బాల్యంలో మన లేత చిగురాకుల వంటి పెదాలపై తొలిసారి, ఓం ప్రథమంగ, ఒకానొక సువర్ణ ఘడియలో పలికిన, పాడినపాట ఏమైవుంటుంది? మిమ్మల్ని మీరు ఎపుడైనా ప్రశ్నించుకుని, ఆలోచించారా? ఆ పాటను మీరు పట్టుకున్నారా? మళ్లీ మీ పెదాలపై ఆ పాట నర్తనమాడిందా? ఇక అక్కడ నుండి జీవితాంతం పాటల పల్లకీలో ప్రయాణిస్తూనే ఉన్నాం కదా! పాటల లోకంలో ఊరేగుతునే ఉన్నాం కదా! మన ‘‘అమ్మలు’’ మనకు పాలు, పాట ఏక కాలంలోనే పరిచయం చేసారు. ఉగ్గుపాలతోనే పాట మన వెంబడి తోడుగా, నీడగా ఇంత కాలం నడిచి వచ్చింది కదా!
నా వరకైతే నా మూడేళ్ల వయసులో మొదటిసారి నేను పాడింది ఒక హిందీ పాట.
‘‘దేఖ్ తెరి సంసార్ కీ హాలత్
క్యా హోగయీ భగవాన్
కిత్ నా బదల్ గయా ఇన్సాన్’’
(1954లో వచ్చిన ‘‘నాస్తిక్’’ అనే హిందీ సీన్మాలోని పాట. దేశ విభజన విషాదాలను ఆ సీన్మా చూపించింది). హీరో అజిత్. మన హైద్రాబాద్, గోల్కొండలో పుట్టి పెరిగిన వాడే.
నా మాతృభాష తెలుగు. మరి హిందీ పాట నా పెదాలపైకి ఎట్లా వచ్చింది? ఇప్పటికీ నేను ఉర్దూ, హిందీ పాటల ‘‘షౌకీన్’’ నే. ఆ పాట నా పెదాలపై ఎట్లా పుట్టిందో చెప్పక తప్పదు.
నేను పుట్టింది హైదరాబాద్ పాతనగరంల కుర్మగూడెం బస్తీ. అలియాబాద్ దర్వాజాకు వెళ్లే తోవల కుడివైపు ఒక చిన్న కమాన్. అందులోకి వెళ్లి తిరిగి ఎడమవైపు మళ్లంగనే కుర్మగూడెం బస్తీ. దాన్ని దాటి సీదా వెళ్లితే గాజీబండ బస్తీ. నేను పుట్టిన బస్తీల కురుమ కుటుంబాలే అధికం. వాడకట్టు మధ్యల పురాతనమైన రావిచెట్టు ఊడలు విస్తరించి ఉండేది. ఆ చెట్టు చుట్టూ సిమెంటు గచ్చుతో చేసిన గుండ్రటి విశాలమైన వేదిక. వటవృక్షపు చల్లని ఛత్రచ్చాయల క్రింద ‘‘చావిడిలా’’ ఉండేది. దాని పక్కన అమ్మవారి గుడి. మైసమ్మనో, పోశమ్మనో, ముత్యాలమ్మనో కావచ్చు.
కురుమోళ్లు చెప్పే ఒగ్గు కథను మొదటిసారి నేను విన్నది ఆ చావిడి దగ్గరే. ఆ రావిచెట్టు ఎదురుంగనే మా ‘‘గరీబ్ ఖానా’’. నేను ఇంట్ల ఉండేది తక్కువ, బజార్ల ఉండేది ఎక్కువ. ఒగ్గు కథను ఆ కురుమ కళాకారులు డోలు, మేళ తాళాలతో, కాళ్ల గజ్జెలతో దరువులు వేస్తూ లయబద్దంగా గుండ్రంగా తిరుగుతూ, లంఘించి కుప్పి గంతులు వేస్తుంటే బస్తీమొత్తం దద్దరిల్లి ఆబాలగోపాలం యావత్తూ మంత్రనగరిలోకి మాయమైపోయేవారు. మా చిన్నప్పుడు ఒగ్గు కథని మేం ‘‘డిల్లం-బల్లం’’ అనేవారం.
ఒకసారి ఆషాడమాసంలో బోనాల పండుగ వచ్చింది. జనం జాతర జజ్జనకరి జనారేలా వుంది. రావి చెట్టు కొమ్మకు ఒక లౌడ్ స్పీకర్ (పుంగీ) తగిలించారు. క్రిందనున్న గ్రామ్‍ఫోన్‍తో దానికి కనెక్షన్ ఇచ్చి నల్లని రికార్డు వేసారు. అది గుండ్రంగ తిరుగుతుంటే పుంగీల నుండి పాట ప్రవాహంలా ప్రవహించింది. ఆ పాటనే ‘‘దేఖ్ తెరీ సంసార్ కి హాలత్’’.
ఆ రెండు రోజుల జాతరల ఆ పాట పదే పదే వేసారు. నేను పెద్ద ‘‘కాన్ సేన్’’ను కదా వినీ వినీ ఆ పాట నాకు కంఠోపాఠం అయ్యింది. ఇగ అంతే సంగతులు. చిత్తగించవలెను. ఆ పాట రాగం ఒకటి మాత్రమే పట్టుకుని, అపభ్రంశ పదాలతో ఘోరంగా ఉచ్చరిస్తూ వినని వారికీ, వినే వారికి ఇద్దరికి మాత్రమే ‘‘తాన్‍సేన్’’లా వినిపించసాగాను. హిందీ భాష తెలిసిన వారిని గాయపరిచేలా పెద్ద గాయకుణ్ణి ఐపోయాను. ఒక రోజు మా పెద్దక్క అత్తారింటి నుండి పుట్టింటికి వచ్చింది నా గానంతో అందరినీ గాయపరుస్తున్నా నన్న వార్త ఆమెకు కూడా తెలిసింది. ‘‘ఒరే లోకీ ఆ పాట పాడరా’’ అని హఠాత్తుగా ఆమె ఆడగగానే నాకు సిగ్గు ముంచుకొచ్చింది నా నక్కిళ్లు కూలబడినయి. నోరు పెగిలి పాట ఇవతలి లోకి రాలేదు. ఆమె మళ్లీ బ్రతిమిలాడింది. నేనింకా నాలోకి నేను ముడుచుక పోయినాను. ఒప్పులకుప్ప, సిగ్గుల మొగ్గ ఐనాను. నా అవస్థ గమనించి ఆమె ‘‘పోనీ ఆగోడ చాటుకు పోయి పాడు’’ అని కనికరించింది. నేను ఒక్క గంతులో గోడ వెనుక దాగి ‘‘దేఖ్ తెరి సంసార్ కి హాలత్’’ అన్న పాటను ఒ దునియా తే రఖ్ వాలే స్థాయిలో గొంతుపెంచి ఏడు కొండలపై నున్న వాడికి కూడా వినబడేలా విజృంభించి పాట కచేరి ప్రారంభించాను.
ఆ తర్వాత కొద్దిరోజులకు జండాపండుగ వచ్చింది. అంటే ‘‘పంద్రాగస్టు’’ అన్న మాట రావిచెట్టుకు మళ్లీ ‘‘పుంగీ’’ తయార్. నేను జారుతున్న చెడ్డీ పైకి లాక్కుంటూ అమ్మవారి గుడి దగ్గర హాజర్. ఈ సారి తెలుగు పాట.
‘‘ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా’’
(1955, రోజులు మారాయి సీన్మా)
టక్కున పాత పాటను వదిలి ఈ కొత్త పాటను లంకించుకుని మళ్లీ శ్రోతల కర్ణభేరీలను పగుల గొట్టటం ప్రారంభించాను.
ఇంతటితో ఐపోలేదు. ఎండాకాలం బడులకు సెలవులని మా రంగన్న మడికొండ నుండి పట్నం వచ్చాడు. వాడు నా కంటె చాలా పెద్ద. ఒక్క చదువు తప్ప అన్ని కళల్లోనూ, విద్యల్లోనూవాడు ఆరితేరినాడు. వాడు ఆవారా పోరగాడని మా అమ్మా బాపులకు కోపం. వాడితో దోస్తీ చేస్తే నేను కూడా చెడిపోతానని వాళ్ల భయం. నాకేమో వాడంటే చాలా ఇష్టం. గిలేర్‍తో పిట్టలను, ఉడతలను కొట్టటం, బొంగరాలు గిరగిర్రా తిప్పటం, గోలీలు ఆడటంలో (రంగు రంగుల గాజు గోళీలు) వాడు అవ్వల్ దర్జా నంబర్ వన్ ఆ గోళీలల్ల రంగురంగుల పువ్వులు ఎట్లా పెట్టారో అని నా సందేహం. అవి వాడి నిక్కర్ జేబులో ఒకదానికొకటి వొరుసుకుని గలగలా చప్పుడు చేసేవి. వాటిల్లోని రంగులపువ్వుల రహస్యాలు తెలుసుకోవాలని నా కుతూహులం. ఓ రోజు ఒక గోళీని రాయితో పగులకొట్టినం. రంగుల్లేవ్, పువ్వుల్లేవ్ ఉత్తగాజుపొడితప్ప.
దానితో నాకు శంకరాచార్యుల వారి మాయావాదమే కాక విశ్వరహస్యం కూడా బోధపడింది.
వాడు ఆడే గోలీలాట మన రెండు కళ్లతో చూసి తరించవలసిందే. దూరాన ఒక గుంటలో ఒక గోళీని నిలబెట్టి మరికొంత దూరంలో మోకాళ్లు ముడుచు కు కూచుని, కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు మధ్యన మరో గోళీని బిగించి పట్టుకుని ఒక కన్ను మూసి ఇంకో కన్ను తెరిచి తీక్షణమైన ఒంటికంటి చూపుతో ఎడమ చేయి చూపుడు వ్రేలుతో ఆ గోళీని బాణంలా విసిరేవాడు. అది గురి తప్పకుండా గుంతలో వున్న గోళీని తాకి టక్కున ఎగర కొట్టేది. వాడు ఆడుతున్నంత సేపు వాడి పెదాలపై ఒక పాట పల్లవిస్తుండేది. వాడున్నన్ని రోజులు ఆ పాటే పాడుతుండేవాడు.
‘‘గోరే గోరే గాల్ గాల్ పే
ఉల్ జే ఉల్ జే బాల్
ఓ తెరా క్యా కహెనా’’
(1957, తుమ్ సా నహీ దేఖా సీన్మా)
సెలవులు ఐపోగానే వాడు, వాపస్ వెళ్లి పోయాడు. నా గుండె గూడు ఖాళీ అయి దిగులు నిండుకుంది. వాడు ఆడి పాడిన వాకిలిని చూస్తూ అక్కడున్న అరుగులపై ఒక్కడినే ఒంటరిగా, మనాదితో కూచునేవాడిని. ఒక దినం హఠాత్తుగా ఎక్కడ్నుండో రేడియోలో ‘గోరే గోరే గాల్ గాల్ పే’’ గానా వినబడింది. వాడు యాదికొచ్చి మనసంతా పానీ పానీ ఐపోయింది. మా రంగన్న తెగిన గాలి పటంలానే అర్థాయుస్సులోనే మరణించాడు. ‘‘గోరే గోరే గాల్ గాల్ పే’’. ఎప్పుడు విన్నా రంగన్నే నాకు జ్ఞాపకం వస్తాడు.
తర్వాత మేం కుర్మగూడెం ఖాళీచేసి శాలిబండ దగ్గరలోని రూప్‍లాల్ బజార్‍లో ఒక పాత పెంకుటిల్లును కొనుక్కున్నాం. ఆ బస్తీ ఒక మినీ ఇండియా. మా గల్లీలో ముస్లింలు, మరాఠీలు, వెనక దిక్కు కన్నడిగులు, బొందిలీలు, కాయస్తులు, జోషీలే కాక మంగలి, గొల్ల, వడ్రంగి, బ్రహ్మణ కులాల వారు కూడా ఉండేవారు. ఆ కాలంలో రేడియో కొంతమంది ఇండ్లలోనే ఉండేది. అది ధనికుల వాడుకునే విలాసవంతమైన సాధనం. మా వెనక ఇల్లు జోషీలది. వాళ్ల రేడియోలోని పాటలన్నీ మా మీది దయతో మా ఇంట్లకు మలయ మారుతంలా ప్రవహించేవి.
వారానికోసారి ‘‘బినాకా గీత్ మాలా’’. అమీర్ సయానీ మంద్రమైన, మత్తు గొంతుతో రాత్రిపూట వచ్చేది. మేం చేద బావి ప్రక్కన మల్లె పందిరి క్రింద మంచాలల్ల పడుకుని ఆ పాటలన్నీ వినేది.‘‘జంగ్లీ’’ సినిమాలో షమ్మీకపూర్ పాట ‘‘చాహె కొయి ముజె జంగ్లీ కహే’’ అని రఫీసాబ్ గొంతు చించుకుని పంచమ స్వరంలో పాడుతుంటే మా మనసులు మానససరోవరంగా మారిపోయేవి. ‘‘మేరా జూతా హై జపానీ, ఏ పంట్లోన్ హిందుస్థానీ’’ పాట అర్థం కాకున్నా ఆ స్వర మాధుర్యానికి, సంగీతానికి ‘‘దిల్‍ఖుష్’’ ఐపోయేది. అప్పటికీ ముఖేష్, శంకర్ జై కిషన్, శైలేంద్రల పేర్లు కూడా తెలియవు. హీరోలే ఆ పాటలన్నీ పాడుతారని నమ్మే అమాయకపు సత్తె కాలం అది.
మా ఇంటి వెనుక యాపచెట్టు పక్కన ఒక బొందిలోళ్ల ఉమ్మడి కుటుంబం ఉండేది. 1857 సిపాయిల తిరుగుబాటు విఫలం కాగానే ఉత్తర భారత దేశపు బుందేల్‍ఖండ్ ప్రజలు ప్రాణాలను అరచేతులల్ల పెట్టుకుని వింధ్యపర్వతాలను దాటి నైజాం రాజ్యంలకు వలస వచ్చారు. వారిలో అత్యధికులు నిజాం కొలువులో సైనికులుగా చేరారు. ఆ ఉమ్మడి కుటుంబంలో అమ్మాయిపెళ్లి కుదిరింది. ఇక ఊరంతా ఒకటే హడావుడి. రాత్రిపూట పెళ్లి. ఆ ఇంటికి ఇంద్రధనస్సు లాంటి రంగులు వేసారు. పండు వెన్నెల్లాంటి పెట్రోమాక్సు లైట్ల వెలుగుల్లో ఇల్లు ఇల్లంతా ధగధగమని చమక్ చమక్ మని మెరిసింది. పిలవని పేరంటంలా నేనక్కడ హాజర్. పెద్ద వెండిప్లేట్‍లో అమర్చిన గాజుగ్లాసులల్ల రంగు రంగుల చల్లని షర్బత్ పానీయాలను అతిధులకు అందిస్తున్నారు. ఆ సేవకులు నాకూ ఓ గ్లాసు ఇచ్చారు. దానిని సేవించిన తర్వాత నాచూపు యాపచెట్టు క్రింద బల్లపీట చుట్టూ మూగిన గుంపు మీదికి మళ్లింది. నేను కూడా వెళ్లి ఆ గుంపులో చొరబడి మెడలు నిక్కించి మిటమిట చూసాను. గ్రామ్‍ఫోన్, దానిపై నల్లని రికార్డు. చెట్టుకొమ్మమీద తెల్లని పుంగీ అంటే లౌడ్‍స్పీకర్. కరెంట్ వైర్ల కనెక్షన్ కూడా ఉంది కాని ఎక్కడో లోపం వల్ల పాట వొస్తలేదు. కుక్క బొమ్మ ఉన్న నల్లటి హెచ్‍ఎంవి రికార్డు ప్లేయర్ గిరగిరా తిరుగుతుంది కాని పాట మాత్రం వొస్త లేదు. అందరూ దానితో కిందా మీదా కుస్తీ పడుతున్నారు. క్యా ఫాయిదా? గానా నహీఁ ఆరా. ఒకాయన దానికి కుంజీ ఇవ్వాలని చెప్పి ఏదో పనిముట్టు దానిలో దూర్చి చెయ్యి, బుజం నొప్పి పుట్టేలా గిరగిరా తిప్పాడు. చెమటలు పట్టాయి కాని పాట మాత్రం రాలేదు. గ్రామ్‍ఫోన్ మూగనోము వ్రతం పట్టినట్టుంది. నాకు విసుగు, నిద్రా ముంచుకొచ్చి ఇంటికి నిరాశగా వెళ్లి ముసుగుతన్ని నిద్రపోయాను.
తెల్లారి నిద్రలేవంగనే పాట, పుంగీ యాదికొచ్చి యాపచెట్టు క్రిందికి ఉరికిన బల్లపీట ఖాళీగా కనబడింది. పుంగీ అట్లనే ఉంది కాని గ్రామ్‍ఫోన్ మాత్రం లేదు. రిపేరు కోసం పట్నం తీసు•• పోయిండ్రట. కొండంత నిరాశతో నేను బడికి తయారై వెళ్లిపోయిన. బడికి పోయి చదువులల్ల పడంగనే ‘‘పుంగీ’’ సంగతి పాట సంగతి యాది మర్సిన. అన్నం బెల్లుల భీ యాదికి రాలే. ఆఖరీల బడి ఇడిసిపెట్టినంక భీ గుర్తుకు రాకపాయె. గల్లీలల్ల నడుసుకుంట వాడకట్టుకు రాంగనే…..
‘‘ఖోయా ఖోయా చాంద్
ఖులా ఆస్మాన్
ఆఖోఁ మే సారీ రాత్ జాయెగీ
తుమ్ కో భీ కైసే నీఁద్ ఆయేగీ’’
(1960, కాలాబజార్ సీన్మాలో దేవానంద్ పాట)
అన్న పాట కర్ణానందంగ నా చెవులకు సోకింది. ఆ పుంగీ పుణ్యమా అని ఆ పాట నాలుగు దిక్కులను ఒక్కటిగ చేస్తుంది. నేను ఇంట్లకు పోయి పుస్తకాల బట్ట సంచీని గూట్లె విసిరి కొట్టి మళ్లీ యాపచెట్టు క్రిందికి ఉరికిన. ఇక మళ్లీ వారం దినాల దాకా నా పెదవుల మీద నుండి ‘‘ఖోయా ఖోయా చాంద్’’ పాట పోనే లేదు. ఆ పాట ఇప్పటికీ మనసు నుండి మాసిపోలేదు. చెదిరిపోలేదు.
ఇక 1960ల నా హృదయం రాజ్ కపూర్ కే అంకితం ఐపోయింది. అప్పటికి నా వయస్సు నవవసంతాలు. లేత చిగురాకు వంటి హృదయం ఏది విన్నా ఏది చూసినా రెపరెపలాడే మనసు. ఒకరోజు మా ముగ్గురక్కలు గుసగుసలాడుకుని ముస్తాబులు మొదలు పెట్టారు. నేను నా ‘‘జాసూసీపనా’’తో విశయం పసిగట్టాను. ముందే వెళ్లి శాలిబండా చెట్టుక్రింద వాళ్లు రిక్షా ఎక్కే రోడ్డు మీద కాపలా కాసాను. ఆఖరికి ముగ్గురు దొంగలు రెడ్‍హాండెడ్‍గా నాకు దొరికారు. నా ఉక్రోషపు ఎర్రటి ముఖాన్ని చూసి వారికి నవ్వు కూడా వచ్చింది. తర్వాత దయ కలిగింది.
అట్లా చార్మినార్ దాటి గుల్జార్ హౌజ్ క్రిష్ణా టాకీసుల రాజ్ కపూర్ సీన్మా ‘‘జిస్ దేశ్ మే గంగా బహతీహై’’ చూసే భాగ్యం అక్కల పుణ్యమా అని నాకు లభించింది. చీకట్లలో మేం తడుముకుంటూ వెళ్లి కుర్చీలల్ల కూచునేసరికే రాజ్ కపూర్ డప్పు కొట్టుకుంట ‘‘మేరా నామ్ రాజు’’ పాట చిన్న తెప్పపై నిలబడి గంగా నదిలో పాడుతున్నాడు. కాశీలోని ఘాట్‍లు, దేవాలయాలు, రిషికేష్ లక్ష్మణ్ జులా, దూరాన హిమాలయాలు కనబడుతున్నాయి. ‘‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’’ నేను రాజ్‍కపూర్ ప్రేమలో పడిపోయాను. ఇప్పటికీ ఇవతలికి రానేలేదు. సీన్మా నుండి ఇంటికి వచ్చినంక ఆ తెల్లారి బియ్యం డబ్బామీది గుండ్రటి రేకుమూతను తీసుకుని దానినే డప్పుగా భావించి చేతులతో కొట్టుకుంట ‘‘మేరా నాం రాజు’’ పాటతో ఇంటిని హోరెత్తించాను. తెల్లపేపర్ ఏది కనబడినా ‘హిమలయాలను, గంగానదిని, అందులో పడవను, అందులో నిలబడ్డ మనిషి చేతిలో ఒక గుండ్రటి డప్పును చిత్రించే వాడిని. మరాఠీల ఇంటిల లేదా జోషీల ఇంటి రేడియోలో ‘‘జిస్ దేశ్ మే’’ పాటలు వస్తుంటే హడావుడిగా పరిగెత్తి వారి ఇంటి కిటికీల వద్ద నిలబడి చెవులప్పగించి ఆ పాటలను, ఆ రాగాలను విని ఊహలలో తేలిపోయే వాడిని.
నేను మొదటిసారి కాశీకి వెళ్లినప్పుడు దశాశ్వమేధ్ ఘాట్ మెట్లపై కూచుని గంగానది అలలను చూస్తూ ‘‘హమ్ ఉస్ దేశ్ కే వాసీహై, జిస్ దేశ్ మే గంగా బహతీ హై’ పాట పెద్దగా తన్మయత్వంతో పాడుకున్నాను. ఆ సీన్మాలో నాయిక పద్మిని ‘‘ఓ బసంతీ పావన్ పాగల్’ పాట రాతి కొండలపై, బండలపై అద్భుతంగా నృత్యం చేస్తూ పాడుతుంది. క్రింద లోయలో ఏదో ఒక నది ఆమె లాగే వొంపులు తిరుగుతూ పాములా ప్రవహిస్తుంది. ఆ కొండలు, బండలు ఎక్కడుంటాయని, అది ఏం నది అని చాలా మందిని అడిగాను. ఎవరూ చెప్పలేదు. చివరికి బిన్నీ రూబెన్ రాసిన రాజ్‍కపూర్ జీవిత కథ పుస్తకంలో అవి జబల్‍పూర్‍కు దగ్గరలోని ‘‘బేడేఘాట్’’లో ఉన్న పాలరాతి కొండలనీ, క్రింద ప్రవహించేది నర్మదానది అని తెలిసింది. 65 సంవత్సరాలు దాటినంక నేను ఆ ప్రాంతానికి వెళ్లి ఆ పాలరాతి బండలపై కూచుని పద్మినిని, రాజ్‍కపూర్‍ను ఆ నృత్య దృశ్యీకరణను గుర్తు చేసుకున్నాను. క్రింద నర్మద ఉదృతంగ పారుతుంది. షూటింగ్ కోసం వారందరూ బస చేసిన గెస్ట్హౌజ్‍ను కూడా చూసాను. అప్పుడు ఆ రోజులలో అక్కడ వాచ్‍మెన్‍గా పనిచేసిన ఒక స్థానిక వృద్దుడితో మాట్లాడి అతను చెప్పిన ఆ నాటి ముచ్చట్లన్నీ విన్నాను.
‘‘మేరే మన్ కీ గంగా, తేరే మన్‍కీ జమునాకా’’ పాట దేశాన్ని, పిచ్చిగా ఊపేస్తున్నప్పుడు (1964 సంగం సీన్మా). నేను పదమూడు టీన్ ఏజ్ లోకి ప్రవేశించాను. ఆ పంచరంగుల సీన్మా సుల్తాన్ బజార్ దిల్షాద్ టాకీసులో చూసిన (అదిప్పుడు లేదు) తర్వాత రంగుల లోకాలలోకి ఎగిరి పోవటం మొదలయ్యింది. పెద్దపెద్ద విమానాల అందం, లండన్, రోమ్, ప్యారిస్, స్విట్జర్లాండ్ నగరాల, ఆల్ఫస్ పర్వతాల సౌందర్యం, నయాగారా జలపాత ఉదృతం నన్ను మంత్రించి మాయచేసాయి. నేలమీద కాలు నిలవకుండా పగటి కలలు కనటం మొదలయ్యాయి. తర్వాత్తర్వాత కాలాలలో ఆ విశ్వనగరాలన్నింటినీ దర్శించి ‘కల నిజమాయెగా’ అని పాడుకున్నాను. రాజ్‍కపూర్‍ను యాది చేసుకున్నాను.
నాకు సిగ్గూ షరమూ అస్సలు లేవని మాపెద్దక్క ద్వారా నాకు మొదటిసారి తెలిసివచ్చింది. అదేల అనగా షమ్మీకపూర్ నటించిన ‘‘ఎన్ ఇవినింగ్ ఎన్ ప్యారిస్’’ (1967) విడుదలైన రోజు నా హెచ్‍ఎస్‍సి ఫలితాలు వచ్చి నేను అన్ని సబ్జెక్టులలోనూ విజయవంతంగా విఫలమయ్యాను. నేను ఫెయిల్ కావటం ఖాయం అని పరీక్షలు రాయకముందే నాకు తెలుసు కావున చింత ఏల అని శుభ్రంగా ఆ రోజే విడుదలైన ‘ఎన్ ఇవీనింగ్ ఇన్ ప్యారిస్’’కు క్రిష్ణా టాకీసులో మార్నింగ్ షోకు వెళ్లినాను. ఇంటికి వచ్చాక ‘‘నీకు సిగ్గూ శరమూ లేవారా’’ అన్న మాటల ద్వారా మా పెద్దక్క నాకు జ్ఞానోదయం కలిగించింది. ‘‘నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు’’ టైపు మనిషిని నేను.
‘‘దునియా కీ సైర్ కర్‍లో,
దునియా కీ సైర్ కర్‍లో
దునియా కీ సైర్ కర్ కే
ఇన్సాన్ సే ప్యార్ కర్‍లో’’
(1967 అరౌండ్ ది వరల్డ్, సీన్మా పాట).
ఈ పాట పుణ్యమా అని చెడిపోయిన్నో, బాగు పడిన్నో నాకైతె తెలియదు కాని కెనడా, పశ్చిమ యూరపు దేశాలు, లండన్, మధ్య ఆసియా నాలుగు దేశాలు (ఒకప్పుడు సోవియట్ యూనియన్‍లో భాగం) చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండు, బూటాన్ దేశాలను తర్వాత కాలంలో ‘చల్ ఉడ్ జారే పంచీలా’ పర్యటించాను. అందులో నా ‘‘సిల్కురూట్ యాత్ర’’ శీర్షమాణిక్యంలా నిలిచిపోయింది.
‘‘అయ్యయ్యో చేతిల డబ్బులు పోయేనే
అయ్యయ్యో జేబులు ఖాళీ అయెనే’’
(కులగోత్రాలు, 1952)
ఈ పాట ఇప్పుడు, ఈ ఏడుపదులు దాటిన వయస్సులో విన్నా నా పెదవులపై చిర్నవ్వులు చిందుతాయి. మళ్లీ పన్నెండేళ్ల కౌమారదశకు వెళ్లిపోతాను. నవ్వు ఏడుపు కలగలిసి ఏక కాలంలో వస్తాయి. కులగోత్రాలు సీన్మా చూడడటం కోసం నేను పడిన తపన, వేదన కార్చిన కన్నీళ్లు ఒకచిన్న ముచ్చట కాదు. అదేలయనగా….
