తెలంగాణ రాష్ట్రం పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలోని బేగంపేట గ్రామానికి దగ్గరగా రామగిరిఖిల్లాగా పిలువబడేదే రామగిరి దుర్గం. ఈ కోట రామగిరి గుట్టలమీద నిర్మాణమైంది. వనౌషధులకు ప్రసిద్ధమైన దట్టమైన అడవి విస్తరించిన ప్రదేశంలోనే దుర్గం కట్టబడ్డది. వివిధ మూలికాజాతులకు చెందిన మొక్కలతో సంపన్నమైంది. ఈ కోట నుంచి చూస్తే మానేరు, గోదావరి నదుల సంగమం కనిపిస్తుంది. రామగిరిని తరుచుగా రత్నగిరి, రత్నగర్భ అంటుంటారు.
రామగిరి భౌగోళిక స్థితి:
రామగిరి కొండ భౌగోళికంగా 790025-790028 డిగ్రీల తూర్పు రేఖాంశాలు, 180034-180038 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, సముద్ర మట్టానికి 679మీ.ల ఎత్తున నెలకొని వుంది. కొండ ఉపరితలం 40 చ.కి.మీ.లు విస్తరించి వుంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 250 కి.మీ.ల దూరంలో, పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 22 కి.మీ.ల దూరంలో రామగిరి ఖిల్లా వుంది. పెద్దపల్లి, మంథని రహదారిలో ఉన్న బేగంపేటకు 2కి.మీ.ల చేరువలో ఉంది.
రామగిర్యాయణం:
రామాయణంలోని అరణ్యకాండలో అగస్త్యాశ్రమానికి వెళ్ళిన రామునికి పంచవటి వైపు వెళ్ళమని వర్ణించి చెప్పిన భౌగోళిక వర్ణన రామగిరికి సరిపోతుందని వాదించే వారున్నారు. సీతారామ లక్ష్మణులు ఒక తాటివనం దాటి, ఉత్తరదిశగా ఒక పర్వతోపరితలం మీద నడిచారు. రాముడు నడిచిన ఆ కొండ ఇదే. కనుక రామగిరి అయిందట.
కొండమీదున్న ఒక దిగుడుబావిలో సీతమ్మ స్నానమాడిందని, అందువల్ల దానిని సీతమ్మగుండం అని పిలుస్తారు స్థానికులు. ఆ పక్కన రెండు శివలింగాలున్నాయి. వాటిని సీతారాములే ప్రతిష్టించారని ప్రచారం. అక్కడే పసుపు, కుంకుమల గుంట లున్నాయి.
రామగిరి కొండకొసన ఉన్న గుహలజంట ఒకదానిలో సీతారామలక్ష్మణ, భరత, శత•ఘ్ను, ఆంజనేయ శిల్పాలున్నాయి. భరతుడిక్కడ నుంచే రాముని పాదుకలు తీసుకుని అయోధ్యకు వెళ్ళాడని భక్తుల విశ్వాసం.
ఏ రామగిరి….?
‘మేఘ సందేశం’లో మహాకవి కాళిదాసు
‘‘యక్షశ్చక్రే జనకతనయా స్నానపుణ్యోదకమేషు
స్నిగ్ధచ్ఛాయా తరుషు వసతి ‘రామగిర్యా’శ్రమేషు’’ అని ప్రస్తావించిన రామగిరి ఇదేనని కొందరు పండితుల అభిప్రాయం. కాళిదాసు 5వ శతాబ్దం వాడు. అంటే తెలంగాణలో విష్ణు కుండినులు, వాకాటకుల పాలనాకాలం. ఇక్కడ విష్ణుకుండినుల నిర్మాణాలు ఉండెనో, లేదో పరిశోధించాల్సిన విషయం.
కాని, ఐ.కె.శర్మ అనే పురాతత్వవేత్త మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్‍కు 36కి.మీ.ల దూరంలోనున్న మానసార రామగిరి (ఆశ్రమాని)కి 5కి.మీ.ల దూరంలో ఉందని రాసాడు. కాళిదాసు ‘మేఘసందేశం’లో యక్షుడు ఖైదీగా ఉన్న రామగిరి కొండ ఇది కాదని, కాళిదాసు వాకాటక రాకుమారునికి గురువుగా చాలాకాలం రామ్ టెక్ దగ్గరలోని రామగిరిలోనే ఉండేవాడని చరిత్రకారులు వివరించారు. కనుక ‘మేఘసందేశం’లోని రామగిరి మన రామగిరి కాదనుకుంట.
రామగిరి మీద చరిత్రపూర్వయుగం జాడలు:
తెలంగాణాలో చరిత్రపూర్వయుగం, తొలి చారిత్రకదశలు, చారిత్రక యుగం చరిత్ర-సంస్క•తులను అధ్యయనం చేయడానికి రామగిరి ఒక మచ్చుతునక.
రామగిరిఖిల్లా ఎక్కడం మొదలుపెట్టి మొదటిదర్వాజకు చేరుకోగానే విరిగిన దర్వాజ, మొండికోట, విరిగిన ద్వారానికి కుడిపక్కన క్రీ.త.1478సం. నాటి తుమ్మీఖాన్ 10వేల రూకలు ఖర్చుపెట్టి చేయించిన కోటదర్వాజ శాసనం వుంది. దర్వాజ నుంచి ఎడమ వైపుకు గొల్లభామల దిక్కు పోతే పెండ్లిబావి. బాయి దాటినంక 100మీ.ల దూరంలోని చిన్నగుహలో లింగం లేని పానవట్టం వుంది. ఈ గుహలోనే ఎరుపురంగులో వేసిన రాతిచిత్రాలు అగుపిస్తాయి.
ఈ రాతిచిత్రాలలో ఒక మనిషి, ఒక ఎద్దు, గుర్తించడానికి వీలుకాని జంతువుల బొమ్మలు రెండు, మరొక మనిషిబొమ్మ అగుపిస్తున్నాయి. బొద్దుగీతలలో వున్న ఈ రాతిచిత్రాలు శైలిని బట్టి, వస్తువును బట్టి చాల్కోలిథిక్ పీరియడ్ కు చెందినవని చెప్పవచ్చు. కొత్తరాతియుగం నుంచి పెదరాతియుగానికి పరిణమించే సమయంలోని మానవసంస్క•తి ప్రతిబింబాలనవచ్చు. నేటికి 4,5 వేల సంవత్సరాలకు పూర్వానివి ఈ రాతిచిత్రాలు.
ఈ గుహకు అవతలివైపు గుహలో పదునైనమొన వున్న పరికరంతో గీరి గీసిన ‘తొక్కుడు బొమ్మలు’ (పెట్రోగ్లైఫ్స్) వున్నాయి. ఈ బొమ్మలలో ఎడమచేత త్రిశూలం ధరించిన నిలబడ్డ వేటగాడు, పక్కన పెద్దపక్షి అగుపించాయి. ఈ చిత్రాలు మధ్యరాతియుగం కాలానికి పూర్వాచెందినవి. ఠాకూర్ రాజారాం సింగ్ నర్రఏషాల పల్లెలో ఇటువంటి పెట్రోగ్లైఫ్స్ను చూసి, వాటిని పాతరాతియుగం చివరిదశకు చెందినవని రాసాడు. పోలికలతో ఈ రామగిరి పెట్రోగ్లైఫ్స్ కూడా మధ్యరాతియుగం నాటి చిత్రాలని చెప్పవచ్చు. రామగిరి కొండ మీద తెలంగాణ పురావస్తు పరిశోధకుడు ఠాకూర్ రాజారాం సింగ్ పురామానవుని (మైక్రోలిథ్స్) మధ్యరాతియుగపు సూక్ష్మరాతి పనిముట్లను దోసిళ్ళకొద్ది సేకరించాడు. అపుడు తనవెంట తనజంట పరిశోధకుడు రాజారాం శర్మ, ఆర్కియాలజీ డిపార్టుమెంట్ డిప్యూటీ డైరెక్టర్ వివి క•ష్ణశాస్త్రి వున్నారు.
అక్కడికి 10మీ.ల దూరంలోనే పెదరాతియుగానికి చెందిన రాళ్ళకుప్ప సమాధులు 36వున్నాయి. ఇవన్నీ రాతినేలమీదనే రాతికుప్పలతో ఏర్పరచిన సమాధులు. చాలా అరుదైనవి. వీటిలో మొదటి వరుసలో 6వ సమాధి దాటగానే పడిపోయిన మెన్హర్ కనిపిస్తుంది. మిగతాచోట్ల సమాధుల అంచుల్లో రాళ్ళపేర్పుతో నిలిపిన రాతి స్తంభాల వంటి మెన్హర్లు ప్రతి సమాధికి కనిపిస్తాయి. ఈ సమాధులలో కొన్నింటిలో ఎముకలు దొరికాయి. ఆ పరిసరాల్లో ఇనుము చిట్టేలు, బండలపై రాతిబొద్దులు (కప్ మార్కస్), కుండ పెంకులు విరివిగా కనిపిస్తున్నాయి.
ఇక్కడ లభిస్తున్న ప్రక•తి సిద్ధమైన సహజవనరులైన నీటివూటలు, నీటి వనరులు, గుహలు, ఆహారానికి అవసరమైన జంతువులు, చెట్లు చేమలుండడం వల్ల వేల సంవత్సరాలుగా ఆదిమానవులిక్కడ నివాసమున్నారని చెప్పవచ్చు. రామగిరిఖిల్లా మీద చరిత్రపూర్వయుగ సంస్క•తి ఆనవాళ్ళు వెతికిన కొద్ది లభిస్తాయి. అన్వేషణ కొనసాగిస్తే ఇంకా చారిత్రకాధారాలు తప్పక లభిస్తాయి.
వాటిని దాటిపోతే గొల్లభామలు, సూటిగా పోతే నందిముక్కు, దానికి ఎడమవైపు నడిస్తే పాండవలొంకకు చేరుకుంటాం. అక్కడ 2 దిగుడు బావులు, 1 చేదబావి వున్నాయి. ఆ పక్కన నివాసాల శిథిలాలు కనిపిస్తాయి.
చరిత్రలో రామగిరి:
రామగిరి చరిత్ర మొదటి శతాబ్దం నుంచి మొదలవుతుందంటారు. ఈ రామగిరి దుర్గాన్ని ‘వజ్రకూటమి’ అని కూడా అన్నారు. కొంతమంది చరిత్రకారులు ఈ కోటను చంద్రగుప్త, బిందుసార, అశోకచక్రవర్తి వంటి మౌర్యపాలకులు అభివ•ద్ధిపరిచి వుంటారంటారు. సాతవాహన చక్రవర్తులైన గౌతమీపుతశ్రీ సాతకర్ణి, పులోమావి ఈ ప్రాంతాన్ని పాలించారు. రామగిరి దుర్గానికి 50కి.మీ.ల దూరంగా వాయవ్యదిశలో సాతవాహనుల రాజధాని కోటిలింగాల కోట వుంది.
వేములవాడనేలిన చాళుక్యులలో వినయాదిత్యుడు (సా.శ.750-755) ఈ కోటను వశపరచుకున్నాడని చరిత్రకారుల కథనాలున్నాయి. చరిత్రకారులు ఊహచేసినట్లు రామగిరి పొలవాస రాజ్యానికి రాజధానిగా ఉన్నట్టు ఆధారాలు దొరకలేదు. లభించిన శాసనాలు, దేవాలయ నిర్మాణాల ఆధారంగా పొలవాసరాజులు పొలవాసనే రాజధాని చేసుకున్నారని చెప్పాలె.
12వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన కోటగా రామగిరి ఖిల్లా ప్రసిద్ధం. కాని, కాకతీయుల సామ్రాజ్యంలో భాగమైన రామగిరిఖిల్లా మీద నిర్మాణాలలో వారిశైలి కనిపించడం లేదు. వారి సామంతులు చేసిన కట్టడాలుండ వచ్చు. కాకతీయులు చాళుక్య సామంతులుగా ఉన్నపుడే కాకతి రుద్రదేవుడు తిరుగుబాటు దారులైన మరో చాళుక్య సామంతరాజు గుండరాజును యుద్ధంలో వధించాడు. (సా.శ.1158లో కోటను వశపరచుకున్నాడు.) సా.శ.1323లో కాకతీయుల పతనానంతరం, ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ జయంతో రామగిరికోట కూడా వారిపాలనలో భాగం అయ్యింది. తర్వాత ముసునూరు నాయకులు ప్రోలయ, కాపయల ఏలుబడికాలంలో ఉన్నది రామగిరి. సా.శ. 1368లో రాచకొండ వెలమలు రామగిరిని స్వాధీనం చేసుకుని పరిపాలించారంటారు. సా.శ. 1425-1433 మధ్య రాచకొండ ప్రభువు సింగమను ఓడించి బహమనీ సుల్తాన్ అహ్మద్ షా రామగిరిని ఆక్రమించాడు. సా.శ. 1457వరకు పాలకులుగా బహమనీలున్నారు. సా.శ.1518 నుంచి 1687వరకు కుతుబ్షాహీల ఏలుబడిలో ఉంది రామగిరి.
ఈ కోట అప్పటి మొగలుల దక్కన్ సుబా గవర్నర్ ఔరంగజేబు కొడుకులలో ఒకరు, అబ్దుల్లా కుతుబ్షా పెద్దబిడ్డ భర్త, అల్లుడైన మహమ్మద్ సుల్తాన్ కు కట్నంగా ఇవ్వబడ్డది. రామగిరిలో 1656 ఏప్రిల్ 6న ఈ పెండ్లి జరిగిన స్థలంలోనే ‘పెండ్లిబావి’ అనే దిగుడు బావి ఉంది. సా.శ.1597 నుంచి మొగలుల పాలనలో ఉండేది ఈ దుర్గమని చరిత్రకారుల రాతలు. సా.శ.1606లో గోల్కోండ నవాబులు ఈ కొండమీద కోటను ఆక్రమించారు. నిజాంరాజుల దాక ఈ దుర్గం ముస్లింల పాలకుల చేతిలోనే వుంది. సా.శ. 1791 నుంచి బ్రిటిష్ వారి పాలనలోనికి వచ్చింది ఈ దుర్గం. బీరార్ సుల్తాన్ గోల్కొండ సుల్తానుల మధ్య జరిగిన యుద్ధంలో కులీ కుతుబ్షా రామగిరికోటమీద ఫిరంగిని పేల్చాడంటారు.
ముసునూరి నాయకుడైన కాపయ సర్వాధికారాలతో ముప్పయనాయకుణ్ణి రామగిరి మండలాధిపతిని చేసాడు. కేసన, కందనామాత్యులను మంత్రులుగా ఏర్పరిచాడు. ఈ ముప్పయ నాయకుడు మడికి సింగన రచనలో ‘కూనయ ముప్పన•పాలక/సూను, శ్రీ తెలుగున•పతి సుదతీ మల్లాం/బానందనుడగు ముప్పయ/భూనాథుని సుకవివరుడ బుధసన్నుతుడన్’ అని పేర్కొనబడ్డాడు.
సా.శ. 1552 ప్రాంతంలో గోలకొండ ఇబ్రహీమ్ కుతుబ్షా ఏలుబడిలో ఎరబాటి నారాయణ్ గారు గోల్కొండలో ముఖ్యోద్యోగి. సుల్తానుచేత రామగిరి దుర్గ పాలనాధికారం పొందినాడు. అతని కొడుకు ఆపో నారాయణ్, వారి కొడుకులు నారోజి, లింగోజిలు పాలకులైనారు.
రామగిరికోట 2వ ద్వారానికి కుడిభాగంలో చెక్కివున్న శాసనం తెలుగులోనే వుంది. కాని, దానిలో తేదీ తెలియడం లేదు. ‘148వి………/బ. 12 బుధవా…./ రిద్బురిం మీ భాండ/రింకిటి దరువాజ కటించి/గ్నా పదివేలు యెండురాజు/లవలెను…ఇమారాంతుపా…/ ……………………/డు……………..’ . ఈ శాసనం 1479 శకానికి సరియగు 1557 నాటికి ఇబ్రహీం కుతుబ్షాహీ కాలం అవుతున్నది.
రామగిరికోటలో…. ఏముంది?
తెలంగాణాలోని కోటలన్నింటిలో రామగిరి విస్తీర్ణతలో, కోటనిర్మాణంలో, ఎత్తులో పెద్దది.
పెద్ద, పెద్ద కోటగోడలు, ప్రాకారాలు, బురుజులు, భవనాలు, మసీదులు అగుపిస్తాయి. కోటలోపల చిత్రకోట, తాటికోట, నిమ్మకోట, సోలుకోట, సింహాలకోట, జంగ్లికోట, మహదేవునికోటలు, కొలువుశాల, మొగలుశాల, సభావేదికలు, భజనశాల, చెరసాల, గజశాల, రహస్యమడిగెలు, సొరంగాలు, నగార్ ఖానా, మందుకోట, తోపులు, తోపుగుండ్లు, చెప్పుల గది, గోరీలు, సమాధులు అని పిలిచే ప్రదేశాలు, దోపుబావి, నల్లకయ్య బావి, పసరు బావి, ఘోడె• •వి, హరి బావి, చక్కెర బావి, అచ్చమ్మ బావి, అమ్మగారి బావి అనే బావులు, దేవస్థలాలు, సప్తద్వారాలు, చౌకీలు, సింహద్వారం, బ•ందావనం, గణపత్ర వనం, మల్లెవనాలు మొదలైనవాటితో మైళ్ళకొద్ది వైశాల్యంతో ఒప్పారుతున్నది రామగిరి దుర్గం. కోటలో అంత శిల్పనైపుణ్యం కనబడదు కాని, ఒకవైపు గోదావరి, 3వైపులా దట్టమైన అడవులు కనిపిస్తాయి.
‘ఈ దుర్గమునే రాజు నిర్మించెనో యే రాజు పాలించెనో, యిది యే కాలమునాటిదో యూహకందనందున పలువురు పలువిధముల భావించి, పలువిధముల నూహించుట జరుగుతున్నది’ అని యరబాటి బాపురావు రాసాడు.
రామగిరి ఖిల్లా పైన గోల్కొండ కోట కంటే విశాలమైన స్థలం వుంటుంది. కోట ఎక్కడానికి చెక్కిన మెట్లు మనుషులకే కాదు గుర్రాలు, ఏనుగులు పైకి ఎక్కడానికి అనువుగా చెక్కినవి అంటారు పరిశీలకులు. మొత్తం ఏడు ద్వారాలున్నాయి.
మొదటి కోట ప్రధానద్వారం ఫతేదర్వాజా దాటి ఇంకా 5 కోటగుమ్మాలు పైకి వెళ్ళాలి. మూడు ప్రాకారాలున్న కోట. రక్షణ కొరకు పటిష్టంగా కట్టిన ఈ కోటగోడలు 120 అడుగుల ఎత్తుంటాయంటారు. రాతితో కట్టిన ఈ కోటకు రక్షణవ్యూహపరంగా 20కంటే ఎక్కువ బురుజులున్నాయి. కోటలో నాలుగు పోతపోసిన ఉక్కు ఫిరంగులున్నాయి. 12మీ.ల ఎత్తున కట్టిన వేదికల మీద అమర్చివున్నాయి ఈ తోపులు. బురద, సున్నం, కొమ్మలు, జంతువుల వెంట్రుకలు, జంతువుల రక్తంతో చేసిన పూతతో కట్టబడ్డాయంటారు పరిశీలకులు.
రామగిరి పూర్వనగరం (పాటిగడ్డ):
యరబాటి బాపురావు రామగిరి చరిత్రలో రాసినదానినిబట్టి రామగిరికొండకు ఉత్తరాన బేగంపేట శివారులో పాతనగరముండే దనడానికి ఆధారాలుగా లభిస్తున్న గుర్తులనేకం. ఇప్పటికి రికార్డుల్లో ఈ ప్రదేశానికి రామగిరి అనే పేరున్నది. బేచిరాగ్ గ్రామం కావచ్చు. అపుడపుడిక్కడ రామటంకాలనే నాణాలు దొరుకుతుంటాయని అక్కడి ప్రజలు చెప్పుకుంటారు. బాపురావుగారు ఇక్కడికి సమీపగ్రామాలన్ని రామగిరి వాడలే అంటారు.
అప్పుడు కరణీకంచేసిన నియోగులు బేగంపేట గ్రామంలో ఉన్నారు. వారు అపుడపుడు మంత్రి పదవులు నిర్వహించేవారని చెప్పుకుంటారు. రామావఝల అనే ఇంటిపేరున్నవారు అప్పటి రాచకొలువులోని వారేనని బాపురావుగారి నమ్మకం.
గిరిదుర్గంలో వనసంపద:
మంథని అటవీశాఖపరిధికి సంబంధించిన తూర్పు డివిజన్‍లో మైదంబండ, కుందారం, లక్కారం, పెద్దపల్లి, సబ్బితం, కల్వచెర్ల, మారేడుగొండ అనే 7 ఫారెస్టుబీట్స్ల లోపల ఉంది. రామగిరిమీద లభించే 150 రకాల వనౌషధులు గుర్తించబడ్డాయి. రామగిరిని ‘వైద్య వనౌషధి కేంద్రం’గా చేయాలి
రామగిరిపై దేవాలయాలు:
రామగిరిలో గణపతి, అనేక శివలింగాలు అగుపిస్తాయి. ముప్పయనాయకుని మంత్రి కేసన రామగిరిలో కేశవాలయాన్ని కట్టించినాడని చెప్పడానికి ‘సకల నీతి సమ్మత’మనే పుస్తకంలో చెప్పబడ్డది.
రామగిరి కోట శిల్పాలు-విశేషాలు:
రామగిరికోటలోని ఒక ద్వారానికి పక్కగా కనిపించే గండభేరుండ శిల్పం. ద్విముఖాలతో, పెద్ద రెక్కలతో, వాడియైన గోర్లతోఉన్న కాళ్ళతో సింహాలను, ఏనుగులను ఎత్తుకుని ఎగిరే రూపంలో దీనిని చెక్కారు. ఈ వైష్ణవ చిహ్నం. గండభేరుండను తమ రాజ్య చిహ్నంగా స్వీకరించిన రాజులు తమ కోటద్వారాలకు, దేవాలయాలలో అరిగజాలను (శత్రు రాజులను), అరిగజకేసరులను (వారిని అణిచి వేసిన వారిని) కాళ్ళతో తన్నుకునిపోయే అపరిమిత శక్తిశాలులం తామేనన్నట్లు గండభేరుండను చెక్కించారు. గండభేరుండం ఒక పౌరాణికమైన జంతువు. విష్ణువు నరసింహాతారాన్ని అణిచివేసిన శరభేశ్వరుడనే శివావతారాన్ని గెలువడానికి వైష్ణవమతంలో రూపొందిన వింత పక్షి. శైవ, వైష్ణవాల ఆధిక్యతల పోటీలో పుట్టిన వారే శరభేశ్వర, గండభేరుండాలు. గ్రద్ద వంటితల, రెక్కలు, సింహంవంటి శరీరంతో గండభేరుండ శిల్పాలు, చిత్రాలుంటాయి. గండభేరుండం ప్రస్తుత కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రచిహ్నం. వడయార్ రాజుల రాజచిహ్నం. అచ్యుత రాయలు వేయించిన నాణేలమీద గండభేరుండం బొమ్మ వుంటుంది. కౌలాస్ కోట ద్వారం మీద ఉన్నది. సంకీస రామాలయం గోడల మీద ఉంది.
కోట ద్వారానికి పైన పుష్పాలు, చేప, తాబేలు, రెండు హంసలు, సింహాలను కాళ్ళతో తన్నుకు పోతున్న గజం, ఏనుగులను నాలుగుకాళ్ళతో అణిచేస్తున్న సింహం శిల్పాలు జంతు పరిణామాలను, జలచర, భూచరాలనో చూపడం లేదు. వైష్ణవాల యాలలో చేప, తాబేలు కనిపిస్తాయి. హంసలు అలంకారాలు. ఈ ఏనుగు, సింహాలు గండభేరుండానికి బలైపోయే అరిగజాలు, అరిగజకేసరులు.
కొండచిలువను తొక్కివేస్తున్నట్టుగా ఈ ఏనుగు శిల్పం. రాజదర్పాన్ని సూచించేదే. ఘీంకరిస్తున్న యుద్ధగజం. మరో రెండు యుద్ధగజాలు, ద్వారం పక్కన చెక్కిన అలంకారంగా కాకతీయ శైలి హంస, గోపికలు, గోవులు, గోపాలురతో గోవర్ధనగిరిధారి అర్థ శిల్పాలు, వేణుగోపాలుడు గొల్లభామలతో, శేషఫణఛత్రం కింద మహావిష్ణువు, లక్ష్మి కింద పన్నిద్ధరాళ్వారులు… అక్కడే ఇంకా పరిష్కరింపబడని తెలుగు శాసనం ఉన్నాయి.
రామగిరి రామాలయంలో సీతా రామ లక్ష్మణ భరత శత•ఘ్న, హనుమంతులున్నారు. ఇంకా కోటలో పిల్లల ఫిరంగి, పాడువడ్డ రాజమహల్, రక్షణ బురుజులు కనిపిస్తాయి.
ఆధారాలు:
- కీ.శే.యరబాటి బాపురావు-రామగిరి చరిత్ర-1982, రామగిరి దేవాలయనిర్మాణ ధర్మకర్త సంఘం మరియు దాతలు ప్రచురణ
- రామగిరిఖిల్లాకు అన్నితొవ్వలు తెలిసిన చరిత్రకారుడు, మార్గదర్శి (గైడ్) సముద్రాల సునీల్ అన్వేషణలు- చరిత్ర పూర్వయుగపు ఆధారాలు
- మహేంద్ర, సినీ దర్శకులు (దొరసాని ఫేం), రామగిరి డాక్యుమెంటరీ ఫిల్మ్, ఫోటోల సౌజన్యంతో
- INTERNATIONAL JOURNAL OF PHARMACY & LIFE SCIENCES -(Int. J. of Pharm. Life Sci.) Enumeration of Medicinal Plants of Ramagiri-Khilla Forests of Karimnagar District, Telangana, India- E. Narasimha Murthy* and N. Venu Madhav, Department of Botany, Satavahana University, Karimnagar, (Telangana) – India.
- శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698