పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి.
పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథలు నెరవేర్చేవి. మారిన పరిస్థితులలో ఆ బాధ్యతను బాల సాహిత్యమే నెరవేర్చగలదు.
ఈ మే నెలలో బాలచెలిమి పర్యావరణ కథల పోటీలు – 2023 నిర్వహించింది. తక్కువ సమయంలోనే, వేసవి సెలవులు అయినప్పటికీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. 51 కథలు వచ్చాయి. కథలన్నీ చాలా బావున్నాయి. బాల సాహిత్య నిపుణులు ఈ కథలను చదివి, చర్చించి ప్రచురణకు 24 కథలు ఎంపిక చేశారు. ఈ కథల పోటీలు నిర్వహించి మరియు పుస్తక రూపాన్నిచ్చింది బాలచెలిమి. – వేదకుమార్ మణికొండ
అనగనగా కిష్టాపురం అనే ఊరిలో ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. వారికి బయటి లోకం తెలియదు. అప్పుడే వారి ఊరిలో ప్లాస్టిక్ ఉపయోగం మొదలయింది. మొదట్లో వారు ప్లాస్టిక్‍ను అంతగా ఉపయోగించేవారు కాదు. ఆ ప్లాస్టిక్ చెత్తను ఎలా డిస్పోజ్ చెయ్యాలో తెలియక అశ్రద్ధతో వారు కూరగాయల చెత్తను పారవేసినట్టు ప్లాస్టిక్‍ను కూడా ఒక పెద్ద స్థలంలో పారవేయడం మొదలుపెట్టారు. అదే ఊరిలో రాజమ్మ రామయ్య అనే దంపతులు ఉన్నారు. వారికి కృష్ణ అనే కొడుకు ఉన్నాడు. అతడికి 15 ఏళ్లు. తన ఊరిలో కాలేజీ లేందున అతన్ని రాజమ్మ, రామయ్య పట్టణానికి పంపించారు.
పదేళ్ల తర్వాత కృష్ణ డాక్టర్ అయ్యి కిష్టాపురానికి తిరిగి వచ్చాడు. తన ఊరు అప్పటి లాగా లేదు. మొత్తం మారిపోయింది. చెత్త ఎక్కువయ్యింది. ఇది మంచిది కాదని కృష్ణ అందరినీ హెచ్చరించాడు. కానీ ఎవ్వరూ తన మాట వినలేదు. ఆ తర్వాత అందరికీ రకరకాల జబ్బులు రావడం మొదలయ్యాయి. ఆ ఊరిలో ఏ ఆసుపత్రి లేదు. కృష్ణ సొంతంగా ఒక ఆసుపత్రిని మొదలు పెట్టాడు. ప్రజలంతా ఆసుపత్రికి రావడం మొదలు పెట్టారు. వారికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. కృష్ణ ఈ వ్యాధులకు కారణం ఆ ప్లాస్టిక్ చెత్త అని ప్రజలకు చెప్పాడు. ఊరి ప్రజలు చెత్త ఈ వ్యాధులకు ఎలా కారణమవుతుంది అని అడిగారు. అప్పుడు కృష్ణ ప్లాస్టిక్ మన కూరగాయల లాగా భూమిలో కలిసిపోదు, అందుకే దాని మీద ఈగలు దోమలు గుడ్లు పెట్టి నివసిస్తాయి. దీని వలన వాటి సంఖ్య పెరిగిపోయి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి అని చెప్పాడు. అప్పుడు ప్రజలు తాము చాలా పెద్ద తప్పు చేసామని బాధపడ్డారు. అప్పుడే ఒకతను ఆ చెత్తను కాల్చేద్దామని చెప్పాడు. ఇంకొకతను ఆ చెత్తను నదిలో వదిలేద్దామన్నాడు.
అప్పుడు కృష్ణ చెత్తను కాల్చివేస్తే గాలి కలుషిత మవుతుంది. అప్పుడు టీబీ లాంటి వ్యాధులు వస్తాయి. చెత్తను నదుల్లో లేదా చెరువుల్లో పారవేస్తే నీరు కూడా కలుషితమవుతుంది. అప్పుడు ఆ నీరు దేనికి పనికిరాకుండా పోతుంది అని ఈ సమస్యకు తాను పరిష్కారాన్ని చూపిస్తానని చెప్పాడు.
ప్రజలంతా తమ తమ ఇళ్లకు వెళ్లారు. ఆరోజే కృష్ణ ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యేకు తన ఊరి సమస్యను తెలుపుతూ ఉత్తరం రాసాడు. అది ఎమ్మెల్యేకు చేరుకుంది. ఆ ఫలితంగా ఎమ్మెల్యే చెత్తను తీయించాడు. ఇదంతా కృష్ణయే చేసాడని అందరూ తనని మెచ్చుకున్నారు. ఫలితంగా అందరూ అనారోగ్యం నుండి బయటపడ్డారు.
- వలిపే రామ్ చేతన్,
ఫోన్ : 950215681