నా కప్పుడు పదకొండు ఏండ్లు. ఒకరోజు ప్రొద్దున్నే నిద్ర లేచిన కాని పక్క మీద నుండి లేవలేదు. చేదబావి దగ్గర చేసుకుంట అమ్మా బాపు సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. కండ్లు మూసుకుని రెండు చెవులూ అటు వైపు అప్పగించాను. చివరాఖరికి తెలిసిందేమనగా క్రితం రాత్రి మేమందరం పిల్లలం నిద్రపోయిన తర్వాత వారిద్దరూ ఆబిడ్స్ దగ్గరున్న సాగర్ టాకీసుకు వెళ్లి (అదిప్పుడు లేదు) ఎన్‍టిఆర్, సావిత్రి నటించిన ‘ఆత్మబంధువు’ సీన్మా చూసొచ్చారని! ఇక అంతే ఒక్కసారిగా నాలో కోపం, ఉక్రోషం, అవమానం, ఆత్మాభిమానం పొంగుకొచ్చాయి. దిగ్గున పక్కమించి లేచి తపతపా అడుగులు నేల మీద కొట్టుకుంటూ వెళ్లి బావి గచ్చుమీద కథాకళి, భరతనాట్యం, శివతాండవం ప్రారంభించాను. ‘‘ఇంత మోసమా’’ మీరిద్దరే టింగురంగా అని దొంగల్లాగ, రహస్యంగ సీన్మాకు పోతరా’’ అని అరుపులు, కేకలు. హఠాత్తుగా వచ్చిన ఈ తిరుగుబాటుకు వాళ్లిద్దరూ భీరిపోయారు. తుఫానులా విరుచుకుపడేసరికి వారి ఆనందమంతా ఆవిరయ్యిపోయింది. తప్పు చేసినట్లు అపరాధభావంతో ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. జన్మకో శివరాత్రి అన్నట్లు వారిద్దరూ కలిసి సీన్మాలకు పోవటమే చాలా అరుదు. పోకపోక పోయినందుకు, దొంగల్లాగ దొరికిపోయి, బావి దగ్గర ‘‘బోనులో ముద్దాయిల్లాగ’’ నిలబడాల్సి వచ్చింది.
‘‘సరే లేరా నిన్ను కూడ తీసు••పోతంలే అని బాపు లైట్‍గ తీసుకుని మత్పరించబోయిండు’’
నేను మొండి ఘటం కదా ‘‘ఎప్పుడు?’’ అని కోర్టు మార్షల్ విచారణ శురూ చేసిన.
‘‘ఎప్పుడంటే ఇప్పుడే ఎట్ల చెప్పను? పైసలు లేవు. జీతాలు రావాలి కదా’’ అని నీళ్లు నములుకుంట సంజాయిషీ ఇచ్చిండు.
ఒకటో తారీఖు ఎప్పుడని మనస్సులనే లెక్కలేసుకున్న, ఇంకా ఇరవైదినాలని తేలింది.
‘‘అమ్మో ఇంకా ఇరవై దినాలే అంత వరకూ ఎట్లా ఆగాలి.’’ అని నా ఓపలేనితనాన్ని తెలియచేసి ‘‘ఎక్కడైనా అప్పు తేరాదా’’ అని పెద్ద మనిషి తరహాలో సలహా ఇచ్చాను.
‘‘అరేయ్ ఈపు పగుల్తది’’ అని అమ్మ కలకత్తా కాళిక అవతారంలో రంగంలోకి దిగింది.
ఇక ఆ సుప్రభాత సమయాన దేహశుద్ది తప్పదని (పూర్వానుభవాలు చాలా వున్నాయి లెండి) ఒకడుగు వెనకకు వేసి రాజీ మార్గం ఆచరించాను.
బొటాబొటా కన్నీళ్లు కారుతుంటే ‘‘తొందగర తీస్కపోవాలె’’ అని ఏడుపు కంఠంతో కీచుగా, దీనంగా అడిగాను.
సర్లే. ముందు పోయి ఆ పాచిపండ్లు తెల్లగ తోముకో అని అమ్మ నిర్దయగ ఒక బోడి సలహా ఇచ్చే సరికి నాకు ఒళ్లు మండి ‘‘జీవితాంతం పండ్లే తోముకోను’’ అని మనసులోపలే శపథం తీసుకున్న. దుఃఖభారంతో తలవంచుకున్న.
ఇదే సందని ఇద్దరూ సడి చప్పుడు చేయకుండా, చల్లగా మనసాలలోకి జారుకున్నారు. దుఃఖంతో వున్న నన్ను ఒంటరిగా వదిలేసి!
‘‘సీన్మా, సీన్మా’’ అని ఆ దినం నుండి మనాది మొదలయ్యింది. బాకీ కోసం సత్యహరిశ్చంద్రుడిని వెంటాడి వేధించిన నక్షత్రకుడి వలె దొరికినపుడల్లా బాపును పట్టుకుని సీన్మా? సీన్మా? ఎప్పుడు? ఎప్పుడు? అని గుర్తు చేస్తున్న. ఇక ఆయనేమొ పురుసత్‍గ దౌడకు పాన్ పెట్టుకుని నములుకుంట నోరు విప్పితే రసం కారి క్రిందకు జారిపడుతుందన్న భయంతో తలపైకెత్తి ‘‘చూద్దాం, చూద్దాం’’ అని ఒకసారి ‘‘పోదాం పోదాం’’ అని మరోసారి, జేబుల ఒక్క చిల్లిపైస కూడ లేదు అని ఇంకోసారి ఆకుకు అందని, పోకకు పొందని మాటలు మాట్లాడసాగాడు. ఇక నా ఓపిక ‘‘బర్దాష్ కే బాహర్’’ వచ్చేసింది. అమ్మ ఏం పని చెప్పినా సహాయ నిరాకరణం, రాత్రి పూట ‘‘బూఖ్ హర్తాల్’’ (నిరాహార దీక్ష) సాగించిన. మా వాళ్ల కఠినమైన రాతి గుండెల ముందు నా గాంధీగారి అహింసాయుధాలన్నీ ఘోరంగా విఫలమైనాయి. ప్రతిరాత్రి నిండా ముసుగు కప్పుకుని ఎవరికీ కనబడకుండా, వినబడకుండా లోలోపలే ఏడ్చి కన్నీళ్లు కార్చి పక్క దిండు తడిపి ఎప్పుడో నిద్రలోకి జారుకునే వాడిని.
నెల గడిచింది. జీతం వచ్చింది. ఆ నెలల దసుర పండుగ. అందరికీ కొత్త బట్టలు కొనాలె. పై నుండి పండుగ ఖర్చులు. ఎట్లరా దేవుడా అని అమ్మాబాపు తసబిస అవుతున్నరు. అన్నింటినీ గమనిస్తున్న అయినా ధైర్యం చేసి ఒక రోజు ‘‘సీన్మా’’ అన్న అంతే అమ్మ ఖఁయ్యిమని అరిచి పొయ్యిల ఊదుతున్న గొట్టం చేతిల బట్టుకుని నా మీదికి లేసింది. ఒక్క అంగల నేను వంటింట్ల నుండి గంతువేసి మనసాలలకు వచ్చిన ఆమె కూడా నా వెనకే వచ్చింది. అప్పుడు నేను చర్మ సంరక్షణా నిమిత్తమై అర్రలకు చొర్రబడ్డ. ఆమెకు కోపం ఇంకా ఎక్కువయ్యింది. అండ్లకు కూడా రాంగనే నేను మెరుపు వీరుడిలా బావి గచ్చుమీదికి దూకి అక్కడ కూడా ఆగకుండా మల్లెపందిరి కింద నుండి ఉరికి పెద్ద దర్వాజా దాటి వాకిట్లకు ప్రవేశించిన. అయినా ఏం లాభం? అప్పటికే ఊదుడు గొట్టం గాలిలో రామబాణంలా రయ్యిఁమని తేలి వచ్చి నా వీపును సాపు చేసింది. సీన్మాసీన్మా అని జిద్దు చేసినందుకు వీపు మీద పెద్ద దద్దు వచ్చింది.
అపుడు నాకు జీవితం మీద విరక్తి ముంచుకొచ్చింది. రెండు రోజుల తర్వాత నేనూ, మా మూడో అక్క అంటే సుశక్క బజారుకు పోతున్నం. మేమిద్దరం జిగ్రీ దోస్తులం. మా మధ్య ఏ రహస్యాలు ఉండకపోయేది. ‘‘అక్కా కొంచెం ఆగు’’ అన్న ఎందిరా లోకి అని ఆగి నా ముఖంల ముఖం పెట్టి చూసింది. ‘‘నేను చచ్చిపోతనే’’ అని భళ్లున ఏడ్చేసిన. అప్పటికే సుశక్కకు నా బాధ నా మనాది తెలుసు.
‘‘వొద్దురా. నవ్వు చచ్చిపోతే నెనెట్ల బ్రతుకుతరా’’ అని ఆమె కూడా నాకంటె ఎక్కువగా ఎక్కెక్కి ఏడిచింది. ఇద్దరమూ ఒకర్నొకరం పట్టుకుని ఏడ్చేసరికి చేతిల ఉన్న పాలగ్లాసు నేలమీదికి ఒలికి పోయింది.
మరో నాలుగు రోజుల తర్వాత బ్రతుకమ్మ పండుగ వచ్చింది. కొత్త బట్టలు కట్టుకున్నం. గారెలు, పులిహోర, పూరీలు, కోడిమాంసం కడుపునిండా ఆరగించినం. సాయింత్రం ‘‘జమ్మి’’కి పోయి వచ్చినంక బాపు చిర్నవ్వులు చిందించుకుంట మా పిల్లలందర్నీ దగ్గరికి పిలిసిండు.
ఒసే వెంకటమ్మా (మా రెండవ అక్క) రేపు ఈ పిల్లలందర్నీ మ్యాట్నీ ఆట సీన్మాకు తీసు••పోవే అని అన్నడు.
అందరం ‘‘అహా అహా ఒహో ఒహో’’ అని అర్సుకుంట గంతులేసినం చిందులు తొక్కినం. చిరకాల కోరిక నెరవేరుతుందన్న సంతోషంతో నాకు ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. తెల్లారి మధ్యాహ్నం భోజనాలయినంక మా రెండో అక్క నాయకత్వాన (అప్పటికే ఆమె టీచర్ ట్రేయినింగ్ చేస్తుంది) నేను, సుశక్క, పెద్ద తమ్ముడు జ్ఞాని కొత్త బట్టలు కట్టుకుని సీన్మాకు బయలు దేరినం. రూప్‍లాల్ బజార్ గల్లీలల్ల నడుసుకుంట శాలిబండ చెట్టు క్రింది రోడ్డుకు వచ్చినం. దీపక్ టాకీస్, నారాయణ గూడాకు ఒక రిక్షా మాట్లాడుకున్నం. సీన్మా కంటె ముందు రిక్షా ప్రయాణమే ఒక అందమైన అనుభవం. రిక్షాలో పురుసత్‍గ చక్లంముక్లం కూచుని రిక్షా వాడి కాళ్ల క్రింద భూమి (సడక్) జర్రుజర్రున జారి వెనుకకు పోతుంటే కళ్లప్పగించి చూస్తూ పట్నాన్ని, దుకాణాలను, వాటి సైన్ బోర్డులను చదువుకుంట, పెద్ద పెద్ద భవంతులను చూడటం చిన్న అనుభవమా? మోఘల్‍పురా దాటంగనే దూరంగ చార్మినార్ నాలుగు చేతులు చాచి మమ్మల్ని, ఆహ్వానించేది. గుల్జార్ హౌజ్, మదీనా హోటల్ దాటి కొత్త పూల్ ఎక్కేవాళ్లం. వంతెన మీద తెల్లటి గుండ్రటి బల్దియా లైటు బుగ్గలు, క్రింద ముచికుందమ్మ నది, గౌలిగూడల శంకర్‍షేర్ హోటల్, కోఠీల అప్పుడే కట్టిన కొత్త ఆంధ్రాబ్యాంక్ భవనం, సుల్తాన్ బజార్, బడీ చావిడీల చీరల దుకాణాలు తిలకిస్తూ కాచీగూడ చౌరస్త దాటంగనే కుడివైపు బసంత్ టాకీసు కనబడింది. (అదిప్పుడు లేదు). అక్కడ ‘‘సిరి సంపదలు’’ సీన్మాబోర్డు కనడింది. అది కూడా అక్కలిద్దరికీ ఇష్టమైన అక్కినేని నాగేశ్వరరావు సీన్మానే. ఒక్క నిముషం రిక్షా ఆపి అక్కలిద్దరు చర్చించుకుని దీపక్‍ల ‘‘కులగోత్రాలు’’ సీన్మానే సెలక్టు చేసుకుని రిక్షాను ముందుకు పొమ్మని చెప్పిండ్రు. నారాయన్‍గూడ చౌరస్తాల మాడపాటి హన్మంతరావు బాలికల ఉన్నత పాఠశాల దాటి సుదీర్ఘ ప్రయాణం తర్వాత దీపక్ టాకీసు దగ్గర రిక్షా దిగినం.
సీన్మాహాలు ప్రవేశద్వారం వద్దే పెద్ద పెద్ద హోర్డింగులు నాగేశ్వరరావు, కృష్ణకుమారిల నిలువెత్తు రంగుల బొమ్మలు. ఎంత చూసినా తనివి తీరని పోస్టర్లు. టిక్కట్లు తీసుకుని లోపలికి వెళ్లాం. పేకాట సీన్‍లో రమణారెడ్డి డబ్బులన్నీ పోగొట్టుకుని తలమీద తడిగుడ్డ వేసుకుని పశ్చాత్తాప భారంతో పాట ప్రారంభించాడు. అతడిని ఓదారుస్తూ రేలంగి. మిగతా బృందం వంత పాడారు.
‘‘అయ్యయ్యో చేతిల డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే’’
పాట రాగానే హాలు మొత్తం నవ్వుల పువ్వుల తోటగా మారింది. నేను నా తమ్ముడు జ్ఞాని నవ్వినవ్వి నొప్పితో కడుపులు చేత బట్టుకున్నాం. నాయికా, నాయకులు చేసిన భాంగ్రా నృత్యం మమ్మల్ని ఉర్రూతలూగించింది. సీన్మాలో హీరో అమ్మ చనిపోయే సీన్ రాగానే మా రెండో అక్క వెంకటమ్మ నేను, జ్ఞాని భయపడతామని తన చేరో చేత్తో మా కండ్లు మూసింది.
ఇంటికి వచ్చాక ఒక వారం పాటు ప్రతి ఒక్కరం సీన్మా ముచ్చట్లు, సీన్మా పాటలే. కాలం గిర్రున తిరిగింది.
మా చిన్నప్పుడు మాకు పుస్తకాలు, పాటలు, సీన్మాలను, లోకాన్ని పరిచయం చేసి ప్రభావితం చేసిన మా •వెంకటమ్మ అక్క ఎనభై సం.ల వయసులో కాలం చేసింది. అప్పుడామె హిమాయత్ నగర్‍లో ఉండేది. స్వర్గపురి వాహనంలో మేమందరం ఆమెను అంబర్‍పేటలోని రుధ్రభూమికి తీసుకు పోతున్నాం. సరిగ్గా దీపక్ టాకీసు ముందు నుండే! తలెత్తి చూసాను. అది మూతపడి ఉంది. కాని హాలుమాత్రం శిథిలావస్థలో అట్లనే ఉంది. ఆనాటి మా తీపిజ్ఞాపకాలకు గుర్తుగ! గతించిన కాలానికి జ్ఞాపకంగ!!
మృత్యువును చూసి భయపడతం అని ఆ రోజు మా రెండు కండ్లుమూసిన మా అక్క ఇప్పుడు నిర్జీవంగా ఉన్న తనను చూసి మేం బాధ పడతం అని లేచి మా కండ్లు మూయలేదు కదా!
ఆమె దశదిన కర్మనాడు మా సుశక్క మా అందరికీ రెండు రహస్యాలను విప్పి చెప్పింది. ఒకటి : నేను చచ్చిపోతా అని ఏడ్చిన సంగతి ఆమె ఆ రాత్రే మా వెంకటమ్మ అక్కకు చెప్పితే ఆమె దసుర నాడు ఆ సంగతి అమ్మా బాపుకు చెప్పిందట. రెండు : బొగ్గుల బస్తా (వంట కోసం) కోసం దాచిన డబ్బులను బాపు మాకు ‘‘కులగోత్రాలు సీన్మా’’ చూడటానికి ఇచ్చాడట.
ఆ పాత రహస్యాలను విని అందరం కన్నీళ్లు పెట్టుకున్నాం. మేమందరం ఆ రోజు సంతోషంగా సీన్మాహాల్లో ‘‘చేతిల డబ్బులు పోయెనె’’ పాట విని నవ్వుకుంటున్న సమయంలో సరిగ్గా అదే సమయాన ఇంట్లో మా బాపు ‘‘అయ్యయ్యో బొగ్గుల డబ్బులు పోయెనే’’ అని బాధ పడ్డాడా అని నాకు ఇప్పటికీ తీరని సందేహమే!
ఏం చేస్తాం? వెనక్కి తిరిగి చూస్తే వెయ్యి తప్పులు కనబడతాయి.
-పరవస్తు లోకేశ్వర్, ఎ: 91606 80847