నవనారసింహులు నరసింహస్వామి అవతారంలో విశిష్ట ఆరాధనారూపాలు.
- ఉగ్రనరసింహ
- క్రోధ నరసింహ
- మాలోల నరసింహ
- జ్వాలా నరసింహ
- వరాహ నరసింహ
- భార్గవ నరసింహ
- కరంజ నరసింహ
- యోగా నరసింహ
- లక్ష్మీ నరసింహ
నవ నారసింహ క్షేత్రాలలో వున్న నరసింహమూర్తులు వీరేనని మరికొందరి పండితుల అభిప్రాయాలు:
- జ్వాలా నరసింహ 2. అహోబిల నరసింహ 3. మాలోల నరసింహ 4. క్రోధ నరసింహ 5. కరంజ నరసింహ 6. భార్గవ నరసింహ 7. యోగానంద నరసింహ 8. ఛాత్రవట నరసింహ 9. పవన నరసింహ
ఈ నరసింహ మూర్తుల ప్రతిమాలక్షణాలు వివరంగా తెలియవు. ప్రాంతీయంగా మూర్తి భేదాలు కూడా కారణాలు కావచ్చు. నిజానికి శిల్పం చెక్కే శిల్పికి ధ్యానమంత్రమే ఆధారం. దానికి రూపకల్పన చేయడమన్నది శిల్పుల నైపుణ్యమే.
రూపధ్యాన రత్నావళిలో నారసింహ ధ్యానం:
‘నారసింహః శ్వేతవర్ణః గదాశంఖారి పద్మభ•త్’ అని వుంది. నరసింహుని శిల్పాలు ఈ లక్షణాలతో వుంటాయి.
విజయేంద్ర యతి రాసిన షోడశబాహు నరసింహ అష్టకంలోని 4వ శ్లోకంలో ధ్యానశ్లోకమిట్లా వుంది.
‘‘శంఖం చక్రం చ చాపం పరశుమశమిషుం శూలపాశాంకు శాస్త్రం
బిభ్రన్తం వజ్రఖేటం హలముసలగదాకుంతమత్యుగ్రదంష్ట్రం
జ్వాలాకేశం త్రినేత్రం జ్వలదనలనిభం హారకేయూరభూషం
వందే ప్రత్యేకరూపం పరపదనివసః పాతు మాం నారసింహః’’
విష్ణుకోశంలో ‘అష్టముఖ గండభేరుండ,జ్వాలానరసింహ’ ధ్యానంలో
‘‘వందేహం గండభేరుండ, సింహ, వ్యాఘ్ర, హయానన్
క్రోడవా నర ఖగరా భల్లూకాష్టముఖం సదా
ద్వాత్రింశత్ బాహుయుక్తం చ శంఖ, చక్ర, గదాదిభిః
అతిరౌద్రం మహాసింహం పింగాక్షం భీమవిక్రమం
కోటిసూర్యప్రతీకాంశం కాలానల సమప్రభం’’ అని అష్టముఖ నరసింహుడు, ద్వాత్రింశత్ భుజాలతో వుండే మూర్తి ధ్యానం వుంది.
అదే విష్ణుకోశంలో షోడశభుజ నరసింహ ధ్యానం వుంది కాని, అష్టముఖ నరసింహుడని లేదు.
16 చేతులలో ఆయుధాల గురించి చెప్పబడ్డది. చక్రం, శంఖం, బాణం, ధనుస్సు, ఖడ్గం, ఖేటకం, గద, పద్మం, పాశం, అంకుశం, రెండు చేతులు వధించుటకు, రెండు చేతులు చక్రోద్ధరణలో, రెండు చేతులు శత్రువుల కిరీటాలను పట్టుకున్నట్టుగా… వుంటాయి.
కోట్ల నర్సింహులపల్లె
అపూర్వమైన నరసింహస్వామి శిల్పంతో ప్రసిద్ధం. మొత్తం దేశంలోనే ఇటువంటి అష్ట(8)ముఖ, షోడశ(16) బాహు నరసింహమూర్తి అరుదు. ఈ అర్ధ(ఉల్బణ) శిల్పం ప్రాచీనమైనది కూడా. శైవాగమంలో పేర్కొనబడిన ఉపాసకమూర్తి (తంత్ర) నారసింహుడు, వైష్ణవంలో దశావతారాలలో ఒక అవతారంగా ఆరాధింప బడుతున్నాడు. కొండల్లో, గుట్టల్లోని గుహల్లో, రాతిగుండ్ల మీద వ్యక్తమైన రూపాలనే నరసింహస్వామిగా పూజించడం గిరిజన సంప్రదాయం నుంచి వచ్చినదనిపిస్తుంది. చెంచులక్ష్మి కథ నరసింహస్వామికి, గిరజనులకున్న అనుబంధాన్ని చెప్పే పురాణం. నరసింహస్వామి మూర్తులు కాశ్మీరం నుంచి కన్యాకుమారిదాక రెండు చేతులనుంచి 32 చేతులు కలిగి కనిపిస్తాయి. లక్ష్మీ సహితంగా, లక్ష్మీదేవి లేకుండాను వుంటాడు. హిరణ్యకశ్యపుని సంహరిస్తున్న రూపంలో వుంటాడు. యోగానంద రూపంలో కనిపిస్తాడు. లక్ష్మీసహితంగా శ•ంగారమూర్తిగా కనిపిస్తాడు. శంకరాచార్య నుంచి విజయేంద్రయతి దాక లక్ష్మీనరసింహస్వామి ఆరాధనలో స్తోత్ర, ధ్యాన మంత్రాలను రచించారు. బహురూపాల్లో ఆరాధింపబడే నరసింహుడు తాంత్రికుల దైవం కూడా.
ఒక్క కరీంనగర్ ప్రాంతంలోనే 60దాకా నరసింహస్వామి వెలసిన క్షేత్రాలున్నాయి. కోట్ల నర్సింహుల పల్లెలో దేవునికొండగా పిలువబడే గుట్టకు చెక్కి కనిపించే 8తలల, 16చేతుల నరసింహస్వామి తాంత్రిక మూర్తే. శిల్పం శైలి రీత్యా రాష్ట్రకూటుల కాలానికి చెందింది. (7 నుంచి 10వ శ. వరకు). కోట్ల నరసింహుల పల్లె గ్రామంలో కనిపించే కోట ఆనవాళ్ళు వివిధకాలాలలో కట్టినట్లు, వేర్వేరు విధంగా కట్టడాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ రాష్ట్రకూటుల కాలంలోనే నిర్మించినట్లు చెప్పదగిన నిర్మాణశైలిలో వున్న లక్ష్మీనరసింహ, విశ్వనాథాలయా లున్నాయి. తర్వాతి కాలంలో కళ్యాణీ చాళుక్యులు, కాకతీయుల కాలాలలో కట్టించిన శైలిలో మల్లికార్జున, సోమనాథ, వీరభద్రాలయాలు అగుపిస్తున్నాయి.
దేవునిగుట్ట మీద నరసింహస్వామి అపురూపశిల్పం కారణంగా, కోటలున్నందువల్ల ఈ గ్రామానికి కోట్ల నర్సింహుల పల్లె అనే పేరు వచ్చింది.
విష్ణుకోశంలో చెప్పబడిన…
నరసింహ ధ్యానశ్లోకం (8-పదహారు చేతుల నరసింహ మూర్తి)లో
‘‘ధ్యాయో యదా మహత్కర్మ తథా షోడశహస్తవాన్
న•సింహః సర్వలోకేశః సర్వాభరణభూషితః
ద్వౌ విదారణకర్మాహౌ ద్వౌ చాత్రోద్ద్వరణక్షమౌ
చక్రశంఖధరావన్యావన్యౌ బానధనుర్ధరౌ
ఖడ్గఖేటధరావన్యౌ ద్వౌ గదాపద్మధారిణౌ
పాశాంకుశ ధరావన్యౌ ద్వౌ రిపోర్మకుటార్పితౌ
ఇతి షోడశదోర్దండమండితం న•హరి విభుం
ధ్యాయోదంబుజనీలాభమ•గకర్మణ్యనన్యధీ’’ అని వుంది.
కోట్ల నరసింహుల పల్లె నరసింహస్వామి ప్రతిమలక్షణాలకు ఈ ధ్యానశ్లోకం తగినట్టుగా వున్నది.
ప్రస్తుతం మిగిలివున్న నరసింహమూర్తి శిల్పంలో రెండు తలలు స్పష్టంగా, ఒక తల రాలిపోయినట్టుగా, మిగతా తలలు ఛాయామాత్రంగా కనిపిస్తున్నాయి. కుడివైపు చేతులలో రెండుచేతులు హిరణ్యకశ్యపుని పొట్టచీల్చుతున్నట్టుగా, మిగతా చేతులు ఆయుధాలు ధరించి కనిపిస్తున్నాయి. కుడివైపు 8 చేతులు, ఎడమవైపు 7చేతులు మిగిలివున్నాయి. చేతుల్లోని ఆయుధాలు వివరంగా కనిపించడం లేదు.
కోట్ల నర్సింహులపల్లె నరసింహుడు:
ఈ మూర్తిని రాష్ట్రకూట చక్రవర్తి దంతిదుర్గుని (8వ శ.) నాటి ఎల్లోరా దశావతారగుహ-15లో, నందివర్మ (730-795) కాంచీపురంలో వైకుంఠ పెరుమాళ్ గుడిలోని పోరాటద•శ్యంలోని నరసింహ మూర్తులను పోలివుందని కీర్తికుమార్ రాసాడు. నందివర్మ రాష్ట్రకూట రాకుమార్తె రేవను పెండ్లాడినాడు. ఈమె దంతిదుర్గుని కూతురు కావడానికి అవకాశం వుంది. రాష్ట్రకూట రాజ్యస్థాపకుడైన దంతిదుర్గుడు అప్పటి ఉపాసక మతాలను అవలంబించి వుంటాడు.
కోట్ల నర్సింహులపల్లెలో శాసనాధారాలు ఏవీ దొరకలేదు. శిల్పాలు, దేవాలయ నిర్మాణాలను ఆధారం చేసుకునే కాలనిర్ణయం చేయవలసి వస్తున్నది. గుట్ట మీద నందరాజుల(?) నాటిదిగా చెప్పుకునే రాతికోట శిథిలాలు అగుపిస్తాయి. నరసింహాలయానికి ఎదురుగా సీతారామాలయం, దానికవతల 16స్తంభాల అర్థమంటపం కనిపిస్తుంది. ఈ నిర్మాణం మనకు బాదామీ చాళుక్యుల కాలం నుంచి కనిపించే ఒక శైలి. శంకరాచార్యుడు దర్శించాడని నమ్మే విశ్వనాథాలయం వుంది. పక్కన నీటివూటల కోనేరు వుంది.
గుడివద్ద కల్వకోట కీర్తికుమార్ పేరుతో వేయించబడిన శిలాఫలకం మీద ‘1885లో కల్వకోట క్రిష్ణయ్య (రామడుగు) దేశపాండ్యకు స్వప్నసాక్షాత్కారమిచ్చిన నరసింహస్వామి తనకు గుడి కట్టించమన్నాడట. నరసింహస్వామి గుడిని పునరుద్ధరించిందే వీరే. వీరి వంశస్తులే దేవాలయ ధర్మకర్తలు. ఇక్కడ ప్రతియేటా చైత్రపౌర్ణమి నుంచి 3రోజులు బ్రహ్మోత్సవాలు, రామనవమి, వైకుంఠ ఏకాదశి, నరసింహజయంతి వేడుకలు జరుగుతాయి’ అని వుంది.
కోట్ల నరసింహులపల్లె నరసింహస్వామి అష్టముఖ, షోడశబాహుమూర్తి
ఈ శిల్పం క్రీ.పూ.321(?)లో సాతవాహనరాజు శ్రీముఖుని కాలంనాటిదని కాలం నిర్ణయం చేసారు. కాని, ఈనాటికి సాతవాహనులు చెక్కించిన దేవతాశిల్పాలు కోట్ల నర్సింహులపల్లెలో ఎక్కడకూడా లభించిన నిదర్శనాలు లేవు. సాతవాహనుల కాలానికి ఏ సంబంధం లేదు.
కోట్ల నర్సింహులపల్లెలో దొరికిన విడిశిల్పాలలో భైరవుడు, వీరగల్లు వున్నాయి. కోట ప్రదేశంలో ఇటీవలి కాలానికి చెందిన మట్టిగోడలు కనిపిస్తున్నాయి. అక్కడ సాతవాహనుల కాలంనాటి డిజైన్లున్న కుండపెంకులు (కోటిలింగాల, కొండాపూర్ లలో లభించిన వాటితో పోలినవి) దొరికాయి. గ్రామంలో మట్టిఒరల బావులున్నాయని కూడా ప్రజలు చెప్పారు. పెద్దసైజు ఇటికెల ముక్కలు లభిస్తున్నాయి.
జైనధర్మ శిల్పాలు:
అన్నిటికన్నా విశేషం ఇక్కడ ఒక పొలంలో పార్శ్వనాథుని శిల్పం బయటపడడం. ఈ శిల్పం ఏడు పడగలతో గొడుగుపట్టిన సర్పంతో, దిగంబరంగా, కామోత్సర్గ భంగిమలో నిల్చుని వున్న పార్శ్వనాథుని పాదాల వద్ద ఇరువైపుల యక్ష, యక్షిణులిద్దరు వున్నారు. రెండవసారి కూడా ఒక రైతు పొలంలో దున్నుతున్నపుడు బయటపడిన ధ్యానాసనస్థితిలో వున్న జైన తీర్థంకరుని శిల్పం ఋషభనాథునిది. ఈ తీర్థంకరుని అధిష్టానపీఠం ఆ ప్రాంతంలోనే లభించే అవకాశం ఉంది. (విగ్రహం తలవెనక కనిపిస్తున్న జులపాల జుట్టును జడ అనుకున్న కొందరు పరిశీలకులు ఈ విగ్రహాన్ని ‘మల్లినాథ తీర్థంకరుని’గా భావించారు.) ఈ జైన తీర్థంకరుల శిల్పాలు రెండు రాష్ట్రకూటులశైలిలో ఉన్నాయి. వీటిని భద్రమైన చోటుకు తరలించి కాపాడాలని కోరుకుంటున్నాం.
ధన్యవాదాలు:
చరిత్రబ•ందం సభ్యులు వేముగంటి మురళీక•ష్ణ, అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్ (కోట్ల నరసింహుల పల్లె క్షేత్రపరిశీలకులు)
- శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698