ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే రాజ్యాంగ పరిరక్షణ

ప్రజలకోసం ప్రజలచే నిర్వహించబడే అత్యుత్తమ పాలనా విధానం ప్రజాస్వామ్యం. ఎన్నికలు ప్రజాస్వామ్య భావనకు గీటురాయిగా ఉంటున్నాయి. మన దేశంలో ధనిక, పేద, కుల, మత, స్త్రీ, పురుష, ప్రాంతీయ తేడాలు లేకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉన్నది. తమకు ఇష్టమైన వారిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉన్నది. అంతేకాదు. వీరందరికీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కుకూడా వుంది. ఈ ఎన్నికల పక్రియే ప్రపంచంలో మన దేశాన్ని గొప్ప ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందేలా చేసింది. ఏపక్రియ అయినా దానంతట అది గొప్పది కాదు. ఆ పక్రియ ఆచరణ గమ్యమూ, గమనమూ దానికొక విలువను ఆపాదిస్తాయి.


ఈ నేపథ్యంలో చూస్తే ఇవ్వాళ్టి మన ప్రజాస్వామ్యం ఒక మేడిపండు. ఇంత సుదీర్ఘ స్వపరిపాలనా పరిణామాలను గమనిస్తే రానురాను ప్రజాస్వామ్యం రూపం తప్ప సారం లేని ఒక బాటగా మిగిలిపోతున్నట్లు అర్థమవుతోంది.


ప్రజల చేత ఎన్నుకోబడటం నిజమే, కాని అది ప్రజల కోసం కాదని తమ అధికారానికి, ఆధిపత్యానికి, ఆర్థిక పెరుగుదలకు యిచ్చిన అవకాశంగా రాజకీయవాదులు నమ్ముతున్నారు. ప్రజలంటూ ఒకరున్నారని వారి సుఖజీవన బాధ్యత తమదేనని ఇవాళ్టి రాజకీయ వాదులు అనుకోవడం లేదు.
ఎన్నికల పక్రియ ఎంత ఆదర్శవంతమో ఆచరణలో అంత విఫలమవుతున్నది. ఎన్నికలు సజావుగా, నిక్షపాతంగా నిర్వహించేందుకు మన రాజ్యాంగం భాతర ఎన్నికల కమీషన్‍ను ఏర్పాటు చేసింది. ఎన్నికల నిర్వహణలో పర్యవేక్షణ, మార్గనిర్దేశకత్వం, నియంత్రణ చేయవలసిన బాధ్యతను కమీషన్‍కు అప్పగించింది. రాజకీయ పార్టీలకు గుర్తింపు న్విడం, రద్దు చేయడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం, అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టడం, స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించడం ఎన్నికల కమీషన్‍ విధులు, బాధ్యతలు. ఈ కమీషన్‍ సర్వస్వతంత్ర వ్యవస్థ. ఎవరి ఆధిపత్యానికీ, ప్రభావాలకు లోబడి ఉండకూడని వ్యవస్థ.


నిజానికి ఈ సర్వ స్వతంత్ర వ్యవస్థ పారదర్శకంగా పని చేస్తే ఆర్థిక అరాచకులు, నేరస్థులు, రేపిస్టులు, పలు కేసులతో కోర్టులు, చట్ట సభల్లోకి ఎలా ప్రవేశించగలరని తప్పుడు అఫిడవిట్ల దగ్గర నిరాకరించగల స్థితిలో ఎందుకు లేరు? ధనము, కులము, ఆధిపత్యం, బలమూ, బలగమూ ఎన్నికల్లో నిర్వహిస్తున్న పాత్రకు అడ్డుకట్ట వేయకపోతే అనైతికరాజకీయాలు పేట్రేగిపోతాయి. ఎన్నికల పక్రియ అపహాస్యమవుతుంది.


ఈ సమయంలో ఎన్నికల కమీషన్‍ చైతన్య వంతంగా, ప్రభావవంతంగా, ముఖ్యంగా పారదర్వకంగా వ్యవహరించాలి. నియమాలను కఠినంగా అమలు చెయ్యాలి. అవసరమైతే ప్రజాస్వామ్య పరిరక్షణకు కొత్త నియమ నిబంధనలను తయారు చేసుకోవాలి.
ప్రజాస్వామ్యం ఎగతాళి చేయబడిన చోట అరాచక ధోరణులు పురుడు పోసుకుంటాయి.

(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్‍

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *