కెంపుల సొంపులు

మాణిక్యం:
రూబీని సంస్క•తంలో మాణిక్యం అని, తెలుగులో కెంపు అని అంటారు. రూబీ దాని రంగు షేడ్‍ కారణంగా అనేక ఇతర పేర్లను పొందింది.
నాగరికత ప్రారంభమైనప్పటి నుండి మానవులకు రూబీ బాగా పరిచయం. మరే ఇతర పదార్థంలో లేని ఎరుపు రంగు యొక్క గాఢత మానవ ద•ష్టిని ఆకర్షించింది. ఇది అన్ని నాగరికతలలోను చాలా విలువైనది గా పరిగణించబడ్డది.
హిందూ పురాణాల ప్రకారం, అన్ని రత్నాల మూలం చంపబడిన రాక్షసుడు బలి యొక్క శరీర భాగాలకు ఆపాదించ బడింది. మాణిక్యాలు బలి యొక్క రక్తం నుండి పుట్టాయని నమ్మేవారు. రూబీ ప్రసక్తి దాదాపు ప్రాచీన సాహిత్యం లో అంతా కనిపిస్తుంది. ఇది నవరత్నాలు మరియు పంచరత్నాలలో భాగమే కాక, రత్నాల రాజుగా రాజ రత్నంగా పేర్కొనబడ్డది. సహజంగానే దీనికీ అనేక దివ్యశక్తులు ఆపాదించ బడ్డాయి. దేవతలు ధరించే రత్నంగాను, విజయానికి సంకేతం గానూ భావించబడింది. ఈ రత్నంతో భగవంతుని పూజిస్తే వచ్చే జన్మలో రాజుగా పుడతారనే నమ్మకం కూడ ఉన్నది. ప్రాచీన సాహిత్యంలో మాణిక్యం రత్నపరంగానే కాకుండ ‘‘ఆయుర్వేద ఔషధం పేరు, గ్రంధాల పేరు, వ్యక్తుల పేర్లు, రాజ వంశాల పేర్లు’’ ఇలా అనేక వ్యుత్పత్తి అర్ధాలలో వాడబడింది.
అరుదైన మాణిక్యం:
‘శైలే శైలే న మాణిక్యం న మౌక్తికం గజే గజే।।
నహి సర్వత్ర చందనం న వనే వనే?’
అన్ని అరుదైన వస్తువులు అన్నీ చోట్ల దొరకవు అనే అర్ధం గల ఈ శ్లోకం, చాణక్యనీతిలో భాగంగా చెప్పబడ్డది.
‘మాణిక్య వీణాముపలాలయంతీం,
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం,…’
అనే ఈ వాక్యాలు కాళిదాసు శ్యామలదండకంలో ఉన్న ప్రారంభ వాక్యాలు. ఇలా మాణిక్యం మన ప్రాచీనసభ్యతలో, అన్నిరంగాల్లో భాగమైంది.
మాణిక్యానికి ఆ పేరు…
రూబీ అనే పేరు లాటిన్‍ పదం రూబర్‍ (ఎరుపు రంగు) నుండి వచ్చింది. ఈ రత్నం యొక్క ఇతర పేర్లు మాణిక్య, సౌగంధికా, సరోజరాగాలు, శూర్గరిణీ, శోణితోపల, షోనోపల, శోనాష్మా, శోణరత్న, లోహితక, లక్ష్మీపుష్ప, రవిరత్న, రత్ననాయక, రత్నరాజ, రాగమాణిక్య, రాగయుజ్‍, రాగద•శ, భాస్కరప్రియ, పాతాళోపల, పద్మరాగ, తరల, తరణిరత్న, తామ్రాశ్మ, కురువింద, కురుబిల్వ, అరుణ, అరుణోపల మరియు మాంసఖండ మొదలైనవి.
ఈ పేర్లను పరిశీలిస్తే కొన్ని రంగును సూచించేవి, ప్రత్యేకతను, ప్రాముఖ్యతను సూచించేవి మరికొన్ని. ఆపాదించబడిన గ్రహాలను సూచించేవి కూడా కొన్ని ఉన్నాయి.


‘సౌగన్ధికా కురువిన్ద స్ఫటికేభ్యః పద్మరాగ సంభూతిహిః’
బ•హద్సంహితలోని ఈ శ్లోకం రూబీ యొక్క లక్షణాల గురించి ఆ కాలంలో ఉన్న అవగాహనను తెలియ పరుస్తుంది. ఆ రోజుల్లో రాయి రంగును బట్టి పేర్లు ఉండేవి, కానీ ఖనిజ జాతుల ఆధారంగా కాదు. సారూప్యంగా కనిపించే అన్ని రత్నాలకు సమిష్టిగా ఒకే పేరు ఉండేది.
కురువిందము కాకుండ స్పినెల్‍ మరియు స్ఫటికం మొదలైన ఇతర ఖనిజాలను రంగు ఆధారంగా మాణి క్యాలలో చేర్చారు. కోరండం కురువిందం యొక్క పాశ్చాత్య రూపమే. యాఖుత్‍ అనే అరబిక్‍ పేరు కూడా యాకూట పర్వతం నుండి వచ్చింది అని చెబుతారు. మాణిక్యం అనే పేరు మణులో దీని ప్రాముఖ్యత వల్ల వచ్చి నట్టుగా అనిపిస్తోంది. గరుడమాణిక్యం లాంటి పదప్రయోగం వల్ల దీన్ని ఎరుపు రంగు మణులకే కాకుండా ఇతర శ్రేష్టమైన మణుల పరంగాను కూడా వాడేవారని తెలుస్తుంది.
మన సాహిత్యం ప్రకారం భారతదేశంలో మాణిక్యం దొరికే ప్రాంతాలు సింహళ, కాలపుర, ఆంధ్ర, తుంబుర మరియు రావణగంగ మొదలైనవి. ఆయా ప్రాంతాల్లో దొరికే మాణిక్యాల లక్షణాలలోఉన్న తేడాను కూడా వరాహమిహిరుడు తన బ•హద్సం హితలో వివరించాడు. ఈ ప్రదేశాలలో ఉత్పత్తి మరియు వాణిజ్య కేంద్రాలు సమిష్టిగా ఉన్నాయి మరియు కొన్నిటికి భౌగోళిక స్పష్టత లేదు.
రత్నశాస్త్రం ప్రకారం:
సాంప్రదాయ రత్నశాస్త్రం ప్రకారం మాణిక్యం రాజులకు మరియు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులకు తగినదిగా పరిగణించ బడుతుంది. పరిమాణంలో పెద్దది (మహత్‍), కమలాచ్ఛాయ (కమల వర్ణం), స్నిగ్ధ (జిడ్డు) స్వచ్ఛ, గురు (భారీ), స్ఫుట (స్పష్టమైన), అసమ (అసమానం, పలకలుగా ఉండేది కావచ్చు) మరియు వ•త్తాయత (ఓవల్‍ ఆకారం) ఉన్న మాణిక్యం ఉత్తమమైనదిగా పరిగణించబడ్డది రంగు తక్కువ, తక్కువ బరువు, పగుళ్లు, కఠినమైన ఉపరితలం కలిగి ఉండి, చదునైన రూపాన్ని కలిగి ఉన్న, చిన్న మరియు అస్పష్టంగా ఉన్న మాణిక్యాలను నాసిరకంగా పరిగణిస్తారు.
కోరండం కుటుంబంలో భాగం అయిన రూబీ (రెడ్‍ కొరండం) లో క్రోమియం యొక్క ఉనికి దాని ఎరుపుకు కారణం. కొరండం కుటుంబం యొక్క అన్ని ఇతర రకాలు, అంటే ఎరుపు రంగులో లేనివి అన్నీ నీలమణులుగా వర్గీకరించబడతాయి. రూబీ మరియు నీలమణి మధ్య సరిహద్దు రేఖ పింక్‍ కలర్‍, ఇది ఎరుపు రంగులో ఒక ఛాయ. కొన్నిసార్లు రూబీ మరియు నీలమణిల మధ్య సరిహద్దు సాంకేతికంగా కాకుండా వ్యక్తిగత అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. కనక పుష్యరాగం కూడా ఒక విధమైన కొరండం మాత్రమే. నీలమణి క్రోమియం, టైటానియం మరియు ఇనుము వంటి మూలకాల మిశ్రమాన్ని జాడలుగా కలిగి ఉంటుంది.


రూబీలో రకాలు: రూబీ యొక్క రసాయన సూత్రం AI203, క్రిస్టల్‍ సిస్టమ్‍ Trigonal.
రంగు : ప్రధానంగా ఎరుపు, ఎరుపు ఇతర షేడ్స్, పింక్‍ మొదలైనవి.
రూబీ పూర్తిగా ఎరుపు రంగులో ఉంటే దాన్ని పీజియన్‍ బ్లడ్‍ రకం అని, కాస్త తక్కువరంగులో ఉన్న మాణిక్యం రాబిట్‍ బ్లడ్‍ రకంగా పరిగణించబడుతుంది. రూబీలో ఉన్న రంగుల తేడా వల్ల పద్పరాశ్చ (పద్మ రాగం) వంటి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు.
స్టార్‍ రూబీ
కొన్నిసార్లు సిల్క్ థ్రెడ్‍ వంటి రూటైల్‍ చేరికలపె కాంతి ప్రతిబింబించే కారణంగా రూబీలో స్టార్‍ అకారంలో మూడు రేఖలు ఏర్పాడుతాయి. ఈ నక్షత్రం రూబీ విలువను ఇనుమడింపచేస్తుంది. ఇలాంటి స్టార్‍ రూబీ కర్నాటకలో దొరుకుతుంది.
ఎమరీ
ఏ నాణ్యత లేని నాసిరకం కొరండం పారిశ్రామిక వాడకానికి పనికివస్తుంది. దీనిని ఎమరీ అంటారు.
బర్మీస్‍ రూబీ
కెంపుల గురించి మాట్లాడుకునేటప్పుడు బర్మీస్‍ రూబీ ప్రసక్తి తప్పకుండా వస్తుంది. వీటీ క్రిమ్సన్‍ ఎరుపు రంగు పావురం రక్తంవలె ఉండి, ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి.


మొగోక్‍ రూబీ
మాండలే వద్ద ఉండే మొగక్‍ ప్రాంతంలో మార్బుల్‍ అసోసియేషన్‍లో దొరికే ఈ కెంపులు అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. అవి గుర్తించతగ్గ చక్కటి పట్టు వంటి రూటిల్‍ చేరికలను కలిగి ఉంటాయి. రంగులేని కాల్సైట్‍ మరియు డోలమైట్‍ యొక్క చేరికలు, ఎపటైట్‍, మైకా వంటి ఇతర ఖనిజాలు, ద్రవ చేరికలు (fluid inclusions) కలిగియుండి ఇతర కెంపుల నుండి వేరుగా ఉంటుంది.
నవరత్‍ రూబీ, నయాసాయిక్‍ రూబీ. సగయిన్‍ రూబీ. కటపనా రూబీ వంటివి కూడ మొగోక్‍ రూబీల వలెనే ప్రసిద్ధం. వీటిని సమిష్టిగా పాత బర్మీస్‍ రూబీ అని పిలుస్తారు. కొత్త బర్మీస్‍ రూబీ భౌగోళికంగా బర్మా నుండీ మాత్రమే కాక పొరుగు దేశాల నుండి కూడా ఉత్పత్తి చేయబడుతుంది.
రూబి ట్రీట్మెంట్‍.
పగుళ్లు ఎక్కువగా ఉండే రూబీలను గ్లాస్‍ ఫిల్లింగ్‍ అనే పక్రియ ద్వారా నునుపుగా కనపడే విధంగా చేస్తారు. దీనిని గ్లాస్‍ ఫిల్డ్ రూబీ అంటారు. రూబీలో రంగు ఎక్కువచేయడం కోసం దానిని వేడిచేసే పక్రియ కూడా జరుగుతుంది. దీనిని treated రూబీ అంటారు. అదనంగా క•త్రిమ రూబీలు కూడా మార్కెట్‍లో ఉన్నాయి. స్పినెల్‍ రూబీకి దగ్గరగా ఉండే ఖనిజం, కొన్నిసార్లు గోమేధికాలు కూడా వాటి రంగు కారణంగా రూబీస్‍గా చలామణి కావచ్చు.


కొరండం నిల్వలు మరియు వనరులు:
కొరండం అస్సాం, మేఘాలయ మరియు మహారాష్ట్రలో కైనైట్‍ మరియు సిల్లిమనైట్‍లతో కనుగొనబడింది. ఇది తెలంగాణలోని సైనైట్స్ మరియు అల్ట్రా బేసిక్‍ రాక్స్లో ఉంటుంది. బస్తర్‍ మొరేనా ఛత్తీస్‍గఢ్‍ జిల్లాలలో పెగ్మాటైట్స్తో కొరండం దొరికింది.
ఆస్టరిజంతో (నక్షత్ర) అపారదర్శక రూబీ కర్ణాటకలోని మైసూరు జిల్లాలో పుష్కలంగా ఉన్నట్లు తెలిసింది. తిరుచిరాపల్లి జిల్లాలోని కరూర్‍ నుండి కుళితలై వరకు విస్తరించ కంగాయం బెల్ట్, తమిళనాడులోని దిండిగల్‍ జిల్లా వేదచందూర్‍ ప్రాంతంలో విలువైన/ పాక్షిక విలువైన రూబీ రకాలు ఉన్నయి.


NMI డేటా ప్రకారం కొరండం మొత్తం నిల్వలు మరియు వనరులు 294వేల టన్నులుగా అంచనా వేయబడింది. అందులో 200 టన్నులు రిజర్వ్ కేటగిరీ కింద ఉంచబడ్డాయి మరియు మిగిలినవి వనరులు, ఇవి తెలంగాణలో 26% కర్ణాటకలో 68% రాజస్థాన్‍లో 4% మరియు చిన్ని మొత్తంలో ఆంధ్ర, తమిళనాడు, ఛత్తీస్‍గఢ్‍లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో రూబీ ఒరిస్సాలో 5,349 కిలోలు ఉన్నట్లు అంచనా. నీలమణి నిలువలు 450 కిలోలు మాత్రమే జమ్మూ కాశ్మీర్‍లో ఉన్నట్లు తెలుస్తుంది.


భారతదేశంలో కొరండం రూబీ మరియు నీలమణి కోసం అన్వేషించడానికి అపారమైన సంభావ్యత ఉంది. ప్రస్తుతం అధికారిక రికార్డు ప్రకారం రూబీ ఉత్పత్తి శూన్యం. ఆంధ్రా, కర్ణాటక మహారాష్ట్ర, తమిళనాడులోని పలు ప్రాంతాల నుంచి రూబీని ఉత్పత్తి చేస్తున్నట్లు అనధికారిక సమాచారం. కొరండం 1837 నుండి క•త్రిమంగా ఉత్పత్తి చేయబడింది. రత్నం నాణ్యత కొరండం 1990 ప్రారంభం నుండి మార్కెట్లో అందుబాటులో ఉంది. చాలా పెద్ద సైజు క్రిస్టల్‍ Czochralski పద్ధతి ద్వారా తయారీ చేయవచ్చు. Verneuil పక్రియ మరొక సంశ్లేషణ పద్ధతి.


ఉపయోగాలు:
కొరండం దాని రాపిడి మరియు ఉష్ణ సహన లక్షణాల వల్ల పారిశ్రామిక ఉపయోగం ఉంటుంది. గ్రైండింగ్‍ మరియు పోలిష్‍ కు పనికి వస్తుంది. దీన్ని ఫర్నెస్‍లో కూడ ఉపయోగిస్తారు. రంగులలో ,సున్నితమైన శాస్త్రీయ పరికరాలు, LED ఆప్టికల్‍ మరియు రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటిగ్రేటెడ్‍ సర్క్యూట్‍లో ఉపయోగ పడుతోంది.
రూబీని ఆయుర్వేదఔషధం తయారీలో ఉపయోగిస్తారు. మాణిక్యం భస్మాన్ని ఇమ్యునోమోడ్యులైజేషన్‍ కోసం ఉపయోగిస్తారు. ఆకలి పుట్టించేది, మరియు క్యాన్సర్‍ చికిత్స కోసం ఇంకా అనేక విధాలుగా ఉపయోగ పడుతోంది. రత్నంగా రూబీ యొక్క
ఉపయోగాలు అపరిమితంగా ఉంటాయి.
మాణిక్యం చరిత్ర:
కెంపులతో సహా భారతీయరత్నాల ప్రస్తావన రోమన్‍ మరియు పర్షియన్‍ యాత్రికుల రికార్డులలో 77 •ణ నుండి కనిపిస్తుంటాయి. మహమ్మద్‍ బెన్‍ మన్సూర్‍ (13వ శతాబ్దం) తూర్పు భారతదేశానికి చెందిన యాకుత్‍ గనుల గురించి ప్రస్తావించాడు. అల్లావుద్దీన్‍ ఖిల్జీ జనరల్‍ మాలిక్‍ నాయక్‍తో పాటు అమీర్‍ ఖుస్రో (1310-1312) దక్షిణ భారత దండయాత్ర లో పాల్గొన్నారు. వరంగల్‍లో దోచుకున్న బంగారం, రత్నాలు అపారమైన నిధుల గురించి ఆయన వివరించారు.


‘‘కొరండం (యాకుత్‍) సూర్యుని అబ్బురపరిచింది! మాణిక్యాల మెరుపు రాత్రి చీకటిని ప్రకాశవంతం చేసింది. బర్మత్‍పూర్‍ స్వర్ణ దేవాలయం ధ్వంసం గురించి ఇదే విధమైన వర్ణన ఉంది.’’ దాని గోడలు మరియు పైకప్పు మెరిసే మాణిక్యాలు మరియు పచ్చలతో పొదగబడి ఉన్నాయి మరియు వాటిని చూస్తుంటే ప్రేక్షకుల ద•ష్టికి ఎరుపు మరియు పసుపు మచ్చలు వచ్చాయి. (పడగొట్టిన ఆలయంలో) 500దాక విలువైన రాళ్ల గుట్టలు ఏర్పడ్డాయి! ఈ వర్ణన కొద్దిగా కవితాత్మకంగా ఉంది, కాని దోచుకున్న వస్తువుల యొక్క అపారతను సూచిస్తుంది.


మార్కోపోలో బదక్షన్‍ (Badakshan) యొక్క బాలాస్‍ మరియు రూబీ గురించి కూడా ప్రస్తావించాడు. Odaroda Barbosa (1519) విజయనగర రత్నాల అంగళ్ళ గురించి నివేదించాడు. అక్కడ బర్మా మరియు శ్రీలంక నుండి వచ్చిన వివిధ రత్నాలు విక్రయించ బడటాన్ని వివరించాడు. టావెర్నియర్‍ (1665) మొఘల్‍ ఆభరణాలు మరియు నెమలి సింహాసనం గురించి ప్రత్యక్షంగా వివరించాడు. అతను సింహాసనంలో పొదిగిన 100 నుండి 200 క్యారెట్ల బరువున్న 108 పెద్ద కెంపులను లెక్కించాడు.


1398-99లో తైమూర్‍ ఢిల్లీని దోచుకున్నప్పుడు అతను ‘‘తైమూర్‍ రూబీ’’ని తీసుకెళ్లాడు. జహంగీర్‍ వద్దకు తైమూర్‍ వారసుడి హోదాలో ఆది తిరిగి వచ్చింది. కానీ మళ్లీ నాదిర్‍ షా వద్దకు వెళ్లి రంజిత్‍ సింగ్‍ ద్వారా బ్రిటిష్‍ కిరీటాన్ని చేరుకున్నది. ఈ 352 క్యారెట్ల రూబీ అసలు రూబీ కాదు ‘‘స్పినల్‍’’ అని తరువాత తెలిసింది. కెప్టెన్‍ నియోబోల్డ్ 1840 తమిళనాడులో కొరండం యొక్క విస్త•తమైన మైనింగ్‍ గురించి, భద్రాచలం దగ్గర ‘‘కురుంద’’ మైనింగ్‍ గురించి నివేదించాడు.


‘‘రాజ్‍రతన్‍ రూబీ’’ మాణిక్యాల రాజుగా ముద్దుగా పిలుచుకునే విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఒక 2475 క్యారెట్ల స్టార్‍ రూబీ, ప్రస్తుతం బెంగుళూరుకు చెందిన ఒక ప్రైవేట్‍ యజమాని వద్ద ఉంది.


-చకిలం వేణుగోపాలరావు,
డిప్యూటి డైరెక్టర్‍ జనరల్‍ జిఎస్‍ఐ(రి)
ఎ: 9866449348

శ్రీరామోజు హరగోపాల్‍, ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *