చిన్నారి స్నేహం

అనగనగా ఒక అడవిలో రెండు పిల్ల ఏనుగులు ఉండేవి. అవి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అన్ని పనులూ కలిసి చేసేవి. ఎక్కడికైనా రెండు కలిసే వెళ్లేవి, కొంత మంది ఏనుగుల్ని ఎత్తుకుపోవటానికి అడవికి వచ్చారు. వారిని గమనించిన పెద్ద ఏనుగులు పారిపొమ్మని మిగిలిన వాటిని హెచ్చరించాయి. అవన్నీ తలా ఒక దిక్కుకు పరిగెత్తాయి. స్నేహితులైన పిల్ల ఏనుగులు రెండూ కలిసి ఒక దిక్కుకు పరిగెత్తాయి. చాలా దూరం వెళ్లిన తర్వాత వాటికి దారి తప్పాయని అర్థమైంది. తిరిగి తిరిగి బాగా అలసిపోయాయి. వాటికి విపరీతమైన దాహం వేసింది. నీళ్లకోసం వెతక సాగాయి.
కనుచూపు మేరిలో ఎక్కడ నీళ్లు కనిపించలేదు. నీళ్ల కోసం వెతుకుతూ చాలా దూరం వెళ్లాయి. ఒక చోట గుంట కనిపించింది. కానీ దానిలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. రెండు ఏనుగులకు సరిపడినన్ని నీళ్లు లేవు. అవి చాలా దాహంతో ఉన్నాయి. ఎక్కువ నీళ్లు తాగితే తప్ప వాటి దాహం తీరేటట్లు లేదు. ఆ గుంటలో ఉన్న నీళ్లన్నిటిని తాగినా ఒక ఏనుగుకి కూడా పూర్తిగా దాహం తీరదు.


అప్పుడు మొదటి ఏనుగు ‘‘ఈ నీటిని నువ్వు తాగు నాకు దాహం ఎక్కువగా లేదు’’ అని రెండో దానితో చెప్పింది. రెండు ఏనుగు ‘‘కాదు కాదు నువ్వే తాగు నీకే ఎక్కువగా దాహం ఉందని ఇందాక చెప్పావు కదా!’’ అని మొదటి దానితో చెప్పింది. చాలా సేపు రెండూ వాదించుకున్నాయి. చివరకు అవి రెండు ఒకేసారి నీళ్లు తాగాలని నిర్ణయించుకుని తొండాలు నీటిలో పెట్టాయి. ఎంత సేపటికీ గుంటలో నీళ్లు తగ్గటం లేదు.


ఈలోగా పెద్ద ఏనుగులు చిన్న వాటిని వెతుకుతూ అక్కడకు చేరుకున్నాయి. తొండాలు నీటిలో ఉంచిన పిల్ల ఏనుగుల్ని చూశాయి. కాసేపటి తరువాత పెద్ద ఏనుగులకు పిల్ల ఏనుగులు నీటిలో తొండాలు పెట్టాయి కానీ నీళ్లు తాగడం లేదు అని అర్థం అయింది. ‘‘మీరు నీళ్లు ఎందుకు తాగటం లేదు’’ అని పిల్ల ఏనుగులను అడిగాయి.


‘‘నేను నీళ్లు తాగితే నా స్నేహితుడికి నీళ్లు సరిపోవని నేను తాగలేదు’’ అని ఆ రెండూ ఒకేసారి చెప్పాయి.
‘‘మీరు ఒకరి కోసం మరొకరు త్యాగం చేసుకున్నారు. స్నేహితులంటే మీలాగే ఉండాలి’’ అని పెద్ద ఏనుగులు వాటిని మెచ్చుకున్నాయి. గుంటలోని నీళ్లను చెరి సగం తాగమని వాటికి సలహా ఇచ్చాయి. నీళ్లు తాగాక అన్నీ కలిసి అడవిలోని తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళాయి.


నేను నేర్చుకున్న అంశాలు : పరస్పరం అర్థం చేసుకున్నప్పుడే స్నేహం. పది కాలాల పాటు సజీవంగా ఉంటుంది.
ముగింపు : సృష్టిలో తీయనిది స్నేహం. తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి, తోబుట్టువుతో పంచుకోలేనివి కూడా స్నేహితులతో చెప్పుకుంటారు. ‘మన తప్పులను ఎత్తి చూపడం, మంచిని ప్రశంసించడం అవసరమైనప్పుడు సహాయం చేయడం, ఆపదల్లో విడువకుండా ఉండడం, రహస్యాలను దాచుకోవడం’ అనేవి మిత్రుని లక్షణాలు.

  • హర్షశ్రీ, ఫోన్‍ : 798173430

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *