కలివి కోడి.. కలివి కోడి.. కనిపించవూ!!!

‘‘భూమి ఉన్నది మానవుడి ఆశలు తీర్చడానికే గాని అత్యాశలు తీర్చడానికి కాదు’’ అన్న మహాత్మా గాంధీ మాటలు నేటి ఆధునిక మానవుడు చెవికెక్కించుకోలేదు. అందుకే కాబోలు, భూమిపై మానవాళి మాత్రమే కాకుండా జంతువులు, పక్షులు, క్రిమి కీటకాదులు, మొక్కలు తదితర జీవజాలం ఉందన్న సంగతినే మరిచి తన స్వార్థం కోసం భూమి పై ఉన్న సమస్త వనరుల్ని కబలించడం మొదలుపెట్టాడు. దీంతో అనేక జంతువులు పక్షులకు, భూమిపైన నిలువ నీడ లేకుండా పోయింది. మానవుడి అత్యాశకు అనేక మొక్కలు జంతువులు, పక్షులు, భూమి మీద నుండి కనుమరుగు కాగా, మరికొన్ని అంతరించి పోయే దశలో ఉన్నాయి. అలా అంతరించి పోయే దశలో ఉన్న పక్షుల్లో కలివికోడి ఒకటి. ఆ కలివి కోడి విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా!


కలివికోడి భూమి మీద నుండి అంతరించిపోయే దశలో ఉందన్న కారణం చేత ఇంటర్నేషనల్‍ యూనియన్‍ ఫర్‍ కన్జర్వేషన్‍ ఆఫ్‍ నేచర్‍ (IUCN) అన్న సంస్థ, ఈ పక్షిని క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ప్రకటించి, రెడ్‍ బుక్‍లో చేర్చింది. ఈ కలివి కోడిని మొదట కడప, నెల్లూరు జిల్లాల పరిధిలోని తూర్పు కనుమల్లో 1848వ సం।।లో బ్రిటిష్‍ సైనిక వైద్యాధికారి థామస్‍ సి జెర్డాన్‍ కనుగొన్నారు. జెర్డాన్‍ చేసిన ఈ విలువైన క•షికి గుర్తింపుగా ఆయన పేరు మీదనే కలివికోడికి జెర్డాన్స్ కొర్సర్‍ అని పేరు పెట్టారు. ఈ పక్షి శాస్త్రీయ నామం రినోప్టిలస్‍ బైటర్క్యే టస్‍ 1848 అనంతరం రమారమి 50 సంవత్సరాల తర్వాత 1900 సంవత్సరంలో హోవార్డ్ క్యాంప్‍ బెల్‍ అనే వ్యక్తికి ఈ పక్షి కనిపించింది. తర్వాత 85 సంవత్సరాల పాటు ఈ పక్షి కనిపించలేదు. తదుపరి 1986 జనవరి 5న కడప జిల్లా సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్‍ పరిధిలోని అట్లూరు మండలం రెడ్డిపల్లికి చెందిన ఐతన్న అనే గొర్రెల కాపరి ఈ పక్షుల జంటను గమనించానని అధికారులకు సమాచారం ఇచ్చాడు. అందులో ఒక పక్షిని బంధించి అటవీ శాఖ అధికారులకు అప్పగించాడు. వారు ఉన్నతాధికారుల ద•ష్టికి తీసుకుపోగా, ఆ పక్షిని కలివికోడిగా గుర్తించారు. ఈ సమాచారాన్ని కలివి కోడిపై పరిశోధన చేస్తున్న ‘‘బాంబే నేచురల్‍ హిస్టరీ సొసైటీ’’ వారికి తెలియపరిచారు. ఈ సంస్థకు చెందిన ప్రముఖ పక్షి శాస్త్రవేత్త డాక్టర్‍ సలీం అలీ ఆయన సహచరుడు భరత్‍ భూషణ్‍ కడపకు వచ్చి ఆ పక్షిని కలివి కోడిగా నిర్ధారించారు. అయితే వారు వచ్చేలోపే ఆ పక్షి ఆహారం, నీరు సరిగా తీసుకోకపోవడం వల్ల మరణించింది. దాంతో ఆ పక్షి మ•తదేహాన్ని బాంబే మ్యూజియంలో భద్రపరిచారు.


కలివి కోడి అన్న పేరు ఎలా వచ్చింది?
కలివి పొదలు, ముళ్ళతో ఉండే చిన్న చిన్న గుల్మాలు. వాటి మధ్యలో ఈ కోడి లాంటి పక్షి ఎక్కువగా కనిపిస్తుంది. పరిగెత్తడమే గాని, ఎగరడం సరిగా రాని ఈ పక్షికి, పొదల్లో తప్ప విడిగా రక్షణ
ఉండదు. ఇది రాత్రిపూట మాత్రమే సంచరించే నిశాచర పక్షి. కలివి చెట్ల పొదల్లో ఈ పక్షి ఎక్కువగా సంచరించడంతో దీనికి కలివికోడి అన్న పేరు వచ్చింది.


కలివి కోడి శారీరక సౌష్టవం ఎలా ఉంటుంది?
ఈ కోడి చూడడానికి పొడవాటి కాళ్ళుండి, కముజు పిట్ట కన్నా కొంచెం పెద్దదిగా ఉంటుంది. మెడపైన ఉండే రెండు అందమైన చారలు సహజసిద్ధంగా ఏర్పడిన మెడ ఆభరణాలుగా ఉంటాయి. అందువల్ల దీనిని ‘‘డబుల్‍ బాన్డెడ్‍ కర్సర్‍’’ (double banded cursor) అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా ఈ పక్షిని స్థానికంగా ‘‘జతపట్టీల చిటానా’’ అని కూడా పిలుస్తారు.


కలివికోడి కూత?
‘‘బాంబే నేచురల్‍ హిస్టరీ సొసైటీ’’కి చెందిన సీనియర్‍ పరిశోధకులు ప్రకాశం జగన్నాథన్‍ ఈ పక్షి అరుపులు కూడా రికార్డు చేశారు. ట్విక్‍-టూ, ట్విక్‍-టూ అన్న శబ్దంతో ఈ పక్షి అరుస్తుంది. కోయిల కన్నా ఎక్కువగా అరగంట పాటు నిరంతరంగా అరిచే ఈ పక్షి నవంబర్‍ నుండి మార్చి నెలల మధ్య ఎక్కువగా కూత బెడుతుందని ఆర్నిథాలాజిస్టులు (ornithologists) తెలిపారు.


కలివి కోడి తీసుకునే ఆహారం?
ఈ పక్షి ఈ ప్రధానంగా చెదపురుగులను ఆహారంగా తీసుకుంటుంది. చీమలు, ఉసూళ్లు వంటి చిన్న చిన్న వాటిని ఎన్నింటిని తిన్నా, చెదపురుగులను మాత్రం ఎక్కువగా ఇష్టపడుతుంది. కలివి పొదల కొమ్మలు, రెమ్మలు నేలను తాకుతూ ఉండడంతో, వీటిని చెదలు ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటాయి. పైన మట్టిపూత వేసి లోన ఎంత దాక్కున్నా చెదపురుగులు కలివికోడి ద•ష్టి నుంచి తప్పించుకోలేవు. ఈ పక్షి రాత్రి మాత్రమే ఆహారం స్వీకరించి పగలంతా విశ్రాంతి తీసుకుంటుంది. కలివికోడి రెట్టను గుర్తించి పలుమార్లు పరిశోధకులు చేసిన పరీక్షల్లో, ఈ విషయం నిర్ధారణ అయింది. కలివికోడి విసర్జనలో చెదలకు సంబంధించిన పెంకు లాంటి జీర్ణం కానీ నోటి భాగాలు (మాండిబుల్స్) కనిపించాయి. ఇది ఒక జత లేత పసుపు వర్ణం గల గుడ్లను పెడుతుందని డా।। సామంత్‍, డా।। ఇలంగోవన్‍ అనే శాస్త్రవేత్తలు 1997లో ధ్రువీకరించారు.


తెలుగు గంగ ప్రాజెక్ట్నే దారి మళ్లించిన కలివికోడి!!
పట్టుమని పిడికెడంత పరిమాణం కూడా లేని కలివి కోడి, కడప జిల్లాలోని తెలుగుగంగ నీటిపారుదల ప్రాజెక్టు యొక్క మార్గాన్ని దారి మళ్లించింది అంటే నమ్మగలమా!! అవును నమ్మి తీరాల్సిందే!! కలివికోడి నివాస ప్రాంతాలకు ముప్పు కలుగుతుందన్న ఉద్దేశంతో తెలుగుగంగ పథకం కింద శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి రిజర్వాయర్‍ దిగువన, తెలుగుగంగ కుడి ప్రధాన కాలువ తవ్వకాలను అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. కుడి ప్రధాన కాలువ 30 నుండి 40 కిలోమీటర్ల మధ్య, ప్రొక్లేన్లతో 400 మీటర్ల కాలువ తవ్వకం జరిగిన తర్వాత, అభయారణ్యంలోకి అనుమతి లేకుండా ప్రవేశించి తవ్వకాలు జరిపినట్లు గుర్తించిన కడప అటవీశాఖ అధికారులు ఐవిఆర్సిఎల్‍ కంపెనీకి చెందిన తొమ్మిది మంది అధికారులపై 2005 నవంబర్‍ 23న కేసు నమోదు చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని సమస్య పరిష్కారం కోసం 2006 మార్చిలో ఒక సాధికారిక కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కాలువ తవ్వకం అలైన్మెంట్‍ను మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టులో అఫిడవిట్‍ సమర్పించింది.


కలివికోడి పరిరక్షణకు ప్ర••త్వం తీసుకుంటున్న చర్యలు!!

కలివికోడి నివాస స్థావరమైన లంకమల అడవులను సంరక్షించవలసినదిగా ‘‘బాంబే నేచురల్‍ హిస్టరీ సొసైటీ’’ వారు ఆంధప్రదేశ్‍ ప్రభుత్వానికి సూచించడంతో, ప్రభుత్వం స్పందించి 464 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న లంకమల అడవులను శ్రీశైల మల్లేశ్వర అభయారణ్యంగా ప్రకటించి కలివికోడి సంరక్షణకు చర్యలు చేపట్టింది. భారత ప్రభుత్వం కలివికోడి ముఖచిత్రంతో 1988లో తపాలా బిళ్ళను విడుదల చేసింది. అంతేకాకుండా, అటవీ జంతు సంరక్షణ చట్టం-1972 కింద ఈ పక్షిని రక్షిత జాబితాలో చేర్చడంతో పాటు, 2015వ సంవత్సరంలో, వైల్డ్ లైఫ్‍ ఇన్స్టిట్యూట్‍ ఆఫ్‍ ఇండియా అన్న సంస్థ ఆధ్వర్యంలో కడప జిల్లా సిద్ధవటం అటవీ రేంజ్‍ పరిధిలోని కొండూరులో ప్రత్యేకంగా ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా 2019లో కేంద్ర ప్రభుత్వం కలివి కోడి పునరుజ్జీవ ప్రాజెక్టును మంజూరు చేసి, దానికి సుమారు 5.73 కోట్ల నిధులు కేటాయించింది. ఈ ప్రాజెక్టు 2019-20 నుండి 2024-25 వరకు కొనసాగాల్సి ఉంది. కానీ అది సకాలంలో ప్రారంభం కాలేదు. తదనంతరం కొన్ని మార్పులు చేసి 2022-23 నుండి 2026-27 వరకు ఐదేళ్లపాటు కొనసాగేలా మరో షెడ్యూల్‍ ప్రకటించినా, అది కూడా అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో 2023 ఆగస్టులో వైల్డ్ లైఫ్‍ ఇన్స్టిట్యూట్‍ ఆఫ్‍ ఇండియా ఆధ్వర్యంలో వన్యప్రాణుల సమగ్ర అభివ•ద్ధి ప్రాజెక్టు ప్రారంభించారు. నాలుగేళ్ల పాటు ఇది కొనసాగనుంది. ఇందులో భాగంగా మొదట శాస్త్రవేత్తలు, అటవీ శాఖ అధికారులు కొండూరులోని కలివికోడి పరిశోధనా కేంద్రంలో, అటవీ ప్రాంతానికి చెందిన, సమీప గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఆ పక్షిని కనిపెట్టడంలో గ్రామస్థులు సహకరించాలని కోరారు. తమిళనాడుకు చెందిన పాపులేషన్‍ అసెస్మెంట్‍ పరిశోధక బ•ందం రంగంలోకి దిగి సెప్టెంబర్‍, అక్టోబర్లో కొండూరు బీటులోని కలివి కోడి ఆవాస ప్రాంతాల్లో, క్షేత్రస్థాయి పరిశీలన చేసి లొకేషన్లు గుర్తించారు. నవంబర్‍ నుండి రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో 35 అత్యాధునిక కెమెరాలు అమర్చారు. వాటిలో నిక్షిప్తమైన డేటాను 20 రోజులకు ఒకసారి సేకరించి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మద్దూరు బీటులో 70 అత్యాధునిక కెమెరాలు అమరుస్తున్నామని అధికారులు తెలిపారు. కలివికోడి ఆచూకీని కనిపెట్టడమే లక్ష్యంగా క•షి చేస్తున్నట్లు వారు వివరించారు.


చివరిగా…!!

ప్రక•తిని మనం రక్షించినట్లయితే అది మనల్ని రక్షిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆధునిక సాంకేతిక ప్రపంచం విసురుతున్న ఉచ్చులో చిక్కుకొని కలివి కోడి, గ్రేట్‍ ఇండియన్‍ బస్టర్డ్ (బట్ట మేక పక్షి) లాంటి అరుదైన పక్షులతో పాటు, పిచ్చుకలు, గద్దలు, రాబందుల్లాంటి పక్షుల మనుగడ కూడా ప్రశ్నార్థకమవుతోంది. ఎకో ఫ్రెండ్లీ జీవన విధానాన్ని అనుసరించడంతో పాటు, పాఠశాల స్థాయిలోనే, పర్యావరణ పరిరక్షణ పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. తద్వారా అంతరించిపోతున్న కలివి కోడి లాంటి అరుదైన పక్షుల పునరుజ్జీవనానికి మార్గం సుగమం కావాలని, భూమి పై నున్న సకల ప్రాణి కోటికి పూర్వ వైభవం సాకారం కావాలని ఆశిద్దాం!!


-పుట్టా పెద్ద ఓబులేసు,
స్కూల్‍ అసిస్టెంట్‍, జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల
రావులకొలను, సింహాద్రిపురం, కడప
ఎ : 9550290047,

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *