కొల్లేటి జాడలు నవల – పర్యావరణ వివేచన

"If all mankind were to disappear, the world would regenerate back to the rich state of equilibrium that existed ten thousand years ago. If insects were to vanish, the environment would collapse into chaos."  -  E. O. Wilson

మానవ జాతి అంతా కనుమరుగైతే, ఈ ప్రపంచం పదివేలయేళ్లనాటి సమతుల్యతతో గొప్ప పునరుజ్జీవనం పొందుతుంది. కీటక జాతులు నాశనమైతే, పర్యావరణమంతా సంకటస్థితిలోకి కుంగిపోతుంది-జీవావరణ శాస్త్రం, జీవ వైవిధ్యంపై పరిశోధనలు చేసిన ప్రముఖ అమెరికన్‍ జీవ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఓ విల్సన్‍ అన్న ఈ మాటలు, ఈ సర్వ ప్రక•తిలో మిగిలిన జీవకోటితో పోల్చుకుంటే, మానవుని ఉనికికి ఉన్న విలువ శూన్యమని, ఒక చిన్న కీటకమంత కూడా కాదని తెలుస్తుంది. మనం భూమికి చెందిన వాళ్ళమే కానీ భూమి మనకి చెందినది కాదు అన్న వాస్తవాన్ని గుర్తించని మనిషి చేస్తున్న తప్పిదాల వల్ల, అమానవీయ పెట్టుబడిదారీ విధానాల వల్ల, అత్యాశ వల్ల, క•తఘ్నత వల్ల పుడమితల్లిని గాయాల పాలుచేస్తున్నాడు మనిషి. ఈ భూగోళాన్ని ఆవరించి ఉన్న పరిసరాలలోని జీవనిర్జీవాలన్నింటినీ కలిపి పర్యావరణం అంటున్నాం. ఈ పరిసరాలలో ఉండే జీవులన్నిటికీ ప్రాణాధారమైన గాలి, నీరు, ఆహారం, వెలుతురు రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి అత్యంత ఆవశ్యకమైన అవసరాలు. ప్రక•తి ఏర్పరచిన ఆహార చక్రాన్ని అనుసరించి, ఇతర అవసరాలను అనుసరించి వాతావరణంలోని సకల జీవరాసులు ఒక దానిపై మరొకటి ఆధారపడి జీవిస్తాయి. జీవ పరిణామ క్రమంలో చివరగా వచ్చిన మానవ జాతి చర్యల వలన సమతౌల్యం లోపిస్తున్నదనే ప్రారంభవాక్యాలలో అనుకున్నది.


సుమారు 150 యేళ్ళ క్రితం నాటి ప్రాపంచిక పర్యావరణ ద•క్పథ ఆవిర్భావం, 18వ శతాబ్ది నుండి 20వ శతాబ్దం వరకు దాని పరిణామ క్రమాన్ని గురించి ఒక ప్రామాణిక గ్రంథం రాసిన ప్రముఖ చరిత్రకారుడు, పర్యావరణవేత్త శ్రీ రామచంద్ర గుహ ః•ష్ట్రవ •స్త్రవ శీ• జు•శీశ్రీశీస్త్రఱ••శ్రీ ×అఅశీ•వఅ•వ(1945-62)’ అనే భాగంలో, రెండవ ప్రపంచయుద్ధానంతరం అభివ•ద్ధి కోసం తీసిన వెర్రి పరుగును పర్యావరణ యెరుక ప్రభావితం చేయలేక పోయిందంటాడు. అలాగే ‘పాశ్చాత్య దేశాలలో పర్యావరణవాదం, ప్రధానంగా అంతరించిపోతున్న జీవ వైవిధ్యాన్ని, సహజ ఆవాసాలను రక్షించాలనే ఆలోచనతో ఎగువ మధ్య తరగతి, ఉన్నత వర్గాల నుండి వస్తే, మన దేశంలో, పేదవాడి మనుగడ చుట్టూ ఈ వాదం ఉన్నదని, ఇది పేదల పర్యావరణవాదమని, ఇదొక వైపు సుస్థిరతతో, మరోవైపు సామాజిక న్యాయం కోసమే జరిపే ఆందోళనతో జత కట్టింద’ని అంటాడు. ఈ వాస్తవాన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే, అడవుల నిర్మూలన, శిలాజ ఇంధనాలు కాల్చటం, గ్రీన్‍ హౌజ్‍ ఉద్గారాలు, అధికమోతాదులో రసాయనాలు నీటివనరులలోకి విచక్షణారహితంగా విడుదల చేయటం, రసాయన ఎరువుల వాడకం వంటి అనేక కారణాలవల్ల తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని మనందరికీ తెలుసు. వీటి కారణంగా సముద్ర మట్టాలు పెరగడం, తరచుగా ప్రక•తి వైపరీత్యాలు రావటం, జంతు, వ•క్ష జాతులు అంతరించిపోవడం వంటి ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. అయితే మొదట చెప్పుకున్న అడవుల నిర్మూలన వల్ల నష్టపోయేది అడవిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలు, అందుకే ఉత్తరాంచల్‍ అడవుల్లో నివసించే బిష్ణోయ్‍ తెగకు చెందిన గిరిజన మహిళలు అడవులను కాపాడుకోవడానికి చెట్లను ఆలింగనం చేసుకుని తమ ప్రాణాలను సైతం లెక్కచేయక ఉద్యమించారు. అదే తర్వాతి కాలంలో చిప్కో ఉద్యమం అయింది. నర్మదా బచావో అంటూ బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణాల వలన నిర్వాసితులైన గిరిజనులు ఉద్యమం బాట పట్టారు. పరిశ్రమల నుండి వెలువడే విషపూరిత రసాయనాలు కలసిన నీటినే అన్ని అవసరాలకు వాడుకుంటున్న పేదలు…వీళ్ళందరిది జీవన పోరాటమే… అదే పర్యావరణవాదమైంది.


భూమి తల్లి పట్ల ప్రపంచం తన గౌరవాన్ని కోల్పోయింది, ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లు, అడవులను నేలకూల్చుతూ, జీవావరణాన్ని ధ్వంసం చేస్తూ, జీవనదుల్ని ఎడారులుగా మార్చుతూ పెట్టుబడిదారీ విధానం ద్వారా ఆర్థిక వ•ద్ధిని మాత్రమే అభిలషిస్తున్న మనిషి సామాజిక శ్రేయస్సును గురించి ఆలోచించకపోవటంతో పర్యావరణ విధ్వంసం మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నది.


Sooner or later, we will have to recognize that the Earth has rights, too, to live without pollution. What mankind must know is that human beings cannot live without Mother Earth, but the planet can live without humans – అంటాడు దక్షిణ అమెరికా దేశమైన బొలీవియా అధ్యక్షుడిగా ఉండి ధరిత్రి హక్కుల కోసం పోరాడిన ఇవో మొరేల్స్. ‘ధరిత్రికి కూడా కాలుష్యరహితంగా ఉండే హక్కుందని ముందో వెనుకో మనందరం గుర్తించాల్సి ఉంటుందని, భూమాత లేకుండా మనుషులు జీవించలేరుకానీ, మానవజాతి లేకుండా భూగోళం మనగలుగుతుంద’ని, మానవ హక్కుల విశ్వ ప్రకటన వెలువడిన 60 సంవత్సరాల తరువాతైనా భూమి హక్కుని గుర్తించి, ఐక్యరాజ్య సమితి జనరల్‍ అసెంబ్లీ, ఏప్రిల్‍ 22ని ధరిత్రి దినోత్సవంగా ప్రకటించటం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ఐక్యరాజ్య సమితి అటు తరువాత ప్రపంచ నీటి దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, జీవవైవిధ్య దినోత్సవం ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అభివ•ద్ధి, అత్యాశ పేరిట మానవ జాతి చేస్తున్న పనులవల్ల గత కొన్ని దశాబ్దాలలోనే అరణ్యాలు 50 శాతానికిపైగా, నీటి వనరులు 70 శాతానికి పైగా లుప్తమయ్యాయి. తన జీవనశైలితో ప్రక•తిని ధ్వంసం చేస్తున్న మనిషి సహజ వనరుల వినియోగంపై, పర్యావరణ పరిరక్షణపై, అంతరించిపోతున్న జీవజాతుల సంరక్షణ కోసం ప్రత్యేక దినాలను ప్రకటించి ఆ ఒక్క రోజు కంటితుడుపుచర్యగా కార్యక్రమాలు నిర్వహించటం.


కవులు, రచయితలు సాహిత్యానికి, పర్యావరణానికి మధ్య గల సంబంధాన్ని, పర్యావరణ విమర్శక ద•ష్టితో చూడటం 1970లనుండి మనకు అమెరికన్‍ సాహిత్యంలో కనిపిస్తుంది. Joseph W. Meeker అనే అమెరికన్‍ మానవ పర్యావరణవేత్త, వన్యప్రాణి జీవావరణం, మానవ-జంతు స్వభావాలు అనే అంశంపై పరిశోధన చేశాడు. అతడు రాసిన The Comedy of Survival: Literary Ecology and a Play Ethic అనే పుస్తకంలో తొలిసారిగా సాహిత్య జీవావరణం గురించి చేసిన చర్చ పర్యావరణవేత్తలు, సాహిత్య విమర్శకులు, మానవ పరిణామ శాస్త్రవేత్తలతోపాటు, సాధారణ పౌరులను సైతం ఆలోచింపజేసి ఈ భూగోళాన్ని పరిరక్షించవలసిన సైన్యంగా మన కర్తవ్యాన్ని తెలియజేస్తుంది. William Rueckert అనే అమెరికన్‍ రచయిత, సాహిత్య అధ్యాపకుడు 1978లో ‘»Ecocriticism’ అనే పదాన్ని పరిచయం చేశాడు. పర్యావరణాంశాలు, ప్రక•తి సంబంధ విశేషాలను సాహిత్యంతో అన్వయంచేస్తూ కవులు, రచయితలు, పరిశోధకుల రచనలను విశ్లేషించే విమర్శా ధోరణిగా దీనిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తెలుగు సాహిత్యంలో పర్యావరణాంశాలను ప్రస్తావించిన, చర్చించిన రచనల గురించి పరిశీలించినప్పుడు అక్కినేని కుటుంబరావు గారు రాసిన ‘‘కొల్లేటి జాడలు’’ నవలను పేర్కొనవచ్చు.


జలవనరులు సమ•ద్ధిగా ఉంటే ఏ ప్రాంతమైనా సుభిక్షంగా ఉన్నట్లే. నీటి జాడల వెంటే నాగరికతల జాడలు కనిపిస్తాయి. కానీ జీవ నదులు సైతం కనుమరుగవుతున్న విషాద కాలంలో చెరువులు, సరస్సులు, కుంటలు, బావుల దుస్థితి మనందరికీ తెలిసిందే. అలాంటి ఎన్నో సరస్సులలో పశ్చిమ గోదావరి, క•ష్ణా జిల్లాల పరిధిలో ఉన్న కొల్లేరు సరస్సు ఒకటి. చిత్తడి నేలల్లో సుమారుగా1.20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన కొల్లేరు సరస్సు ఆసియాలో అత్యంత ప్రాచీనమైన పెద్ద మంచినీటి సరస్సు. ప్రపంచ ప్రసిద్ధమైన వలస పక్షుల ఆవాస కేంద్రం. ఒకప్పుడు ఒక్క పెలికన్‍, ఫ్లెమింగో జాతి పక్షులే లక్షల్లో సందర్శించేవి. రెండు వందల పక్షి జాతులతో కొల్లేరు అలౌకికమైన జీవంతో తొణికిసలాడేది. బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు లాంటి చిన్నా, పెద్దా ఏరుల నుంచి కొల్లేరుకు నీరు వచ్చి చేరుతుంది. ఒకప్పుడు సమష్టి వ్యవసాయంతో దేశానికే ఆదర్శంగా నిలిచిన కొల్లేటి ప్రాంతంలోని ఒక గ్రామ వాసి వర్తమాన బీభత్సాన్ని చూసి బెంగటిల్లి తలచుకున్న జ్ఞాపకాల వలపోత అక్కినేని కుటుంబరావు రాసిన ‘కొల్లేటి జాడలు’. ఈ నవలలో రచయిత బాల్యం నాటి కొల్లేటి జీవనం, ఏటా వస్తున్న వరదలతో తమ చేతికొచ్చిన పంట, నిలువ నీడ, నీళ్ళపాలైనా, ఆ ప్రాంతీయులంతా శూన్యం నుంచి పోరాటం మొదలుపెట్టారు కానీ, ఏనాడూ ప్రక•తి ప్రకోపాన్ని నిందించిన వాళ్ళు కాదు. ఒక సామూహిక కార్యాచరణ గురించి ఆలోచించి, అందరూ ఒక్క మాట మీద నిలబడి 500 ఎకరాలను ఊరంతా ఒక్కటై సమష్టిగా వ్యవసాయం చేస్తారు. కానీ దేశాన్ని విడగొట్టే కులమతాలు ఊరినీ విడగొడతాయి. ఊరు కులాలుగా విడిపోవటం, సమష్టి వ్యవసాయం దెబ్బతినటం, అటు తరువాత వరుస తుఫానులతో వ్యవసాయం కుదరదని రైతులు వలసలు వెళ్ళిపోతారు. 1976లో చేపల చెరువులకు, 1990ల తరువాత రొయ్యల సాగుకు ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేయటంతో కొల్లేరు చుట్టుపక్కల ఆక్రమణలు పెరిగాయి. సర్వే చేయని భూముల్లో కూడా ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చి చేపల చెరువులు, రొయ్యల చెరువుల తవ్వకాలు చేపట్టటం, చుట్టుపక్కల భూముల ఆక్రమణ, మురుగు నీరు వచ్చిచేరటంతో మంచినీటి సరస్సు ఉన్నా, చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు తాగునీటి కోసం అలమటించటం వంటివి పర్యావరణ విధ్వంసం, జీవావరణాన్ని ధ్వంసం చేసిన ఆనవాళ్ళు ఆవేదనకు గురిచేస్తాయి.


కొల్లేరు పరిధిలోని పులపర్రు గ్రామానికి చెందిన శీను అనే అయిదేళ్ళ బాలుడు తన బాల్యంలో తన కళ్ళతో, తన హ•దయంతో చూసిన, ఈతలు నేర్చుకున్న కొల్లేరు సరస్సుకు దూరమై 60 యేళ్ళ తరువాత చూడటానికి వస్తాడు. అనంతమైన సరస్సు ముక్కలు ముక్కలై కళ్ళముందు కనబడుతుంటే మనసులో కల్లోలం చెలరేగుతుంది. ఆ సరస్సుతో పెనవేసుకున్న బంధాన్ని, పులపర్రు గ్రామ వాసుల జీవనం, కేవలం రెండే కులాలు ప్రధానంగా జీవించిన గ్రామంలో సామాజిక సంబంధాలు, అవసరం ఏర్పడినప్పుడు అందరూ ఒక్క తాటిపైకి వచ్చి సమష్టిగా నిలబడటం… అన్నీ జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతాయి. కొల్లేరు ప్రాంతంలోని సాంఘీక జీవితాన్ని రికార్డ్ చేస్తూనే పర్యావరణం, జీవావరణం పట్ల ప్రభుత్వాలు, సమాజమూ చేస్తున్న అమానవీయ ఆర్థిక దోపిడీ, అత్యంత వేగంగా విస్తరించిన ప్రపంచీకరణ ప్రభావం, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, అభివృద్ధి పేరుతో దళారులకోసం పుట్టే ప్రాజెక్టుల గురించి రచయిత ప్రస్తావిస్తాడు.


ప్రక•తిలో జీవవైవిధ్య సౌందర్యమే బహు గొప్పది, సహజసిద్ధంగా ఏర్పడిన ఆహార చక్రానికి అనుగుణంగా జీవులన్నీ ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. కొల్లేరు నీటిలోని జీవ వైవిధ్యాన్ని రచయిత పేర్కొంటాడు-కొరమీనులు, వాలగలు, బొచ్చెలు, గురకలు, పరిగలు, బిల్లా పరిగలు, బెట్టులు, మత్త గుడిసెలు, బొమ్మిడాయిలు, ఇంగిలాయిలు, మార్పులు, జెల్లలు, శీలావతి వంటి అనేక చేపల రకాలు, వేసవిలో దేశంలోని వివిధ ప్రాంతాలనుండే కాక సైబీరియా, ఫిలిప్పైన్స్, రష్యా, చైనా, ఫిజి దీవులనుండి వచ్చే పెలికాన్‍, ఫ్లెమింగో పక్షులు, గూడ కొంగలు, పరజ, కొండింగాయ్‍, నత్తగొట్టు కొంగలు, తెల్ల కంకణాలు, ఎర్రకాళ్ళ కొంగలు, చింతవక్కలు, చుక్కమూతి బాతులు, నల్లబోడికోడి, కలికి పక్షులు, జకానాలు, కత్తిరి పిట్టలు, మైనా గోరలు, పాల పిట్టలు, కొంగలు, ఉత్తూతి పిట్టలు. మేరతూడు, తుంగ, గవర, గరిక, అల్లి వంటి పచ్చని మేతతో, జమ్ము, జీలగ వంటి పొదలతో ఉండే కొల్లేరు అక్కడి పశువులకి తల్లివంటిది. పులపర్రు గ్రామంలోని పిల్లలంతా తమ పశువులను తీసుకుని కొల్లేరుకొస్తే, పశువులకు కడుపునిండా మేత దొరికేది. పిల్లలు కూడా అక్కడ దొరికే కలేకాయలు, చీమిడి కాయలు తిని సరస్సులో నీళ్ళు తాగి కడుపునింపుకునేవాళ్లు. వందల రకాల చేపలను తన కడుపులో దాచుకున్న కొల్లేరును, వ్యాపారం పేరుతో ముక్కలు చేసి ఒకే రకం చేపలను పెంచి, జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేశారు. అభివ•ద్ధి పేరుతో వ•ద్ధి చెందింది కొందరేనని, ఒకప్పుడు కొల్లేట్లో చేపలుపట్టి అమ్ముకున్న క•ష్ణమూర్తి కుటుంబం ఇప్పుడు చెరువుల్లో కూలీల్లా చేపలు పడుతుంటారు. విజయవాడ, ఏలూరు పారిశ్రామిక కాలుష్యాలన్నీ కొల్లేరులోకి విసర్జితమవుతున్నాయ్‍. చేపల పెంపకంలో అధికలాభాలకోసం మేతలో కూడా రసాయనాలున్నాయి. వరదల సమయంలో వచ్చే ఒండ్రు మట్టి, గుర్రపు డెక్క, కిక్కిస వంటివాటి కారణంగా కొల్లేరు పూడికతో నిండిపోతోంది. దీని ఫలితంగా 1900 నాటికి సముద్ర మట్టం కంటే దిగువన ఉన్న కొల్లేరు ఇప్పుడు ఎగువకు వచ్చిందని అధికారిక నివేదికలు తెలుపుతున్నాయి. ఇదిలాగే కొనసాగి, ప్రధానంగా పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనాలు, ప్లాస్టిక్‍ వ్యర్థాలు చేరికతో మరింత వేగంగా సరస్సు పూడికమయం అయిపోయే ప్రమాదం ఉంది.
కొల్లేరు గురించి శ్రీనివాసరావు పడుతున్న బాధను చూసి మధుసూదనరావు ‘‘కొల్లేరు సమస్య చిన్న సమస్య కాదు. రాజకీయాలతో, వ్యాపారంతో, పెట్టుబడులతో ముడిపడి ఉందని, బతకటానికి కాక, లాభాలవేటకి ప్రక•తిని, సహజ వనరుల్ని కొల్లగొడతామో, అప్పుడు పర్యావరణానికి ముప్పు తెస్తున్నట్టేనం’’టాడు. ‘‘కొల్లేరు బాగుండాలి, పేదల బతుకులూ బాగుపడాలంటే ప్రభుత్వాలు ముందు చూపుతో చిత్తశుద్ధితో పనిచేయాలం’’టాడు. కానీ కొల్లేరును ప్రభుత్వం అభయారణ్యంగా ప్రకటించింది. చిత్తడి నేలల పరిరక్షణ కోసం ఒక చట్టం ఉంది. 40 శాతం జీవరాసులు ఈ చిత్తడి నేలల్లోనే జీవిస్తున్నాయి. ‘‘కొందరు పెట్టుబడీదారులు కొల్లేరును 77 వేల ఎకరాలకు కుదించి మిగిలిన 23వేల ఎకరాల్లో ఏమైనా చేసుకోవచ్చని వాదిస్తుంటే, స్వార్థ రాజకీయ నాయకులు నలభైఐదువేల ఎకరాలకు కుదించి మిగిలిన దాన్ని చిత్తడి నేలల పరిరక్షణ చట్టం నుండి మినహాయింపు పొంది, తద్వారా దక్కే యాభైఐదు వేల ఎకరాలను చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. కొల్లేరులో అంతులేని సంపద ఉందని గ్రహించిన ప్రభుత్వం దానిని దురాశాపరుల చేతుల్లో పెట్టింద’’ని విని శ్రీనివాసరావు బాధ పడితే, చదువుకోసం, మెరుగైన జీవితాల కోసం వలస వెళ్ళిపోయిన వాళ్లు ఇప్పుడు కొల్లేరు గురించి చింతించటం చూసి వ్యంగ్యంగా నవ్వుతాడు అతడి చిన్ననాటి మిత్రుడు రాధాక•ష్ణ. కొల్లేరు మాత్రమే కాదని, తాము ఉన్నచోట మరో రకంగా పర్యావరణంపై జరుగుతున్న విధ్వంసాన్ని పట్టించుకోకుండా కేవలం కుటుంబాలను బాగుచేసుకోవటంపైనే ద•ష్టి పెట్టామని, ప్రతిదీ ప్రభుత్వాలే చూడాలన్న తమ ఆలోచనా విధానం తప్పని అంటాడు రాధాక•ష్ణ.


‘‘కొల్లేటి జాడలు’’ నవల మనుషులంతా ఉమ్మడిగా క•షి చేస్తే ఏదైనా సాధించగలరన్న విషయాన్ని సమష్టి వ్యవసాయం ద్వారా నిరూపించింది. ఇదే స్పూర్తితో జీవవైవిధ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకోసం కూడా ఉద్యమిస్తే సాధ్యమవుతుందన్న భావన కలుగుతుంది. అలాంటి ఆలోచనతోనే ప్రముఖ పర్యావరణవేత్త డా.తల్లావజ్ఘుల పతంజలి శాస్త్రి, రాష్ట్ర డ్రైనేజ్‍ బోర్డు సభ్యుడు ఏమని నాగేంద్రనాథ్‍, కొల్లేరు జాలర్ల సంఘం, సన్నకారు రైతు సంఘం వారు ప్రభుత్వంపై వేర్వేరుగా వేసిన పిటీషన్లపై అనేక సంవత్సరాలు సాగిన వాదోపవాదాలు విన్న ఎస్‍.సిన్హా, వి.రావు బెంచ్‍ ఒక తీర్పు ఇచ్చింది
‘‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన సరస్సులను కాలుష్యం, జీవావరణ శాస్త్రం, ఆక్రమణ మొదలైన వాటి నుండి రక్షించడం రాష్ట్రం ప్రాధమిక అంశంగా ఉండాలి. వేగవంతమైన ప్రపంచీకరణ మరియు పర్యావరణానికి ముప్పు పొంచివున్న నేపథ్యంలో, కాలుష్య రహిత పర్యావరణాన్ని కలిగి ఉండటానికి పౌరుల హక్కులు, నీటి హక్కు మొదలైనవాటిని అపెక్స్ కోర్ట్ ఆర్టికల్‍ 21 ప్రకారం గుర్తించింది. భారత రాజ్యాంగం, సరస్సుల పరిరక్షణలో ప్రభుత్వ కర్తవ్యం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. రాజ్యాంగంలోని పార్ట్’’ కింద రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‍ 21 ప్రకారం అమలు చేయబడతాయని ఇప్పుడు బాగా స్థిరపడిన చట్ట సూత్రం. రాజ్యాంగంలోని ఆర్టికల్‍ 48-• ప్రకారం, పర్యావరణాన్ని రక్షించడానికి, మెరుగుపరచడానికి, దేశంలోని అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి రాష్ట్రం ప్రయత్నిస్తుంది. రాజ్యాంగంలోని 49వ అధికరణం జాతీయ ప్రాముఖ్యత కలిగినదిగా పార్లమెంట్‍ చేసిన చట్టం ద్వారా లేదా చట్టం ప్రకారం కళాత్మక లేదా చారిత్రాత్మక ఆసక్తి ఉన్న ప్రతి స్మారక చిహ్నాన్ని లేదా ప్రదేశాన్ని పాడుచేయడం, విక•తీకరణ, విధ్వంసం, తొలగింపు, పారవేయడం, ఎగుమతి చేయడం వంటి వాటి నుండి రక్షించాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉంది. అదే సమయంలో, అడవులు, సరస్సులు, నదులు మరియు వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని పరిరక్షించడం, మెరుగుపరచడం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‍ 51-•(స్త్ర) ప్రకారం జీవుల పట్ల కరుణ కలిగి ఉండటం భారతదేశంలోని ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. పిటిషన్లలో లేవనెత్తిన వివిధ సమస్యలను పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986, నీరు (కాలుష్య నివారణ మరియు నియంత్రణ) చట్టం, 1974, మరియు వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 వంటి పై రాజ్యాంగ నిబంధనలు, పర్యావరణ చట్టాల వెలుగులో పరిశీలించాలి.


1999లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‍ 120 విడుదల చేసి ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించింది. 2005లో సుప్రీం కోర్టు నియమించిన సాధికారిక కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిత్రా కమిటీలు కొల్లేరులో పర్యటించి అప్పటి స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదికలందించాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి 2007లో కొల్లేరు ప్రక్షాళనలో భాగంగా సుమ్మరు 55వేల ఎకరాల అనధికార చెరువులు కొట్టేసి సాగుదారులకు రూ.55 కోట్ల మేరకు నష్ట పరిహారం అందించింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. కైకలూరు పరిసర ప్రాంతాల్లో అభయారణ్యంలో 7500 ఎకరాల భూమి వెలుగులోకి వచ్చింది. కొల్లేరులో 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకి కుదించాలని స్థానికుల కోరిక మీద అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ‘‘కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యం +5 అడుగుల ఆక•తి నుండి +3 అడుగుల ఆక•తి వరకు తగ్గించటం ద్వారా స్థానిక రైతుల సమస్యలను తగ్గించడానికి ‘నేషనల్‍ బోర్డ్ ఆఫ్‍ వైల్డ్ లైఫ్‍’, భారత ప్రభుత్వం, ‘సెంట్రల్‍ ఎంపవర్డ్ కమిటీ’ సిఫారసుల కోసం ‘అసెంబ్లీలో తీర్మానం చేసింది. తీర్మానంలోని పర్యావరణ, చట్టపరమైన, సామాజిక-ఆర్థిక, జీవనోపాధికి సంబంధించిన చిక్కులను గ్రహించి, కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ సమస్యను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూన్‍ 2010నుండి కొల్లేరు ప్రాంతాన్ని పలుమార్లు సందర్శించి, సంబంధిత అధికారులతో, రైతులతో, రైతుసంఘాలతో, చేపల చెరువుల వ్యాపారులతో అనేక సమావేశాలు నిర్వహించింది. కొల్లేరు సరస్సు ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక మరియు పర్యావరణ సమస్యలకు ప్రస్తుత అభయారణ్యం ప్రాంతాన్ని తగ్గించడం ఆచరణీయ పరిష్కారం కాదు. కొల్లేరు అభయారణ్యం ప్రస్తుత సరిహద్దులో చేపల పెంపకాలను నిర్వహించడంతోపాటు, దాని పరిధిలో ఎటువంటి మార్పును అనుమతించకూడదని కమిటీ నివేదిక సమర్పించింది.
2012లో కొల్లేరును ఎకో సెన్సిటివ్‍ జోన్‍గా ప్రకటించింది. కొల్లేరులో 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకి కుదించాలని స్థానికుల కోరిక మీద 2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కాంటూరు కుదింపు కోసం తీర్మానం చేసి కేంద్రం పరిధిలో ఉన్న అంశం కావడంతో వారికి నివేదిస్తున్నట్టు తెలిపింది. సముద్రమట్టానికి ఎగువ, దిగువన ఎంత మేరకు ఉన్నది అన్నది లెక్కగట్టి కాంటూరు లెక్కిస్తారు. ప్రస్తుతం కాంటూరు 5గా ఉన్న కొల్లేరు పరిధిని కాంటూరు 3కు కుదిస్తే సుమారుగా 40 వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. తద్వారా స్థానికులందరికీ ఉపాధి లభిస్తుందని దానిని పర్యావరణ పరంగా సక్రమంగా అభివ•ద్ధి చేస్తే అందరికీ మేలు జరుగుతుందని, కానీ, పర్యావరణం పేరు చెప్పి ప్రజల ఉపాధిని కొల్లగొట్టడం తగదని అక్కడి రైతులు, రైతు సంఘాల వాదన.


గణాంకాల ప్రకారం సరస్సు మొత్తం విస్తీర్ణంలో 1967లో 29.95 చదరపు కిమీలో ఉన్న ఆక్వాకల్చర్‍ ప్రస్తుతం సుమారు 110.0 చ.కిమీ.కు విస్తరించింది. చిత్తడి నేలలో వ్యవసాయం చేసే విస్తీర్ణం కూడా పెరిగింది. ఏలూరు, గుడివాడ పట్టణాల నుండి పెరిగిన మురుగు ప్రవాహమే కాక, క•ష్ణా-గోదావరి డెల్టా ప్రాంతం నుండి, విజయవాడ నుండి పారిశ్రామిక వ్యర్థాలు, పురుగుమందులు, ఎరువులు కూడా సరస్సును కలుషితం చేస్తున్నాయి. సరస్సులో ఇప్పటికే వాడుకలో ఉన్నవి కాకుండా అక్రమ చేపల తొట్టెల నిర్మాణం ప్రస్తుతం సరస్సుకు పెను ముప్పుగా పరిణమిస్తోంది. వర్షాకాలం తరువాత, అభయారణ్యంలోకి నీటి ప్రవాహం ఆగిపోవటం, ఆ ప్రాంతంలో అక్రమ చేపల చెరువులు త్రవ్వటానికి అక్కడ 8-10 అడుగుల ఎత్తు వరకు పెరిగే ఫ్రాగ్‍మిట్‍ కర్కాతో పాటు అనేక జల కలుపు మొక్కలను కాల్చడం సౌకర్యంగా ఉంటుంది. అభయారణ్యం ప్రాంతంలో ప్రైవేట్‍ వ్యక్తులకు వేల ఎకరాల భూమిని అధీనంలోకి తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ భూములను జిరాయతీ భూములుగా పేర్కొంటారు. చేపల పెంపకందారులు మరియు రాజకీయ నాయకులు అభయారణ్యం ప్రాంతాన్ని తగ్గించడానికి ఆసక్తి చూపుతున్నారు. అభయారణ్యం ప్రాంతం తగ్గడం పెలికాన్‍లు, పెయింటెడ్‍ కొంగలు, ఇతర నీటి పక్షులపై ప్రభావం చూపుతుంది.


స్వదేశీ పక్షులతో పాటు విదేశీ పక్షి జాతులకు ఆలవాలమైన కొల్లేరు సరస్సులో ఏటేటా వాటి సందడి తగ్గిపోతుంది. కొల్లేరుపై ఆధారపడి మూడు దశాబ్దాల క్రితం నులుగుపిట్ట, పరాజ, పెలికాన్‍ వంటి పక్షులు రెండు కోట్ల వరకు మనుగడ సాగించేవి. కానీ ప్రస్తుతం వాటి సంఖ్య ప్రమాదకరస్థాయిలో తగ్గిపోతున్నదని, గత రెండు, మూడు సంవత్సరాలుగా అభయారణ్య శాఖ తెలుపుతున్న పక్షజాతి గణాంకాలను గమనిస్తే అర్థమవుతుంది. కేవలం రెండు, మూడు లక్షల పక్షులు మాత్రమే విహరిస్తున్నట్లు అంచనా.
2010లోని చిత్తడి నేలల నిబంధనల ప్రకారం చిత్తడి నేలలను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కొన్నేళ్లుగా కొల్లేరును పరిరక్షించాలని పర్యావరణవేత్తలు హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, కేసులు వేశారు. సుప్రీం కోర్టు కూల్చివేత ఉత్తర్వు తర్వాత, అక్రమ చేపల ట్యాంకులు కూల్చివేసినా, కొంతకాలం తర్వాత మళ్లీ ట్యాంకులను నిర్మించారు. ఇదే తీరు కొనసాగితే కొల్లేటి సరస్సు పునరుద్ధరణ అసాధ్యం.
ఒక సరస్సు అస్తిత్వాన్ని ప్రధాన ఇతివ•త్తంగా తీసుకుని సమాజంలో పర్యావరణ చైతన్యాన్ని ఆర్ద్రంగా ప్రబోధించిన నవల ‘కొల్లేటి జాడలు’. పర్యావరణ సాహిత్యంలో ఇది ఒక స•జనాత్మక డాక్యుమెంట్‍గా నిలిచిపోతుంది.


ఉపయుక్త గ్రంధ సూచి:
  1. Environmentalism: A Global History-Ramachandra Guha
  2. The Comedy of Survival: Literary Ecology and a Play Ethic-Joseph W Meeker
  3. Dr.T.Patanjali Shastri vs Chairman Andhra Pradesh State Judgement
  4. Report on the proposal for downsizing the Kolleru Wildlife Sanctuary (+5 to +3 feet contour)- Submitted to The Ministry of Environment and Forests Government of India April 2011
  5. The story of a Glory Lost – Kolleru Lake-  Shakti and AS Bishnoi Saevus Magazine

-డా.జె.నీరజ
ఎ : 9848370018

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *