మానవ సమాజం మౌలికంగా ఒక్కటే అయినప్పటికీ భౌగోళిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్క•తిక, ప్రాకృతిక వనరులలో విభిన్నతల వల్ల వైరుధ్యాలతో కూడిన, వైవిధ్యంతో కూడిన సంకలితగా ఉంటుంది. ఆ ప్రయోజనాలను తీర్చగలిగిన అభివృద్ధి విధానాల రూపకల్పన లోనూ ఈ విభిన్నత ప్రధాన పాత్ర పోషిస్తుంది.
సాధ్య, అసాధ్యాలతో నిమిత్తం లేకుండా తాత్కాలిక, ఆకర్షిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చే వివిధ ప్రభుత్వాలు తమ తమ రీతుల్లో అమలుపరిచే ఆర్థిక విధానాలు, పథకాలు ప్రజల సమగ్ర, సమస్త ప్రయోజనాలు నెరవేర్చలేకపోతున్నాయి.
దీనివల్ల ఎప్పటికప్పుడు ఈ సామాజిక, ఆర్థిక, ప్రాకృతిక పరిణామాలకు కారణమైన మౌలిక భావనలను పునర్మూలంకనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది.
ప్రజలు తమ ఓటుతో తమకొక ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటారు. తమ మనుగడకి ఆ ప్రభుత్వమే భరోసా అని నమ్ముతారు. ఆ ప్రభుత్వాలు ప్రజల ఆయా ప్రయోజనాలకు అనుగుణంగా కృషి చేయాల్సి ఉంటుంది. మనది వ్యవసాయిక దేశం. వ్యవసాయానికి అనుకూలమైన భూమికి కొదవలేదు. పుష్కలమైన నీటి వనరులున్నాయి. మానవ శ్రమ అపారం. వీటి మధ్య సమన్వయం సాధ్యం చేయాలి. ఆరోగ్యమైన సమాజం కోసం సరైన వైద్యరంగాభివృద్ధి జరగాలి. జ్ఞానవంతమైన సమాజం కోసం విద్యను అందరికీ అందించాలి. శబ్ద, వాయు, జల, భూగర్భ కాలుష్యం లేని పారిశ్రామిక రంగంలో అభివృద్ధి జరగాలి.
పెరుగుతున్న జనానికి అనుగుణంగా ఆవాస నివాస నిర్మాణాలు, రవాణా సౌకర్యాలు, మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించాలి. డ్రైనేజీ నిర్మాణం జరగాలి. ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ పొందేందుకు అవసరమైన పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవాలి. భౌగోళిక, నైసర్గికతలలోని ఔన్నత్యాన్ని, ప్రత్యేకతలను కాపాడుకోవాలి.
ఈ కృషిలో తీసుకునే అన్ని చర్యలూ పారదర్శకంగా ఉండాలి. ప్రజలను భాగస్వాములను చేయాలి. ఎన్నికలకు ముందే అన్ని రాజకీయ పక్షాలు తమ మేనిఫెస్టోలలో తాము చేయగలిగిన, తమకు సాధ్యమైన అంశాలనే వాగ్ధానం చేయాలి. అందులో నిజాయితీ, నిబద్ధత ఉండాలి.
ప్రభుత్వాలు మారొచ్చు. కాని ప్రజా జీవితం, అవసరాలు, పరిష్కారాలు ప్రధానం కనుక ప్రభుత్వాలు తాత్కాలిక ప్రయోజనాల కోసం కాక శాశ్వత పరిష్కారాల కోసం, సమగ్రమైన, సుస్థిరమైన, నిజాయితీతో కూడిన నిర్ధిష్టమైన ప్రణాళికలు అవసరమని గుర్తించాలి. దీనికి విడివిడి ప్లాన్‍లు కాక ఒక సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవాలి. ఈ రూపకల్పనలో వివిధ రంగాలకు చెందిన నైపుణ్యం, అనుభవం గలిగిన మేధావులను, ఆయా రంగాల ప్రభుత్వ అధికారులను, ఆ ప్రాంత ప్రజలను భాగస్వాములను చేయాలి.
అభివృద్ధి చెందిన సాంకేతిక జ్ఞానం మానవ శ్రమ వినియోగాన్ని తగ్గించాలి. ప్రజల బుద్ధి వినియోగానికి దోహదం చేయాలి.
(మణికొండ వేదకుమార్)
ఎడిటర్