పుస్తక పఠనంతో మేధోసంపత్తి
ఆర్ అండ్ ఆర్ కాలనీ జెడ్పీహెచ్‍ఎస్‍లో ‘బాలచెలిమి’ గ్రంథాలయం ఏర్పాటు
పుస్తక పఠనంతో మేధోసంపత్తి పెరుగుతుందని బాలచెలిమి కన్వీనర్ గరిపల్లి అశోక్ తెలిపారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో గల జెడ్పీహెచ్‍ఎస్‍లో బాలచెలిమి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్ సహకారంతో బాలచెలిమి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గరిపల్లి అశోక్ మాట్లాడుతూ… చదవడం రాయడం, అభ్యసనంలో ఒక భాగమని, విద్యార్థులలో పఠనాసక్తిని కలిగిస్తూ, వారిలోని సృజనాత్మకతను వెలికి తీస్తూ, సామర్థ్యాల పెంపుదలకు గ్రంథాలయాలే కీలకమని తెలిపారు. అందులో భాగంగానే, అనేక పాఠశాలల్లో విద్యార్థులకు కథాకార్యశాలలు నిర్వహిస్తూ, వారిలో చదవడం, రాయటం పట్ల ఆసక్తిని కలిగిస్తూ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే బాలచెలిమి గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు గ్రంథాలయంలో లభించే పుస్తకాలను చదవడం వల్ల విజ్ఞానాన్ని మరింత పెంచుకోవచ్చన్నారు.
- గోవర్ధన్ (పిఇటి)
ఎ : 98665 0408