మనిషి మెదడులో చిప్‍… ఏ న్యూరాలింక్‍ టెక్నాలజీ!!!

చందమామ కథలో చదివా… రెక్కల గుర్రాలుంటాయని, నమ్మడానికి ఎంత బాగుందో…!! బాల మిత్ర కథలో చదివా… పగడపు దీపులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో..!! అంటూ ఓ సినీ గేయ రచయిత, ఓ తెలుగు సినిమాలో, ప్రేమికులైన నాయక, నాయికలను కాసేపు ఊహలలోకంలో విహరింపజేస్తారు.


మనం కూడా రాత్రి నిద్రపోయే టపుడు ఎన్నో మధురమైన కలలు కంటూ ఊహల్లో తే•లుతూ ఉంటాం. కళ్ళు తెరిస్తే అవేవి మనకు కనిపించవు. కానీ కంప్యూటర్‍ డేటా తరహాలో అలాంటి మధురమైన కలలకు సంబంధించిన జ్ఞాపకాలను మనం డౌన్‍లోడ్‍ చేసుకొని భద్రపరచు కోగలిగితే, అవసరమైనపుడు వాటిని ‘‘రీప్లే’’ చేసుకోగలిగితే, మనసులో అనుకున్న వెంటనే హైదరాబాద్‍ బిర్యానీ వచ్చి, మన ఇంటి ముంగిట వాలితే, మనం జపాన్‍ వెళ్ళినపుడు, జపనీస్‍ భాష మనకు మాట్లాడడం రాదు, అయితే జపనీస్‍ భాషను మన మెదడులోకి డౌన్‍లోడ్‍ చేసుకొని, జపనీస్‍ భాషను మనం అవలీలగా మాట్లాడితే… ఇవన్నీ చూడడానికి వింతగా, విడ్డూరంగా కనిపిస్తున్నప్పటికీ, తను ప్రతిపాదించిన న్యూరాలింక్‍ టెక్నాలజీ ద్వారా సాకారం కావడానికి మరెంతో కాలం పట్టదనీ ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలన్‍మస్క్ ఘంటాపథంగా చెబుతున్నారు. దీనికోసం తాము మనిషి మెదడులో చిప్‍ను విజయవంతగా అమర్చామని, ఆ మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటున్నాడని ఇటీవల ట్వీట్‍ చేశారు. ఈ నేపథ్యంలో న్యూరాలింక్‍ టెక్నాలజీ గురించి మనమూ తెలుసుకుందామా!!


అసలు న్యూరాలింక్‍ అంటే!!
న్యూరాలింక్‍లో న్యూరా అంటే నాడులు, లింక్‍ అంటే అనుసంధానం, న్యూరాలింక్‍ అంటే నాడుల అనుసంధానం అని చెప్పవచ్చు. న్యూరాలింక్‍ అనునది ఒక అంకుర సంస్థ (start up). దీనిని ఎలన్‍మస్క్ 2017లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ మానవ మెదుడుని, కంప్యూటర్‍తో అనుసంధానం చేసే ఒక సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. దీనినే బ్రెయిన్‍ మిషన్‍ ఇంటర్‍ ఫేస్‍ (బీఎంఐ) అని పిలుస్తారు. వ్యవహారికంగా న్యూరాలింక్‍ టెక్నాలజీ అంటారు. బీఎంఐ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మానవ శరీరంలో అత్యంత సంక్లిష్ట అవయవమైన మెదడులో, వైర్‍లెస్‍ బ్రెయిన్‍ కంప్యూటర్‍ ఇంటర్‍ ఫేస్‍ను ఏర్పాటు చేయడం న్యూరాలింక్‍ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం. బీఎంఐ సాంకేతికత ద్వారా ఫోన్‍ లాంటి ఎటువంటి పరికరం లేకుండా, కేవలం మన ఆలోచనలతో ప్రపంచంలో ఎక్కడో ఉన్న వేరొక మనిషితో డైరెక్ట్గా సమాచారం ఇచ్చిపుచుచకునేలా అనుసంధానం కావడాన్ని టెలీపతి అని పిలుస్తారు. ఈ టెలీపతిని సాకారం చేయడం న్యూరాలింక్‍ ప్రధానలక్ష్యం. మానవ మెదడులో అమర్చే చిప్‍ను టెలీపతి చిప్‍ అని అంటారు. అందుకే ఈ పక్రియనంతటినీ న్యూరాలింక్‍ టెలీపతి అని వ్యవహరిస్తారు.


మెదడులో చిప్‍ ఎలా అమరుస్తారు

మనావ మెదడులో అమర్చడానికి 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ‘ఎన్‍’1 అనే ఇంప్లాంట్‍ను ఎంపిక చేసుకుంటారు. ఎన్‍1 ఇంప్లాంట్‍ ఒక నాణెం పరిమాణంలో ఉంటుంది. దానిలో ఒక చిప్‍, ఒక బ్యాటరీ, చిప్‍కు అనుసంధానంగా 1024 ఎలక్ట్రోడ్లను కలిగిన, 64 అత్యంత సన్నటి పోచల్లాంటి నిర్మాణాలుంటాయి. వెంట్రుకతో పోలిస్తే, ఈ పోచల మందం 20వ వంతు మాత్రమే ఉంటుంది. ఈ చిప్‍ చెవిపై ఉండే ఒక సాధనంతో వైర్‍లెస్‍ పద్ధతిలో అనుసంధానమై ఉంటుంది. అది బ్లూటూత్‍ సహాయంతో సమీపంలోని స్మార్ట్ఫోన్‍తో అనుసంధానం కాగలదు. చిప్‍కు ఉండే పోచలు ఎంత పలుచగా ఉంటే అంత సులువుగా మెదడులోని రక్తనాళాలకు ఎలాంటి హాని కలగకుండా చిప్‍ను మెదడులో అమర్చవచ్చు. చిప్‍ను అమర్చేటప్పుడు ఏ మాత్రం పొరపాటు జరిగినా, దాని వల్ల మెదడులోని రక్తనాళాలకు చిన్న పాటి గాయమైనా, అది బ్రెయిన్‍ స్ట్రోక్‍కు దారితీసి, వ్యక్తి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇలాంటి సంక్లిష్టమైన పక్రియను, అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించడం మానవ మాత్రులకు సాధ్యం కాదు. అందుకే న్యూరాలింక్‍ కంపెనీ ఈ పక్రియనంతా సక్రమంగా నిర్వహించడం కోసం ‘ఆర్‍’1 అనే ఆటోమేటిక్‍ రోబోట్‍ను తయారు చేసింది. ఇది 8 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ రోబో తలలో పెద్ద గాయం లేకుండా కేవలం 8 మిల్లీమీటర్ల పరిమాణం (1 సె.మీ. కన్నా తక్కువ)తో ఒక చిన్న రంధ్రం చేసి పుర్రెకు, మెదడుకు మధ్య ఈ ఎన్‍1 ఇంప్లాంట్‍ను అమరుస్తుంది. ఈ ఇంప్లాంట్‍ నందలి చిప్‍కు ఉండే ఎలక్ట్రోడ్లను కలిగిన సన్నటి పోచల్లాంటి నిర్మాణాలను మెదడులోనికి చొప్పిస్తారు. వీటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. ముందే చెప్పుకున్నట్లు అవి సుతిమెత్తగా, ఎటుపడితే అటు వంగేలా
ఉంటాయి. అందువల్ల సమీప కణజాలానికి ఎలాంటి నష్టం ఉండదు. ఈ చిప్‍లోని బ్యాటరీ వైర్‍లెస్‍ పద్ధతిలో చార్జింగ్‍ అవుతుంది. అందువల్ల దీన్ని ధరించిన వారు సాధారణంగానే కనిపిస్తారు. అంతేకాకుండా ఈ పక్రియ అంతా రివర్సబుల్‍. అంటే ఈ చిప్‍ వద్దన కుంటే, ఎప్పుడైనా తొలగించు కోవచ్చు. ఈ పరికరాన్ని మెదడుకు దూరంగా పెడితే సంకేతాలను ఖచ్చి తత్వంతో గుర్తించడం సాధ్యం కాదు. అందువల్లే పుర్రెలో అమర్చుతారు. అంతేగాకుండా కొన్ని సం।।రాల తరువాత ఈ చిప్‍లో అప్డేట్స్ వస్తే, తదనుగుణంగా వాటిని అప్డేట్‍ చేసు కోవచ్చు.


ఎలా పని చేస్తుంది
మన బ్రెయిన్లో కోట్ల సంఖ్యలో న్యూరాన్లు (నాడీకణాలు) ఉంటాయి. మనం చూడాలన్నా, మాట్లాడాలన్నా, కదలాలన్నా, ఇలా ఏ పని చేయాలన్నా మన మెదడులో ఎలక్ట్రిక్‍ సిగ్నల్స్ అనేవి ఒక న్యూరాన్‍ నుండి మరొక న్యూరాన్‍కు నిరంతరం ప్రసారమవుతూ ఉంటాయి. ఇలా న్యూరాన్ల మధ్య ఎలక్ట్రిక్‍ సంకేతాలు ఏర్పడినప్పుడు అక్కడ స్వల్పస్థాయిలో ఎలక్ట్రో మ్యాగ్నటిక్‍ ఫీల్డ్ (విద్యుదయస్కాంత క్షేత్రం) ఏర్పడుతుంది. ఈ సమయంలో మెదడులో అమర్చిన చిప్‍ యొక్క ఎలక్ట్రోడ్లు, ఈ విద్యుదయ స్కాంత క్షేత్రం ఆధారంగా ఈ ఎలక్ట్రిక్‍ సిగ్నల్స్ని స్వీకరించి, చిప్‍కి పంపిస్తే, ఆ చిప్‍ వాటిని 0,1 లుగా కంప్యూటర్‍లు అర్థం చేసుకొనే బైనరీ కోడ్‍లోకి మారుస్తుంది. అలాగే బయటి నుండి మనం ఏదైనా సమాచారాన్ని అందిస్తే దానిని బైనరీ కోడ్‍ నుండి ఎలక్ట్రిక్‍ సిగ్నల్స్ రూపంలోకి మార్చి, బ్రెయిన్‍లోని న్యూరాన్లకు అందిస్తుంది. ఇలా ఈ సమాచారమంతా బ్లూటూత్‍ ద్వారా అందజేయబడుతుంది. ఎందుకంటే మెదడులోని చిప్‍కి ఎలాంటి వైర్లు ఉండవు. ఒకవేళ ఏవైనా వైర్లు ఉంటే, ఆ వైర్ల యొక్క రంధ్రాల గుండా బ్యాక్టీరియా మెదడులోకి ప్రవేశించి, బ్రెయిన్‍కి ఇన్‍ఫెక్షన్‍ సోకే ప్రమాదం ఉంది. అలాగే ఛార్జింగ్‍ కూడా వైర్‍లెస్‍ మాగ్నటిక్‍ ఇండక్షన్‍ ద్వారా వైర్‍లెస్‍ విధానంలో అవుతుంది.


స్వల్పకాలిక, ధీర్ఘకాలిక లక్ష్యాలు
మానవ మెదుడు చాలకవిధులు (motor functions), మరియు గ్రాహక విధులు (sensors functions) అన్న రెండు రకాల విధులను నిర్వహిస్తుంది. నడవడం, మాట్లాడడం, తినడం లాంటివి చాలక విధులు కాగా, రుచి (taste), వాసన (smell), స్పర్శ (touch) లాంటి వాటిని గ్రాహక విధులు అంటారు. ప్రస్తుతం న్యూరాలింక్‍ టెక్నాలజీ ద్వారా అభివృద్ధి పరిచిన సాంకేతికత మెదడు యొక్క చాలక విధుల (motor functions)ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడుతుంది.


న్యూరాలింక్‍ సాంకేతికత స్వల్ప కాలిక లక్ష్యం, వివిద కారణాల వల్ల అవయవాలు కోల్పోయిన వారి యొక్క అవయవాలు సవ్యంగా పనిచేసేందుకు వినియో గించడమని, కాగా సాధారణ మనిషిని, సూపర్‍ హ్యూమన్‍గా తీర్చి దిద్దడం న్యూరాలింక్‍ టెక్నాలజీ దీర్ఘకాలిక లక్ష్యమని ఎలన్‍ మస్క్ తెలిపారు.


ప్రయోజనాలు:
నాడీ సమస్యలకు శాశ్వత పరిష్కారం

నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వంటివాటివల్ల కాళ్ళు,చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ, కదలికలను మెరుగుపరిచే వీలుంది. వీరు సులువుగా ఉపకర ణాలను ఉపయోగించ గలుగుతారు. దీర్ఘకాలంలో వీరి అవయ వాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించగలిగే వీలుంది.


ఉదా।।కు మోటార్‍ న్యూరాన్‍ డిసీజ్‍ కారణంగా వీల్‍ఛైర్‍కే పరిమితమై, ఇటీవల మరణించిన ప్రపంచ ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, కాస్మాలజిస్ట్ స్టీఫెన్‍హాకింగ్‍, కండరాల కదలికలు సరిగాలేక శరీరమంతా చచ్చుబడిపోయినా, వీల్‍ఛైర్‍లో కూర్చుని తన బుగ్గ కండరాన్ని కదలించడం ద్వారా, ఎన్నో అద్భుతమైన, ప్రతి పాదనలను, సిద్ధాంతాలను ప్రపంచానికి అందించారు. కానీ అది చాలా క్లిష్టమైన పక్రియ. ఆయన వీల్‍ఛైర్‍కి అమర్చిన కంప్యూటర్‍ తెరపై పదాలు వరుసగా వెళ్తుంటే, తాను అనుకున్న పదం వచ్చినపుడు బుగ్గ కండరాన్ని కదల్చడం ద్వారా తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఆయన చెప్పేవారు.


అంత కష్టం లేకుండా న్యూరాలింక్‍ సాంకేతికత ద్వారా ఆయన మెదడులో ఒక ఇంప్లాంట్‍ను అమర్చి, అది వైర్‍లెస్‍గా ఏ కంప్యూటర్‍కో, ఫోన్‍కో అనుసంధానమై పోయి, ఆయన మెదడులో వచ్చిన ఆలోచనలను అక్షరరూపంలోకి మార్చవచ్చు.


మానసిక వ్యాధుల నియంత్రణ
పార్కిన్‍సన్స్, డిమెన్షియా, అల్జీమర్స్ లాంటి మానసిక వ్యాధుల చికిత్స కోసం ఈ సాంకేతికతను వినియోగించవచ్చు.
ఆలోచనాశక్తితో వస్తువుల నియంత్రణ
ఆలోచనశక్తి సహాయంతో టెక్టస్ లేదా స్వర సందేశాలతో కమ్యూనికేషన్‍ సాగించడానికి, బొమ్మలు గీయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.
జ్ఞాపకశక్తిని స్థిరంగా ఉంచడం
కొత్త సమాచారాన్ని నేర్చుకునే మరియు గుర్తుంచుకొనే సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చు. క్లౌడ్‍ సర్వర్‍లో నిల్వచేయబడిన ఆర్టిఫిషియల్‍ ఇంటలిజెన్స్ సిస్టమ్‍లోకి వారి జ్ఞాపకాలను అప్‍లోడ్‍ చేయడానికి వారిని అనుమతించడం ద్వారా వయసుపెరిగినప్పటికీ జ్ఞాపకశక్తిని కోల్పోయే అవకాశం ఉండదు.
హార్మోన్ల నియంత్రణ
ఈ చిప్‍ సాయంతో హార్మోన్‍ స్థాయిని కూడా నియంత్రించొచ్చు. కుంగుబాటును దూరం చేసుకోవచ్చు.
నైపుణ్యాల మెరుగుదల
అవసరమైన నైపుణ్యాలను మెదడులోకి డౌన్‍లోడ్‍ చేసుకోవచ్చు. కంటిచూపును, వినికిడి పరిధిని పెంచుకోవచ్చు.
టెలీపతి: ముందే చెప్పుకున్నట్లు మన ఆలోచనలతో, ప్రపచంలో ఎక్కడో ఉన్న వేరొక మనిషితో నేరుగా సమాచారం ఇచ్చిపుచుకునేలా అనుసంధానం కావడాన్ని టెలీపతి అంటారు. న్యూరాలింక్‍ సాంకేతికతతో టెలీపతి సౌకర్యం సాకారమయ్యే అవకశం ఉంది.


సూపర్‍ హ్యూమన్‍ కాగ్నిషన్‍
ఎలన్‍మస్క్కు కృత్రిమ మేధ (ఏఐ)పై తీవ్ర వ్యతిరేకత ఉంది. అది మానవుడి కన్నా తెలివైందని, భవిష్యత్‍లో మానవాళిపై పై చేయి సాధిస్తుందని తరచూ చెబుతున్నారు. ఈ ఏఐని అధిగమించడానికి మానవునికి ప్రస్తుతమున్న సామర్థ్యాలు సరిపోవని మనిషి సూపర్‍ హ్యూమన్‍గా మారాలని మస్క్ చెబుతున్నారు.
కాబట్టి సుదీర్ఘ భవిష్యత్‍లో న్యూరాలింక్‍ సాంకేతికత ద్వారా మానవాతీత విషయ గ్రహణ సామర్థ్యం (సూపర్‍ హ్యూమన్‍ కాగ్నిషన్‍) సాధించవచ్చు. కృత్రిమ మేధపై పోరాటానికి ఈ సామర్థ్యం చాలా అవసరం. మానవుడు సూపర్‍ హ్యూమన్‍గా మారితే ‘ఏ ఐ’తో సురక్షిత సహజీవనం కూడా చేయవచ్చు.
సవాళ్ళు :
గోప్యతకు చిక్కులు

మన మెదడు ఇంటర్నెట్‍తో కనెక్ట్ అయి ఉంటుంది. మన ఆలోచనలకీ, మన మెదడులో నిక్షిప్తమై ఉన్న సమాచారానికి ప్రైవసీ అవసరం. ఎవరైనా మన బ్రెయిన్‍కి కనెక్ట్ అయి ఉన్న చిప్‍ని హ్యాక్‍ చేసి మన అకౌంట్స్ సంబంధించిన పాస్‍వర్డస్ వంటి డేటాను తస్కరించడం లేదా తొలగించే ప్రమాదం ఉంది.


వాణిజ్య రంగంలో గుత్తాధిపత్యం
వాణిజ్య కంపెనీలు ప్రకటనల ద్వారా మన మెదడులోని చిప్‍లను నియంత్రణలోకి తెచ్చుకొని ఆయా కంపెనీల బ్రాండ్లను చూసిన వెంటనే, మెదడులో డోపమైన్‍ విడుదల చేయించడం ద్వారా, ఆ బ్రాండ్లపైన సానుకూల భావాన్ని కలిగించి తమ ప్రొడక్ట్లను మాత్రమే కొనేలా చేసి వాణిజ్య రంగంలో ఏక ఛత్రాధిపత్యం సాధించే అవకాశం ఉంది. అంటే వాణిజ్య ప్రకటనలు ప్రస్తుతం పెద్ద పెద్ద హోర్డింగులు, వెబ్‍సైట్స్, టీవీల్లో కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మన ఆలోచనల మధ్య కూడా వచ్చే అవకాశం ఉంది.
భద్రత మరియు విశ్వసనీయత
న్యూరాలింక్‍ సాంకేతికత విరివిగా మానవాళికి అందుబాటులోకి వచ్చే ముందుగా మన మెదడులోని ఆలోచనలకు సంబంధించిన సమాచారం తస్కరించబడకుండా చూడాలి. అప్పుడే ఆ సమాచారానికి విశ్వసనీయత ఉంటుంది. ఇందుకొరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలి.
బగ్స్తో ప్రమాదం
సమీప భవిష్యత్‍లో మానవ మెదడులో అమర్చిన చిప్‍లో కూడా అప్‍డేట్లు వస్తాయని, తద్వారా కాలానుగుణంగా ఆ చిప్‍ను అప్‍డేట్‍ చేసుకోవచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ అప్‍డేట్లలో బగ్స్ ఉంటే ఎదురయ్యే విపరిణామాలను ఎలా ఎదుర్కోవాలన్న ప్రశ్నకు ఎవరిదగ్గరా సమాధానం లేదు. దీనికి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది.


సామాజిక అసమానతలు
బాగాడబ్బున్న వాళ్ళు ఇప్పుడు ఖరీదైన ఫోన్‍లు కొనుక్కున్నట్లే భవిష్యత్‍లో తమ బ్రెయిన్‍ ఇంప్లాంట్లకు, అత్యంత ఖరీదైన అప్‍గ్రేడ్‍లు చేయించుకొని తెలివితేటలు పెంచేసుకుంటే బాగా తెలివైన వాళ్ళు, తెలివితక్కువగా ఉన్నవారు అనే వర్గాలుగా విడిపోయి మానవాళి మధ్య సామాజిక అసమానతలు తలెత్తుతాయన్న ఆందోళనలో అతిశయోక్తిలేదు.
ఖరీదైనది
న్యూరాలింక్‍ సాంకేతికతలో వినియోగించే చిప్‍లు అత్యంత అధునాతనమైనవి. కాబట్టి వాటిధర సామాన్యులకు అందనంత ఎక్కువగా ఉంటుందన్న వాదన ఉంది.
వ్యసనం, ఆందోళన, నిరాశ వంటి ప్రతికూల పరిణామాలకు అవకాశం
న్యూరాలింక్‍ టెక్నాలజీ ద్వారా మానవులు సూపర్‍ హ్యూమన్‍ సామర్థ్యాలను పొందితే, వారు దానికి బానిసలౌతారు. తద్వారా వారు నిజ జీవిత అనుభవాలపై ఆసక్తిని కోల్పోతారు. తద్వారా వారిలో ఆందోళన, నిరాశలు పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని పరిశోధనలు అవసరం :
న్యూరాలింక్‍ సాంకేతికత మానవాళిపై కలిగించే సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఇదే మొదటిది కాదు
మానవ మెదడులో చిప్‍ను అమర్చే సాంకేతికతలో న్యూరాలింక్‍ మాత్రమే మొదటికాదు. బ్లాక్‍రాక్‍ న్యూరోటెక్‍ అనే సంస్థ రెండు దశాబ్దాల క్రితమే ‘యూటాయారే’ అనే పేరుతో ఒక ఇంప్లాంట్‍ను అభివృద్ధి చేసింది. సింక్రాన్‍ అనే మరో సంస్థ కూడా ఇలా బ్రెయిన్‍ ఇంప్లాంట్లను మనుషులకు అమర్చింది. స్విట్జర్లాండ్‍ చెందిన ఈసీఎఫ్‍ఎల్‍ (ఎకోల్‍ పాలిటెక్నిక్‍ ఫెడరల్‍ ఇన్‍ లాసాన్‍) గత ఏడాది మే నెలలో గెర్ట్ జాన్‍ ఆస్కామ్‍ అనే ఒక పక్షవాత బాధితుడి మెదడులో ఇంప్లాంట్‍ను అమర్చి, అతడు నడవగలిగేలా చేసింది. కాకపోతే సాధారణ ఆరోగ్యవంతుల్లాగా నడవలేకపోయినా, అప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న చిన్న పిల్లల్లా నడవగలుగుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కనీసం 42 మంది తమ మెదళ్లలో ఇలాంటి ఇంప్లాంట్లను కలిగి ఉన్నారని వాషింగ్టన్‍ పోస్ట్ వార్తా సంస్థ తెలిపింది. అయితే పైన తెలిపిన సాంకేతికతల కన్నా న్యూరాలింక్‍ సాంకేతికత సరళమైనది, సురక్షితమైనది, ప్రభావవంతమైనదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
చివరగా
సాంకేతిక రంగంలో దినదిన ప్రవర్థమానమై వర్ధిల్లుతున్న ఈ ప్రగతిశీల పయనంలో ప్రతి సాంకేతికత వల్ల అపార ప్రయోజనాలతో పాటు, అపాయకర ప్రతికూలతలు కూడా ఉంటాయన్నది వాస్తవం. న్యూరాలిక్‍ సాంకేతికత కూడా ఇందుకు మినహాయింపు కాదు. కాబట్టి న్యూరాలింక్‍ సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు, ప్రతికూలతలను కూడా గుర్తెరిగి, వాటిని పరిష్కరించే దిశగా మరిన్ని పరిశోధనలు జరగాలి. తద్వారా ఈ సాంకేతికత ద్వారా మానవాళికి మహోపకారం జరగాలని ఆశిద్దాం.


-పుట్టా పెద్ద ఓబులేసు,
స్కూల్‍ అసిస్టెంట్‍, జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల
రావులకొలను, సింహాద్రిపురం, కడప
ఎ : 9550290047

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *