ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది ఇప్పుడు నిట్ట నిలువుగా చీలింది!

ఇందుర్తి. ఆ ఊరిపేరుతో చాలా ఊర్లున్నాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకునే గ్రామం మాత్రం మర్రిగూడ మండలం, నల్లగొండ జిల్లాలో ఉంది. అటు మునుగోడు నుంచి ఇటు మాల్‍ నుంచి వెళ్లొచ్చు. ఆచార్య అండమ్మగారి ఆహ్వానంపై వాళ్లూరు కొరిటికల్‍ గ్రామంలోని లక్ష్మీనరసింహాలయాన్ని చూచి, ఆమె కారులోనే ఇందుర్తి వెళ్లాం. అక్కడున్న కొందరు మిత్రులు గ్రామంలోని చారిత్రక ఆనవాళ్లకు తీసుకెళ్లారు. కొంత కారు, కొంత మోటారు సైకిల్‍, మరికొంత కాలినడక. పల్లెటూరి పొలంగట్లు, చెరువుకట్ల వెంట తిరుగుతుంటే, చెట్లూ, గట్టుల పలకరింపులతో ఒళ్లంతా పులకింతలే.


ముందుగా గ్రామంలోని శిథిల శివాలయానికి తీసుకెళ్లాడు ఆ ఊరి మిత్రుడు నరసింహ. చుట్టూ కంపచెట్లు. పక్కనే పెంటపోగు. రోడ్డు వెంట పడిపోయిన ఆలయ రాళ్లు, ఇటుక రాతి ముక్కలు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‍ శ్రీరామోజు హరగోపాల్‍గారు నాకు వివరించిన శిథిల శిల్పాలు.
ఓపిగ్గా ముళ్ల కంచెలోంచి ఆలయంలోపల అడుగుబెట్టాం. గర్భాలయం ఒక మూలన మట్టిలో సగం కూరుకుపోయిన తల తెగిన నంది విగ్రహం. నిధుల వేట గాళ్ల గడ్డపారలకు బలై, జాలిగా చూస్తున్న గర్భాలయం, నేనూ అంతే నంటున్న అర్ధమండపం. నిత్యనైవేద్యస్థానంలో నిండు నైరాశ్యం. మనిషినే కాదు దేవునికి కూడా బాధలుంటాయన్న నిజం తెలిసింది. బయటికొచ్చిచూస్తే, ఎవరో దాడి చేస్తేనో ప్రకృతి భీభత్సం ముంచుకొస్తేనో తప్ప, చెల్లా చెదురుగా పడి ఉన్న ఆలయ శిఖ శకలాలు.


గతంలో ఒకసారి ఈ ఆలయాన్ని గురించి చెప్పిన చరిత్రకారుడు డా. ద్యావనపల్లి సత్యనారాయణ గారిని మళ్లీ సంప్రదించి గాలింపు మొదలు బెడితే, ఊరు బయట శిథిల శివాలయం, గ్రామంలో చెన్నకేశవాలయం, పొలాల్లో వీరగల్లు శిల్పాలు, శివలింగాలు, ఒద్దికగా కుదురుకున్న నంది, కళ్యాణీ చాళుక్య కొత్తశాసనం, నాగదేవతలు, ఇందుర్తి చరిత్రకు తరగని, చెరగని సాక్ష్యాలు. ఇందుర్తి గ్రామంలోనూ, పొలిమేరల్లోనూ ఉన్న అన్ని ఆనవాళ్లను తడిమి చూచి, చరిత్ర అనుభూతుల్ని పొంది, ఒకపక్క ఆ గ్రామ చారిత్రకగాధ, నిర్లక్ష్యానికి గురౌతున్నాయన్న వ్యధ ఒక్కసారిగా నాముందు ముసురుకున్నాయి. బాధ్యత లేదా అంటూ మౌనంగా కసురుకొన్నాయి. మిత్రులతో కలసి మొద• చూచిన శిథిల శివాలయానికి మళ్లీ వచ్చాను. అక్కడున్న గ్రామస్తులకు గ్రామంలో క్రీ.శ. 9 నుంచి క్రీ.శ.14వ శతాబ్ది ఆనవాళ్లను కాపాడుకోవాలని విన్నవించుకొన్నాను. నా బాధను వాళ్లతో పంచుకొన్నాను. రేచర్ల పద్మనాయకులు రాచకొండ నుంచి ఠీవిగా పాలించినప్పుడు కట్టిన ఆలయమని వారికి వివరించాను. నిలువునా చీలిన ఈ ఆలయాన్ని పదిలపరచుకోవాలన్న నాగోడును వారికి విన్నవించాను. అమాయకంగా వారు నా వైపు చూచిన చూపులు, నాలో వేల ప్రశ్నలను పుట్టించాయి. జవాబుల కోసం, ఆకసం వంక చూస్తూ, ఆచార్య అండమ్మగారి కారులో హైదరాబాదు చేరుకొన్నాం. కళ్ల ముందు అవే శిథిలాలు, అవి వేస్తున్న వేల ప్రశ్నలు, దొరకని సరైన సమాధానాలు.

-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి,
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *