ఆర్‍. విద్యాసాగర్‍ రావు

సాగునీటిపై సాధికారికంగా మాట్లాడమేకాదు. నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన వాటాపై విద్యాసాగర్‍రావు చేసిన కృషి తెలంగాణ ప్రజలకు మార్గదర్శకత్వంగా నిలుస్తుంది. ఆయన ఉద్యమ కాలంలో నీటి నిజాలను నిగ్గుతేల్చి తెలంగాణ మట్టి రుణాన్ని తీర్చుకున్న ముద్దుబిడ్డ. ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖర్‍రావు అడుగులో అడుగై నడిచిన విద్యాసాగర్‍రావు బీడు భూములకు నీటిని ఎలా తరలించారో మేధో యజ్ఞం చేశారు. అందుకే ఆయన ‘సాగునీటి నిపుణుడి’గా యావత్తు తెలంగాణ ప్రజలకు దీపపు స్థంభమై కనిపిస్తారు. కానీ, నటుడిగా, నాటక రచయతగా, ప్రయోక్తగా ఈ తరానికి దాదాపు తెలియదు. విద్యాసాగర్‍రావు జీవితంలో జలవిజ్ఞానం నాటక విజ్ఞానం ఒక జమిలిగా కనిపిస్తాయి. ఆయన చేసిన వృత్తి జలశాస్త్రవేత్తగా నిలబెడితే, ప్రవృత్తి నటుడిగా, రచయితగా నాటకరంగంలో సుస్థిరం చేసింది.


ఆర్‍. విద్యాసాగర్‍ రావు నల్లగొండ జాజిరెడ్డిగూడెంలో 1939 నవంబర్‍ 14న ఆర్‍. రాఘవరావు, లక్ష్మయ్య దపంతులకు జన్మించారు. తండ్రిఉపాధ్యాయుడు కావడంతో ఇంట్లో వారంతా ఉన్నత చదువుల్లో రాణించారు. ఆయన విద్యాభ్యాసం 10వ తరగతి వరకు సూర్యాపేటలో సాగింది. విద్యాసాగర్‍రావు బాల్యం నుండి చదువుతో పాటు ఆటలు, సాహిత్యం, నాటకాలపట్ల ఆకర్షితుడయ్యాడు. ఎక్కువ సమయం లైబ్రరీలో గడిపేవాడు. గిరీశం కలం పేరుతో కవిత్వాలు రాయడం, సినిమా పత్రికల్లో సినిమా రివ్యూలు పంపడంతో ప్రారంభమైన రచనా వ్యాసాంగం తర్వాత కాలంలో ఆయనను నాటక రచయితగా కాలమిస్టుగా, వ్యాసకర్తగా ఆవిష్కరించింది. ఉన్నత చదువులకు హైదరాబాద్‍ నిజాం కళాశాలలో చేరిన విద్యాసాగర్‍రావు ఇంటర్‍ కాలేజి ఉత్సవాల్లో నటకాలను ప్రదర్శించడం హబీగా మార్చుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‍లో చేరినప్పటికి ఆయన ద్యాసంతా నాటకంపైనే ఉండేది. ప్రతిరోజు సాయంత్రం నాటకం మిత్రులతో గడపడం అలవాటయింది. ఇంజనీరింగ్‍ చదువుకుంటున్న సమయంలోనే నాట్య విద్యాలయంలో నటశిక్షణలో డిప్లొమ కోర్సును పూర్తిచేసారు. అబ్బూరి రామకృష్ణారావు, మంత్రి శ్రీనివాసరావు, ఎ.ఆర్‍.కృష్ణలు అధ్యాపకులుగా ఉండేవారు. మంత్రి శ్రీనివాసరావును నాటక రంగంలో తనకు మొదటి గురువుగా విద్యాసాగర్‍రావు పేర్కొంటారు.


స్టాన్‍స్లావిస్కీ నట శిక్షణతోనే తాను నటుడిగా రూపొందానని అంటారు. ఆయన ఆనాటి తరగతి గది జ్ఞాపకాలను గుర్తుచేస్తూ నట శిక్షణలో భాగంగా మంత్రి శ్రీనివాసరావు తనను ఏదైనా పాత్రను నటించి చూపమని అడిగితే దానికి ఆయన ‘‘సార్‍! ముందు మీరు చేసి చూపించండి. నేను చేస్తానని’’ సమాధానం చెప్పాడట. దానికి మంత్రి ‘‘నేను చెబితే నీవు చేయడంకాదు నీకు నీవుగా ప్రయత్నించాలి అని యు ఫీల్‍ ఇట్‍ అండ్‍ యాక్ట్ ఇట్‍- నటుడు పాత్రలో జీవించడంకాదు, పాత్రలో నటించాలి’’ అని అన్నారట. దీనిని ప్రేరణగా తీసుకొని తాను నటుడుగా మారానని అంటాడు విద్యాసాగర్‍రావు గారు.
నాట్య విద్యాలయంలో సినీ నటులు త్యాగరాజు, ప్రఖ్యాత రంగస్థల నటులు భానుప్రకాష్‍, లక్ష్మీ కనకాల, రవీందర్‍రెడ్డి వంటి వారు ఆయనకు సహ విద్యార్థులు. అక్కడ మృచ్ఛకటికం, కన్యాశుల్కంవంటి నాటకాలు ప్రయోగాత్మకంగా ప్రదర్శించబడ్డాయి. నాట్య విద్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన అనేక నాటకాల్లో నటుడిగా పాల్గొన్నారు. వాటిలో ‘తప్పెవరిది’, ‘కీర్తి శేషులు’ వంటి నాటకాలు నటుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ఉస్మానియాలో ఇంజనీరింగ్‍ పూర్తయ్యాక కోఠి ఉమెన్స్ కళాశాలలో మెయింటెనెన్స్ ఇంజనీర్‍గా, రాష్ట్ర నీటిపారుదల శాఖలో ఇంజనీర్‍గా పని చేశారు. 1960 నుండి ప్రారంభమైన విద్యాసాగర్‍రావు ఉద్యోగ ప్రస్థానం కేంద్ర జలవనరుల సంఘం చీఫ్‍ ఇంజనీర్‍ స్థాయికి ఎదిగేలా చేసింది. ఒకవైపు ఉద్యోగం మరోవైపు నాటకం ఆయన జీవితంలో భాగంగా మారాయి. దేశ విదేశాల్లో పర్యటనలు, ఉద్యోగం కొనసాగుతున్నప్పటికి ఆయన నాటకరంగాన్ని విస్మరించలేదు. వృత్తిలో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికి ప్రవృత్తిగా నాటకంతో అనుబంధాన్ని కొనసాగించాడు. విద్యాసాగర్‍రావు జీవితంలో జల విజ్ఞానం, నాటక విజ్ఞానం ఒక జమిలీ కలయిగా కనిపిస్తాయి. ఇంజనీర్‍గా పనిచేస్తున్న విద్యాసాగర్‍రావుకు డబ్బులు ఆర్జించాలనే ద్యాస ఏనాడు
ఉండేదికాదు.


1962లో విద్యాసాగర్‍రావుకు యు.పి.యస్‍.సి. ఇంటర్వ్యూ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వరించింది. ఈ కొత్త ఉద్యోగంలో చేరాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో ఢిల్లీ నేషనల్‍ స్కూల్‍ ఆఫ్‍ డ్రామా వంటి నాటక సంస్థలు ఆయనను ఢిల్లీ వెళ్ళేందుకు ప్రేరేపించాయి. అక్కడ నేషనల్‍ స్కూల్‍ ఆఫ్‍ డ్రామా ప్రదర్శించే నాటకాలను తప్పకుండా చూస్తూ ఆయన తనలోని నటున్ని మరింత పదును పెట్టుకున్నాడు. ఢిల్లీ తెలుగు అసోసియేషన్‍ వంటి కళాసంస్థలతో జతకట్టి తెలుగు నాటకాలను, హిందీ నాటకాలను ప్రదర్శించేవారు. ‘మట్టె బంగారం’, ‘పంజరంలో పక్షులు’, ‘ఇదేమిటి’, ‘ఈ ఇల్లు అమ్మబడును’, ‘వానవెలసింది’ వంటి ఎన్నో నాటకాలు ప్రదర్శించి గుర్తింపు పొందారు. సుదీర్ఘకాలం ఢిల్లీ, అహ్మదాబాద్‍, రూర్కెలాలో పని చేయడం వల్ల ప్రతిచోట నాటక మిత్రులను ప్రోది చేసింది. తొలి రోజుల్లో ‘గిరీశం’ పేరుతో కవిత్వం రాసిన ఆయన కలం నాటక రచనలవైపు పరుగులు తీసింది. ఎన్నో సృజనాత్మక నాటకాలు ఆయనచే ఆవిష్కరించబడ్డాయి.
విద్యాసాగర్‍రావు నటుడిగానే కాకుండా నాటక రచయితగా, దర్శకుడుగా నాటక రంగంలో ఆయన పాదముద్రలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 1960 నుండి 75 వరకు ఆయన నాటక రచనా ప్రస్థానంలో 2 నాటకాలు, 11 నాటికలు రచించారు. ఆనాటి సంఘటనలు సమాజంలో నెలకొన్న అంశాలు వీరి నాటక రచనకు కథావస్తువులయ్యాయి.


ఆయన ‘క్షంతవ్యులు’, ‘గుడ్‍బై’ నాటకాలు రాశారు. అదేవిధంగా ‘దేవుడయ్య’, ‘గంధర్వులే తీరుస్తారు’, ‘కొత్తదారి’, ‘ఆఫ్‍కీ అదాలత్‍’, ‘నారు మనది – నీరు వాడిదా’, ‘ప్రధానం’, ‘వార్షికోత్సవం’, ‘ఓ ఆఫీసు కథ’, ‘నిన్న – నేడు – రేపు’, ‘ఇంటర్వ్యూ’లను నాటికలుగా రచించారు.
‘గుడ్‍బై’ నాటకంలో స్వరూపం పురుషుడు. స్వభావం స్త్రీ అయిన పాత్రను సృష్టించి కథను నడుపుతాడు. అమాయకత్వాలను, అవసరాలను ఆసరాగా చేసుకుని పరాన్నజీవులుగా బ్రతికే మనుషుల నిజస్వరూపాలను రచయిత ఆవిష్కరిస్తాడు. హోమోసెక్యువల్‍ ఇతివృత్తంపై తెలుగులో వచ్చిన మొదటి నాటకంగా పేర్కొనవచ్చు.


ప్రముఖ హిందీ నాటక రచయిత శంకర్‍ శేష్‍ ‘కిస్సాకుర్సికా’ స్కిట్‍ను స్ఫూర్తిగా తీసుకుని ‘ఓ ఆఫీసు కథ’ నాటికగా మలచారు. ఫార్స్ నాటక పక్రియలో సాగుతుంది. గవర్నమెంటు ఆఫీసులో బాధ్యతలేని ఉద్యోగులు, కాలానికి శిలువ వేసి స్వంత లాభం చూసుకునే ప్రబుద్ధుల కథ ఇది. హాస్యానికి పెద్ద పీఠ వేసి వ్యంగ్యాత్మకంగా సాగుతుంది. చెకోవ్‍ వ్రాసిన ‘ప్రపోజల్‍’ నాటికను ‘ప్రధానం’గా ‘జూబ్లీ’ నాటికను ‘వార్షికోత్సవం’గా అనువాదం చేసారు. తెలుగు నేటివిటితో ప్రదర్శనకు అనువుగా రచయిత నాటకీకరణ చేసారు.
విద్యాసాగర్‍రావు రచనలో ‘కొత్తదారి’ స్కిట్‍ పక్రియకు సంబంధించింది. యం.వి.యస్‍. హరనాథరావు ‘యక్షగానం’ నాటిక తరహాలో కళాకారుడి ఆవేదనను ఆవిష్కరిస్తుంది. పగటివేషగాడైన ‘లత్కోర్‍సాబ్‍’ కొడుకులేని తనకు తన కళను ఎలా బ్రతికించుకోవాలో మదనపడుతుంటాడు. కూతురు ముందుకొచ్చి ‘లత్కోర్‍ సాబ్‍’నై జీవిస్తానంటూ తండ్రిలో కొత్త ఆశలను చిగురింపచేస్తుంది. ప్రధాని మోడీ చేపట్టిన ‘బేటి బచావో – బేటి ఫడావో’ స్ఫూర్తికి ఈ నాటిక ప్రతిరూపం.


ఎమర్జెన్సీ కాలంలో ఆనాటి రాజకీయాలను నిరసిస్తూ ‘నిన్న, నేడు – రేపు’ నాటికను రచించారు. గరిమెళ్ళ రాంమూర్తితో కలిసి ఈ నాటికను ప్రదర్శించాలను కున్నారు. నిర్బంధాలతో నెలకొన్న నాటి పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రదర్శించలేక పోయారట. అయితే ఈ నాటిక ప్రతి దొరకలేదు. విద్యాసాగర్‍ రావు రాసిన నాటికలు, నాటకాలను ఆయన స్వయంగా నటుడిగా, దర్శకునిగా రంగస్థలంపై ప్రదర్శించారు. విద్యాసాగర్‍రావు రచనల్లోని ప్రతి నాటిక ఒక ప్రత్యేకతను సంతరించుకున్నదే.


విద్యాసాగర్‍ రావు ఉద్యోగ విరమణ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి లా డిగ్రీని పూర్తి చేసారు. హైదరాబాద్‍ తిరిగి వచ్చాక కొంతకాలం దూరదర్శన్‍లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జెమినీ టీవిలో మూడు సీరియళ్లను ప్రొడ్యూస్‍ చేసారు. వివిధ పత్రికల్లో ‘‘నీళ్ళు – నిజాలు’’ పేరుతో వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. విద్యాసాగర్‍రావు రాసిన వ్యాసాలు, ప్రసంగాలు తెలంగాణ నీటిపారుదలపై మేధావులను సైతం ఆలోచింపచేసాయి. ఆయనలోని జలవిజ్ఞానమే కల్వకుంట్ల చంద్రశేఖర్‍రావుకు దగ్గరయ్యేలా చేసింది.
ఆయన రచించిన నాటకాలను రవీంద్రభారతి వేదికపై 2017, మే 18, 19, 20 తేదీలలో మూడు రోజులపాటు ఘనంగా నాటకోత్సవాలను నిర్వహించడమే కాకుండా ఆర్‍. విద్యాసాగర్‍రావు జలసాగరుడేకాదు, కళాసాగరుడని తెలంగాణ సమాజానికి తెలంగాణ థియేటర్‍ రీసెర్చ్ సెంటర్‍ పరిచయం చేసింది. ఆయన నాటకాలను ప్రదర్శించి విద్యాసాగర్‍ రావుకు కళానివాళిని అర్పించింది. (తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)


-డా।। జె. విజయకుమార్‍జీ
ఎ : 9848078109

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *