‘‘స్వాతంత్ర సమరయోధులు చెన్నమనేని జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం’’ పోస్టల్ కవర్ ఆవిష్కరణ సందర్భంగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి గారు
‘‘శాసనసభలో వారి ప్రసంగాలు వారి ప్రత్యామ్నాయ రాజకీయార్ధిక సామాజిక మార్పులపైన విష్లేశణ ఉన్న ఈ పుస్తకం ప్రతి ప్రజాప్రతినిధికి ఒక విజ్ఞాణభాండారం’’ శాసనసభలో వారి ప్రసంగాల పుస్తకావిష్కరణ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు
‘‘శాసనసభాపతిగా శాసనసభలో వారి పాత్ర చూసే భాగ్యం నాకు దక్కడం నా అద్రుష్టం’’ కె.ఆర్.సురేష్ రెడ్డి గారు, ఎం పి, మాజి స్పీకర్
‘‘చట్ట సభలలో వైవిధ్యమైన రాజకీయ పరిస్తితులను సునాసాయంగా ప్రజాభ్యున్నతి వైపు మలచగల రాజకీయ నైపుణ్యమున్న వ్యక్తి మా అన్నగారు’’ చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు, మాజి గవర్నర్
‘‘బడుగుబలహీన వర్గాలకు సామాజిక న్యాయంతో పాటు రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో చెన్నమనేనికి ఖచ్చితమైన అభిప్రాయం ఉండేది’’ ఎల్.రమణ గారు, శాసనమండలి సభ్యులు
‘‘చెన్నమనేని రాజేశ్వర రావు గారి స్ఫూర్తిని ఫౌండేషన్ కార్యక్రమాల ద్వారా అందరికి అందుబాటులోకి తెస్తాం’’
చెన్నమనేని రమేష్, చెన్నమనేని రాజేశ్వర రావు లలితా దేవి ఫౌండేషన్ చైర్మన్
కీ.శే. చెన్నమనేని రాజేశ్వర రావు గారి శతజయంతి సందర్భంగా ‘‘చెన్నమనేని రాజేశ్వర రావు మరియు లలితా దేవి ఫౌండేషన్’’ ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో 17 ఫిబ్రవరి 2024 సాయంత్రం జలవిహార్, హైదరాబాదులో విడుదలైన పుస్తకం ‘‘శాసనసభలో మూడు దశాబ్దాల ప్రజా వాణి – చెన్నమనేని’’ మరియు భారత పోస్టు విభాగం ద్వారా వారి జ్ఞాపకార్ధం పోస్టల్ కవర్, వారి జీవితకాల విశేషాలను తెలియజేస్తున్న ఫొటో ప్రదర్శన ప్రధానమైనవి.
పార్టీ యజ్ఞంలో నేను సమిధను
పార్టీ చీకట్లో నేను ప్రమిదను
పార్టీ పోరాటంలో నేను సైనికుడిని
పార్టీ నిర్మాణంలో నేను కార్మికుడిని
పార్టీ పాఠ్యాంశంలో నేనొక ముఖ్య అంశాన్ని
నా పాత్ర ఇంకా సశేషం, నేను ఒక విశేషం!
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు నాయకులలో అగ్రజుడు చెన్నమనేని రాజేశ్వరరావు తన గురించి చెప్పుకున్న మాటలు ఇవి. అటు స్వాతంత్య్ర ఉద్యమంలోను, ఇటు కమ్యూనిస్టు పోరాటంలోను ఆయన పోషించిన పాత్ర ఆజరామం. నిజాయితీకి నిలువుటద్ధం! అజాతశత్రువు! నిస్వార్ధ సేవ! పోరాటాలకు స్ఫూర్తి…. ఇవన్నీ చెన్నమనేని వ్యక్తిత్వానికి పర్యాయపదాలు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వివిధ పదవులు అలంకరించి భావితరాలకు స్ఫూర్తినిచ్చిన అలుపెరగని యోధుడు ఆయన.
చెన్నమనేని రాజేశ్వరరావు పద మూడెండ్ల ప్రాయంలోనే సిరిసిల్లలో 1935లో జరిగిన ఆంధ్ర మహాసభలకు స్వచ్ఛంద సేవకులుగా హాజరయ్యారు. స్కాలర్స్ డిబేటింగ్ సొసైటీ పేరుతో స్థాపించిన సంఘానికి కార్యదర్శిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతుగా విద్యార్థులను సమీకరించారు. ఆ సమయంలో అరుణ ఆసఫ్ అలీ రాజేశ్వరరావును నాయకుడిగా సంబోధిస్తూ అభినందించారు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన హైదరాబాదులో మాత్రం నిజాం పాలనే కొనసాగింది. ఈ సమయంలో మేధావులు, ఉద్యమకారులను కలుపుకొని హైదరాబాద్ సంస్థాన విమోచన ఉద్యమంలో పాల్గొన్నారు. రహస్యంగా మారువేషాల్లో తిరిగారు. కాలేశ్వరం గోదావరి ఒడ్డున సిరొంచాలో క్యాంపు నిర్వహించిన సమయంలోనే పీ.వీ నరసింహారావుతో పరిచయం ఏర్పడింది. 1951లో కమ్యూనిస్టు ఉద్యమం సాగుతున్న సమయంలో రావి నారాయణరెడ్డితో పాటు రాజేశ్వర రావును అరెస్ట్ చేశారు. చంచల్ గూడా, ఔరంగాబాద్, గుల్బర్గా జైళ్లకు తిప్పారు. అప్పుడే మార్క్సిజం, లెనినిజంపై ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగినట్టు రాజేశ్వరరావు తెలిపారు. 1952లో జైలు నుంచి విడుదలయ్యాక కమ్యూనిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా రైతు ఉద్యమాల్లో నిమ్మగ్నమయ్యారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పని చేశారు.
1952లో ఆయన జైల్లో ఉన్న సమయంలో పెరోలుపై మెట్ పల్లి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసేందుకు రాగా రెండు నిమిషాలు సమయం ఎక్కువ అవడంతో నామినేషను తిరస్కరించారు. 1957లో చొప్పదండి నుంచి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. తర్వాత సిరిసిల్ల నుంచి 1967, 1978, 1985, 1994, 2004లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు మూడు పర్యాయాలు శాసనసభలో 1967, 78, 85ల్లో సిపిఐ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 77 ఏళ్ల వయసులో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన టిడిపిలో చేరడానికి ఎటువంటి కారణాలు చెబుతారో అన్న ఉత్కంఠ ఆనాడు అందరిలోనూ కనిపించింది. కానీ టిడిపిలో తన చేరిక కేవలం వైయుక్తకమైనదే తప్ప రాజకీయమైనది కాదని ప్రకటించి తన నిజాయితీని చాటుకున్నారు.
ఏడు దశాబ్దాల రాజకీయ జీవితంలో చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు. శా సనసభ లోపల, బయట ఆయన చేసిన ప్రసంగాలు ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసేవిగా ఉండేవి. పాలకవర్గాలపై విమర్శలు చేస్తూనే పరిష్కార మార్గాలు చూపిన మేధావిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ అన్ని పార్టీల నేతలు గౌరవించే అరుదైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం అలాంటి రాజకీయ విలువలు ప్రతినిత్యం అంతరించిపొతున్న సమయంలో నిజంగానే చెన్నమనేని పాత్ర ఇంకా సశేషం, ఖచ్చితంగా ఈ తరానికి వారి స్ఫూర్తి ఒక విశేషం. ఆయన కోరిక మేరకే చట్ట సభలో వారి సందేశాలను, చట్టసభలు మరియు వాటి నియమావళులు, సంధానకర్తల పైన వారి అనుభవాలు విమర్శలను పొందుపరచిన పుస్తకం మనకు ఒక సమగ్ర పాఠ్యాంశంగా విడుదల కాబోతున్నది.
ఈ పుస్తకం ‘‘శాసనసభలో మూడు దశాబ్దాల ప్రజా వాణి – చెన్నమనేని’’ వారి రాజకీయ జీవితాశయాలను, పేద, బడుగు బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతికోసం వారు చేసిన నిరంతర పరిశ్రమను ప్రతిబింబిస్తాయి. శాసనసభను ప్రజలవాణిగా తీర్చిదిద్దదలచుకున్న ప్రతి రాజకీయవేత్తకు ఈ పుస్తకం మంచి పాఠాలను అందిస్తుంది. ఇందులో బడ్జెట్ ప్రసంగాల సందర్భంగా వారు ఒకవైపు ప్రజాసమస్యలను – కౌలుదారి చట్టాలు, భూసంస్కరణలు, ప్రజాపోరాటాలు నిర్భంధాలు, సన్న చిన్న కారు రైతుల ఆర్ధిక సామాజిక అభ్యున్నతి, తెలంగాణలో సాగునీటి సమస్య పరిష్కార మార్గాలు, తీవ్రవాదం వాటి మూలాలు, పేదరికం పెట్టుబడిదారి వ్యవస్థలో సామాన్యప్రజల జీవనసంఘర్షణ, విద్యా, వైద్యన్ని – లోతుగా అధ్యయణం చేసి పరిష్కారమార్గాలను, వ్యవస్థాపరమైన మార్పుల ఆవష్యకతను కూలంకషంగా నినదించారు. ఇదేగాక వారి శాసనసభా అనుభవాలను – ‘‘నాయకుడికి నా నిర్వచనం’’, ‘‘శాసనసభ విలువల పరిరక్షణలో స్పీకర్ పాత్ర, ముఖ్యమంత్రి పాత్ర, ప్రజాస్వామ్య ప్రతిష్ట’’ తో పాటు ‘‘శాసనసభ్యునిగా నా అనుభవాలు’’ పొందుపరిచారు.
‘‘పదవి అనేది యుద్ధ వీరుడు చేతిలో కరవాలం. మానవత్వమే గమ్యం. మానవత్వం వెల్లివిరిసే సమాజమే నా ధ్యేయం’’ అంటూ ఆయన చెప్పిన మాటలు నేటి తరాలకు స్ఫూర్తి దాయకం. ఒక్క మాటలో చెప్పాలంటే సుదీర్ఘ రాజకీయ అనుభవమున్నా ఏనాడు హంగు ఆర్భాటాలకు పోకపోగా.. నమ్మి గెలిపించిన ప్రజల పక్షాన నిలిచి స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా పోరాడి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
అవును చెన్నమనేని పాత్ర ఇంకా సషేశం, ఖచ్చితంగా ఈ తరానికి వారి స్ఫూర్తి ఒక విశేషం!
- డా. చెన్నమనేని రమేష్
చైర్మన్, చెన్నమనేని రాజేశ్వర రావు మరియు లలితా దేవి ఫౌండేషన్ (www.chennamanenifoundation.org)