రోజు రోజుకూ ఆ గుళ్లు కూరుకుపోతున్నాయి చూపరుల గుండెలు తరుక్కుపోతున్నాయి

నీళ్లలో కాదు, మట్టిలో మునిగిపోతున్నాయి. ఒకప్పుడు అంగరంగ వైభవంగా వెలిగిపోయిన ఆగుళ్లు మట్టిలో కూరుకుపోతున్నాయి. చూపరుల గుండెలు తరుకుపోతున్నాయి. ఎక్కడో కాదు. ఇక్కడే హైదరాబాదు నగర పరిసరాల్లోనే.
ఒకప్పుడు పట్టణ చెరువు. అది ఇప్పుడు పటాన్‍చెరు. కన్నడంలో పొట్టలకెఱె, పొట్టళ కెఱెయె అని పేర్కొన్న పటాన్‍చెరు. క్రీ.శ. 11వ శతాబ్దిలో కళ్యాణ చాళుక్యుల శాఖా నగరంగా వర్ధిల్లిన చోటు. రాజులు, రాణులు, చక్రవర్తులు, ప్రధానులు, సామంతుల రాకతో కళకళ లాడిన నగరం. సువిశాల సౌధాలతో, గుళ్ళూ, గోపురాలతో, చక్కటి పురవీధులతో, నిత్యకళ్యాణం పచ్చ తోరణంలా భాసిల్లిన స్థావరం.


మతసామరస్యానికి మరో నిర్వచనంలా, శైవ, శాక్త, వైష్ణవ, జైన దేవాలయాల ముఖ్యకలయికగా మధ్యయుగ మహానగరాలకు నాయికగా హోయలోలికిన సుందరతర దృశ్యాలకు ఆకరం. దాదాపు 20కి పైగా దేవళాలు, వందల శిల్పాలు, ఎత్తైన గోపురాలతో సురపురాన్నే మరపించిన మహోన్నత శాఖానగరం. అది ఒకప్పటి వైభవం. ఇప్పుడు ఆలయాలు శిథిలాలైనాయి. మంటపాలు మరుగుపడినాయి. శిల్పాలకు కాళ్లొచ్చి హైదరాబాదు మ్యూజియాలకు నడచిపోయాయి. రాష్ట్ర కూట శాసనాల్లో పొట్టలకిరె, కళ్యాణ చాళుక్య మూడో సోమేశ్వడని క్రీ.శ.1127 నాటి శాసనంలో పొట్టలగెరె అని పేర్కొనబడిన పటాన్‍చెరువులో ఏవీధిలో చూచినా శిథిల కట్టడాలే. విరిగిన శిల్పశకలాలే. ఓపిగ్గా తిరగాలేగానీ, పటాన్‍చెరువు నిండా, యోగనరసింహ, భైరవ, మహిషమర్ధిని, గణేశ, సూర్య, కిన్నెర, కింపురుష, గంధర్వ, విద్యాధర శిల్పాలే. ఒకప్పుడు జైన చింతామణిపురంలో తీర్థంకరుల శిల్పాలతో వెలుగొంది అటుమోక్షాన్ని, ఇటుకైవల్యాన్ని అందించిన అపురూపనగరం పటాన్‍చెరు. ఇటీవలి వరకూ బుద్ధునిగా పూజలందుకొన్న క్రీ.శ.12వ శతాబ్దినాటి వర్ధమాన మహావీరుని శిల్పం, శివునిగా విభూతిరేఖలు ధరించి, పూజలందు కొంది. కొన్నాళ్ల క్రితం ఊరుదాటి పోయింది!


క్రీడాభిరామంలో మట్టెవాడలో తిరుగుతూ వరంగల్‍ మహానగర వైభవ, ప్రాభవాలను వివరించిన టిట్టిభశెట్టి, మంచన శర్మలు, పటాన్‍చెరులో తిరిగుంటే మరిన్ని వివరాలు తెలిసుండే వనిపిస్తుంది. మరుగున పడిన మరో తెలంగాణా మహానగరం చరిత్రలో నిలిచిపోయి ఉండేదనిపిస్తుంది. ఆలయాలు, ఆకృతులు కోల్పోయాయి. మండపాలు మట్టిలో కూరుకు పోయాయి. పెరిగిపోయిన పిచ్చి మొక్కలు కప్పులపై కరాళనృత్యం చేస్తున్నాయి. వరసతప్పుతున్న వారసత్వాన్ని ఒడిసి పట్టుకొనే వారికోసం ఎదురు చూస్తున్నాయి. పదిలపరిచే పరమపురుషుల కోసం పరితపిస్తున్నాయి.


-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి,
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *