నవంబర్ 14, బాలల దినోత్సవం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుకునూరుపల్లిలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో ‘బాలచెలిమి’ గ్రంథాలయాన్ని సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పి. శ్రీనివాసరెడ్డి, పాఠశాల ప్రధానో పాధ్యాయులు బి. సత్తయ్య, సొసైటీ ప్రతినిధులు ఖైజర్, గరిపల్లి అశోక్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సిద్ధిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి నుండే పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలని తద్వార పఠనాసక్తి కలుగుతుందని జ్ఞానాన్ని పెంపొందించు కోవచ్చునని, ప్రాపంచిక విషయాలపట్ల సరియైన అవగాహన ఏర్పడుతూ సానుకూలనడవడిక అలవడుతుందని, శాస్త్రీయవైఖరి ఏర్పడుతుందని తెలిపారు. అంతేకాకుండా మానవ సంబంధాలు బలపడతాయని విద్యార్థులలో మంచి క్రమశిక్షణ అలవాటవుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పుస్తకాలు దోహదం చేస్తాయని సూచించారు. పుస్తకాలు చదవటం కోసం విద్యార్థులకు వారంలో కొన్ని పీరియడ్లు కేటాయిస్తూ, సమయ సారిణి రూపొందించుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో దిగువ మధ్యతరగతి, పేద వర్గాల పిల్లలే విద్యనభ్య సిస్తుంటారని, అలాంటి పిల్లలకు నాణ్యమైన పుస్తకాలతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పం ‘‘బాలచెలిమి’’ సొసైటి జిల్లాల వారీగా కార్యక్రమాల్ని ఏర్పాటు చేయటం అభినందనీయమని తెలిపారు. మారుమూల గ్రామాల్లో ఇలాంటి గ్రంథాలయాలవల్ల పిల్లల్లో విద్యాసుగంధాలు వెల్లివిరుస్తాయని, మరిన్ని ప్రభుత్వ పాఠశాల ఇలాంటి గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని అందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ సొసైటీ వ్యవస్థాపకులు వేదకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సామాజిక మధ్యమాల మోజులో పడి యువత, విద్యార్థులు, చదువును నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. పుస్తకం, ఒక మంచి స్నేహితుని లాంటిదని, శాస్త్రసాంకేతిక విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా, పుస్తకం అందించే విజ్ఞానమే గొప్పదని పుస్తకాన్ని చదివినప్పుడు కలిగే సంతృప్తిని ఏవీ అందించలేవని తెలిపారు. విద్యార్థులు పుస్తకాలు చదవటం దినచర్యలో భాగంగా మార్చుకోవాలని తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.సత్తయ్య మాట్లాడుతూ మా పాఠశాలలో ఇంతమంచి గ్రంథాలయాన్ని ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు పుస్తకాలు చదివే స్థాయి నుండి పుస్తకాలు రాసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు గ్రంథాలయంలో మంచి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలుగులోనే కాకుండా, ఇంగ్లీష్, హిందీ భాషలలో ప్రసిద్ధిచెందిన ప్రపంచ స్థాయి రచయితల సాహిత్యంతో కూడిన విలువైన పుస్తకాలు ‘బాలచెలిమి’ గ్రంథాలయం సమకూర్చిందని తెలిపారు. వీటి ద్వారా ఆయాదేశాల సంస్క•తీ, సాంప్రదాయాలు, జీవన విధానాలను అధ్యయనం చేయవచ్చని తెలిపారు. గ్రంథాలయాన్ని మన పాఠశాలలో ఏర్పాటు చేసేందుకు సహకరించిన వేదకుమార్‍గారికి బాలచెలిమి ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
బాల సాహితీ వేత్త ‘‘బాలచెలిమి’’ ప్రతినిధి గరిపల్లి అశోక్ మాట్లాడుతూ చదవడం రాయడం, అభ్యసనంలో ఒక భాగమని, విద్యార్థులలో పఠనాసక్తిని కలిగిస్తూ, వారిలోని సృజనాత్మకతను వెలికి తీస్తూ, సామర్థ్యాల పెంపుదలకు గ్రంథాలయాలే కీలకమని తెలిపారు. అందులో భాగంగానే, అనేక పాఠశాలల్లో విద్యార్థులకు కథాకార్యశాలలు నిర్వహిస్తూ, వారిలో చదవడం, రాయటం పట్ల ఆసక్తిని కలిగిస్తూ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే బాలచెలిమి గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పిల్లలకు నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన, పాటల పోటీల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు బాలచెలిమి తరపున పుస్తకాలను బహుమతులుగా అందజేశారు. ‘బాలచెలిమి చిల్డ్రన్ సొసైటీ’ ప్రతినిధులు ఖైజర్, గరిపల్లి అశోక్‍లను విద్యాశాఖ పక్షాన జిల్లా విద్యాధికారి ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, చిల్డ్రన్స్సొసైటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
× × ×
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడుతాయి. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకునేందుకు పుస్తకాలు దోహదం చేస్తాయి. మా పాఠశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినందుకు బాలచెలిమి వ్యవస్థాపకులు వేదకుమార్ గారికి ధన్యవాదాలు – పొల్కంపల్లి జయంతీ నరేందర్, సర్పంచ్, కుకునూరుపల్లి
మా పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేసినందుకు బాలచెలిమికి ధన్యవాదాలు. విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడుతుంది. – మల్లం అయలయ్యా, ఎస్‍ఎంసీ చైర్మన్
గత పదేళ్ళ నుండి పాఠశాల అభివృద్ధి కోసం అనేక కార్య క్రమాలు చేపడుతున్నాం. దాతల సహకారంతో మౌళిక వసతులు సమకూర్చుకుంటున్నాం. పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేయటం వల్ల విద్యార్థులలో మంచి అలవాట్లు క్రమశిక్షణ అలవాటు అవుతాయి. బాలచెలిమి చిల్డ్రన్స్ సొసైటీకి ప్రత్యేక ధన్యవాదాలు. -పొల్కంపల్లి నరేందర్, పిఎన్‍ఆర్ ట్రస్ట్చైర్మన్, సామాజిక కార్యకర్త
గ్రంథాలయమే కదా విద్యార్థులకు ఆలయము. ప్రతి గ్రంథం కూడా విజ్ఞాన భాండాగారం. చదవడం నిత్యక•త్యమైతే ప్రతి విద్యార్థి ఒక మేధావి అవుతాడు. కుకునూరు పల్లిలో ‘‘బాల చెలిమి’’ గ్రంథాలయం విద్యార్థుల పాలిట ‘‘విజ్ఞాన కల్పవ•క్షం’’. ప్రతి రోజు ఒక గ్రంథాన్ని చదవడం. ఎన్నో గ్రంధాలు చూడవచ్చు, చదవచ్చు. ప్రతి విద్యార్థి సెలవు రోజులలో ఒక పుస్తకాన్ని బాల చెలిమి గ్రంథాలయం నుండి తీసుకొని పోయి చదివి ఇవ్వడం వలన వారికి విజ్ఞానం వస్తుంది. రేపటి భవితకు చక్కటి మార్గాన్ని వేస్తాయి. బాల చెలిమిని సమకూర్చిన వేదకుమార్ గారికి ధన్యవాదాలు. -పెందోట వెంకటేశ్వర్లు, తెలుగు భాషా ఉపాధ్యాయులు, గ్రంథాలయ అధికారి, జి. ప. ఉ .పా. కుకునూర్ పల్లి.
విద్యార్థి దశ నుంచే పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయటం వల్ల చదవటం, రాయడమే కాకుండా, ఉత్తమ వ్యక్తిత్వం, ఉన్నత విలువలు, క్రమశిక్షణ, అలవడుతాయి. ప్రపంచ విషయాల పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఏర్పాటు చేసుకుంటారు. శాస్త్రీయ వైఖరులు, సామాజిక దృక్పథం పెంపొందుతాయి. ‘‘బాలచెలిమి’’ గ్రంథాలయాల స్థాపన ద్వారా మంచి మార్పుకు శ్రీకారం చుట్టిన వ్యవస్థాపకులు వేదకుమార్ గారికి ప్రత్యేక అభినందనలు. – కొండి మల్లారెడ్డి, ఉపాధ్యాయులు, కవి, రచయిత
మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుని లాంటిది. పాఠశాలలో గ్రంథాలయం ఎంతో అవసరం విద్యార్థులకు, కథలు, కవితలు, పాటలు, పద్యాల పుస్తకాలు చదవటం అలవాటు చేయిస్తే పదజాలం పెరుగుతుంది. సులభంగా చదవటం అలవాటవుతుంది. – యెల్లు అనురాధ, తెలుగు ఉపాధ్యాయురాలు
పుస్తక పఠనం వల్ల చదువుటం, రాయడంతోపాటు, మంచి నడక ఒక అలవడుతుంది. బాలచెలిమి గ్రంథాలయం ఏర్పాటు చేయటం, మంచి పరిణామం. గ్రంథాలయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా మార్గ నిర్దేశనం చేస్తాం. – చింత సంధ్యారాణి, తెలుగు ఉపాధ్యాయురాలు
పాఠ్యపుస్తకాలే కాకుండా, జనరల్ నాలెడ్జి, కథలు, కవిత్వం, వ్యాసాలు, పాటలు అనేక రకాల పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయి. ఇవి మాకు ఎంతో ఉపయోగపడుతాయి. – నితిన్, విద్యార్థి, 10వ తరగతి
నాకు కథలంటే చాలా ఇష్టం, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, భాషలలో చాలా కథల పుస్తకాలున్నాయి. సమయం దొరికినప్పుడల్లా మంచి మంచి కథల పుస్తకాలు చదువుకుంటున్నాము. ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. – స్పందన, విద్యార్థి, తొమ్మిదో తరగతి
నేను కవిత్వం రాస్తాను. గతంలో మా పాఠశాల నుండి విద్యార్థులు రాసిన కవితల పుస్తకం అచ్చయింది. మంచి మంచి కవిత్వం చదివే అవకాశం మా గ్రంథాలయం ద్వారా నెరవేరుతుంది. – వైష్ణవి, విద్యార్థి, తొమ్మిదో తరగతి.
సయ్యద్ ఖైజర్ భాష
ఎ : 9030 6262 88