రెండువైపులా పదునైన ఖడ్గం @ డీప్‍ఫేక్‍ టెక్నాలజీ

సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) అన్నది మానవాళిని ఆధునికత వైపు పురోగమింపజేయడంతో పాటు, ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్ఠం చేయాలన్న సుప్రీంకోర్ట్ చీఫ్‍ జస్టిస్‍ డీ వీ చంద్రచూడ్‍ మాటలు అక్షర సత్యాలు. సాంకేతిక పరిజ్ఞానం మానవాళి జీవితంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. వారు ఎదుర్కొనే ప్రతీ సమస్యకు కూడా క్షణాల్లో పరిష్కారాన్ని సూచించిందనడం కూడా కాదనలేని సత్యం. ఇదంతా నాణేనికి ఒకవైపు కాగా, మరోవైపు అదే సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) దుర్వినియోగ మవుతూ మానవాళిని తిరోగమనం వైపు నెడు తోందనడంలో కూడా ఎలాంటి అతిశ యోక్తి లేదు. సినీతారలు, రాజకీయ నాయకులతో పాటు, సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా ఏదో రూపంలో చికాకు పరుస్తున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో డీప్‍ఫేక్‍ టెక్నాలజీ ఇటీవల ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో డీప్‍ ఫేక్‍ టెక్నాలజీ అంటే ఏమిటి, దాని వల్ల మానవాళి ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనం కూడా అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.


డీప్‍ఫేక్‍ టెక్నాలజీ అంటే ఏమిటి?
డీప్‍ (deep) అనగా లోతైన, ఫేక్‍ (fake) అనగా నకిలీ అని అర్థం. శక్తివంతమైన కంప్యూటర్లు మరియు ఆర్టిఫిషియల్‍ ఇంటలిజెన్స్కు సంబంధించిన డీప్‍లర్నింగ్‍ అన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వీడియోలు, ఆడియోలు, చిత్రాలను (images) తమకు నచ్చిన విధంగా మార్చడానికి వినియోగించే పద్ధతిని ‘‘డీప్‍ ఫేక్‍ టెక్నాలజీ’’ అని పిలుస్తారు.
2017లో రెడ్‍ డిట్‍ (reddit) అనే సామాజిక మాధ్యమానికి చెందిన ఒక అజ్ఞాత వినియోగదారుడు సెలెబ్రిటీల వీడియోలను డీప్‍ ఫేక్స్ అన్న పేరుతో పోస్ట్ చేయడంతో ‘‘డీప్‍ఫేక్‍’’ అన్న పదం విస్త•తంగా వాడుకలోకి వచ్చింది.


డీప్‍ఫేక్‍ గురించి మరింత విఫులంగా చెప్పుకున్నట్లయితే.. ఒకప్పుడు ఫోటోలను మర్ఫింగ్‍ చేసి నకిలీవి తయారుచేసేవారు. ఇప్పుడు మరో అడుగుముందుకేసి ఆర్టిఫిషియల్‍ ఇంటలిజెన్స్ (కృత్రిమమేధ) సహాయంతో మరింత మెప్పించేలా, అచ్చంగా ఒరిజినల్‍ అనిపించేలా నకిలీ వాటిని తయారుచేస్తున్నారు. ఈ పనికి అవసరమైన టెక్నాలజీ, దాని ఫలితంగా వెలువడే బోగస్‍ కంటెంట్‍, రెండూ స్ఫురించేలా దీన్ని డీప్‍ ఫేక్‍ అంటున్నారు. దీంతో ఫోటోలు, వీడియోలు, ఆడియోలు నకిలీని తయారు చేయొచ్చు. కొన్ని అసలు వాటిని మరిపిస్తే, కొన్ని కొత్త కంటెంట్‍ను సృష్టి స్తున్నాయి. ఫలితంగా ఒక వ్యక్తిలేని చోట ఉన్నట్లు, చేయని పని చేసినట్లు, అనని మాటలు అన్నట్లు కంటెంట్‍ బయటికి వచ్చి, సదురు వ్యక్తికి తెలియకుండానే వ్యాపిస్తుంది. దాంతో ఆ సమాచారంలోని అంశానికి అతడు బాధ్యత వహించాల్సి వస్తుంది. గతేడాది ఉక్రెయిన్‍ యుద్ధం తీవ్రంగా జరుగుతున్నప్పుడు, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‍స్కీ, తమదేశ సైన్యాన్ని లొంగిపొమ్మని ఆదేశిస్తున్నట్లు వచ్చిన వీడియో సంచలనం సృష్టించింది.


డీప్‍ ఫేక్‍ వీడియోలను ఎలా తయారు చేస్తారు..!!
డీప్‍ ఫేక్‍లను జనరేటర్‍ మరియు డిస్క్రిమినేటర్‍ అనే రెండు అల్గారిథమ్స్ ఆధారంగా తయారుచేస్తారు. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా కావలసిన కంటెంట్‍ని జనరేటర్‍ తయారుచేస్తుది. డిస్క్రిమినేటర్‍ తయారైన కంటెంట్‍ని, అసలుతో పోల్చి, దానిలోని లోపాలను వెతికి చెబుతుంది. జనరేటర్‍ ఆ లోపాలను సరిచేస్తుంది. ఇలా పలుదశల్లో ఇవి మళ్ళీ మళ్ళీ పనిచేసి అచ్చంగా అసలులా కనిపించే నకిలీని తయారు చేస్తాయి. పై రెండు అల్గారిథమ్స్ని ఉపయోగించుకొని జనరేటివ్‍ అడ్వర్సోరియల్‍ (జీఏఎన్‍) అన్న వ్యవస్థ ఒక న్యూరల్‍ నెట్‍వర్క్ని తయారు చేస్తుంది. ఆ తరువాత ఫేసియల్‍ రికగ్నిషన్‍, ఇతర కదలికలను గుర్తించడానికి ‘‘కన్వల్యూషనల్‍ న్యూరల్‍ నెట్‍వర్కస్ (సీఎన్‍ఎన్‍)ని వాడతారు. ముఖంలో హావభావాలు, శరీర కదలికల్ని మార్చడానికి ఉపయోగపడే ‘ఆటో ఎన్‍ కోడర్స్’’ సాంకేతికతతో వీడియోలో ఆ మార్పుల్ని చేస్తారు. డీప్‍ ఫేక్‍ ఆడియో సృష్టించడానికి వాడే వ్యవస్థను ‘‘నేచురల్‍ లాంగ్వేజ్‍ ప్రాసెసింగ్‍ – ఎన్‍ఎల్‍పి’’ అంటారు. డీప్‍ ఫేక్‍ తయారీకి ఉత్తమ సామర్థ్యమున్న హై పెర్ఫామెన్స్ కంప్యూటింగ్‍ వ్యవస్థ కావాలి. డీప్‍ ఆర్ట్ ఎఫెక్ట్, డీప్‍ స్వాప్‍, డీప్‍ వీడియో పోర్ట్రెయిట్స్, ఫేస్‍ ఆప్‍, ఫేస్‍ మ్యాజిక్‍, మై హెరిటేజ్‍, వేవ్‍ టు లిప్‍, వోంబో, జావో లాంటి టూల్స్ సాయంతో సెకన్ల వ్యవధిలోనే డీప్‍ ఫేక్స్ తయారై పోతున్నాయని ‘‘ఇన్‍క్రీజింగ్‍ త్రెట్‍ ఆఫ్‍ డీప్‍ఫేక్‍ ఐడెంటిటీస్‍’’ నివేదిక తెలుపుతోంది. ఈ నివేదిక ప్రకారం డీప్‍ఫేక్స్ ద్వారా అడల్ట్ కంటెంట్‍ని సృష్టించడానికి అవకాశం ఉన్న దేశాల పరంగా గ్లోబల్‍ ర్యాంకింగ్స్లో ఇండియా 6వ స్థానంలో ఉంది.


డీప్‍ ఫేక్‍ వీడియోలను ఎలా కనిపెట్టవచ్చు

నిశితంగా పరిశీలిస్తే నిపుణులు, డీప్‍ఫేక్‍ కంటెంట్‍ని కనిపెట్టగలరు, కానీ అందరికీ సాధ్యం కాదు.
అసహజ కదలికలు :
ముఖం పొజిషన్‍ అసాధారణంగా, శరీర కదలికలూ, హావభావాలు, రంగులూ, లైటింగ్‍ అసహజంగా ఉండవచ్చు.
ఆడియో నాణ్యతను సరిపోల్చడం :
ఆడియోలో నిలకడ ఉండదు. మాట బ్రేక్‍ అవుతుంది. ఆడియోకి తగినట్లుగా పెదవుల కదలిక ఉందా, గొంతు వారిదేనా అన్నది గమనించాలి.
వీడియోల నాణ్యతను సరిపోల్చడం :
వీడియోలను జూమ్‍ చేసి చూస్తే వెలుగు నీడలు అసాధారణంగా కనిపిస్తాయి. బ్యాక్‍గ్రౌండ్‍లోనో, చుట్టుపక్కల వస్తువులో బ్లర్‍ అయి కనిపిస్తాయి. వీడియోల్లో కనురెప్పల కదలిక సహజంగా ఉండదు. అలాగే నేరుగా కళ్ళలోకి చూసి మాట్లాడు తున్నారా లేదా కూడా గమనించవచ్చు. చూసి మాట్లాడుతున్నారా లేదా కూడా గమనించవచ్చు.
సందేశాల్లో తప్పులు :
సందేశాల్లో స్పెల్లింగ్‍ తప్పులుంటాయి. వాక్యాలు సదరు వ్యక్తి మాట్లాడే, రాసే శైలికి భిన్నంగా, అసందర్భ ప్రస్తావనలు ఉంటాయి. ఈ మెయిల్‍ అడ్రస్సులు కూడా అనుమానాస్పదంగా ఉంటాయి.
శరీర సౌష్ఠవంలో తేడాలు :
డీప్‍ ఫేక్‍ టెక్నాలజీ ద్వారా చేసిన వీడియోల్లోని వ్యక్తులు నిజంగా ఉన్నట్లే అనిపించినప్పటికీ మానవదేహానికి ఉండాల్సిన సహజరంగు, రూపు, చలనం మొదలైన వాటిని సృష్టించలేరు.
అయితే కృత్రిమ మేధతో ఈ లోపాలను అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి రానురాను వీటిని ‘కనిపెట్టడం ఇంకా కష్టం అవుతుంది. టెక్‍ సంస్థలూ, ప్రభుత్వ విభాగాలూ డీప్‍ ఫేక్‍ కంటెంట్‍ని కనిపెట్టి, బ్లాక్‍ చేయగల సాంకేతికతను అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. సోషల్‍ మీడియా యాజమాన్యాలు కొన్ని తమ వేదికల మీద పోస్ట్ చేసే వీడియోలు, ఫోటోలు అసలువా, నకిలీవా అని గుర్తించడానికి బ్లాక్‍ చైన్‍ టెక్నాలజీని వాడుతున్నాయి. అడోబ్‍, మైక్రోసాప్ట్ లాంటివి అందుకు తగిన సాప్ట్వేర్‍ని తయారు చేసుకున్నాయి. ఐఐటీ రోపార్‍, ఆస్ట్రేలియాలోని మోనాష్‍ యూనివర్సిటీ నిపుణులు కలిసి ‘‘ఫేక్‍ బస్టర్‍’’ పేరుతో, ఫేక్‍ వీడియోలను కనిపెట్టే సాంకేతికతను అభివృద్ధిచేశారు.


అనువర్తనాలు :

డీప్‍ ఫేక్‍ టెక్నాలజీని కళలు, విద్యా, వైద్య రంగాలతో పాటు ఎంటర్‍టైన్‍మెంట్‍ ఆడియో, వీడియో కంటెంట్‍ తయారీలో చట్టబద్ధంగా వినియోగించవచ్చు.
ఫిల్మ్డబ్బింగ్‍ :
ఈ సాంకేతికతను ఉపయోగించి భాషరాని నటులు, కళాకారుల పెదాల కదలికలను మరింత సహజంగా మార్చవచ్చు.
ఉదా।।కు ప్రపంచవ్యాప్తగా మలేరియాను నివారించేందుకు అంతర్జాతీయ ప్రముఖులైన డేవిడ్‍ బెక్‍ హోమ్‍, హ్యూజ్‍ జాక్‍ మెన్‍, బిల్‍ గేట్స్ మొ।।లైన వారు, వారి భాషల్లో మాట్లాడిన విషయాన్ని డీప్‍ ఫేక్‍ టెక్నాలజీ ద్వారా అన్ని భాషల్లోకి అనువదించి, ప్రసారం చేశారు. దీని వల్ల మలేరియాను తగ్గించడానికి అవసరమైన కార్యాచరణని వేగవంతం చేయగలిగారు.
విద్యారంగం :
డీప్‍ ఫేక్‍ టెక్నాలజీ ద్వారా చారిత్రక సన్నివేశాలు, యుద్ధాలను ఇంటరాక్టివ్‍ సిమ్యులేషన్‍ ద్వారా నిజరూపంలో చూపించవచ్చు.
వైద్యరంగం :
కొన్ని రకాల వ్యాధుల గురించి వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి రోగుల వ్యక్తిగత గోప్యతకు ఇబ్బంది కలగకుండా ఈ వీడియోలను ఉపయోగించవచ్చు. క్యాన్సర్‍ లాంటి వ్యాధుల బారిన పడి గొంతు పోగొట్టుకున్న వారికి వాయిస్‍ క్లోనింగ్‍తో అవసరమైన చోట అతని గొంతు వినిపించేలా చేయవచ్చు.
కళారంగం :
ప్రఖ్యాత కళారూపాలకు, నకిలీలు తయారుచేసి పాపులర్‍ చేశారు. రవి వర్మ, వాన్గోల చిత్రాలకు, నకిలీలు ఇప్పుడు పలుచోట్ల కనిపిస్తున్నాయి. అదేవిధంగా కళాకారుల్లో వివిధ రూపాల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయవచ్చు.
భద్రత : డీప్‍ఫేక్‍ టెక్నాలజీ ద్వారా పౌరులు వారి డిజిటల్‍ ఐడెంటీని, ప్రైవసీని కాపాడుకోవచ్చు.
క్రిమినల్‍ ఫోరెన్సిక్‍ : ఈ సాంకేతికతను ఉపయోగించి నేర నిర్ధారణను అత్యంత సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
డిజిటల్‍ రీ కన్‍స్ట్రక్షన్‍ :
పూర్తిగా కోల్పోయిన లేదా ప్రమాదవశాత్తు డిలీట్‍ అయిన డిజి•ల్‍ సమాచారాన్ని లేదా పాత ఫోటోలు, వీడియోలను ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పునరుద్ధరించవచ్చు. అంతేకాకుండా వాటి క్వాలిటీని పెంచవచ్చు.
కస్టమర్‍ ఫోన్‍ సపోర్ట్ :
కొన్నిచోట్ల ఫిర్యాదు నమోదు చేసుకోవడానికీ, ఖాతాల్లో బ్యాలెన్స్ చెక్‍ చేసుకోవడానికీ ఫోన్‍ చేస్తే ఎగ్జిక్యూటివ్‍ గొంతు వినిపిస్తుంది. అది డీప్‍ ఫేక్‍ సాంకేతికతతో తయారు చేయబడినదే.


కాలర్‍ రెస్పాన్స్ సర్వీసెస్‍ :
మనిషి లేకుండా ఆటోమేటిగ్గా అందించే రిసెప్షనిస్టు సేవల్లో భాగంగా ఫోను చేసిన వారికి పర్సనలైజ్డ్ సమాధానాలు ఇవ్వడానికి ఈ సాంకేతికతను వాడతారు.
విస్త•త ప్రచారం : ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి సామాజికంగా వెనుకబడిన లేదా వివక్షకు గురైన లేదా సమాజంలో చిన్న చూపునకు గురయ్యే సమూహాలకు విస్త•తంగా ప్రాచుర్యం కల్పించవచ్చు.
పబ్లిక్‍ సేప్టీ : ఈ సాంకేతికత ద్వారా అత్యంత సహజంగా శిక్షణా కార్యక్రమాలను చేపట్టవచ్చు. ఈ ప్రయోజనాలను చట్టాల అమల్లో, మిలటరీ శిక్షణా కార్యక్రమాల్లో, విపత్తు నిర్వహణా కార్యక్రమాల్లో ఉపయోగించవచ్చు.
వినూత్న ఆవిష్కరణలు :
ఈ సాంకేతికత ద్వారా వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఉదా।।కు పరిశ్రమలు, వినోద రంగం, గేమింగ్‍, మార్కెటింగ్‍ మొ।।లైన రంగాలు ఎంతో వినూత్న ఆవిష్కరణలతో శరవేగంగా పురోగమిస్తున్నాయి.
సవాళ్ళు : లాభాలకన్నా, నష్టాల వల్లే డీప్‍ఫేక్‍ టెక్నాలజీ ప్రజల్లో విస్త•తంగా ప్రాచుర్యం పొందింది.
నకిలీ సమాచారం :
డీప్‍ ఫేక్‍ టెక్నాలజీ ద్వారా నకిలీ సమాచారాన్ని అత్యంత వేగంగా, విస్త•తంగా ప్రచారం చేయొచ్చు. ప్రస్తుతం ఈ సాంకేతికత విసిరే పెద్ద సవాలు ఇదేనని నిపుణులు చెబుతున్నారు.
ప్రముఖుల నకిలీ వీడియోలను వైరల్‍ చేయడం వల్ల సాధారణ ప్రజానీకంలో, అత్యంత అయోమయ పరిస్థితి ఏర్పడు తుంది. దీంతో పాటు వారి పరువు, వ్యక్తిగతగోప్యత హక్కుకు నష్టం వాటిల్లుతోంది.
రాజకీయ అస్థిరత : ఈ సాంకేతికత ద్వారా రాజకీయ నాయకుల మాటలను వక్రీరించి వారు మాట్లాడని వాటిని మాట్లాడినట్లు ఫేక్‍ వీడియోలు సృష్టించి, వాటికి ప్రచారం కల్పిస్తున్నారు. అవి ప్రజాభిప్రాయాన్ని మార్చడమే కాకుండా, పాలనా వ్యవస్థపైనా తీవ్ర ప్రభావాన్ని కల్పిస్తున్నాయి.
సామాజిక అస్థిరత :
లింగవివక్షను, సామాజిక వెనుకబాటుతనాన్ని, అసాంఘిక కార్యకలాపాలను, ఉగ్రవాద ఉన్మాద చర్యలను ఈ వీడియోలు లేదా ఫోటోల ద్వారా ఆయా వ్యక్తుల ప్రమేయం లేకుండా సృష్టిస్తున్నారు. ఇవి సమాజంలో అలజడులకు కారణమౌతున్నాయి.
జాతీయ భద్రతకు విఘాతం :
ఈ పరిజ్ఞానం ద్వారా సృష్టించిన నకిలీ సమాచారం, జాతీయ భద్రతకు కూడా విఘాతం కలిగిస్తుంది.
నేర విచారణ పక్రియకు అవరోధాలు :
నేరస్తులను శిక్ష నుండి కాపాడేందుకు నకిలీ వీడియో, ఆడియోల రూపంలో బూటకపు సాక్ష్యాలు సృష్టించి, వాటిని కోర్టుల్లో ప్రవేశపెట్టి, నేరస్తులు శిక్షకు గురవ్వకుండా చేయొచ్చు.
ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం :
వ్యక్తులూ, సంస్థలూ, ప్రభుత్వాలు కూడా డీప్‍ఫేక్‍ బాధితులు కావచ్చు. సైబర్‍క్రైమ్స్ బారిన పడొచ్చు. కార్డుల్ని క్లోన్‍చేసి ఆర్థిక మోసాలు చేయొచ్చు. పరిచయస్తుల గొంతుతో డబ్బు అడగవచ్చు. స్టాక్‍ మ్యానిపులేషన్‍కీ ఇది సాధనంగా మారింది. వివాదస్పద వ్యాఖ్యలతో ఫేక్‍ వీడియోలు సృష్టించి, విడుదల చేయడంతో ఒక్కసారిగా షేర్లు కుప్పకూలుతున్నాయి.


చట్టపరమైన రక్షణ ఉందా??


ఈ నేరానికి మనదేశంలో ప్రత్యేకంగా చట్టమేమీ లేదు. విభిన్న చట్టాల్లోని నిబంధనలను డీప్‍ ఫేక్‍ల నియంత్రణకు వర్తింప జేస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్‍ ఐటీ మంత్రిత్వ శాఖ సోషల్‍ మీడియా ఇంటర్మీడియరీస్‍, ప్లాట్‍ఫాంల నియంత్రణకు కావాల్సిన నియమాలను పేర్కొంది. వీటి ప్రకారం..

  • ఫేస్‍బుక్‍, వాట్సప్‍, ట్విట్టర్‍, ఇన్‍స్టాగ్రామ్‍, యూట్యూబ్‍ తదితర సామాజిక మాధ్యమాలల్లో ప్రజలను తప్పుదోవ పట్టించే నకిలీ వీడియోలు, చిత్రాలు, ఆడియోలను 24 గంటల్లో తొలగించాలి.
  • ఇన్ఫర్మేషన్‍ టెక్నాలజీ చట్టం 2000, సెక్షన్‍ 66డి ప్రకారం, ఈ విధంగా తప్పుడు సమాచారం సృష్టించి, మోసం చేసే వ్యక్తులకు మూడేళ్ళ కారాగార శిక్షతో పాటు, లక్ష రూ।।ల జరిమానా విధిస్తారు.
  • ఇన్ఫర్మేషన్‍ టెక్నాలజీ రూల్‍ 2(2)(బి) ప్రకారం, మార్ఫింగ్‍ చేసిన ఫోటోలు వివిధ రకాల నకిలీ సమాచారానికి సంబంధించిన ఫిర్యాదును స్వీకరించిన 24 గం।।ల్లో ఆయా నకిలీ చిత్రాలు, వీడియోలను సామాజిక మాధ్యమాల నుండి తొలగించాలి.
  • ఐటీ చట్టంలోని రూల్‍ 3(1) (బి) ప్రకారం వేరొక వ్యక్తిని అనుకరించే ఆడియోలు లేదా వీడియోలను సోషల్‍ మీడియా విధానాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఫ్లాట్‍ ఫాంలలో ప్రదర్శించకూడదు.
  • ఐసీసీ సెక్షన్‍ 500 కింద పరువునష్టం కలిగించినందుకు శిక్షించవచ్చు.
  • 2019లో ప్రవేశపెట్టిన పర్సనల్‍ డేటా ప్రొటెక్షన్‍ బిల్‍ పార్లమెంట్‍ ఆమోదం పొందినట్లయితే వ్యక్తిగత సమాచారానికి మరింత రక్షణ లభిస్తుంది.

అంతర్జాతీయ స్థాయిలో డీప్‍ ఫేక్‍ల నియంత్రణకు చేపట్టిన చర్యలు:

  • మహిళలపై ఆన్‍లైన్‍లో అసభ్య ప్రచారానికి పాల్పడేవారికి 9 నెలల జైలు శిక్ష విధించడానికి వీలుగా మెక్సికో ఇటీవలే చట్టం చేసింది.
  • ఇంటర్నెట్‍ను దుర్వినియోగం చేసేవారిని శిక్షించడానికి 2016, 2018లో బ్రిటన్‍ ప్రత్యేక నియమావళిని వెలువరించింది.
  • జర్మనీలో, ఆన్‍లైన్‍లో విద్వేషం, అసభ్య చిత్రాలతో ప్రచారం చేసే వారి గురించి ఫిర్యాదు చేసిన 24 గంటల్లో వాటిని తొలగించాలి. లేకపోతే ఆయా సామాజిక మాధ్యమాలు లక్షల డాలర్ల జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది.
  • చైనాలో ఒక వ్యక్తికి సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు సోషల్‍ మీడియాలో వినియోగించాలంటే తప్పనిసరిగా సదరు వ్యక్తి నుండి అనుమతి తీసుకోవాలని ఆదేశ ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది.
  • కెనడాలో ప్రజలకు హానికలిగించే వైరల్‍ డీప్‍ఫేక్‍ మీడియా కంటెంట్‍ను సోషల్‍ మీడియాలో పెట్టడం చట్ట విరుద్ధం.
డీప్‍ ఫేక్‍లను ఎలా ఎదుర్కోవాలి!!
  • ఒక వీడియో అయినా, ఫోటో అయినా, ప్రసంగమైనా చూడగానే నిజమని నమ్మేయొద్దు. నిశితంగా పరిశీలించాలి. అది నమ్మదగిన వ్యక్తుల నుండే వచ్చిందా లేదా అన్నది గమనించాలి.
  • ఫేక్‍ కంటెంట్‍ అని అనుమానం ఉన్న దేన్నీ ఇతరులకు ఫార్వర్డ్ చేయకూడదు, వెంటనే తొలగించాలి.
  • బ్యాంకుఖాతాలకు సంబంధించీ, ఆర్థిక విషయాలకు సంబంధించీ, ఏ సమాచారాన్నీ ఫోనులో ఎవరికీ చెప్పకూడదు.
  • ఏఐ జనరేటెడ్‍ వీడియోలపై, కనిపించేలా వాటర్‍ మార్కులు ఉంచాలని ఆయా వ్యక్తులకు నిర్దేశాలు ఇవ్వాలి.
  • డీప్‍ ఫేక్‍లను క్షణాల్లో పసిగట్టే డీప్‍ ఫేక్‍ డిటెక్షన్‍ వ్యవస్థలను, మెటాడేటా లాంటి ఆధునిక సాంకేతికతలను విరివిగా వాడుకలోకి తేవాలి.
  • మీడియా లిటరసీ, ప్రజాచైతన్యంతో అనుమానాస్పద కంటెంట్‍ను వైరల్‍కాకుండా కట్టడి చేయాలి.
  • మనం వాడే గ్యాడ్జెట్స్ అన్నిటికీ సెక్యూరిటీ సెట్టింగ్స్ పెట్టుకోవాలి.
  • సమాజంలోని ప్రతి ఒక్కరు స్వీయ సామాజిక నియమావళిని రూపొందించుకొని, దానికి విధిగా కట్టుబడాలి. అప్పుడే ఇలంటి డిజిటల్‍ నేరాలను సమర్థవంతంగా నియంత్రించ వచ్చు ననడంలో ఎలాంటి సందేహం లేదు.


చివరగా :
బంగారం ఎంతో విలువైనది, అందుకే మనం దానిని ఆభరణాలుగా తయారు చేసుకొని ఒంటిపైన ధరిస్తాం. కానీ బంగారు కత్తి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటాం. అదే విధంగా సాంకేతికత (టెక్నాలజీ) అందించే ప్రయోజనాలను అందింపుచ్చుకుంటూనే దాని వల్ల కలిగే నష్టాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


పుట్టా పెద్ద ఓబులేసు,
స్కూల్‍ అసిస్టెంట్‍, జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల
రావులకొలను, సింహాద్రిపురం, కడప
ఎ : 9550290047

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *