శక్తి ఆరాధకులు – బైండ్ల కళాకారులు

తెలంగాణా జానపద కళారూపాల్లో విశిష్టమైన కళారూపం బైండ్ల కళారూపం. ఇక్కడ మనుగడలో ఉన్న కళారూపాల్లో భారతం, రామాయణం కథలను కథాగానం చేసే కళారూపాలే ఎక్కువ. ఇందుకు భిన్నంగా కేవలం శక్తి దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పెద్దమ్మ వంటి దేవతలను కొలుస్తూ, కథలు చెప్పే కళారూపాల్లో అరుదైన కళారూపం బైండ్ల కళారూపం కావడం విశేషం. వంశపారంపర్యంగా సంక్రమించిన కథాగాన సంస్క•తిని అనుసరిస్తూ వృత్తిగాయకులుగా పేరు గాంచిన బైండ్లవారు ఎల్లమ్మ, మారమ్మ, మైసమ్మ, భవాని, దుర్గా, కాళి మొదలైన పేర్లు కలిగిన శక్తి దేవతలను ఆరాధిస్తూ జీవనం గడుపుతారు. కళాకారులు దేవత పేరు ఏది చెప్పినా ఆదిశక్తి రూపమైన భవాని దేవియే వీరికి ఆరాధ్యదైవం. మాదిగ వారికి ఉపకులంగాను పేర్కొంటారు. వారు చేసుకునే శుభ, అశుభ కార్యాలతోను పండుగలలోను భాగస్వాము లవుతారు. పెండ్లిళ్లకు పురోహితులుగా వ్యవహరిస్తారు. శక్తి దేవతల చరిత్రలను వీరిని గురించి పరిశీలించినట్లయితే వారి ఆకారం, వీరు పూజించే దేవతలను జన వ్యవహారలో నున్న ఈ క్రింది చాటు పద్యంలో వర్ణించడం చూడవచ్చు.
సీ।। దీర్ఘకాయము గల్గి ధైర్యవంతుడయ్యి
పాదాల జీరాడుపంచె గట్టి
బుగ్గ మీసంబుల పూర్ణ దృఢత్వంబు
తెల్లని తలపాగ తేజమలర
చెనయ రక్షిణ చేతి సింహతలాటమ్ము
జమిడిక వామచంకను ధనింప
కాళ్ళకు గజ్జెలు ఘల్లు ఘల్లున మోగ
నుదుట కంకుమ బొట్టు నది జ్వలింప
తే ।। శాంభవీ దుర్గా మహంకాళి జగము మాత
ప్రకృతి దేవికి పుత్రుడు భవ్యశీలి
అతడె భవనీడు జనపడుడాది శక్తి
మహిమల న్పుగ్గిడించెబు మానధనుడు


బైండ్ల ప్రస్థావన : బైండ్ల వారి ప్రస్థావన ప్రాచీన తెలుగు సాహిత్యంలోను మరియు వారు ప్రదర్శించే ఎల్లమ్మ కథలోను కనిపిస్తుంది. ముఖ్యంగా
శ్రీనాధుని కాశీఖండంలోని ఏడవ అశ్వాసంలో
।। పణుతించు ఏక వీరాదేవి నొకవేళ
బపనీడయి సమగ్ర భక్తి గరిమ ।।
అనే – ప్రయోగాన్ని బట్టి చూస్తే శక్తిని ఆరాధించే ఒక గాయకుడైన భక్తుడు ‘బైండ్ల’ అని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రతాపరుద్రుని కాలంలో ఓరుగల్లులో భవనీల చక్రవర్తి ఏకవీరాదేవి ముందు (ఎల్లమ్మ) నిలబడి పరశరాముడి కథలన్నీ పౌడీతో పాడినట్లు క్రీడాభిరామంలో కలదు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్త మాల్యదలో జముడిక వాయిద్యమును గూర్చి పేర్కొన్నాడు. ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకంలో ప్రతీ ఊర్లో భవానీ కాండ్రు మహాకవులుగా చలామణి అవుతున్నారని ఉంది. వీరు వంశపారంపర్యంగా గ్రామ దేవత కథలు చెబుతూ శక్తి గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ గ్రామ గ్రామాల్లో కథాగానం చేయడం ప్రధాన వృత్తి.


బైండ్ల వృత్తాంతం :
బైండ్ల వారిని బవనీలు అని కూడా పిలుస్తారు. కళాకారులు ప్రదర్శనలో వాయించే వాద్యాన్ని జమిడిక అని, శిష్టులు దీనిని బవనిక అంటారు. అందుకే ఈ బవనికను వాయించే వారే బవనీలు, బైండ్ల వారని బిరుదురాజు రామరాజుగారు ‘తెలుగు జానపద గేయ సాహిత్యం’లో వివరించాడు. అదేవిధంగా వీరు భవాని మాతను కొలువడం వల్ల భవనీలు అని, వారే బైండ్ల వారు అని పేర్కొన్నారు. బైండ్ల వారిని సర్కారు జిల్లాలో జముకులవాళ్లు అని అంటారు. ఇక్కడ జముడుకను జముకు అంటారు. శ్రీకాకుళం జిల్లాలో బుడబుడకలవారు అంటారు. జముడుక వాయించేటపుడు బుడబుడ మనే శబ్ధం వస్తుంది. కాబట్టి బుడబుడ కల వారు అంటారు. రాయలసీమలో ఆసాదివాళ్లు, బైనీండ్లు అని అంటారు.
కళాకారులు చెప్పే ఎల్లమ్మ కథలో బైండ్ల వారి ప్రస్తావన మరియు వారి వృత్తాంతం కనిపిస్తుంది. జమదగ్ని మహాముని భార్య ఎల్లమ్మ తల్లి సంతానం కావాలని భర్తను కోరుతుంది. అందుకు జమదగ్ని మహాముని సంతాన వరం కావాలంటే పరశురాముడికి తండ్రి జాడ చెప్పకూడదని చెపితే ఇరవై నాలుగు సంవత్సరాలు అష్టకష్టాలు పడాల్సి వస్తుందని అంటాడు. ఒకవేళ అతను పెట్టే కష్టాలు భరించలేక తండ్రి జాడ చెప్పితే, నీ శిరస్సు పత్తికాయ మాదిరిగా నాలుగు వక్కలుగా పగిలిపోతుందని చెప్తాడు. అయినప్పటికీ ఆమె సంతానం కావాలని కోరుతుంది. ఆ రకంగా ఆమె కొడుకు పరుశురాముడు పెట్టే కష్టాలు భరించలేక అతని నుండి తప్పించుకుంటునే తండ్రి దాక్కోడానికి గౌండ్ల వాడ, చాకలివాడ, గొల్లవాడ, బాపనివాడ, శాలవాడ తిరుగుతుంది. వారంతా పరుశురాముని పేరు విని ఎవరూ ఆశ్రమం కల్పించరు. చివరికి జగతి కంటే ఆరునెలల ముందు పుట్టిన తాత జాంబవంతుని దగ్గరికి వెళ్లి ఒక్క గడియ దాయమని కోరుతుంది. అతను ఆమె కష్టం విని నా దగ్గర నిన్ను దాయడానికి స్థలం లేదని పచ్చి తోళ్లు నాన బెట్టిన, రడగబ్బు వాసన వచ్చే లందగోలెం ఉందని అందులో దాక్కోమంటాడు. ఆమె కొడుకు పెట్టే కష్టం కంటే లందగోలెం రడగబ్బు వాసన ఎక్కువ కాదని, ఆ వాసన రాకుండా ఉండేందుకు ఆమె తన దగ్గరి గోరంత బండారి తీసి, గోలెం దగ్గర వేయగా వాసనంతాపోయి, సువాసన వెదజల్లుతుంది. పరశురాముడు తల్లిని వెతుకుతూ, తాత జాంబవంతుని దగ్గరికి వచ్చి ఎల్లమ్మ జాడ చెప్పమని వాదిస్తాడు. జాంబవంతుడు ఆమెను రక్షించడానికి ఇక్కడికి రాలేదని చెప్పినప్పటికీ లందగోలెం దగ్గరి బండారి చూసి, తల్లి గోలెంలోనే దాక్కుందని, ఆ తల్లిని బయటికి రప్పించడానికి పరశురాముడు చేతిలో జమిడిక, జేగంట, కాళ్లకు గజ్జెలు, వేప రెమ్మలు ధరించి బైండ్ల అవతారమెత్తుతాడు. లందగోలెం దగ్గర పసుపు బండారి తోటి పట్నాలు పరిచి ప్రార్ధన చేయగా ఎల్లమ్మ తల్లి బయటికి వస్తుంది. ఈ రకంగా శక్తిని ఆరాధించడానికి ప్రసన్నం చేసుకోవడానికి పరశురాముడు ధరించిన బైండ్ల వేషమే వంశపారంపర్యంగా బైండ్ల కళాకారులకు సంక్రమించిందంటారు. ఈ విధంగా ఎల్లమ్మ కథలో బైండ్ల ప్రస్థావన కలదు.


బైండ్ల కళాకారులు ప్రదర్శించే కథలు :

బైండ్ల కళాకారులు ప్రధానంగా గ్రామ దేవతల కథలు ప్రదర్శిస్తారు. ముఖ్యంగా గ్రామాల్లో జరిగే జాతరలు, కొలుపులు, పండుగల సందర్భంలో ఈ కథలను చెబుతారు.

1.మాతపురాణం 2. ఎల్లమ్మ కథ 3. శక్తికల్యాణం 4. రేణుకా యుద్ధం 5. మలిశెట్ల యుద్ధం 6. మాంధాత కథ 7. తరీదేవి కథ 8. మైసమ్మ కథ 9. పోచమ్మ కథ 10. పెద్దమ్మ కథ మొదలైన కథలు ప్రధానంగా చెప్తారు.


బైండ్ల వారు గానం చేసే కథల్లో మాతపురాణం ఒక విశిష్టమైన కథ. మాత అనగా తల్లి. ఆదిశక్తి పరంజ్యోతి అని ఈ మహత్తర శక్తికి గల పేర్లు. భవానీ, అంబ, కాళిక మొదలగు నామాలతో ఈ శక్తిని ఆరాధించే సంప్రదాయం ఉంది. బైండ్లవారు ఈ శక్తిని బాధ•లు మాన్పే దేవతగా భావించి ఈమె కీర్తిని తమ ప్రధాన వాద్యమైన జమిడికతో పాడుతూ కథను ప్రారంభిస్తారు. బవనీయుడు రేణుక అమ్మవారి కొలుపులకు ప్రధానకర్త. చంకలోని జమిడికతో అతడు శక్తిగానం చేయనిదే ఆదిశక్తికి ఉనికియే లేదు. చర్మవాద్యాలైన రుంజ, మృదంగం, తబలా, డోలు, మద్దెల, డమరుకం, వీ•న్నిటికీ లేని లక్షణం జమిడికకు ఉంది. ఒక తంత్రి, ఒక చర్మం, రెండు కలిసి ఉన్న వాద్యం జమిడిక.


ఇది భారతీయ వాద్యాలలోనే ప్రత్యేకతను కలిగి ఉంది. దీనిని వాయిస్తూ అమ్మవారిని సంతోషపెట్టే విధంగా జానపదులను అలరింపచేసే పాట ఈ క్రింది విధంగా ఉంటుంది.
కృతాయుగంబున రేణుకాశక్తి
త్రేతాయుగంబున సీతామహాశక్తి
ద్వాపర యుగంబున ద్రౌపది మహాశక్తిగా
కలియుగంబున అమ్మవారు
గృహ గృహిణి యను ఆదిశక్తి
లోలాక్షి లోకమాత
మాపు చూస్తే మరియు రూపు
పగలు చూస్తే పద్మిని చూపు
లోకాలు నేలు శక్తి
లోకాలు పోలు శక్తి
నీళ్ల మీది బుగ్గ నీలారివమ్మా అమ్మా
అమ్మవారు నీ గురిగింజ కన్నులకు గుప్పెన నుదుట
వాలారి కన్నులకు వచ్చేట్లు నిదుర (నిద్ర)
మా భవనీల ప్రార్ధన అలకించి
మమ్ములను కాపాడునట్టి
రేణుకా
పరంజ్యోతి, ఆదిశక్తి, అమ్మవారు
నమస్తే, నమస్తే నమ: అని ఆదిశక్తిని కీర్తిగానం చేస్తారు.


ఆదిశక్తి అమ్మవారు సృష్టికి మూలకారణం. పరంజ్యోతిగా వెలుగొంది, కృతాయుగంలో, రేణుకాశక్తిగా, త్రేతా యుగంలో సీతామహాలక్ష్మిగా, ద్వాపరయుగంలో ద్రౌపదిగా, కలియుగంలో అమ్మవారిగా అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించి బాధలను తీర్చే తల్లిగా, ఆరాధించిన వారిని ఆదుకొను మాతగా విలసిల్లింది. లోకమాతగా అనేక రూపాల్లో లోకాన్ని రక్షించేదిగా ఆరాధింపబడుతుంది అమ్మవారు. బవనీలు చెప్పే అన్ని కథలు కూడా అమ్మవారికి సంబంధించినవే కాకుండా అవి గ్రామ దేవతలకు సంబంధించనవి కావడం విశేషం. ఈ కథలన్నింటిలో ఎల్లమ్మ, జమదగ్నుల మహిమలను వేనోళ్ళ కీర్తింప చేసేవే.


ఉదా : కళాకారులు చెప్పే ఎల్లమ్మ కథా స్వరూపంను పరిశీలించినట్లైతే ఈ కథలో అహల్య గౌతముల కుమారుడగు జమదగ్నికి శివుని కూతురగు ఎల్లమ్మను ఇచ్చి వివాహం చేస్తారు. వివాహం అయిన కొద్ది రోజులకే జమదగ్ని తల్లిదండ్రుల అనుమతి పొంది తపస్సు చేయుటకు అడవికి వెళ్తాడు. ఒకనాడు ఎల్లమ్మ తన భర్తను కలుసుకొనదలచి భోనం వండి అలంకరించుకొని బయలుదేరుతుంది. ఆమె వస్తే జమదగ్నికి తపో:భంగం జరుగుతుందని భగవంత••డు మార్గ మధ్యంలో ముగ్గురు పసిబాలురను సృష్టించి వారిని ఎల్లమ్మ వద్దకు పంపుతాడు. ఆ పసిబాలురు మాకు ఆకలి వేస్తుంది. అన్నం పెట్టమని అడుగుతారు. కాని ఆమె భర్త సేవకు ఆలస్యమవుతుందని చెప్పి వారి ఆకలిని తీర్చకుండానే• జమదగ్నిని చేరుకుంటుంది.


జమదగ్ని ఎల్లమ్మను పరీక్షించదలచి జల్లెడలో నీరు తెమ్మంటాడు. జల్లెడలో నీరు తేగా, అతను సంతోషించి భోజనం చేయుటకు సిద్ధం అవుతాడు. అపుడు కుండ తెరిచి చూసేసరికి అన్నం అంతా అదేవిధంగా ఉంటుంది. అశ్చర్యంతో జమదగ్ని దీనికి కారణమేమిటని దివ్యదృష్టితో చూస్తాడు. భర్త సేవకు ఆలస్యమవుతుందని వచ్చిన ఎల్లమ్మ దారిలో అన్నమడిగిన ముగ్గురు పసిబాలురకు అన్న పెట్టలేదని, ఆ ముగ్గురు పిల్లలు తమ పిల్లలేనని జమదగ్ని గుర్తిస్తాడు. వారికి అన్నం పెట్ట్టి తీసుకరావలసిందిగా ఆదేశిస్తాడు. ఆ పసిబాలురు ఎల్లమ్మను నగ్నంగా ఉండి భోజనం పెట్టమని కోరగా, ఎల్లమ్మ పాతివ్రత్య మహిమచే అక్షయ వలువలు ధరించి ఆ బిడ్డలకు అన్నం వడ్డించి వారిని తీసుకొని జమదగ్నిని చేరుకుంటుంది.


జమదగ్ని తన భార్య ఎల్లమ్మను ఇసుకతో కడవ గావించి నీరు తెమ్మని కోరడం, ఆమె తన పాతివ్రత్య మహిమచే ఇసుకతో భాండము గావించి, దానిలో నీరు నింపే సమయంలో అక్కడ కొన్ని కప్పలు రాసక్రీడ లాడుతున్నట్లు గమనించిన ఎల్లమ్మ మనస్సు చెలిస్తుంది. దివ్య దృష్టితో ఇది గమనించిన జమదగ్ని తన రొమ్ము నుండి కొంతమట్టిని తీసి ఒక వ్యక్తిని సృష్టించి ఎల్లమ్మ ఉన్న కొలను వద్దకు పంపిస్తాడు. అతడు ఎల్లమ్మను బలత్కరించ ప్రయత్నిస్తాడు. వానిని తిరస్కరించి జమదగ్నిని చేరుకొని అతనికి అన్నం పెడుతుంది. జమదగ్ని ఎల్లమ్మను దోషురాలుగా భావించి ఆమె చేతి అన్నం తినడం ఇష్టము లేక తన కుమారులైన పసిబాలురతో తల్లైన, అక్కైనా, చెల్లైళ్శైనా, తప్పు చేస్తే ఏమి చేయవలెను కొమరులారా? అని జమదగ్ని అడుగగా తప్పు చేసిన వారిని చంపుట మంచిదని తిరిగి సమాధానం చెపుతారు. అప్పుడు తప్పు చేసినది నీ తల్లియే అని వారికి చెపుతాడు. తప్పు చేసినది తన తల్లియేనని తెలిసి కూడా పరశురాముడు ఏ మాత్రం సంకోచించ కుండా తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి తలను ఖండిస్తాడు. తరువాత జమదగ్ని ప్రసన్నచిత్తుడై, పరశురామున్ని వరము కోరుకోమనగా, తన తల్లిని బ్రతికించుమని కోరుతాడు. అప్పుడు జమదగ్ని తపో:మహిమచే ఎల్లమ్మను బ్రతికిస్తాడు.ఇంతటితో ఎల్లమ్మ కథ ముగుస్తుంది.


ఎల్లమ్మ దీన జన రక్షకురాలిగా, వ్యాధి, రోగ భయాలు, దారిద్య్ర భయాలు పోగొట్టు శక్తిగా గుర్తించి ఆరాధించడం నిమ్న వర్గాలలోను, ఉన్నత వర్గాలలోను ఉన్నాయి. తెలుగునాట ఈ దేవతను ఎల్లమ్మ మాహురమ్మ, రేణుక, ఎల్లు, అక్కలదేవి, ఎల్లారి, ఏకవీర మొదలైన పేర్లు వ్యవహారంలో వినిపిస్తాయి. అందుకే ఈ దేవతను ఎక్కువగా కొలుస్తారు. ఈ కథల ద్వారా శక్తి దేవతలకు సంబంధించిన మహిమలను జానపదులు ఎంతగా విశ్వసించి ఆరాధిస్తారో తెలుస్తుంది.


ప్రదర్శనా విధానం :


ప్రదర్శనా సమయం : గ్రామ దేవతా కొలుపులు అన్ని రాత్రి పూటనే జరుగుతాయి. అందుకే వీరు చెప్పే కథలు కూడా రాత్రి పూటనే ఉంటాయి. అప్పుడప్పుడు అనుష్టానాలకు అనుగుణంగా పగలు కూడా ప్రదర్శిస్తారు. రాత్రి పూట అయితే భోజనాలు ముగించుకుని 9 లేదా 10 గం।।లకు ప్రారంభిస్తే తెల్లవార్లు కథలు ప్రదర్శిస్తారు.
వేదిక : వేదిక అనేది ప్రత్యేకంగా ఉండదు. కాని వీరు ఎక్కడైతే దేవతా కొలుపులు కొలుస్తారో ఆ గుడి ముందే నిలబడి కథలు ప్రదర్శిస్తారు. గుడి ముందు పందిరి వేసి ఉంటే దాని క్రింద నిలుచొని కథలు చెపుతారు.
ప్రదర్శకులు :
ప్రదర్శనలో కళాకారులు ముగ్గురు ఉంటారు. ఇందులో ఒకరు ప్రధాన కథకుడు. ఇతనే జమిడిక వాద్యాన్ని వాయిస్తూ, కథ చేస్తాడు. ఇతనికి వంతులగా ఇద్దరు తాళాలు వాయిస్తూ, ప్రధాన కథకున్ని అనుసరిస్తూ కథాగానం చేస్తారు.
ప్రదర్శనా ప్రారంభం : బవనీయుడు పాడే పాటలతో, పద్యాలతో, దండకాలతో ప్రజలకు వినోదాన్ని, భక్తిని కలిగిస్తాడు. అంబకీర్తనతో, దండకంతో దేవీస్తుతితో శ్రావ్యమైన కంఠంతో కథ చెపుతూ, గజ్జెల కాళ్ళతో చక్కగా నాట్యం చేస్తూ, వివిధ భంగిమలలో ప్రేక్షకులను ఆనందపెడుతాడు.


ప్రదర్శనా పద్ధతి : ప్రదర్శన ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. కథకులు ప్రదర్శనలన్నింటిని కథాగాన పద్ధతిలో ప్రారంభిస్తారు. పరశురాముని కథ మాత్రం పాత్రలకు అనుగుణంగా వేషధారణ చేసుకొని కథాగాన యక్షగాన పద్ధతిలో కథలను ప్రదర్శిస్తారు.
కథాగానాన్ని మధ్యలో ఆపి విశ్రాంతి తీసుకొనే సమయంలో ప్రధాన కథకుడు కథను వివరిస్తుంటాడు. ఈ సమయంలో కథకుడు కొంత విరామం పొంది, మళ్లీ తరువాత కథను అందుకొని అతను – మధ్యలో పెద్దకేక వేస్తాడు. ఈ కేక నిద్రిస్తున్న ప్రేక్షకులకు ఒక హెచ్చరికలా ఉంటుంది. కథ చెప్పేటపుడు బైండ్లవారు ప్రదర్శించే హావభావ విన్యాసాల్ని చూడవలెనే గాని, చెప్పుటకు అలవి కాదు. కథావేగాన్ని పుంజుకుని కథకుడు లయ బద్ధంగా, వేగంగా నాట్యం చేస్తూ కథాగానం చేస్తూ హుషారుగా గంతులిడుతూ ఉంటే చూసేవారు ఉద్రేకంలో ఉంటారు.
జమిడిక ధ్వని కథకుని కథాగానానికి అనుకూలంగా కదం తొక్కుతుంది. కథ సీసపద్యాలతో, ద్విపదాలతో సాగుతుంది. అభినయ పూర్వకంగా మరియు కథాగాన శైలిలో కథ ఉన్నా, కథ ఎక్కువగా వచనరూపంలో నడుస్తుంది. రెండు నిమిషాల కొకసారి కథకుడు చేతితో జమిడిక మీటుతుంటాడు. కథా సందర్భమును బట్టి అవయవ చాలనం చేస్తుంటాడు. ముఖ్యంగా సన్నివేషాలు రాగానే ఎడమ చేతిని దగ్గర పెట్టుకొని, కుడిచేతితో అభినయం చేస్తూ కథ చెప్తూ ఉంటారు. కథ చెప్పే సందర్భాన్ని బట్టి వచనం పొడిగించడం, కుదించడం జరుగుతుంది. ఇవి నిస్సారంగా చెప్పుకుంటూ పోయే కథలు కావు. వివిధ రాగాలను గొంతులో పలికిస్తారు. కథలోని సంఘటనలు ప్రేక్షకుల కళ్ళ ముందు జరుగుతున్నాయా అన్నంత బాగా కథకుడు కథ చెప్పుతుంటాడు.
ఈ విషయాలన్నింటిని గమనించడానికై ముందుగా అమ్మవారిని సంతోషపెట్టే విధంగా వారు జానపదులను అలరింపజేసే ప్రార్ధన గేయాన్ని గమనిద్దాం.
తల్లి నిన్ను కొలచి
దండములు పెట్టి కరమెత్తి మెక్కెదా, నా కన్నతల్లి
అవని లోపలజనుల అంబవే తల్లి
బవనీల పాలిటి ఓకల్పవల్లి
గవ్వ దర్శనాలు, ఘనంగా ధరియించి
ముప్పొద్దు పూజలు చేసేము తల్లి
గుగ్గిలము మైసాచి కుప్పగా పొగ లేపి
తలచితిమి మదిలోన తల్లి మాయమ్మా
సుతులు, జమిడికలు, సుందరముగ వాయించి
కాళ్ళ గజ్జెలు కట్టి ఘల్లున మోగించి
ఆడితి నీ ముందు అంబవో తల్లి
ఇల్లిల్లు నీ పూజ ఇష్టంగా జేసి
జగన్మాత నిన్ను జగమెల్ల గొలిచేరు
కోపగించకు తల్లి ఓపజాలమమ్మా
బగ్గుబగ్గున నుండి బొబ్బలు లేపి
కష్టపెట్టకు మమ్ము ఓ కన్నతల్లి,
కొత్తకుండల కల్లు సాకాలు నీకు
గడప గడపకు నీకు కలివేపరిల్లలు
ఆపదలు బాపేటి అమ్మలకు అమ్మ
శాంతింపు మా తల్లి జగమేలే తల్లి
కోపగించుడి వేళ కోడి పుంజులు బలి బలి
గొఱ్ఱెపోతుల బలి బలి
శాంతింపు శాంతింపు ఓ జగన్మాత
బవనీల ఇలవేల్పు భార్గవి అంబ
దండాలు దండాలు చండికా నీకు అని ప్రధాన కథకుడు, జమిడికను వాయిస్తూ, భక్తి రసావేషంతో ఊగిపోతూ పాడుతుండగా వంతకాళ్లు అనుసరిస్తారు. ఇలా గేయం పాడుతూ ముగింపులో బవనీల ప్రార్ధన అలకించెడి తల్లి అని తనను గురించి కూడా ప్రస్తావించుకోవడం కనిపిస్తుంది. ఇంకా వీరు దేవతాస్తుతితో శక్తి కథాగేయాన్ని ద్విపదకు సమీపగతిలో నడుపుతుంటారు.
ఉదా : రేణుకా శక్తి కళ్యాణంలో
రాతికే వరమియ్యి మాత
నీ అష్ట కంకణాల చేత
అవునమ్మ అనుకుంట్ల కొమ్మ
నీవు అద్దంకి నాంచారివమ్మా
కల్లు తాగుదువు రావమ్మో
సారాయి తాగుదువు లేవమ్మా
గంజాయి తాగుదువు రావమ్మా
అల్లనాడు నీ(వు) విచ్చిన వరము
అడితప్పకే ఓయమ్మా
బండ్లు కట్టుక వచ్చేవారు
పూల చెండ్లు వేసుక వచ్చేవారు
గుడి చుట్టు కుంకుమ బండ్లు
అమ్మ అందురే నీ పేరు
శివ అవతార మందురే నీ పేరు
అంటూ పాడడం కనిపిస్తుంది.
ఎల్లమ్మ జన్మ వృత్తాంతంను తెలిపే మరో పాట రాగయుక్తంగా పాడడం వినబడుతుంది.
శివుని చిన్న బిడ్డవయ్యా ఎల్లమ్మా
నీవు శివునెల్ల మాతవమ్మా ఎల్లమ్మా
పార్వద్దేవి బిడ్డవమ్మా ఎల్లమ్మా
నీవు పరంజ్యోతి తల్లివమ్మా ఎల్లమ్మా
పుట్టలోన బుట్టినావు ఎల్లమ్మా
నీవు పుడిమిపై బిడ్డవమ్మా ఎల్లమ్మా
నాగవన్ని చీరలమ్మ ఎల్లమ్మా
నీకు నెమలి రవికెలమ్మా ఎల్లమ్మా
ఏడుము గవ్వాలు తల్లీ ఎల్లమ్మా
నీకు వెనుక దరిసెనమ్మూ తల్లీ ఎల్లమ్మా
నాగుపాముల బట్టి నావు ఎల్లమ్మా
నాగుపాముల బట్టినావు ఎల్లమ్మా
నీవు నడికట్టు వేసినావు ఎల్లమ్మా
జెర్రిపోతుల బట్టినావు ఎల్లమ్మా
నీవు జడ కొప్పుల వేసినావు ఎల్లమ్మా
ఓరుగంటి రాజులను ఎల్లమ్మా
నీవు ఓంకార మడిగితివి ఎల్లమ్మా
నీవు ఎదురైనచో తల్లి ఎవరమ్మా ఎల్లమ్మా
అంటూ తల్లిని బైండ్ల వారు కీర్తిస్తారు.


బైండ్ల కళాకారులు ప్రస్తుత స్థితిగతులు :
బైండ్ల కళాకారులు పూర్వం మాదిగ వారికి పూజారులుగా, శక్తి ఆరాధకులుగా వెలుగొందారు. సామాజికంగా ఒక గౌరవమైన స్థానంలోనే మనుగడ సాగించారు. కాలాలు మారుతున్న కొద్దీ సమాజంలో వస్తున్న మార్పులు బైండ్ల వారి సాంస్క•తిక జీవితంలో కూడా మార్పులు వచ్చాయి. పూర్వం మాదిగ వారు జరుపుకునే శుభ కార్యాలకు బైండ్ల వారు ముహూర్తాలు పెట్టడమే గాక, పెళ్లి తంతు కూడా జరిపించేవారు. ప్రస్తుతం ఆ సంస్క•తి కనుమరుగయింది. ప్రస్తుతం వీరికి వంశానుగతంగా సంక్రమించిన నతను గ్రామాలకు వెళ్లి పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ కథలు చెప్పి దేవతలను కొలిచే పూజారులుగా, కళాకారులుగా మాత్రమే మిగలిపోయారు.


కళారూపం ప్రదర్శనలో కూడా కాలానుగుణంగా ప్రేక్షకుల అభిరుచి మేరకు మార్పులు చేసుకున్నారు. పూర్వం వీరు కథాగానం చేసే ఎల్లమ్మ కథను ఏడు రోజులు చెప్పేవారు. ప్రస్తుతం అదే కథను మూడు గంటల్లో చెప్పి కథను ముగిస్తున్నారు. ఈ రకంగా కథ చెప్పించుకునే ధాతలే చెప్పమనడంతో కళా•కారులు అందుకు అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంతే గాక ప్రదర్శనలో పూర్వం ప్రధాన కథకుడు జమిడికను వాయిస్తుండగా, మిగతా ఇద్దరు కళాకారులు తాళాలు వాయిస్తూ వంత పాడుతూ కథాగానం చేసేవారు. ఈ రకమైన ప్రదర్శన రెండు తరాల కంటే ముందు బాగానే కొనసాగింది. అప్పుడున్న ప్రేక్షకులు కథ•ను ఆసక్తితో వినేవారు. కానీ ప్రస్తుతం ఆ రకంగా ప్రదర్శిస్తే ప్రదర్శన ప్రేక్షకులను ఆకర్శించడం లేదని కళాకారులు తాము ప్రదర్శించే కథలోని పాత్రలక• అనుగుణంగా వేషాలు ధరించి కథాగానం చేయడం ప్రారంభించారు. దీని కారణంగా తాము ప్రదర్శించే కథాంశం ప్రేక్షకులను ఆకర్షిండమే కాక వారికి ఆదరణ పెరిగేలా కళాకారులే తమ కళారూపంలో మార్పులు చేసుకోవడం చేత కళారూపం మనుగడకు కూడా వారే దారి వేసుకున్నట్లయింది.


అలాగే ప్రదర్శనలో కళాకారులు ప్రధానంగా వాయించే జమిడిక వాద్యాన్ని ఇంతకుముందు మేక ఙక్కి పొరతో ముడుసు కోవడం జరిగేది. అది చర్మం కావడంతో చలి కాలంలో మరియు వర్షాకాలంలో తేమకు తరుచూ అదిముడుసుకోవడంతో దాని స్ధానంలో ప్లాస్టిక్‍ పొరను ముడుసుకొని వాయించడం జరుగు తున్నది. కాని దేవతలను కొలిచేటప్పుడు చర్మంతో ముడిసిన జమిడిక వాద్యాన్ని వాయిస్తేనే శక్తి దేవతలు తృప్తి చెందుతారనే విశ్వాసం కళాకారులకు ఉన్నప్పటికీ, తప్పని పరిస్థితుల్లో ఉపయోగించడం తప్పలేదని కళాకారుల మాటల్లో కనిపిస్తుంది.


తెలంగాణాలో బైండ్ల సామాజిక వర్గానికి చెందిన జనాభా కూడా అతి తక్కువగా ఉంది. వీరంతా పది గ్రామాలకు ఏదో ఒక గ్రామంలో రెండు కుటుంబాలు, మూడు కుటుంబాలు విస్తరించి కనిపిస్తారు. మాదిగ వారికి ఉపకులంగా కళాకారులు చెప్పు కున్నప్పటికీ మాదిగ వారికి వీరికి కంచం పొత్తు ఉంది కానీ వియ్యం పొత్తు ఉండదు. అయితే వీరి జనాభా తక్కువగా ఉండటంతో పెళ్లి సంబంధాలు కలుపుకోవడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణాలో కథాగానం చేసే బైండ్ల కళాబృందాలు కొద్ది వరకే పది వరకు ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే కళారూపానికి గ్రామాల్లో శక్తి దేవతలకు జాతర నిర్వహించి నపుడు వీరికి సంబంధించిన ఆయా కట్టడి గ్రామాల్లో దేవతలను కొలుచుకునేప్పుడు మాత్రమే వీరికి ప్రదర్శనావకాశాలు ఉంటాయి. దీని ద్వారా కేవలం సంవత్సరంలో ఆషాడం, శ్రావణం మాసాల్లోనే కళాకారులకు ఉపాధి దొరుకుతున్నది. మిగతా రోజులు వేరే వృత్తులు చేయడానికి కూడా కళాకారులకు అవకాశం లేకపోవడంతో కొత్త తరం వారు లేదా యువకులు ఈ కళారూపాన్ని నేర్చు కోవడానికి ముందుకు రావడం లేదని కళాకారుల మాటల్లో వినిపిస్తున్నది. కానీ అక్కడక్కడ కళాకారులు తమ మూల సంస్క•తిని కొనసాగించాలనే పట్టదలతో తమ పిల్లలను చదివిస్త్తూనే సందర్భాన్ని బట్టి వారికి కథలను నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు.


బైండ్ల వారు కేవలం శక్తి దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పెద్దమ్మ లాంటి దేవతల కథలే చెప్తారు కాబట్టి ఆయా గ్రామాల్లో ఉన్న శక్తి దేవతల ఆలయాల్లో ప్రభుత్వం ధూప దీప నైవేద్యాల పథకం కింద ఈ బైండ్ల కళాకారులను చేర్చి వీరికి ఆయా శక్తి దేవతల ఆలయాల్లో ఉపాధి కల్పిస్తే కళారూపం మనుగడకు, కళాకారుల గౌరవానికి దోహదం చేస్తుంది. అంతే గాక తరతరాల నుండి కళాకారులు కాపాడుతూ వస్తున్న మౌఖిక సంపద, వారి సంస్క•తి పరిరక్షింపబడుతుంది.

  • డా।। గడ్డం వెంకన్న
    ఎ : 9441305070

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *