చరిత్ర గుట్టు బయటపెట్టే నాణేలు నాణేలతో శాతవాహనులపై మరింత స్పష్టత

శాతవాహనుల చరిత్రకు ప్రాచీన నాణేలు అందించిన తోడ్పాటు ఏంటి అనేది నా కీలకోపన్యాసానికి నేను ఎంచుకున్న అంశం. ప్రాచీన భారతదేశాన్ని పాలించిన ప్రముఖ రాజవంశాల్లో శాతవాహనులు ఒకరని మీ అందరికీ తెలిసిందే. ప్రఖ్యాత సాంచీ స్థూపం, అమరావతి స్థూపం లాంటివి, పశ్చిమ భారతదేశంలో రాతిని తొలచి నిర్మించిన ఆలయాలు లాంటి గొప్ప కళాత్మక కట్టడాలన్నీ శాతవాహనులు అందించినవే. ఇలస్ట్రేటివ్‍ ఆర్కియాలజీకి ప్రఖ్యాతి పొందిన గొప్ప శిల్పకళా రీతులు మూడు నాలుగు వందల ఏళ్ల పాటు వికసించి వర్ధిల్లింది వీరి కాలంలోనే. ఎన్నో బౌద్ధ స్థూపాలు ఇందుకు సజీవ తార్కాణాలుగా ఉన్నాయి.


శాతవాహనుల కాలంలో సాహిత్యం కూడా వికసించింది. హాలుడి గాధాసప్తశతి, సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం, గుణాఢ్యుడి బ•హత్కథ, సోమదేవుడి కథాసరిత్సాగర, క్షేమేంద్రుడి బ•హత్కథా మంజరి వంటి రచనలు ఎన్నో వచ్చాయి.


ఆక్స్ ఫర్డ్, ప్రిన్స్ టన్‍ యూని వర్సిటీకు చెందిన జాన్‍ హేవుడ్‍ తయారు చేసిన ప్రపంచ చరిత్ర పటాలను చూస్తే గనుక, సామాన్యశక పూర్వం ఒకటో శతాబ్దంలో భారత దేశంలో దాదాపుగా మూడింట ఒక వంతు ప్రాంతాన్ని, సామాన్య శకం 200 సంవత్సరంలో దాదాపు సగం భారతదేశాన్ని శాతవాహనులు పాలించారని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. శాతవాహనుల కాలంలో రోమ్‍, పాశ్చాత్యదేశాలతో వ్యాపారం కూడా జరిగింది. భారతదేశ చరిత్రలో ఆ కాలం ఎంతో శాంతి సౌభాగ్యాలతో ఉండింది.


శాతవాహనుల చరిత్రను అధ్యయనం చేసేందుకు మూడు రకాల వనరులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మొదటిది శాతవాహనుల కాలానికి చెందిన సాహిత్య రచనలు, రెండోది శాసనాలు, మూడోది నాణేలు. శాతవాహనుల కాలానికి చెందిన సాహిత్య రచనలు చాలా వరకు పురాణాలు. మత్స్య, వాయు, విష్ణు, బ్రహ్మాండ, భాగవత పురాణాలు వీటిలో ఉన్నాయి. ఈ పురాణాలు విషయపరంగా శాతవాహనులతో మిళితం అయినప్పటికీ, పాలకుల సంఖ్య, వారు పాలించిన సంవత్సరాలు, వారి వారసులు లాంటి విషయాలలో అవి పరస్పర విరుద్ధ సమాచారాన్ని అందించాయి. ఈ రచనలు అన్నీ కూడా ఆనాటి ప్రజల సామాజిక, మత, ఆర్థిక అంశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడినా, చరిత్ర రచనకు మాత్రం అంతగా ఉపయోగపడవు.


ఇక శాసనాల విషయానికి వస్తే, శాతవాహనుల కాలానికి సంబంధించినవి 33 శాసనాలున్నాయి. వీటిలో ఇటీవలే తెలంగాణలోని కరీంనగర్‍ జిల్లాలోని ముక్కత్‍ రావుపేట, గట్టు సింగారంలలో బయటపడిన హకుసిరి యువరాజుకు సంబంధించిన రెండు శాసనాలు కూడా ఉన్నాయి. వాటి వివరాలు నేను తరువాత తెలియజేస్తాను. అయితే శాతవాహనుల శాసనాల్లో మూడో వంతు అధికారికం. వాటిలో అత్యధిక భాగం ప్రైవేటు వ్యక్తులకు జారీ చేయబడినవి. అందువల్ల అవి వాటి ఉపయోగిత స్వభావపరంగా ఎక్కువగా మతపరమైన అంశాలకు చెందినవి. శాతవాహనుల చరిత్ర పునర్‍ నిర్మాణాణికి వాటి ఉపయోగం తక్కువే. అందువల్ల శాతవాహనుల చరిత్ర సమాచార అధ్యయనానికి సంబంధించి నాణేలు ప్రధాన వనరుగా మారాయి.


శాతవాహనుల కాలం నాటి సాహిత్య రచనలు, శాసనాలతో పోలిస్తే, నాణేల అధ్యయనం మరెంతో ఉపయుక్త కరంగా ఉంటుంది. మద్రాస్‍ యూని వర్సిటీలో 1959 మార్చి 4న మర్రెమండ రామారావు ప్రసంగించారు. వివిధ మ్యూజియంల నుంచి, ప్రైవేటు వ్యక్తుల దగ్గరి నుంచి ఆయన 57271కి పైగా శాతవాహన నాణేలను అధ్యయనం చేశారు. శాతవాహనుల గురించి ఆయన చేసిన ప్రసంగానికి నాణేలే ఆధారంగా నిలిచాయి. ఈ నాణేలు సాధారణంగా మూడు రకాలు. హోర్డస్, స్ట్రేస్‍, సైట్‍ ఫైండ్స్. హోర్డస్ అంటే మట్టిలో దొరికే నిక్షేపాల్లోని నాణేలు. స్ట్రే నాణేలు అంటే అనుకోకుండా లభించినవి. ఇక మూడో రకం తవ్వకాల సందర్భంగా బయటపడేవి. వీటన్నిటిలోకి తవ్వకాల్లో బయటపడిన నాణేలే అత్యుత్తమంగా ఉపయోగపడుతాయి. ఎందుకంటే ఇక్కడ లభించేవి ప్రత్యక్ష ఆధారాలు. అక్కడ దొరికే ఇతర వస్తువుల డేటింగ్‍, నాణేల డేటింగ్‍కు కూడా తోడ్పడుతుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‍, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్‍, చత్తీస్‍ గఢ్‍… ఇలా శాతవాహన ఆర్కియలాజికల్‍ విభిన్న ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో శాతవాహనుల నాణేలు లభ్యమయ్యాయి. వాటి అధ్యయనం శాతవాహన చరిత్రను నమోదు చేయడంలో ఎంతగానో తోడ్పడు తుంది. దేశంలో శాతవాహనుల నాణేలు లభించిన తవ్వకాల ప్రాంతాలు మొత్తం 27 ఉన్నాయి. శాతవాహనులకు సంబంధించి వారు ఎవరు, వారి పాలన ఎప్పుడు ప్రారంభమైంది, అది ఎంత కాలం కొనసాగింది, వారి పాలన ఎక్కడి నుంచి ప్రారంభమైంది… ఇలా ఎన్నో ప్రశ్నలకు ఈ నాణేలు సమాధాన మిచ్చాయి. 1978లో కనుగొన్న కోటిలింగాల నాణేలు శాతవాహనులకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చాయి.


మొదటగా శాతవాహనులు ఎవరో చూద్దాం. శాతవాహనులు, ఆంధ్రులు ఒక్కరే. పురాణాల్లో ప్రస్తావించిన పేర్లు, రాజుల జాబితాలు శాసనాల్లో కనుగొన్న, నాణేల్లో పేర్కొన శాతవాహన రాజుల పేర్ల మాదిరిగానే ఉన్నాయి. అందువల్లే వారు ఒక్కరే అని పరిగణించడం జరిగింది. శాతవాహన సామ్రాజ్యం మొదటి పాలకుడి సరైన పేరు చిముక శాతవాహన. శతాబ్దాల తరువాత ఈ పురాణాలను రాసినందున మొదటి పాలకుడికి అవి విభిన్న పేర్లను ఇచ్చాయి. దాంతో వారి చుట్టూ మరెన్నో కథలు అల్లుకుపోయాయి. శాతవాహన నాణేలపై ఉన్నది ఎవరు? ఆయన మరెవరో కాదు, చిముక శాతవాహన. శాతవాహన నాణేలపై
ఉన్నది ఏ భాష? అది ప్రక•తి. దాని లిపి బ్రాహ్మి.


చిముక శాతవాహనుడి తరువాత అధికారం చేపట్టింది ఎవరు? ఆయన సామగోప. ఆయన కోటిలింగాల నుంచి వచ్చిన ముందుకాలపు శాతవాహన రాజు. చిముక రాజు కాకముందు ఏం చేసే వాడు? ఆయన రాజు కాకముందు మహారథి అనే బిరుదుతో ఉన్న అధికారి అని సన్నతి తవ్వకాల్లో దొరికిన నాణేలు నిరూపించాయి. సన్నతిలో రాజుగా చిముకను పేర్కొనే నాణేలతో పాటుగా ఆయన మహారథి బిరుదుతో ఉన్న అధికారిగా పేర్కొనే నాణేలు కూడా లభించాయి.


శాతవాహనులకు పుట్టినిల్లు తెలంగాణ అని, వారి మొదటి రాజధాని కోటిలింగాల అని కూడా ఈ నాణేలు తిరుగులేని విధంగా నిరూపించాయి.
శాతవాహనులకు సంబంధించిన మరో అంశం నాణేల ద్వారా వెలుగులోకి వచ్చింది. శాతవాహన కుటుంబాలు స్వాభావికంగా మాత•స్వామ్యానికి చెందినవి. గౌతమిపుత్ర, వాశిష్ట పుత్ర వంటి శాతవాహన రాజుల పేర్లను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.


శాతవాహన రాజులకు సంబంధించి పౌరాణిక జాబితా కూడా అసంపూర్ణంగానే ఉంది. ఉదాహరణకు స్కంద, రుద్ర వంటి నాణేలు లభించాయి కానీ వాటి ప్రస్తావన పురాణాల్లో లేదు. అందుకే శాతవాహన రాజుల పౌరాణిక జాబితాను సవరించాల్సి ఉంది.


పశ్చిమ క్షాత్రపులకు చెందిన నహపాణను ఓడించేంత వరకు కూడా శాతవాహనులు వెండినాణేలను జారీ చేయలేదని, ఓడించిన తరువాత వాళ్ళ వెండిని ఉపయోగించుకున్నారని చెబుతారు. క్షాత్రపుల వెండి, శాతవాహనుల నాణేలు వేర్వేరు లోహాలకు చెందినవని నేను చేసిన ఎక్స్ రే అధ్యయనాలు నిరూపించాయి. పంచ్‍ మార్క్ చేసిన వెండి నాణేలు అనేకం అప్పట్లో చలామణిలో ఉండేవి, అందుకే శాతవాహనులకు వెండి నాణేలు జారీ చేయాల్సిన అవసరం రాలేదు.


పురాణాలు గౌతమీపుత్ర యజ్ఞ శాతకర్ణి తన సోదరుడు గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత చాలా కాలం పాటు రాజ్యపాలన చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అది నిజం కాదు. వారు ఏకకాలంలో వేర్వేరు ప్రాంతాలను పరి పాలించారు. ఉదాహరణకు గుంటూరులో లభించిన నిక్షేపాల్లో ఎక్కువ నాణేలు యజ్ఞకు సంబంధించినవి. ఈ సోదరులు తమ సామ్రాజ్యంలోని భాగాలను ఏకకాలంలో పాలించినట్లుగా కనిపిస్తోంది.


శాతవాహన చివరి పాలకుడిని పులుమావిగా పిలిచేవారని నాణేలు నిరూపిస్తున్నాయి. పులుమావి అనేది తెలుగుపదం. అది అంతకు ముందు పాలకులైన పుడుమావిలకు సంబంధించింది కాదు. పెద్దబొంకూరులో లభించిన నాణేలు కొన్ని ప్రాంతాల్లో శాతవాహనుల తరువాత పల్లవులు రాజ్యాధికారంలోకి వచ్చినట్లుగా నిరూపిస్తున్నాయి. పల్లవులు శాతవాహనుల నాణేలపైనే తిరిగి తమ ముద్రలు వేశారు. ఇది కొన్ని కొన్ని ప్రాంతాల్లో శాతవాహనుల తరువాత పల్లవులు రాజ్యాధికారంలోకి వచ్చినట్లుగా నిరూపిస్తోంది.
మొత్తం మీద శాతవాహనుల చరిత్రకు నాణేలు గొప్పగా తోడ్పడ్డాయి.

  • దెమె రాజారెడ్డి,
    ఎ : 9848018660

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *