పగటివేషం – పరమార్థం

పగటివేషాలు అనే కళా రూపం జాతి, కుల, వంశ, వైశిష్టతను కాపాడేదిగా చెప్పవచ్చు, భిన్నమతాలకు, కులాలకు నిలయమైన మన భారతీయ సంస్క•తిలో అట్టడుగు వర్గాలు మాత్రమే పగటివేషాలతో సంస్క•తిని పరిరక్షిస్తున్నారు. పగటివేషాలు అనేక కళల్లో ఒకటి. వీళ్ళను కళాకారులుగా పేర్కొనవచ్చు. ప్రజల వినోదం కోసం ప్రదర్శించబడే కళారూపాలు చాలా వరకు రాత్రివేళల్లోనే ప్రదర్శించబడతాయి. కాని రాత్రి సమయాల్లో కాకుండా పగటిపూట ప్రదర్శించబడటం వల్ల ఈ కళారూపాలకు పగటివేషాలనే పేరు స్థిరపడిపోయింది. తమ హావభావాలతో వాక్చాతుర్యంతో కొందరిని అనుకరించడం, పట్టపగలే వేషం కట్టి గుర్తుపట్టలేనంతగా ఆ పాత్రలో లీనమైపోయి ఇటు పామరులను, అటు పండితులను ఆకట్టుకొని మెప్పించి, మురిపించడం పగటివేషాల ప్రత్యేకత. ఈ కళలు ప్రాచీన భారతంలోనూ కనిపిస్తాయి. ఆనాటి సమాజంలో జమీందార్లు, పెత్తందార్లు, వర్తకులు ఎన్నో అన్యాయాలు, ఆక్రమాలు, పాపాలు, అత్యాచారాలు, దోపిడిలు వంటి సంఘ వ్యతిరేక పనులు చేసే ప్రజాపీడన సమూహానికి ఒక ఆట లేదా కథ రూపంలో వివరించి చెప్పే ఉద్దేశ్యంగా ఈ పగటివేషాలు ఆవిర్భవించాయి.


పగటివేషాలు చారిత్రకంగా, పౌరాణికంగా, సామాజికంగా దర్శించబడుతుంటాయి. ఆయా పాత్రల ద్వారా సమాజంలో ఉండే మూఢనమ్మకాలు, ఆచారవ్యవహారాల వంటి చీకటికోణాలను తమ చతుర సంభాషణలతో హాస్యధోరణితో వ్యంగ్యంగా బట్టబయలు చేస్తూ సమాజ మార్పుకు దోహదపడేటట్లు ప్రజలను విజ్ఞాన పరుస్తూ ప్రదర్శించబడ్డ ఈ కళల్లో ఆది భైరాగి వేషం, ఫకీరుసాహెబు వేషం, హరిదాసు వేషం, అర్ధనారీశ్వర వేషం, రంభ, శుక మహాఋషి వేషం, చాతాది వైష్ణవుల వేషం, లంబాడీల వేషం, వీరబాహువేషం, ఎరుకలసోదె వేషం, వడ్డీ ఉప్పరవేషం, కోయ వేషం, గొల్లబోయడి వేషం, బుడబుక్కల వేషం, మందులవాడి వేషం, సోమయాజులు సోమిదేవమ్మ వేషం, పిట్టలదొర వేషం, మొదలగునవి బాగా జనాదరణ పొందిన వేషాలుగా చెప్పవచ్చు.


ఆది భైరాగి వేషం :
‘‘మట్టి నుండి పుట్టిన మనిషి చివరకు మట్టిలోనే కలిసిపోతాడు’’ అనే వైరాగ్యాన్ని ఈఆది భైరాగి వేషం తెలయజేస్తుంది. జానపదులకు భక్తితో పాటుగా హాస్యచతురత ఎక్కువ. కాబట్టి ఈ వేషం ఆలంబనగా వేదాంతదోరణిని కూడా హాస్యప్రధానం చేసుకుని ప్రదర్శిస్తారు. ఆదిభైరాగులు ఒక గ్రామాన్ని ఎంచుకుని ఆగ్రామంలోకి ఒకరు అడ్డనామంతో, వేరొకరు నిలువునామంలో, మరొకరు ఇస్లామిక్‍ వేషాధారణతో, ఇంకొకరు కాషాయ వస్త్రాలతో ప్రవేశిస్తారు. జానపదులకు వారు ఏమతానికి చెందినవాళ్ళ తెలియకుండా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితిని ఆదిభైరాగులు తమకు అనుకూలంగా మలుచు కుంటూ హాస్యోక్తులతో ఒక్కోమతం వారి లోపాలను పట్టింపులను ఎత్తిచూపుతూ తమ కళను ప్రదర్శిస్తారు.
ఫకీరు సాహెబుల వేషం :
ఈ వేషంలో కూడా వేదాంత ధోరణి, తాత్వికచింతన కన్పిస్తాయి. ‘‘మనిషి శరీరం శాశ్వతం కాదు. ధనం కూడా శాశ్వతం కాదు ధనాన్ని చూసి వ్యక్తులకు విలువ ఇవ్వడం సరికాదు’’ అనే సందేశాన్ని ఈవేషధారణ ద్వారా అందిస్తారు. అలాగే వీరి సందేశంలో మానవ సంబంధాల విశిష్టత తెలుస్తుంది. మమతానురాగాలు ఎక్కువయ్యే కొద్ది బాధలు కూడా ఎక్కువవుతాయనే వాస్తవాన్ని కూడా వీళ్ళు తెలియజెప్తుంటారు. హాస్యప్రియత్వమై ఈ వేషం కొనసాగుతుంది
హరిదాసు వేషం:
సంక్రాంతి సందర్భంలో హరిదాసులు వస్తుంటారు. వీరు ఎక్కువగా రామదాసుకీర్తనలు, త్యాగరాయ కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు పాడుతుంటారు. తలపై అక్షయపాత్ర ధరించి హరినామ స్మరణ చేస్తూ ప్రతి ఇల్లు తిరుగుతూ భిక్షాటన చేస్తారు. వీరు తమ కీర్తనాలలో భక్తితత్వాన్ని ప్రబోధిస్తుంటారు. జీవితంలో కష్టసుఖాలు అనివార్యమని, దైవనామస్మరణ మనసుని గట్టెక్కిస్తుందని, దైవమే మనిషి మనుగడని నిర్దేశిస్తాయని వీరి కీర్తనలు తెలియజేస్తాయి. ‘‘హరి’’ అంటే జీవితసారం వినిపించే ఉన్నతమైన పదం. ఈ పదమే జీవనసాగారాన్ని నడిపిస్తుందనే మర్మం హరిదాసు కీర్తనల్లో కనిపిస్తుంది. ఇందులో హాస్యం ఉండదు. భక్తిచింతన ప్రధానంగా ఉంటుంది.
రంభ-శుకమహాబుషి వేషం:
ఈ వేషంను ‘‘బాల్కి భైరాగి వేషం’’ అని పిలుస్తారు. ఇక్కడ ‘‘రంభ’’ అనే స్త్రీ ప్రలోభానికి ప్రతీక. ఈ వేషంలో బాల్కి భైరాగి తురకయాసలో తెలుగు మాట్లాడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంటాడు. ఈ వేషంలో ‘‘రంభ –
శుకమహర్షిల’ సంవాదఘట్టం ప్రదర్శింప బడుతుంది. రంభ అందచందాలకు లొంగని శుకమహర్షి నిగ్రహశక్తి ఒక సందేశంగా ఈవేషం విజయం సాధిస్తుంది. మనిషి కూడా శుకమహర్షివలె ప్రలోభాలకు లొంగకుండా, కఠినమైన నిగ్రహశక్తితో, ఏకాగ్రతతో తను అనుకున్నది పట్టువదలకుండా సాధించాలని తెలిపే ఒక దివ్య సందేశమే ఈ కళ ఉద్దేశ్యం.
అర్ధ నారీశ్వర వేషం :
ఈ వేషం నిరాడంబరంగా ఉంటుంది. సమాజంలో సవతులపోరు, ఇద్దరు భార్యలు ఉన్న మగాడి పరిస్థితిని కళ్ళకు కట్టినట్లుగా ఈ వేషధారణలో ప్రదర్శిస్తుంటారు. ఈ వేషం ద్వారా భార్యభర్తల బంధంలోని పటిష్టత అర్థమవుతుంది. త్రిపురాసుర సంహారం, దక్షయజం, పార్వతీ పరిణయం, అమ•తమధనం, మొదలగునవి ఈవేషధారణలో ప్రదర్శిస్తుంటారు. త్రిమూర్తులలో ముగ్గురు ఈ వేషధారణలో ప్రదర్శిస్తుంటారు. త్రిమారులతో ముగ్గురు ఏదైనా కష్టం వస్తే సమానంగా పంచుకునేవారు. దేవతలను కాపాడటం కోసం శివుడు హాలాహలాన్ని సేవించాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ ప్రతి కుటుంబంలో కష్టసుఖాలను సమానంగా పంచుకుని ఆనందంగా ఉండాలని ఈ వేషం యొక్క పరమార్థాన్ని తెలియజేస్తారు.


చాతాది వైష్ణవుల వేషం :
ఈ వేషం వైష్ణవ మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. మానవుడు జన్మించింది మొదలు మరణించే సమయం వరకు జరిగే కార్యక్రమాలను గురించి కళాశక్తులు తెలియజెప్తుంటారు. జ్యోతిష్యమునకు సంబంధించిన లింగాలు ప్రస్తావించబడతాయి. స్త్రీ గర్భందాల్చిన సమయాన్ని ఆధారం చేసుకుని ఎలాంటి సంతానం కలుగుతుందో ఈవేషం తెలియజేస్తారు. మనిషి చిన్నచిన్న సమస్యలకు భయపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా కాకుండా ఎంతటి పెద్దసమస్యకైనా ఆలోచిస్తే తప్పనిసరిగా పరిష్కరం దొరుకుతుందనే సందేశాన్ని వివరిస్తారు. ఎంతో పుణ్వం చేసుకుంటే తప్ప మానవ జన్మ రాదనే విషయాన్ని తెలుపుతారు.
లంబాడీ వేషం :
లంబాడీల కులాచార పద్ధతులను ఈ వేషం తెలియజెప్తుంది. లంబాడీ జాతిలో అన్న మరణిస్తే వదినను మరిది వివాహాం చేసుకునే ఆచారం కొనసాగుతున్నది. ఈ ఆచారం తప్పు అని కొందరు వాదిస్తుంటారు. అయితే జీవితం కొల్పోయిన స్త్రీకి కొత్త జీవితాన్ని ఇవ్వడం తప్పుకాదని సూచిస్తారు. అదేక్రమంగా సమాజంలో ఒక స్త్రీకి భర్త లేకపోతే ఆ స్త్రీని ఎన్నిరకాలుగా అవమానపరుస్తూ, గేలి చేస్తారో తెలియజేస్తారు. వితంతు వివాహాల ప్రోత్సాహానికి లంబాడీవేషం ఆదర్శంగా నిలబడుతుంది. రామాయణంలో వాలి, సుగ్రీవుల కథను అనుసంధానం చేస్తూ ప్రదర్శిస్తున్న ఈ వేషం ఆడపిల్లలకు కుటుంబసభ్యులు అండదండగా ఉండాలని సూచిస్తుంది.
వీరబాహువేషం :
ఈవేషం మాదిగవారిది. వీరబాహు అంటే బలమైన భుజాలు కలిగినవాడు అని అర్ధం. అనాదిగా మాదిగలు అస్ప•ష్యతకు గురౌతున్నారు. ఈ పద్ధతిని నిరసిస్తూ తమ సమస్యలకు బాధలకు పరిష్కారమార్గంగా మాదిగవారు ఈ వేషాన్ని స•ష్టించుకున్నారు. వేమన పద్యాలలో, పురాణ శ్లోకాలలో బ్రహ్మంగారి తత్వాలలో అందరూ ఈస•ష్టిలో సమానమే అనే సందేశకరమైన సారాంశాన్ని ఈ వేషం ద్వారా ప్రేక్షకులను రంజింపచేస్తారు. పెళ్ళిళ్ళలో వధూవరులు దర్శించుకునే ‘‘అరుంధతి నక్షత్రం’’ తమ కులమేనని చెబుతూ తమ ఆశీర్వాదం లేకుండా ఏ ఒక్కరి జీవితాలు సంతోషంగా ఉండవని, తమకులం గొప్పతనం గురించి ఈ వేషం తెలియజేస్తుంది.
ఎరుకల సోది వేషం :
గిరిజనతెగల్లో ఒకరైన ఎరుకల స్త్రీలు మాత్రమే ఈ వేషం ధరిస్తారు. వాగ్దేవి క•పతో సోది విద్యను వీళ్ళు ప్రదర్శిస్తారనేది ఒక నమ్మకం. స్త్రీలు కుటుంబపోషణలో భాగంగా ఉత్తమ ఇల్లాలై, సంసారాన్ని చక్కదిద్దాలనే సంకల్పంతో రమ్యమైన మాటలతో ఎదుటివాళ్ళను ఆకట్టుకుంటుంది. వేషాధారణ దేవతల్ని పోలి ఉంటుంది. ఇందులో భూత, భవిష్యత్‍, వర్తమానాలకు సంబంధించిన అనేక అంశాల గురించి చెప్పబడతాయి. ఒకరకంగా ఈవేషం జ్యోతిష్యానికి సంబంధించినది. ఇందులో ఎక్కువగా వాస్తవికతకు పెద్దపీట వుంటుంది
గొల్లబోయడు వేషం:
ఇది కుల ప్రధానమైన వేషం. ఈవేషంలో ఎక్కువగా హాస్యభరితమైన సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. ఈ వేషంలో అమాయకుడైన గొల్లవాడు, దౌర్జన్యం చేసే సాయిబు ప్రధానంగా కనిపిస్తారు. మహాభారతం మొత్తం గొల్లకులం చుట్టూ తిరుగుతుందనే సందేశాన్ని వివరిస్తారు. అలాగే శ్రీక•ష్ణ పరమాత్ముడు, పాండవులు కౌరవులు మొత్తం మా గొల్లకుల వారసులు అంటూ మేమిచ్చిన పాలు, పెరుగు, నెయ్యిని ఇష్టంగా ఆరగించినట్లు మీరందరూ కూడా మమ్మల్ని ఉన్నతంగా చూడాలని ఈవేషంను ధరించి అందరి మన్ననలను ఆకట్టుకుంటారు.
బుడబుక్కల వేషం :
జానపదుల్లో దుష్టశక్తుల గురించి భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఈ భయాల్ని పొగోట్టేందుకు స•ష్టించబడిన వేషమే బుడబుక్కల వేషం. వీరు తెల్లవారు జామున గ్రామాల్లోకి ప్రవేశిస్తారు. డమరుకం మోగిస్తూ ఆసక్తికరమైన పదాలతో జానపదులకు వినోదాన్ని కలిగిస్తూ వారిలో ఉండే భయాన్ని దూరం చేస్తారు. ‘ఈ మాటలన్నింటిని దేవతలందరు కలిసి బుడుబుక్కల వేషం వారి చేత మాట్లాడిస్తున్నారని ఆ జనసమూహాన్ని నమ్మిస్తారు. ఆ గ్రామదేవతలు ఆ ఊరివారందరినీ ఎల్లవేళలా కాపాడతారని జానపదులకు ఉండే భయాన్ని పొగొట్టి ధైర్యాన్ని తెలియజేసే వేషమే బుడబుక్కల వేషం,


మందుల వాళ్ళవేషం :
జానపదులకు నాటుమందులపై నమ్మకం ఎక్కువ. గిరిజనులకు ఆయుఃర్వేద వైద్యంలో చాలా ప్రావీణ్యం ఉంటుంది. పసర్లు, బెరడులు, ఆకులు, దుంపలు, వేళ్ళు, తీగలు, గడ్డలు, పువ్వులు వంటి తదితర వనసంపద గొప్ప ఔషధ గుణాల్ని కలిగి ఉంటాయి. గిరిజనులు వీటిని సేకరించి జనాలకు విక్రయిస్తుంటారు. ఆ క్రమంలో కొందరు మోసగాళ్ళు గిరిజనుల వేషం గట్టి మాయదారి మొక్కల్ని మందులుగా భ్రమింపజేస్తూ అమ్ముంతుంటారు. ఇలాంటివాళ్ళను నమ్మకూడదని, వైద్యం తెలిసిన గిరిజనులు మందుల వాళ్ళు వేషంగట్టి జనాలకు అవగాహన కలిగిస్తుంటారు. దొంగ మందులు అమ్మే వాళ్ళు నిలకడలేని జీవితం జీవిస్తారని, ఏ ఊళ్లో మందులు అమ్మినా మరుసటి రోజుకే వారు ఏదో ఒక వేరే గ్రామం వెళ్లిపోతారని వాళ్ళు చేసే మోసాలను జానపదులకు తెలియజేసే వేషమే ఈ మందులవారి వేషం.


సోమయాజులు – సోమిదేవమ్మ వేషం :
సంఘసంస్కర్తలు బాల్యవివాహాలను, మూఢనమ్మకాలను ఎలా రూపుమాపాలని ప్రయత్నించారో, అలాంటి ప్రయత్నంలోనే మనకు సోమయాజులు, సోమిదేవమ్మ వేషం కన్పిస్తుంది. ఈ వేషం గొప్ప సందేశాత్మకమైనది. ఇందులో సోమయాజులు వ•ద్ధుడు. సోమిదేవమ్మ యవ్వనవతి. ఇద్దరూ పెళ్ళిచేసుకోవడం వల్ల వచ్చే సమస్యలు చెప్పలేనివి. నిత్యజీవితంలో చాలాచోట్ల ఇలాంటి వివాహాలు జరుగుతుంటాయి. ‘ఆ దంపతుల మధ్య వేదనాభరతమైన సంఘటనలను, హాస్యరూపంలో సోమిదేవమ్మ దుస్థితిని తెలియజేప్తుంటారు. వధూవరులు పంచభూతాల సాక్షిగా జీవితాంతం కలిసి ఉండే పెళ్ళిని ఎంపిక చేసుకునేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనే అవగాహన కార్యక్రమంను ఈ వేషం ద్వారా తెలియజేస్తారు.


పిట్టలదొర వేషం :
ఈ వేషం బాగా జనాదారణ పొందింది. హాస్యప్రధానమైన ఈవేషంలో పాట, మాట, ఆట మూడు ప్రధానంగా ఉంటాయి. పిట్టలదొరను ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా పిలుస్తారు. కోతలరాయుడు, తుపాకిరాముడు, లత్కోరుసాయిబు అనేవి పిట్టలదొరకు ఉన్న పేర్లు. తుపాకిరాముని ప్రసంగం కోతలతో నిండిపోయినా తన విషాదజీవితాన్ని అప్పడప్పుడు వ్యంగమాటలతో వివరిస్తూ జనాలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచడమే ధ్యేయంగా ఈ వేషం ప్రదర్శిస్తుంది. సమాజంలో కనబడే కొందరి వ్యక్తులు దోపిడి ప్రవర్తనను అదే క్రమంగా దేశభక్తిని, మాత•భక్తిని ఈవేషధారుడు ప్రకటిస్తాడు. మనిషి నిత్యజీవితంలో తనచుట్టు ఉండే కళాయి, అగ్ని, అరుగు, దీపం, తుమ్మాకు, ఇస్తరాకులు, కోడి, పార వంటి వస్తువుల విశిష్టతను వివరిస్తాడు. స్త్రీకి బంగారంపై ఉండే మక్కువను వ్యంగ్యంగా వ్యక్తం చేస్తాడు. పిట్టలదొర వేషం ప్రజ్ఞాపాటవానికి నిదర్శనంగా కన్పిస్తుంది. పోలిస్‍ వేషం మాదిరిగా కనబడే పిట్టలదొరలు ప్రస్తుతం చాలా వరకు కనుమరుగైపోయారు.
అత్తరుసాయిబు వేషం:
‘‘మింగమెతుకులేదు మీసాలకు సంపెంగనూనె’’ అనే సామెత ఈవేషం నిరూపిస్తుంది. ఈ క్రమంలో ఇంట్లో ఆర్థిక స్థోమత లేదు. కొందరు వ్యక్తులు మాత్రం బయటి ప్రపంచానికి ఢాంబికంగా కనిపించేందుకు చౌకబారు సెంట్లు, పౌడర్లు, సబ్బులు కాటుకలు మొదలైనవి కొని ఏవిధంగా తమ అందాన్ని, ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారో వివరిస్తారు. ఉన్నంతలో జీవించాలని విజ్ఞానాన్ని అందించే వినూత్నమైన అంశంగా హాస్యరూపంలో తెలియజెప్తూ సాయిబు వేషం కొనసాగుతుంది
వడ్డీఉప్పర వేషం :
కులవ•త్తిని, కులం గొప్పతనాన్ని ఈవేషం తెలియజేస్తుంది. వడ్డెరలు, ఉప్పరలు సమాజంలో తక్కువ చేయబడుతుంటారు. కాని వడ్డెరలు రాళ్ళుకొట్టడం, పునాదులు తీయడం, గోతులు తవ్వడం, చేస్తుంటారు. మనిషి నిత్య అవసరాలలో ఉండడానికి కచ్చితంగా గూడు ఉండాల్సిందే అటువంటి ఇల్లు కట్టేది కేవలం మేస్త్రీగా ఉప్పరలు కొనసాగుతున్నారు. ఈవిధంగా తాములేకుండా ఏపనులు జరుగవు కాబట్టి ప్రజలందరి బాధలను, కష్టాలను దూరం చేయడానికి ఆవర్భవించిన వడ్డీ ఉప్పర కులాలను అన్ని కులాలతో పాటు సమానంగా చూడాలనే కులపరమార్థాన్ని ఈ వేషం సోదాహరణంగా వివరిస్తుంది.


ముగింపు :
జానపదకళలు ప్రాచీనమైనవి. ఎన్నో సంవత్సరాల నుండి జానపదులు ఈ కళల్ని ఆదరిస్తున్నారు. తమ అవసరాలకోసం ఈ కళల్ని నమ్ముకొని ప్రత్యేకమైన వేషదారణతో హావభావాలను కల్పిస్తూ, రాగమేళ తాళాలతో జానపదులను మెప్పించి మురిపింప చేయడంలో పగటి వేష దారులకు వెన్నతో పెట్టిన విద్య. జానపద కళల్లో ప్రత్యేకతను సంతరించుకున్న ఈ పగటివేషాలు ఒకవైపు జీవనభ•తిని మరోవైపు జనాలకు హాస్యాన్ని, విజ్ఞానాన్ని సమపాళ్లలో కలిగిస్తున్నాయి. నాగరికత పెరిగాక జానపదకళలు చాలా వరకు కనుమరుగైపోయాయి. వీటిని కాపాడు కోవాల్సిన అవసరం ఎంతయినా ఉన్నది. ప్రభుత్వాలు పగటివేషాలను కళా ప్రదర్శనలను ప్రోత్సహించాలి. ఇందువల్ల భవిష్యత్‍ తరాలకు జానపద సాహిత్యాన్ని, కళలను పరిచయం చేయడానికి నిదర్శనంగా నిలుస్తాయి. కనుమరుగై పోతున్న కళల్ని కనీసం కొన్ని ప్రత్యేక సమయాల్లోనూ, పర్వదినాల్లోనూ బాధ్యతయుతంగా ఈ కళారూపాల ప్రదర్శనను ప్రోత్సహించడం అలవర్చుకుంటే ఈ కళలు పునరుజ్జీవనం పొందుతాయి.

ఆధార గ్రంధాలు :

1 పగటివేషాలు – ప్రదర్శనరీతులు- డా. గుఱ్ఱం ప్రతాపరెడ్డి
2 జానపద విజ్ఞానాధ్యయనం డా. జి..ఎస్‍. మోహన్‍ –
3 తెలుగువారి జానపద కళారూపాలు – డా. మిక్కిలినేని రాధాక•ష్ణ
4 తెలుగు జానపద సాహిత్యము డా. చింతపల్లి వసుందరారెడ్డి.

  • డా।। బి. భీమమ్మ
    ఎ : 84640 67373

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *