ప్రకృతే సౌందర్యం! 21 ప్రకృతే ఆనందం!! సముద్ర గర్భం! మరో ప్రపంచం!

ఆ చల్లని సముద్ర గర్భం!
దాచిన బడబాగ్నిలెన్నో…!!

సౌరకుటుంబంలో భూగ్రహం రూపొందడం ఓ ప్రకృతి వింతనే! ఈ రూపాంతరం గూర్చి గత సంచికల్లో (మార్చి 2021 నుంచి జూన్‍ 2021) స్థూలంగా వివరించడం జరిగింది. ఇలా ఏర్పడిన గ్రహం మూడు ఆవాసాలుగా చూడవచ్చు! నింగి, నేల, నీరు అంటూ ప్రస్థావిస్తాం! నింగి, నేల గూర్చి తెలిసినంతగా నీటి ఆవాసాల గురించి తెలిసింది చాలా తక్కువే! నీటి ఆవాసాలు అనగానే భూమిపై గల వాగులు వంకలు, నదులు, కుంటలు, చెరువులతోపాటుగా వీటికి అతీతమైన ఆవాసం సముద్రాలు, మహాసముద్రాలు ప్రధానమైనవి. నేలపై గల నీటి ఆవాసాలన్నీ మంచినీటి ఆవాసాలు కాగా, సముద్రాలు యావత్తు ఉప్పునీటి ఆవాసాలే! భూనీటి ఆవాసాల గూర్చి మానవుడి మేధ కావాల్సినంత సమాచారాన్ని సేకరించినా, సముద్రాల గూర్చి, సముద్రాల గర్భంగూర్చి, అందులో ఆవాసముండే అశేష జీవుల గూర్చి, సంపద గూర్చి మానవుడు తెలుసుకున్నది చాలా తక్కువ! తెలుసుకోవాల్సిందే మరెంతో వుంది. అయితే ఇప్పటిదాకా తెల్సిన సమాచారమే మనకెంతో ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఇంకా పూర్తి సమాచారం తెలిస్తే, బహుషా సముద్రం లోపల కూడా మానవుడు ఆవాసాల్ని ఏర్పర్చుకుంటాడేమో!


సముద్రయానం గూర్చి, అంతరంగం గూర్చి, దాని సంపదగూర్చి రష్యా, చైనా, యూరోపియన్‍ దేశాల సాహసికుల కృషి గణనీయంగా వుంటే, సనాతన దేశాలైన భారత్‍ లాంటివి చాలా వెనుకంజలో వున్నట్లుగా తోస్తుంది. పోతే మన కాల్పనిక సాహిత్యమైన భాగవతాల్లో సముద్రాల గూర్చి, వాటి మథనం గూర్చిన ప్రస్తావన లుండడం గమనార్హం!
ఈ మథనంలో హాలాహలం, అమృతం లభించినట్లు చెప్పుకుంటాం. దీన్ని శాస్త్రీయంగా అన్వయించుకుంటే, సముద్రంలో మంచితో పాటు ప్రకృతి విపత్తుల్ని కల్గించే పరిస్థితులు కూడా వున్నాయని అర్థమౌతుది.


సముద్ర యానం – సముద్ర మథనం!
గడచిన ఆరు శతాబ్దాలుగా సముద్రయానం గూర్చిన కథనాల్ని ప్రపంచవ్యాపితంగా చూస్తున్నాం. రోడ్డు సౌకర్యం లేనప్పుడు ఖండాంతర ప్రయాణాలు కేవలం సముద్రాల ద్వారానే జరిగినట్లు చరిత్ర పుటలు తెలుపుతున్నాయి. మనదేశ విషయంగా చూసినప్పుడు, 15వ శతాబ్దపు చివరి భాగంలో (క్రీ.శ.1495-1499) పోర్చ్గీసు దేశస్తుడైన వాస్కోడగామా అట్లాంటిక్‍, హిందు మహాసముద్రాల ద్వారా పయనించి భారత్‍లోని నేటి కేరళకు చేరుకున్నట్లుగా చెప్పుకుంటాం. దీనికి ముందు, ఆయన నేటి అమెరికాకు చేరుకోవడం తెలిసిందే! ఇలా ప్రపంచ వ్యాప్తిగా క్రీస్తుపూర్వంలోనే సముద్రయానాలు జరిగినట్లుగా చరిత్రపుటల్లో, ఇతిహాసాల్లో చూస్తాం. దీనికి చక్కని ఉదాహరణ ట్రోజన్‍ (Trojan) యుద్ధం. గ్రీకులకు, టర్కీలకు మధ్య జరిగినదిగా (గ్రీస్‍-ట్రాయ్‍) సముద్రయానం ద్వారానే జరిగినట్లుగా చెపుతుంది. ఇలా వేలాది సంవత్సరాలుగా సముద్రంపై మానవుడు నడయాడినా, సముద్ర అంతర్మథనం మాత్రం 20వ శతాబ్దపుదే!


1930-మొదటి సముద్ర మథనం :
భూ, ఖగోళ పరిశోధనలకు శతాబ్దాల చరిత్రవుంటే, సముద్ర పరిశోధనలకు వంద సంవత్సరాల చరిత్రకూడా లేదు. అమెరికాకు చెందిన ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్‍ విలియం బీబె (beebe) ఓటిస్‍ బార్టన్‍ (otis barton) మరో 26 మంది సహాయకులతో కలిసి జూన్‍ 1930లో బెర్‍ముడా(bermuda) ద్వీపంలోని నాన్‍సచ్‍ (nonsuch) అనే ప్రాంతంలో చేపట్టాడు. ఉక్కుతో చేసిన ఇనుప గోళం (bathy sphere)లో బార్టన్‍ తో కలిసి 240 మీటర్ల లోతు సముద్రంలోకి వెళ్ళి పరిశోధన చేసాడు. తిరిగి 15 ఆగస్టు 1934లో 923 మీటర్ల లోతుకు వెళ్ళి, సముద్రం గూర్చి సైన్సుకు తెలియని అనేక విషయాల్ని బాహ్య ప్రపంచానికి బీబె అందించాడు. ఆయన ప్రయోగ ఫలితంగా సముద్ర మథనం ఆధునిక సముద్రశాస్త్రంగా (oceanology oceanography) ఎదిగింది.


సముద్రవాసులు (Ocean Dowelters)
భూమిపై నివసించే వాటిని భూవాసులని, (భూచరజీవులు) పిలిస్తే, సముద్రాలని ఆవాసంగా చేసుకొని జీవించే జీవుల్ని సముద్రవాసులని ( Ocean Dowelters ) పిలుస్తారు. సముద్రశాస్త్రంగా అభివృద్ధి జరగక ముందు, సముద్రంపై భాగంలో, తీరానికి దగ్గర ఆవాసంగా వుండేజీవుల గూర్చి మాత్రమే విభిన్న దేశవాసులకు తెలిసేది. వాటిలో చేపలు, తాబేళ్ళు, పక్షులు, డాల్ఫిన్స్, కొంతమేర తిమింగలాలు మాత్రమే! మరికొన్ని ప్రాంతాల్లో, ధృవప్రాంత సముద్ర తీరాల్లో సముద్ర సింహాలు, సీల్లు, నీటి కుక్కలు, వాల్రస్‍, ధృవ ఎలుగుబంట్లు లాంటి తదితర జంతువులే! ఎప్పుడైతే సముద్రపు లోతుల్ని తెలుసుకోవడం మనిషి ప్రారంభించాడో, భూమికి సమాంతరమైన, ఇంకా చెప్పాలంటే, కొంచెం పెద్ద స్థాయిలో మరో ప్రపంచం సముద్ర గర్భంలో దాగివుందని తెలిసింది. భూచరాలకన్నా (ఏనుగు, ఖడ్గమృగం), పెద్ద పెద్ద జలచరాలు తీరాలకు దూరంగా, సముద్రపు లోతైన జలాల్లో వున్నట్లు తేలింది. వీటితోపాటు, సముద్రం రత్నగర్భ అని, సహజవాయువుకు, పెట్రోలియం లాంటి రాతి నూనెలకు పెద్ద పాత్ర అని గుర్తించబడింది.


చేపలు – ఎన్ని రకాలో
20వ శతాబ్దపు ప్రారంభంలో, చేపల శాస్త్రంగా (lchthyology) అభివృద్ధి చెందకముందు, జీవశాస్త్రంగా వున్నప్పుడు ప్రపంచవ్యాపితంగా గుర్తించబడ్డ చేపల రకాలు సుమారు 1400 మాత్రమే! తర్వాత ఫ్రెంచ్‍ ప్రకృతి శాష్ట్రజ్ఞుడైన జార్జ్ కువియర్‍ (George Cuvier) జలచరాలపై, ముఖ్యంగా చేపలపై దృష్టి సారించి 5,000 వేల రకాల చేపలున్నట్లుగా గుర్తించాడు. ఈ చేపల్ని, దక్షిణాఫ్రిక, యూరప్‍, ఆసియా, దక్షిణ అమెరికా తీరప్రాంతాల నుంచి సేకరించడం జరిగింది. ఈ జాబితాలోకి 20 వతాబ్దపు మధ్య భాగంలో మరో 15,000 రకాలకు పైగా చేర్చబడ్డాయి. ఈ కాలంలోనే బెడిసముద్రలోతుల్ని తడమాడు. ఈ విధంగా భారీచేపలతో పాటు సెంటిమీటర్‍ కన్నా తక్కువ నిడివిగల చేపల్ని ఆయన గుర్తించడం గమనార్హం!


ఇదే కాలంలో మతాధిపతులు (Cardinals) నీటి ఆవాసాల నుంచి రంగు రంగుల చిన్న చేపల్ని సేకరించి, ఆయా రాజులకు, పోప్‍కు బహుమతులుగా ఇచ్చేవారు. ఈ చేపలు నీలి రంగుతో, ఎర్రని వృంతం (fin)తో వుండేవి. ఈ రకం చిరుచేపను నియాన్‍ టెట్రా (neon tetra) గా పేరు పెట్టారు. ఫ్రెంచ్‍కు చెందిన ఆగస్టు రాబట్‍ (August Rabot), యాత్రికుడిగా వివిధ ఖండాల్ని తిరుగుతూ విలువైన రాళ్ళను (diamond) సేకరించేవాడు. యూరఫ్‍ దేశాల్లోని ధనవంతులు రంగురంగుల సీతాకోక చిలుకల్ని, అలంకరణ పుష్పాల్ని (orchids) ఎంత డబ్బైనా పోసి కొనుక్కునేవారు. వీటి సేకరణకై రాబట్‍ సముద్రయానాలు చేస్తుండేవాడు అనుకోకుండా ఆయనకు నియాన్‍ టెట్రా చేపలు దొరకడం, వాటిని యూరోపియన్లకు అమ్మడంతో గొప్ప ధనవంతుడయ్యాడు. దీన్ని గ్రహించిన అనేక మంది ఈ చేపల వేట సాగించినట్లు కథనాలు. ఈ క్రమంలోనే పిలిప్పియన్‍ ద్వీప ప్రాంతంలో పండాక పిగ్మియ (pandaka pigmea) అనే చేప సెంటిమీటర్‍ కన్నా తక్కువ ఆకారం గలది లభించినట్లు రికార్డుల్లో వున్నాయి. అనగా వెన్నెముక గల జీవుల్లో ఇది అత్యంత చిరు ఆకారంగల జీవి అని గుర్తించారు. (తరువాయి వచ్చే సంచికలో)

  • డా।। లచ్చయ్య గాండ్ల,
    ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *