పాకాల యశోదారెడ్డి

స్వాతంత్య్రానంతర తెలంగాణ తొలితరం కథకుల్లో ప్రసిద్ధ కథకురాలు యశోధారెడ్డి. రేడియో ధారావాహిక కార్యక్రమం ద్వారా ‘‘మహాలక్ష్మి ముచ్చట్లు’’ అనే పేరుతో తెలంగాణ భాషను తెలుగు ప్రపంచానికి పరిచయం చేసిన తొలి రచయిత్రి యశోదా రెడ్డి.
తెలంగాణ మూరుమూల గ్రామంలో జన్మించి హైద్రాబాదు నగరానికి వచ్చి, విద్యాభ్యాసం చేసి ఒక యూనివర్శిటీలో ప్రొఫెసర్‍ అవ్వడమనేది ఆనాడు చాలా అసాధారణమైనటువంటి విషయం.


ఆమె 1929 ఆగస్టు 8వ తేదీన మహబూబ్‍నగర్‍ జిల్లాలోని మిదినేపల్లి గ్రామంలో జన్మించింది. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం చేసింది. ఆమె ఎంత జ్ఞాపక శక్తి కలిగివున్నది అంటే ఒకసారి పాఠశాలకు వెళ్ళినపుడు పుస్తకాలు తేనందుకు ఆమెను క్లాసు బయటే సార్‍ వుంచినపుడు క్లాసు బయటినుంచే ఆమె పాఠం విని ఆ పాఠంలో అక్షరం పొల్లుపోకుండా వినిపించినటువంటి అద్భుతమైన ఏక సంథాగ్రాహి యశోదా రెడ్డి.
ఆ తరువాత విద్యాభ్యాసం ముగస్తున్నటు వంటి క్రమంలోనే తెలంగాణ చిత్రకారుడు పి.టి.రెడ్డి గారితో వివాహం జరిగింది. ఆయనతోపాటు నారాయణగూడలోనే ఇల్లు తీసుకొని అక్కడే నివాసం ఏర్పరచుకుని అప్పటి నుంచి ఆమె చనిపోయేంత వరకు ఆ నివాస గృహంలోనే వున్నారు.
ఆమె తెలుగులో హరివంశాల మీద పి.హెచ్‍.డి చేసింది. సంస్క•త హరివంశం. నాచ సోమనాథుడి హరవంశం, ఎర్రన హరివంశం, భైరవి కవి హరివంశం మొదలైనటువంటి హరివంశాలని తులనాత్మక అధ్యయనం చేసి తన సిద్ధాంత గ్రంథంలో నిరూపించింది.


తులనాత్మక అధ్యయనానికి అది ఒక తొలిమెట్టుగా విమర్శకులు భావిస్తారు. ఆ పి.హెచ్‍.డి. అనంతరం ఆమె ఉస్మానియా యూనివర్శిటిలో సుదీర్ఘకాలం ప్రొఫెసర్‍గా తన విధుల్ని నిర్వర్తించారు.
అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా 1990-93 మధ్య పని చేసింది. అప్పుడు ఆమెవద్ద నేను పర్సనల్‍ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. అప్పుడు యశోదారెడ్డిగారి ప్రతిభ ఏమిటో, ఆమె ఎంత ముక్కుసూటిగా వెళుతుందో, తన అభిప్రాయాలకు విలువ నీయనటువంటి వారిని ఎవరినీ లెక్కచేయనటువంటి స్థితిలో వుంటుందో, ఆమెకు ఎంత సాహిత్య ప్రతిభ ఉన్నదో, సాహిత్య పాండిత్యం వున్నదో నేను దగ్గరినుండి గమనించడం జరిగింది.


ఆమె పరిశోధనా గ్రంథాల్లో మనం పేర్కొనదగినటువంటి సుప్రసిద్ధమైనటువంటి గ్రంథాలు వున్నాయి. వాటిలో ఒకటి ఆంధ్ర సాహిత్య చరిత్ర వికాసం. ఇది ఆంధ్ర సాహిత్య చరిత్ర ఎట్లా వికసనం చెందిందనే విషయాన్ని ఈ గ్రంథంలో తెలియపర్చింది. తన అన్ని గ్రంథాల్ని పరిశీలించినపుడు ఆమెకు ప్రాచీన సాహిత్యం మీద ఎంత అధికారం వున్నదో, పాశ్చాత్య సాహిత్యం మీద కూడా అంతే అధికారం వుందని, ఆధునిక సాహిత్యం మీద కూడా అంతే అధికారం వున్నదన్న విషయం మనకు అర్థమవుతుంది. ఆమె రెండో గ్రంథం పారిజాతాపహరణ పర్యాలోచనం.
నంది తిమ్మన రాసినటువంటి పారిజాతాపహరణ ప్రబంధాన్ని ఆమె అద్భుతంగా విశ్లేషించింది. అదేవిధంగా ఎల్లాప్రెగడ అనే గ్రంథంలో సంస్క•త హరివంశానికి ఎర్రన హరివంశానికి వున్నటువంటి సామ్యబేధాన్ని తులనాత్మకంగా వివరించి చెప్పింది. అదేవిధంగా ఎరప్రగడ రాసిన నృసింహ పురాణం అనువాద విధానం గురించి రాసినటువంటి ప్రబంధ వాజ్మయం. ఇది 1975 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువడినటువంటి గ్రంథం.


ప్రబంధ వాజ్మయ పరిణామ వికాసాల గురించి చాలా సంక్ష్లిప్తంగా రాసినటువంటి గ్రంథం. చాలా ప్రామాణికంగా రాసినటువంటి గ్రంథం ఇది. ప్రబంధ లక్షణాలేమిటి అని విశ్లేషించి వాటిని మనుచరిత్ర, వసుచరిత్ర, అముక్తమాల్యద, కళాపూర్ణోదయం, పారిజాతాపహరణం, విజయవిలాసం మొదలగునటువంటి గ్రంథాల్లో వున్నటువంటి విశిష్టతను తన అద్భుతమైనటువంటి ప్రతిభతో విశ్లేషించింది. అంతేకాకుండా ఆమె పోతన భాగవసుధ, భాగవత కల్పకుసుమావళి అనే గ్రంథాల్లో ఆ పద్యాలకు అద్భుతమైన వ్యాఖ్యానం రాసింది. ఆ వ్యాఖ్యాన మాధుర్యంలో ప్రేక్షకులు, పాఠకులు ఓలలాడారు.


అంటే సాంస్క•తిక ఛందస్సుల మీద ఆమెకు ఎంత అధికారం ఉన్నదో దేశీఛందస్సు అయినటువంటి ద్విపద మీద కూడా అంతే అధికారం ఉన్నదనే విషయాన్ని మనకు ఈద్విపద వాంగ్మూల గ్రంథం తెలియజేస్తుంది. వారిదే ఇంకొక పరిశోధనాత్మకమైన గ్రంథం ‘‘భారతదేశంలో భారతంలో స్త్రీ’’ అంటే మహాభారతంలో స్త్రీని ఎట్లా వ్యాఖ్యానించింది. భారతదేశంలో స్త్రీ యొక్క స్థానం ఏమిటనేదాన్ని చాలా లోతుల్లోకి వెళ్ళి ఆమె విశ్లేషించింది.
ఇందులో వున్నటువంటి స్త్రీ పాత్రను సాంప్రదాయక దృక్కోణం నుంచీ, ఆధునిక దృక్కోణం నుంచి కూడా విశ్లేషించడం ఇక్కడ గమనించవలసిన విషయం.


సాంప్రదాయక దృక్కోణం నుంచి కుంతీ, ద్రౌపది, గాంధారి, సుధేష్ణ, ఉత్తర, దమయంతి, శకుంతల మొదలైనటువంటి పాత్రల్ని విశ్లేషించింది. ఇక ఆధునిక దృక్కోణం నుంచి ప్రద్వేషిని అనే ఒక కథానాయిక కథని విశ్లేషించింది. పుట్టుగుడ్డి అయినటువంటి ధీర్ఘతముని భార్య అయినటువంటి ఈ ప్రద్వేషిని ఒక ఆధునిక స్త్రీలాగా ఎట్లా భర్తని ఇంటి నుంచి వెళ్ళగొట్టిందో ఆమె అద్భుతంగా దీంట్లో విశ్లేషించింది. అంటే నన్ను వెళ్లిపొమ్మంటున్నావు అని భర్త అడిగినపుడు ఒక తర్కబద్ధమైనటువంటి సమాధానం ఆమె ఎట్లా చెప్పిందో ఇక్కడ వివరించింది.
‘‘పతియు భరియించు కావున భర్త అయ్యే, భామ భరియింపబడును గావున భార్య అయ్యే పరగనయ్యెమలయందు వీడ్వడియే విల్లులోన ఎల్లకాలము భరియింతుగాన’’ కాబట్టి సంపాదన లేకుండా తిని కూర్చొని నామీద ఆధిపత్యం చేస్తున్నట్లయితే నేనెట్లా భరిస్తాను. కాబట్టి నువ్వు సంపాదించి నన్ను భరియిస్తే నువ్వు భర్తవు, నువ్వు సంపాదించకుండా తిని కూర్చొని పైగా నామీద ఆధిపత్యం చెలాయించడం అనేది సరియైనటువంటిది కాదు. కాబట్టి నువ్వు నాకు భర్తగా వుండటం తగదు అని చెప్పి ఇంటి నుంచి ఆమె ఎట్లా బయటికి వెళ్ళగొట్టిందీ అని చెప్పే ఒక ఆధునిక దృక్కోణం నుంచి విశ్లేషించింది యశోదా రెడ్డి.


అదేవిధంగా ఆ గ్రంథంలో ఉపసంహారం అనే భాగంలో ‘‘మారుతున్న సమాజంలో స్త్రీ’’ అనే శీర్షిక కిందామె ఈవిధంగా అన్నది. ‘‘స్త్రీకి సమాన హక్కులు ఉండాలని, స్త్రీ సమస్యా పరిష్కారం కోసం కృషి చేయాలని’’ అందుకే ఈ గ్రంథాన్ని రాశానని ఆమె పేర్కొన్నారు. అంటే ఆమె కేవలం పరిశోధన కోసం కాకుండా ఆధునిక దృక్కోణం నుంచి అసలు స్త్రీ గురించి మాట్లాడటమే స్త్రీ పాత్రల గురించి మాట్లాడటమే ఆధునిక దృక్పథం వున్నట్లు మనకు అర్థమవుతుంది.


అంతేకాకుండా ఆమె హిందీ కవయిత్రులు అనే పుస్తకాన్ని కూడా అనువాదం చేసింది. అంటే దాని ద్వారా స్త్రీపట్ల ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిలాష వున్నదన్న విషయం మనకు ఈ గ్రంథాల వల్ల తెలుస్తుంది.
ఈ పరిశోధనాత్మకమైనటువంటి, విమర్శనాత్మకమైనటువంటి గ్రంథాలే కాదు. ఆమె అద్భుతమైనటువంటి కథలు రాసింది. ఆమె కథల్ని నేషనల్‍ బుక్‍ ట్రస్ట్ ‘‘ఉత్తమ కథలు’’ అనే పేరుతో ఒక సంపుటిగా వెలువరించింది. అచ్చమైన తెలంగాణ గ్రామీణ జీవితాలను కల్పనకు, వాస్తవికతకు మధ్య అంతరాన్ని చెరిపివేసిన ముత్యాల లాంటి కథలు ఇవి.
యశోదా రెడ్డి కథలు మంచిని పెంచే కథలు, మానవత్వాన్ని తట్టిలేసే కథలు, ఆర్ద్రత నిండిన కథలు, వేలాది తెలంగాణ భాషా పదాలను, సంస్క•తీ వైవిధ్యాలను, మాటతీరును బంగారంలో వజ్రాల్లా తన కథలో పొదిగారు.


భాష, సంస్క•తి, నుడికారం, మానవ సంబంధాలు, పరిణామాల చిత్రణ, ప్రధాన లక్ష్యం అయినప్పటికి గ్రామీణ జీవనం వారి వారి వ్యక్తిత్వాలు, జీవన ప్రమాణాలు దశాబ్దాల తరబడి ఎలా కొనసాగాయో సామాజిక శాస్త్రాల కన్నా మిక్కిలి శక్తివంతమైన కథల్లో చిత్రీకరించారు.
ఈ వ్యాఖ్యానం ఆమెయొక్క కథల విశిష్టతను తెలియజేస్తుంది. ఆమె ‘ధర్మశాల’ అనే కథా సంపుటిలో 24 కథల్ని, అదేవిధంగా ‘‘మా ఊరి ముచ్చట్లు’’ అనే కథా సంపుటిలోనూ, ఎచ్చమ్మ కథలు అనే కథా సంపుటిలోనూ తెలంగాణా మాండలిక మాధుర్యాన్ని చాలా అద్భుతంగా వ్యక్తం చేసింది.
అంటే తెలంగాణ భాషను ఎవ్వరూ పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ భాషకు ప్రాధాన్యత నిచ్చి తన కథల్లో తెలంగాణ భాష విశిష్టతను ఉదాహరణ సహితంగా వ్యక్తం చేసింది. ఈ కథాసంపుటితో పాటు ‘‘భావిక’’, ‘‘ఉగాదికి ఉయ్యాల’’ అనే కవితా సంపుటిలను కూడా ఆమె వెలువరించింది.
తన స్త్రీ దృక్పథాన్ని గురించి చెప్తూ స్త్రీలంటే ఎవరనుకున్నారు. మీరుగు దిశతిప్పిన బొమ్మలా మీ చేతిలో చిత్విలా, మీకు వీచే విసనకర్రలా, పీక్వాసోపానాలా, సాగనివ్వం. ఇక ఈ పురుషుల హతకుల సార్వభౌమత్వం కూలిపోతుంది. ఈ ఎద్దు మొద్దుల అహంభావన అధికారం. సాగుతుందిక స్త్రీ చైతన్య రథం’ అని తన స్త్రీ దృక్కోణాన్ని, స్త్రీకి, పురుషుడికీ సమాన హక్కులుండాలనే దృక్కోణాన్ని తన కవిత్వంలో వ్యక్తం చేసింది.
సమతాభావనని తన కవితాసంపుటిల్లో వ్యక్తం చేసింది. ఈ రకంగా ఒక పండితురాలిగా, ఒక వక్తగా ఒక పరిశోధకురాలిగా, ఒక విమర్శకురాలిగా, ఒక కథకురాలిగా ఒక కవయిత్రిగా విభిన్నమైనటువంటి పాత్రల్ని పోషించినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి యశోదారెడ్డిగారు.
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్క•తిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)

  • డా।। సుంకిరెడ్డి నారాయణరెడ్డి
    ఎ : 98856 82572

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *