ఉమ్మడి నల్లగొండ జిల్లా లోకోక్తులు, చారిత్రక రూపాలు

అవసరానికి అప్పిచ్చువాడు, రోగాలు నివారించే వైద్యుడు, నిరంతరం ప్రవహించే నది, పురోహితుడు ఉన్న గ్రామంలో కాపురం ఉండాలి. ఇవిలేని ఊరిలో ప్రవేశించవద్దని సుమతి శతక కర్త బద్దెభూపాలుడు స్పష్టం చేశాడు. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో గ్రామమంటే కనీసం వంద కుటుంబాలైనా ఉండాలని, రైతులు అధికంగా ఉండాలని, గ్రామపంచాయతీ పరిమితి రెండు క్రోసులైనా ఉండాలని, పొరుగు ఊర్లకి ఉత్పత్తులను సరఫరా చేయగల స్థితిలో గ్రామం ఉండాలని తెలిపాడు. ఇంకా ప్రాచీన భారతీయులు కొంత శ్రద్ద కనబరచినట్లు పాణిని అష్టాధ్యాయి, అధర్వణ కారికావళి, పాల్కురికి సోమనాథుడి పండితారాధ్య చరిత్ర వంటి గ్రంథాలలో గ్రామ నామాలకు సంబంధించిన సూచనలు కనిపిస్తాయి. ఈ అంశాలను పరిగణన లోకి తీసుకుంటే గ్రామానికి, గ్రామ నామానికి ఎంత ప్రాచీనత ఉన్నదో స్పష్టమవుతున్నది.


ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గ్రామ నామాలలో లోకోక్తులు, చారిత్రక (శాసన) రూపాలను పరిశీలించి చూస్తే అనేక ఆసక్తికర విషయాలు వెల్లడవు తాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇక్ష్వాకుల వైభవాన్ని చాటిన ప్రాంతం. నలమహారాజు అను తెలుగు రాజు తన పేరున కట్టించిన ఇక్కడి పర్వతానికి నలుని పర్వతం లేదా నలుని కొండ అని ఒక కైఫీయతు జనం చెప్పే కథనంగా ప్రచారంలో ఉన్నది. మరొక విధంగా నలుగొండ అనే పేరు వచ్చిందని చెప్పేవారు కూడా ఉన్నారు. క్రీ.శ.1179లో కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు కాలంలో నల్లగండిగా పిలవబడిన ప్రాంతం రాను రాను నల్లగొండగా మారిందనే కథనమున్నది. నల్లగొండ పట్టణానికి అతి ప్రాచీనమైన పేరు నీలగిరి. ఈ పట్టణం లతీఫ్‍ సాహెబ్‍ గుట్ట కాపురాల గుట్ట అను రెండు నల్లని రాళ్ళ గుట్టల మధ్య ఉన్నది ఈ రెండు కొండలను దివి కొండలు అని పిలుస్తారు. అల్లాఉద్దీన్‍ బహుమనీషా అనంతరం నీలగిరి అయి ఉండ వచ్చునని మరో కథనమున్నది. నాటి నల్లగొండ తాలూకా పరిధిలోని రాచపేట శాసనంలో యేరువ సింహాసనమైన నల్లగొండ అని పేర్కొనబడినది. కళ్యాణి చాళుక్యులకు సామంతులైన యేరువ భీమరాజు, యేరువ తొండయరాజు అను పేర్లను బట్టి ఈ వంశీయులు యేరువ ప్రసిద్ధులని తెలియుచున్నది. కావున నల్లగొండను యేరువ సింహాసనం అను పేరుతో వ్యవహరించారని స్పష్టమవుతున్నది. క్రీడాభిరామంలో ‘‘నల్లగొండయు నాగరి/కల్లును ధరణీ స్థలిం బ్రగల్భ స్థలముల్‍/పల్లేరు, నాగులేరును/బల్లెక్ష్మా కాంత యెల్ల ప్రారంభముల్‍’’.. ఈ పద్యం ద్వారా నల్లగొండ నామంతో పాటు నకిరేకల్‍, పల్లెర్ల వంటి ప్రాంతాల ప్రస్తావనలు ఉండడం విశేషం.


2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 1158 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామ నామాలకు పూర్తి సమాచారం దొరకనప్పుటికీ, లోకోక్తులు మరియు చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన గ్రామ నామాలు చాలానే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2016లో కొత్త జిల్లాలుగా ఏర్పడినపుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యా పేట అను మూడు జిల్లాలుగా విభజించ బడినది. మూడు జిల్లాల వారీగా గ్రామ నామాల సంక్షిప్త సమాచారాన్ని ఇవ్వడం ఈ వ్యాసం ముఖ్యఉద్దేశం.


లోకోక్తులు:
లోకోక్తులలో లోకనిరుక్తి ప్రధానమైనది. గ్రామ నామ పరిశీలనలో అర్ధ ద•ష్ట్యా ఆసక్తికరమైన విషయమందిస్తుంది. ఇవి రెండు రకాలు ఒకటవది జానపద లేదా జనసామాన్య లోక నిరుక్తి. రెండవది పండిత లోకనిరుక్తి.
ఉరుమడ్ల:
ఈ గ్రామంలో పూర్వం వరి ధాన్యం బాగా పండించేవారట. కల్లాల నిండా వడ్ల రాసులు పోసి ఎక్కువ రోజులు నిల్వ ఉంచేవారట. తద్వారా వడ్ల ఊరు’గా గ్రామాన్ని వ్యవహరించే వారట. పరిణామ క్రమంలో వడ్లఊరు నుండి ఉరుమడ్లగా మారిందని గ్రామస్తుల కథనం.
కాకుల కొండారం:
ఈ గ్రామాన్ని గతంలో కాపుల కొండవరంగా పిలిచేవారు గ్రామానికి దగ్గరలో కొండపై వెలిసిన హనుమంతుడు (గుడి) ఊరికి రక్షణగా ఉన్నాడని భావించిన గ్రామస్తులు కాపలా కొండగా, కాపలా కొండవరం’గా, కాపుల కొండవరం’గా పిలుచుకునేవారట. ప్రస్తుతం కాపులలో ‘పు’ వర్ణం లోపించి, ‘కు’ వర్ణాదేశంతో కాకుల కొండారం’గా వ్యవహరిస్తున్నారని స్థానిక కథనం.
చండూరు: జిల్లాలోని మండల కేంద్రమిది. ఈ గ్రామంలో చిన్న చిన్న సందులు ఎక్కువగా ఉన్నందున గతంలో సందులూరుగా పిలిచేవారట. కాలక్రమంలో చండూరు’గా మారిందని స్థానిక కథనం. గ్రామదేవత చండిక ఈ గ్రామ పరిరక్షణగా ఉన్నందున చండికఊరు’గా, చండిఊరు’గా తదనంతరం చండూరుగా మారి ఉండవచ్చని మరో కథనమున్నది.
నార్కట్‍ పల్లి: ప్రాచీన కాలంలో ఇక్కడ పాడిపంటలతో, పశు సంపదలతో వ్యవసాయం ప్రధానంగా విలసిల్లేదట. ముఖ్యంగా నారికేళ(కొబ్బరి) తోటలు విరివిగా ఉండేవట. తద్వారా అనేకులు నారికేళపల్లి’గా పలికే వారట. అనంతర కాలంలో నార్కట్‍ పల్లి’గా మారిందని స్థానిక కథనం.
చౌటుప్పల్‍: ఈ ప్రాంతాన్ని భౌగోళికంగా చూసినప్పుడు ఇక్కడ ఫ్లోరిన్‍ ప్రభావంతో చౌడు నేల ఉప్పునీరు కలిసి చౌడు ఉప్పుల’గా, చౌటుప్పల్‍ గా మారి ఉండవచ్చునని స్థానిక కథనమున్నది. మేడ్చల్‍ జిల్లా బోడుప్పల్‍ అనేది బడా ఉప్పల్‍కి మూలమనీ,ఈ చౌటుప్పల్‍ అనేది చోటా ఉప్పల్‍కి రూపాంతరమని మరో కథనమున్నది.


యాదగిరి గుట్ట: తెలంగాణ రాష్ట్ర తిరుపతిగా భాసిల్లుతున్న సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమిది. యాదవ ఋషి అనే భక్తుడికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమైనడని, తద్వారా యాదవ రుషి పేరు మీదుగా యాదగిరిగుట్టగా ఈ క్షేత్రాన్ని వ్యవహరిస్తున్నట్లు స్థానిక కథనమున్నది.
రామన్నపేట: పూర్వం ఇక్కడ రామన్న అనే భూస్వామి చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న తన భూములను చూసుకోవడానికి గుర్రంపై పర్యటించేవాడట. అయినా తను కరణీకం చేస్తూ ఈ ప్రాంతానికి విశిష్ట సేవలందించినందుకు గాను ఇక్కడ చెరువును రామన్న చెరువుగా, ఈ మండల కేంద్రాన్ని రామన్నపేట’గా వ్యవహరిస్తున్నారని స్థానిక కథనమున్నది.
సంస్థాన్‍ నారాయణపురం: నవాబుల కాలంలో మద్ది నారాయణరెడ్డి అనే దొర సామాజిక సేవా తత్పరతతో పరిపాలించడం వలన అతని పేరు మీదుగా ఈ మండల కేంద్రాన్ని పిలుస్తున్నారు. ఏనుగు అంబారీ, పగటి దివిటీలు, మరణ దండన విధించే అధికారాలతో సంస్థాన్‍ హోదా పొందినందువల్ల సంస్థాన్‍ నారాయణపురం’గా వ్యవహరిస్తున్నారని స్థానిక కథనమున్నది.
కోదాడు: ఈ పట్టణానికి పూర్వం కోడెతాడుగా వాడుకలో ఉండేదట తర్వాత కోతాడుగా ప్రస్తుతం కోదాడుగా వ్యవహరిస్తున్నారని స్థానిక కథనమున్నది.
తిరుమలగిరి: ఈ మండల కేంద్ర సమీపంలో ఆంజనేయగుట్ట, మల్లన్నగుట్ట, తోకగుట్ట మూడు గుట్టలు ఉండడం వలన త్రిమలగిరి, తిరుమలగిరి అని పేరు వచ్చిందని, ఈ మూడు గుట్టలు తిరుగలి (ఇసుర్రాయి) రూపంలో ఉండడం వలన తిరుగురుగిరి’గా క్రమంగా తిరుమలగిరి’గా మారి ఉండవచ్చునని స్థానిక కథన మున్నది.
ఫణిగిరి: రెండు మూడు శతాబ్దాల కాలంలోనే ఇక్కడ బౌద్ధమతం పరిఢవిల్లినట్టు అనేక ఆనవాళ్ళున్నవి. బుద్ధుడి ధర్మచక్ర ప్రభావంతో దమ్మచక్రపురం’గా ఈ గ్రామ నామం ఏర్పడి ఉండవచ్చునని, కాల క్రమేణా ధర్మ చక్ర పురంగా మారిందనే స్థానిక కథనం. ఇక్కడున్న గిరి(కొండ) పాము పడగ రూపంలో ఉన్నందువల్ల జనం గిరి ప్రధానంగా వాడటంతో ఫణిగిరి’గా మారిందని మరో కథనమున్నది.
చారిత్రక (శాసన) రూపాలు
ఆలేరు: యాదాద్రి జిల్లా పరిధిలోని మండల కేంద్రం ఇది. క్రీ.శ.1034నాటి పశ్చిమ చాళుక్య రాజు ఒకటవ జగదేకమల్లుడు వేయించిన సైదాపూర్‍ శాసనం, ఇక్కడి మరి కొన్ని శాసనాలలో ఆలేరు అని పేర్కొనబడినది. నాటి శాసన రూపమే నేటికీ వ్యవహారంలో ఉండడం విశేషం.


కొలనుపాక: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిధిలోని చారిత్రక గ్రామమిది. క్రీ.శ. 1064, 1097, 1109, 1110, 1112 కాలం నాటి పశ్చిమ చాళుక్య రాజుల కొలనుపాక శాసనాలు, ఇతర శాసనాలలో ఈ గ్రామ నామానికి కొల్లిపాక, కొట్టియపాక, కొళ్లియపాక, కొల్లిహాకె అను పేర్లు కనబడుతవి. ఇవే కాక బింబావతిపురం, కుదుట నగరం, సరోవరకుటీరం, సోమ శేఖరపురం, కులుదపురం, కుల్‍ పాక్‍ అనే పేర్లతో వ్యవహరించినట్లు స్థానిక సాంప్రదాయాలు తెలియ జేస్తున్నాయి.
జాజిరెడ్డి గూడెం: సూర్యాపేట జిల్లాలోని మండల కేంద్రమిది. ఈ మండల నామాన్ని అర్వపల్లి అని కూడా పిలుస్తున్నారు. ఈ అర్వపల్లికి సంబంధించిన సమాచారం వినుకొండ వల్లభ రాయుడు రచించిన క్రీడాభిరామంలో ఉన్నది. ‘‘ఈ గ్రంథం 121వ పద్యంలో నల్లగొండ, నకిరేకల్లు, పల్లెర్ల,118వ పద్యంలో గురిజాల ప్రాంత నామాల ప్రస్తావనలు ఉన్నవి.119,122 పద్యాలలో ఆరువల్లి నాయురాలి/యార్వెల్లి నాయురాలు, అనే ప్రస్తావన ఉన్నది.’’ నాటి ఆరువల్లి/యార్వెల్లి’యే పరిణామ క్రమంలో అర్వపల్లి’గా, అనంతరం జాజిరెడ్డి గూడెం’గా మార్పు చెంది ఉండవచ్చు. ‘‘క్రీ.శ. 1870 -1933 కాలం నాటి కవి గాదె రామచంద్రా రావు గారు అరవపల్లి నరసింహ స్వామిని గూర్చి చెప్పిన పద్యాలలో ‘నీరేజాసన… అరవపల్లీశా! న•సింహ ప్రభో! ‘‘అను గ్రామ నామ ప్రస్తావన ఉన్నది (క్రీడాభిరామం వినుకొండ వల్లభ రాయుడు, పేజీ 82,) (నల్లగొండ జిల్లా కవులు పండితులు, డాక్టర్‍ శ్రీ రంగాచార్య, పుట 241-242)


దేవరకొండ: నల్లగొండ జిల్లా లోని రెవిన్యూ డివిజన్‍ కేంద్రమిది. శ్రీ క•ష్ణదేవ రాయలు జయించిన ప్రదేశాలలో దేవరకొండ కూడా
ఉన్నది. క్రీ.శ.1608 కాలం నాటి వాడపల్లి శాసనంలో దేవరకొండ్డ’ అని పేర్కొన బడినది. నాటి శాసన రూపం నేటికీ వ్యవహారంలో
ఉండడం విశేషం.
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా నూతన జిల్లా కేంద్రమిది. క్రీ.శ.1111లో పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్లుడు వేయించిన భువనగిరి శాసనం, మరి కొన్ని శాసనాలలో భువనగిరి అని పేర్కొన బడినది. నాటి శాసన రూపమే నేటికీ వ్యవహారంలో ఉండడం విశేషం.


ఉమ్మడి నల్లగొండ జిల్లా గ్రామ నామాలను పరిశోధనకు పరిశీలించిన తర్వాత లోకోక్తులు, చారిత్రక రూపాలు కలిపి దాదాపు నాలుగు వందల వరకు గ్రామ నామాల సమాచారం లభించినది. ఈ వ్యాస పరిమితి ద•ష్ట్యా సంక్షిప్తంగా సమాచారాన్ని అందిస్తున్నాను.


-డా।। మండల స్వామి
ఎ : 9177607603

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *