం, హయత్ బక్షి పేరు మీదుగా హయత్ నగర్, మంచాల్ రెడ్డి పేరు మీదుగా మంచాల, పెద్ద వేముల నుండి పెద్దేముల్, పుండ్రపురం నుండి పూడూరు, యాచవరం నుండి యాచారం, దొరవేటి నుండి ధారూరు’గా మారిన నామాల ప్రస్తావనలు ఎన్నో కనబడుతవి.
హయత్ నగర్ దగ్గరలో ఉన్న తొర్రూరు, గండిచెరువు, పసుమాముల అను గ్రామనామాలు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, తిరుమలగిరి ప్రాంతాలలోని తొర్రూరు, గుండెపురి (గుండియాపూండి) పసునూరు (పసువుల) నామాలతో సామ్యం కనబడుతున్నది. తద్వారా గండిచెరువుకు మూలం గుండెపురి లేదా గుండియాపూండి పేరు, పసుమాములకు మూలం పసునూరు లేదా పసువుల అయి ఉండ వచ్చు. ఇది కేవలం అంచనా మాత్రమే.
నాగారం, భోగారం అనే గ్రామ నామాలు దగ్గరగా జంట గ్రామ నామాలుగా కనబడుతుండడం మరో విశేషం. వికారాబాద్ పట్టణానికి సమీపంలోనూ, కీసర గుట్టకు దగ్గరలో ఈ జంట గ్రామ నామాలు ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో వలిగొండ దగ్గర్లో నాగారం, భోగారం కూడా జంట నామాలుగా ఉండడం విశేషం. పెద్ద అంబర్ పేటకు సారూప్యంగా హైద్రాబాద్ జిల్లాలో బాగ్ అంబర్ పేట, నల్లగొండ జిల్లా శాలి గౌరారం మండలంలోని అంబారీ పేట అను నామాలు ప్రత్యేకతను కనబరుస్తున్నవి.
గ్రామ నామాలలో సాధారణంగా భౌగోళిక స్థితిని బట్టి(చేవెళ్ళ, ఏట్లఎర్రవల్లి, పరిగి, రాళ్ళగుడిపల్లి, బాట సింగారం, దండు మైలారం), వ్యక్తుల పేర్లను బట్టి (కేతిరెడ్డి పల్లి, మాదిరెడ్డి పల్లి, రామచంద్రాపురం, నవాబ్ పేట్, షాబాద్, మోమిన్ పేట్, మొయినాబాద్, పటేల్ గూడ), ఇంటి పేర్లను బట్టి(పోచారం, కౌకుంట్ల, చిలుకూరు, చింతపట్ల), వృక్షాలను బట్టి (మూడు చింతలపల్లి, మేడ్చల్, మోత్కుపల్లి) ఏర్పడుతుంటవి. అయినా ఈ జిల్లాలో ముస్లిం సంబంధ నామాలు అధికంగా కనబడుతుండడం విశేషం.
గ్రామ నామాల వాస్తవ రూపాలు జన వ్యవహారంలో మారుతుంటాయి. మండి గౌరెల్లిని మొండి గౌరెల్లిగా, రాయప్రోలుని రాపోలుగా, బ్రాహ్మణపల్లిని బామనపల్లిగా కొహెడను కొయ్యెడగా, అనంతవరాన్ని అనంతారంగా, నాగన్ పల్లిని నయినంపల్లిగా, కేరవెళ్ళిని కైరెళ్లిగా మరిన్ని గ్రామ నామాలను వ్యవహరించడాన్ని గమనించవచ్చు.
ఏదులాబాద్:- ఘట్కేసర్ మండలంలోని గ్రామమిది. ఇక్కడ 2013లో కొత్త తెలంగాణ చరిత్ర బృందం వెలికి తీసిన సిరిచాప శాసనం ద్వారా ఏదులాబాదుకు రాయపురము, శ్రీవల్లీపుత్తూరు, లక్ష్మీనారాయణపురం అనే పేర్లు ఉన్నాయని తెలుస్తోంది.
కీసర:- కీసరగుట్టలో జరిపిన తవ్వకాలు విష్ణుకుండిన రాజు రెండవ మాధవ వర్మ కాలపు నిర్మాణాలను తెలియజేస్తాయి. 1967లో పురావస్తు శాఖ గుర్తించిన శాసనం. తొలి తెలుగు శాసనం తొలుచువాన్డ్రు అనే లేబుల్ శాసనాన్ని చరిత్రకారులు కీసరగుట్ట మీద గుర్తించారు.
చీర్యాల:- కీసర మండలంలోని చారిత్రక గ్రామమిది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం వెలికి తీసిన కళ్యాణి చాళుక్యుల శాసనంలో ఈ గ్రామనామం శ్రిర్యాలపురం అని ప్రస్తావించబడింది.
తారామతి పేట్, ప్రేమావతి పేట్:- ఈ గ్రామ నామాలకు ఓ ప్రత్యేకత ఉన్నది. గోల్కొండ నవాబు తానీషా పరిపాలనా కాలంలోని ప్రముఖ రాజ నర్తకులుగా ఖ్యాతి గాంచిన తారామతి, ప్రేమావతి ఇరువురి పేర్ల మీదుగా ఈ గ్రామ నామాలు ఏర్పడినవని చారిత్రక కథనం ఉన్నది.
పాన్ మక్తా:- ఈ గ్రామ నామం ఆనాటి ఆచారాన్ని తెలియజేసే కథనంతో ఏర్పడింది తాంబూలం కట్టి ఇచ్చే వారికి ఇనాముగా ఇవ్వబడిన గ్రామమని తెలుస్తుంది. రాజరిక వ్యవస్థలో రాజుల, రాజబంధువుల విలాసాలకు ఎన్నో నిదర్శనాలు లభిస్తాయి. తాంబూలం ఖర్చు కింద ఇచ్చిన భూమి అని కూడా చెప్పుకోవచ్చు.
బోడుప్పల్:- ఈ నామం బడా ఉప్పల్‌కి రూపాంతరమని, యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ చోటా ఉప్పల్‌కి మూలమని స్థానిక ఐతిహ్య కథనాలున్నవి.
మేడ్చల్:- కాకతీయుల కాలంలో సైనిక సరిహద్దుగా ఉండేదట. ఇది అతి ప్రాచీన పట్టణమని 1943లో రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు జి.యాజ్దాని గారు అభిప్రాయ పడ్డారు. ప్రాచీన పరిశోధకులు తారిఖ్-ఏ-జాఫ్రా అనునతడు తన గ్రంథంలో ఈ మేడ్చల్ ప్రస్తావన చేసి ఉన్నాడు. ఔరంగాబాద్ కలెక్టర్ శ్రీ నవాబ్ మన్ సబ్ జంగ్ బహదూర్ తన వ్యాసంలో మేడ్చల్ ఒక పెద్ద అడవి ప్రాంతమని ఇది గోల్కొండవలె ప్రసిద్ధిగాంచి ఉండెనని పేర్కొన్నారు. కాశీ యాత్ర చరిత్రలో ఏనుగుల వీరస్వామి ఇక్కడ అన్నీ మద్ది చెట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. (రంగారెడ్డి జిల్లా గ్రామ నామాలు, డా.మొరంగపల్లి శ్రీకాంత్ పుట, 222-223)
లాల్ గడి మలక్ పేట్:- లాల్ గడి అనగా ఎర్రకోట తలుపులది. అనగా ఎత్తైన తలుపులు కలిగి ఎర్రని రంగు గల ద్వారము గలది అని అర్థం. ఇది జన వ్యవహారంలో మలుకన్న పేట నుండి మలకపేటగా, లాల్ గడి మలక్ పేట్’గా మారినదని స్థానిక కథనం.
వికారాబాద్:- జిల్లా కేంద్రంగా ఉన్నది. ఈ పేరును స్థానికులు వొకారాబాద్ అని కూడా పిలుస్తారు. ఈ ఉచ్చారణకు మూలం ఏమిటో తెలుసుకోవాలి. ఇంకా గంగారం’గానూ వ్యవహరిస్తుండడం విశేషం.
గ్రామ నామాలు మూలాధారాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ నామాలను పరిశీలించగా ప్రత్యేక రూపాలుగా కనబడుతున్న కొన్ని గ్రామ నామాలలో అక్నాపూర్-అక్నాపురం, అగ్గనూరు-అగ్గడూరు, అమడా పూర్-అందానిపూర్, అల్లా పూర్-బషీరాబాద్, ఆరుట్ల-ఆరుపుట్ల, ఇందోల్-లింగమయ్యకుంట, ఎన్కతల-ఏనుగుతల, ఎన్కెపల్లి-కుండల ఎన్కెపల్లి, కంకణాలపల్లి-కంకడాలపల్లి, కంకల్-కనకపురేగల్లు, కప్ప పహాడ్-కొప్పుపహాడ్, కవాడిపల్లి-కవాతుపల్లి, కుల్కచర్ల-కులుకుచర్ల, కేసారం-ఘట్టుక్యాసారం, కౌకుంట్ల-గౌకుంట, కొంపల్లి-కొమ్మపల్లి, కొంషెట్టి పల్లి-కొంషెడ్ పల్లి/కొమ్ము శ్రేష్ఠి పల్లి, గండిపేట-ఉస్మాన్ సాగర్, గున్ గల్-గునగలు, గురువుదోట్ల-గురుదొట్ల/గుడదొట్ల, చందానగర్-చాందా నగరం, చించల్ పేట్-చింతచెట్లపేట, చింతపట్ల-చింతలపట్ల, చిత్తాపూర్-చింతాపురం, చిలుకూరు-చిలుకవూరు, చేవెళ్ల-చేవవేళ్ళ, చౌదర్ పల్లి-చౌదరి పల్లి, జనువాడ-జొన్నాడ, జెన్నారం-జైనవరం/జైనారం, తిప్పాయిగూడెం-తిప్పనిగూడెం, దుందిగల్లు-దొంతులపల్లి, దూలపల్లి-దూడలపల్లి, దోబిపేట్-మునికాలు/మహా మంగాపురం, నంచర్ల-నందిచర్ల, నల్లవెల్లి-నల్లపల్లి, నవాబుపేట ప్రభునగర్/యతిరాజుపల్లి, పగిడియాల-పగిడిఏల, బడంపల్లి-బడమ్మపల్లి, బస్తపురం-బస్తేపురం, బుద్దారం-బుద్ధవరం, బైరాంపల్లి-బయిరాములపల్లి బౌరంపేట్-బవురన్నపేట/బవురంపేట, మంబాపూర్-అంబాపురం, మఱ్ఱికల్-మఱ్ఱికాల్వ/మరికల్, ముడిమ్యాల-ముదిమియాల, మేడ్చల్-మేడిచల్, మోత్కుపల్లి-మోదుగుపల్లి, రుద్రారం-రుద్రవరం, వెన్నచేడ్-నవనీతపురం వంటి అనేక గ్రామ నామ రూపాలు కనబడుతవి.
మున్ముందు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చారిత్రక కోణంలో కృషి జరిగితే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు బయల్పడే అవకాశం ఉన్నది.
ఆధార గ్రంథాలు
- కాకతీయుల నుండి అసఫ్ జాహీల వరకు తెలంగాణ : తెలంగాణ సాహిత్య అకాడమీ.
- తెలంగాణ చరిత్ర తొవ్వల్లో : శ్రీరామోజు హరగోపాల్ : డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ హైద్రాబాద్.
- తొలుత తెలుగు రాతి రాత తొలుచువాన్డ్రు : శ్రీరామోజు హరగోపాల్ : డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ హైద్రాబాద్.
- నల్లగొండ జిల్లా గ్రామ నామాలు (Ph.D సిద్ధాంత గ్రంథం, అముద్రితం): డా. మండల స్వామి
- రంగారెడ్డి జిల్లా గ్రామ నామాలు : డా. మొరంగపల్లి శ్రీకాంత్ : ధృతి మంజీర పబ్లికేషన్స్, హైద్రాబాద్.
డా।। మండల స్వామి
ఎ: 9177607603